వాట్సాప్ (Whatsapp).. ఇప్పుడు ప్రతిఒక్కరి ఫేవరెట్ యాప్. స్నేహితులతో మెసేజ్‌లు, గ్రూప్ చాట్ వంటివాటితో పాటు బిజినెస్ కోసం కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతోంది. ఎంతగా అంటే ప్రపంచవ్యాప్తంగా 1.5 బిలియన్ల మంది దీన్ని ఉపయోగిస్తున్నారు. కానీ తాజాగా వాట్సాప్ తన యూజర్లందరినీ వెంటనే యాప్ అప్ డేట్ చేసుకోమని ఓ ప్రకటన విడుదల చేసింది. దీనికి కారణం లేకపోలేదు.
వాట్సాప్‌లో ఓ సెక్యూరిటీ బగ్ ఉండడం వల్ల హ్యాకర్లు మీ ఫోన్‌ని యాక్సెస్ చేసే వీలుంటుందట. అది కూడా కేవలం మీకో వాట్సాప్ కాల్ చేయడంతో మీ ఫోన్‌ని యాక్సెస్ (hack) చేస్తారు. మీరు ఆ కాల్‌ని ఎత్తకపోయినా వారు మీ ఫోన్‌ని హ్యాక్ చేసే వీలుంటుందట.
మీ ఫోన్ హ్యాక్ అయిందా?
వాట్సాప్ సంస్థ యాజమాన్యం విడుదల చేసిన ప్రకటన ప్రకారం వాట్సాప్ లేదా వాట్సాప్ ఫర్ బిజినెస్ ఇన్ స్టాల్ చేసుకున్న ప్రతిఒక్కరి మీద దీని ప్రభావం పడే అవకాశం ఉందట. మీరు వాట్సాప్‌ని విండోస్, యాండ్రాయిడ్, యాపిల్, టిజెన్ ఇలా ఏ రకమైన ఫోన్లలో ఉపయోగిస్తున్నా.. ఈ బగ్ వల్ల మీ ఫోన్ హ్యాకింగ్‌కి గురయ్యే అవకాశం ఉంటుందట.
ఈ బగ్ వల్ల హ్యాకర్లు మన ఫోన్‌కి వాట్సాప్ వీడియో కాల్ ద్వారా స్పైవేర్‌ని ఇన్ స్టాల్ చేయగలరట. ఈ స్పై వేర్ మీ ఫోన్లోని కెమెరా, మైక్రోఫోన్లు, ఇతర ఫీచర్లన్నింటినీ హ్యాక్ చేసే వీలుంటుందట.
ఈ బగ్ ఎక్కడి నుంచి వచ్చింది?
ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం ఇజ్రాయెల్‌కి చెందిన సైబర్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఎన్ ఎస్ ఓ గ్రూప్ డెవలప్ చేసిన ఈ స్పైవేర్ యూజర్‌కి ఫోన్ చేయగానే వారు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం కూడా లేకుండానే.. వారి మొబైల్‌లోకి దూరిపోయి యాంటీవైరస్‌కి కూడా దొరకకుండా దాక్కుండి పోతుందట.
అసలు ఈ స్పైవేర్‌ని వారు ఎందుకు తయారుచేశారు? దీని వల్ల ఎలాంటి సమాచారాన్ని కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారన్న విషయం ఇంకా తెలియలేదు. కానీ మీకు ఒకవేళ తెలియని నంబర్ నుంచి వాట్సాప్ వాయిస్ లేదా వీడియో కాల్ వచ్చి ఉంటే మీ ఫోన్ కూడా టార్గెట్ అయినట్లు అర్థం. ఒకవేళ మీకు కాల్ రాకపోతే మీ ఫోన్ ఇంకా స్పైవేర్ బారిన పడలేదు అని అర్థం.
మీ ఫోన్‌ని ఎలా కాపాడుకోవచ్చు?
ఫేస్ బుక్ సంస్థ వాట్సాప్‌లోని ఈ బగ్‌ని తొలగించి మీ మొబైల్ ఫోన్‌ని కాపాడుకునేలా.. ఓ అప్ డేట్‌ని తయారుచేసి దాన్ని విడుదల చేసింది. అందుకే మీకు స్వయంగా వాట్సాప్ అప్ డేట్ కోసం గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి వెతికి మరీ యాప్‌ని అప్ డేట్ చేసుకోండి.
ఒకవేళ మీరు అలా చేయలేకపోతే మీ మొబైల్‌లో ఉన్న వాట్సాప్ యాప్‌ని అన్ ఇన్ స్టాల్ చేసి తిరిగి ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మాత్రమే వాట్సాప్‌ని డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఫోన్‌లో స్పై వేర్ ఇన్ స్టాల్ కాకుండా దాన్ని మీరే కాపాడుకున్నవారవుతారు.
ఒకవేళ ఇప్పటికే మీకు తెలియని నంబర్ నుంచి కాల్ వస్తే ఒకసారి మీ ఫోన్‌ని చెక్ చేయించుకొని.. అందులో ఏదైనా స్పైవేర్ ఇన్ స్టాల్ అయిందేమో పరిశీలించాలి. లేదంటే ఫోన్‌ని ఫార్మాట్ చేయడం కూడా మంచి పద్ధతి. అందుకే మీరు వాట్సాప్ అప్ డేటెడ్ వర్షన్ ఉపయోగించేలా జాగ్రత్తపడండి. మీ ఫోన్‌కి తగిన కొత్త వర్షన్ కోసం, ఇతర వివరాల కోసం మీరు వాట్సాప్ వెబ్ సైట్‌ని కూడా సందర్శించవచ్చు.
కేవలం ఫోన్లోనే కాదు.. మీ ట్యాబ్, ల్యాప్ టాప్‌ల కోసం రూపొందించిన వాట్సాప్ యాప్‌లను కూడా అప్ డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందట. దీని కోసం వాటిలో సాఫ్ట్ వేర్ కూడా అప్‌డేటెడ్‌గా ఉండేలా చూసుకోవాలి. రెగ్యులర్‌గా సాఫ్ట్ వేర్ అప్ డేట్స్ చేసే ట్యాబ్, ల్యాప్ టాప్ వంటివి ఎలాంటి స్పైవేర్ బారిన పడలేవు. అందుకే మీ ఫోన్, ల్యాప్ టాప్, ట్యాబ్లెట్ ఇతర ఇంటర్నెట్ కనెక్టెడ్ డివైజెస్ అన్నింటికీ ఎప్పటికప్పుడు సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేయడం, వైరస్, స్పై వేర్, మాల్ వేర్ వంటివి ఉన్నాయా? లేదా? అని వైరస్ స్కాన్ చేయడం.. వంటివి చేస్తుండడం వల్ల మీ వ్యక్తిగత సమాచారానికి ఏ మాత్రం ముప్పు ఉండదు.
ఇవి కూడా చదవండి.
#ToMaaWithLove అమ్మ సోషల్ మీడియాలో ఉంటే.. ఎలా ఉంటుందంటే..?
వాట్సాప్ సంభాషణలు.. స్క్రీన్ షాట్ తీసుకోవడం అలవాటా? అయితే ఇకపై కష్టమే ..!
టిక్ టాక్ ( Tiktok) యాప్ బ్యాన్ అయింది.. మీమ్‌ల పండగ మొదలైంది..
Images : Shutterstock