పెళ్లి (Wedding).. ప్రతి అమ్మాయి(woman) జీవితంలో అదో పెద్ద పండగలాంటి రోజు.. చిన్నతనం నుంచి పెళ్లి గురించి ఎన్నో కలలు కంటూ ఉంటుంది అమ్మాయి.. బొమ్మలపెళ్లి చేసే సమయం నుంచే పెళ్లిలో తాను ఎలా ఉండాలో ఊహించుకుంటుంది. ఇక తన పెళ్లి కుదిరిందని తెలియగానే చీరలు, నగలు, మేకప్.. ఇలా ప్రతి విషయంలోనూ ప్రత్యేకంగా ఉండేలా సిద్ధమవుతుంది. ఎప్పుడెప్పుడు తన మెడలో తాళి పడుతుందా? అని వేచి చూస్తూ ఉంటుంది.
అయితే ఎప్పుడైనా ఆలోచించారా? ఇలా తాళి కేవలం మన మెడలోనే ఎందుకు ఉంటుందో.. పెళ్లయిందని నిరూపించేందుకు అమ్మాయిలకు మెడలో తాళి, కాలికి మెట్టెలు.. నుదుట బొట్టు.. ఇలా చాలా ఉన్నాయి. కానీ మగవాళ్లకు ఇందులో ఒక్కటి కూడా ఉండదు. ఎప్పుడైనా ఇది అన్యాయం అనిపించిందా? మనకే ఎందుకు ఇవన్నీ.. మగవాళ్లకు కూడా ఉంటే బాగుండు.. అని ఎప్పుడైనా అనుకున్నారా? ఆ అమ్మాయిలు కూడా అలాగే అనుకున్నారు. అందుకే తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని తిరగరాసి తమ భర్తల మెడలో తాళి కట్టారు.
ఏంటి? ఇదంతా ఎక్కడో చూసినట్లుంది కదా.. ఈ విషయం చెప్పగానే మీ మనసులో జంబలకిడిపంబ సినిమా గుర్తొచ్చేసింది కదూ.. అందులో నరేష్ మెడలో తాళితో కనిపించిన విషయం గుర్తొస్తుంది. అది కాస్త ఫన్నీగా ఉండొచ్చు. కానీ ఈ విషయాన్ని సీరియస్‌గానే నిజం చేశారు కర్ణాటకకి చెందిన ఇద్దరు వధువులు. తరాలుగా వస్తున్న ఆచారాలను కాదని కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించారు. మార్చి 11, 2019 తేదిన కర్ణాటకలోని విజయపుర జిల్లాలోని నలట్వాడ్ టౌన్‌కి చెందిన ఈ ఇద్దరు వధువులు కొత్త చరిత్రను సృష్టించారు. తమ తమ భర్తల మెడలో తాళి కట్టి సమానత్వాన్ని చాటారు.
వీరిలో మొదటి జంట అమిత్, ప్రియలు.. లింగాయత్, కురుబ కులాలకు చెందినవారు. వీరు లింగాయత్ తెగకు చెందిన 12వ శతాబ్దపు సంఘ సంస్కర్త బసవన్న మాటల ఆధారంగా ఈ పెళ్లిని చేసుకున్నారు.. ఆయన పెళ్లంటే అమ్మాయిలను చిన్నచూపు చూడడం కాదని చెబుతూ.. అమ్మాయి మెడలో తాళి కట్టాల్సిన అవసరం లేదని, వధూవరులిద్దరూ దండలు మార్చుకున్నా సరిపోతుందని అన్నారు. దాన్ని పాటిస్తూ ఈ జంట పెళ్లి చేసుకున్నారు.
మరో జంట ప్రభురాజ్, అంకిత వేర్వేరు కులాలకి చెందిన వ్యక్తులు. అయితే ఎన్నో తరాల నుంచి కొనసాగుతోన్న ఈ సంప్రదాయాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని నిర్ణయించుకొని పెళ్లి చేసుకున్నారు. దీంతో అంకిత తన భర్త మెడలో తాళి కట్టింది. ఇదొక్కటే కాదు.. ఈ పెళ్లిలో మరిన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఈ పెళ్లిని కన్యాదానం లేకుండా కొనసాగించారు. అంతేకాదు.. ఈ పెళ్లి జరిపించేందుకు శుభ ముహూర్తం కూడా నిర్ణయించలేదు. చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు.
తాజాగా ఓ బెంగాలీ వధువు ఇలాగే తరతరాల నుంచి వస్తున్న ఆచారాన్ని కాదని చెప్పి.. కనకాంజలి అనే కార్యక్రమాన్ని చేసేందుకు నిరాకరించింది. బియ్యాన్ని తల మీద నుంచి వెనక్కి వేసి తన తల్లిదండ్రులతో ఇక ఈ రోజుతో మీ రుణం తీరిపోయింది అని చెప్పాలని అక్కడున్నవాళ్లంతా చెబుతుంటే.. ఏం చేసినా మనల్ని కని పెంచి ఇంత వాళ్లను చేసిన తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకోలేం అంటూ దానికి నిరాకరించి ఏడుస్తూ కాకుండా.. నవ్వుతూ అత్తారింటికి వెళ్లింది. అంతేకాదు.. పెళ్లయితే పుట్టింటికి రావడానికి వీల్లేదు అన్న విధానాన్ని కూడా కాదని చెబుతూ.. నాకు నచ్చినప్పుడు, వీలైనప్పుడల్లా ఇక్కడికి వస్తూనే ఉంటా.. అని చెప్పి బయల్దేరింది.
మరో వధువు కన్యాదానం లేకుండా పెళ్లి చేసుకోవడంతో పాటు పెళ్లి జరిపించడానికి కూడా మొత్తం ఆడ పంతుళ్లనే ఏర్పాటు చేసి కొత్తదనాన్ని పాటించిన సంగతి తెలిసిందే. ఇలా పాత తరం సంప్రదాయాలలో పురుషాధిక్యం ఉన్న వాటిని తిరగరాసి కొత్త సంప్రదాయాలను సృష్టిస్తూ భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఇలాంటి వధువులు.
ఇవి కూడా చదవండి..
పెళ్లికి ముందే ఈ ఎమర్జెన్సీ కిట్.. సిద్ధం చేసుకోవడం మర్చిపోవద్దు..
పెళ్లి కూతురికి .. పసుపు ఎందుకు రాస్తారో మీకు తెలుసా??
సంప్రదాయబద్ధంగా నిఖాతో ఒక్కటైన ప్రేమజంట.. ఆర్య – సాయేషా..!
Images : Youtube, Instagram.