రుణమే పెనుభారమా..? బలిపశువులుగా మారుతున్న మహిళలు, బాలికలు ..!

రుణమే పెనుభారమా..? బలిపశువులుగా మారుతున్న మహిళలు, బాలికలు ..!

మనుషుల్లో మానవత్వం తగ్గిపోతుందా? మానవ సంబంధాల కంటే ఆర్థిక సంబంధాలకే ఎక్కువ విలువ ఇస్తున్నారా? మనిషి ప్రాణం కంటే డబ్బుకే విలువ పెరిగిపోతుందా? ఏమో.. ఇటీవలి కాలంలో జరుగుతున్న సంఘటనలను చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. ఆయా సంఘటనలు భయం కూడా పుట్టిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా ఇలాంటి సంఘటనలు బయటకు వస్తున్నాయో లేదా ఇటీవలి కాలంలో ఈ తరహావి పెరుగుతున్నాయో తెలియడం లేదు. కానీ.. నిజంగానే అవి భయానకమైనవి. కేవలం అప్పు తీర్చలేదనే (loan repayment) కారణం చెప్పి.. హత్యలు చేయడం, అత్యాచారాలకు పాల్పడడం, బాధితులను చిత్రహింసలకు గురి చేయడం.. తీవ్ర మానసిక క్షోభను కలిగించడం.. ఇలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో వార్తల్లో తరచూ కనిపించడం గమనార్హం. ఈ ఘటనల్లో కూడా ఎక్కువగా బలవుతోంది మహిళలు (women), బాలికలే. తాజాగా ఇటువంటి సంఘటనే కర్ణాటకలో కూడా జరిగింది.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని కొడిగెహళ్లి గ్రామానికి చెందిన ఓ 30 ఏళ్ల మహిళను కొందరు కరెంట్ స్థంభానికి కట్టేశారు. ఇంతకూ ఆమె ఏం చేసిందో తెలుసా? యాభై వేల రూపాయలను అప్పు  తీసుకోవడం. ఆ అప్పును తీర్చడానికి ఆలస్యం చేస్తుండడం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

30 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఆమెను ‘చెప్పులతో, చీపుర్లతో కొట్టండి’ అనే మాటలు వినబడుతున్నాయి. కాగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళ పట్ల అనాగరికంగా ప్రవర్తించడం.. ఎంత వరకు సమంజసమనే ప్రశ్న నెటిజన్ల నుంచి వ్యక్తమవుతోంది. ఈ విషయం పోలీసుల వరకు చేరడంతో వారు కూడా రంగప్రవేశం చేశారు. వీడియోను ఆధారంగా తీసుకొని ఘటనకు బాధ్యులుగా భావిస్తున్న ఏడుగురిని అదుపులోకి తీసుకొన్నారు.

అప్పులు తీర్చలేదనే నెపంతో ఇలాంటి ఘటనలు జరగడం మనదేశంలో కొత్తేమీ కాదు. ఇంతకంటే దారుణమైన ఉదంతాలే చోటు చేసుకున్నాయి. మొన్ననే రెండేళ్ల ట్వింకిల్ శర్మను.. కొందరు అతి దారుణంగా హత్య చేశారు. ఆమె తల్లిదండ్రులు.. తాము తీసుకున్న పదివేల రూపాయల అప్పును తీర్చకపోవడమే దానికి ప్రధాన కారణం. తల్లిదండ్రులు చేసిన అప్పు తీర్చకపోతే.. పిల్లలను అపహరించి, హింసించి మరీ చంపాలా? అసలు పదివేల రూపాయల కోసం చిన్న పిల్లను చంపితే ఏం వస్తుంది? అసలు తల్లిదండ్రులు చేసిన అప్పుకు పిల్లలు బాధ్యులా? ఇలాంటి సంఘటనలను గురించి విన్నప్పుడు.. ఇవి సాధారణంగా మనలో తలెత్తే ప్రశ్నలే. 

#JusticeforTwinkle చిన్నారి ట్వింకిల్ హత్యను ఖండిస్తూ.. బాలీవుడ్ ఆన్‌లైన్ ఉద్యమం

Shutterstock

కానీ భర్త చేసిన అప్పు తీర్చకపోతే భార్యను అత్యాచారం చేసేవాళ్లు, తండ్రి అప్పు చేస్తే దానికి బదులుగా కూతుర్ని పెళ్లి చేసుకొంటామని బలవంతం చేసే వాళ్లు ఈ రోజుల్లోనూ ఉన్నారు. అప్పు తీసుకొన్నారంటేనే .. ఆ కుటుంబానికి ఏవో ఆర్థిక ఇబ్బందులున్నాయని అర్థం. అనుకోని అవసరాలు వస్తే తప్ప ఎవరూ అప్పు తీసుకోవడానికి ఇష్టపడరు.

బహుశా ఆ ఆర్థిక ఇబ్బందుల వల్లే దాన్ని తీర్చడం కూడా ఆలస్యం కావచ్చు. అంతమాత్రాన వారిని కట్టేయడం, కొట్టడం, చంపడానికి ప్రయత్నించడం లాంటివి చేయడం వల్ల.. ఇచ్చిన డబ్బు తిరిగి వసూలవుతుందా? పైపెచ్చు అలాంటి విపరీత చర్యలకు పాల్పడే వారికి నేరస్థులనే ముద్ర కూడా పడుతుంది.

అప్పు తీర్చకపోవడం అనేది నేరమా? అలా అనుకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి. చట్టప్రకారం ఎలాంటి చర్య తీసుకోవాలన్నది కోర్టు నిర్ణయిస్తుంది. అంతేకానీ.. ఇలా విపరీత చర్యలకు పాల్పడడం ఎంతవరకు శ్రేయస్కరం. ఇచ్చిన అప్పు వసూలు చేసుకోవడంలో తప్పు లేదు. కానీ దాన్ని రాబట్టుకోవడానికి కర్కశంగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు కదా. అప్పు ఇచ్చిన వారు మాత్రమే కాదు.. కొన్ని సందర్బాల్లో రుణం తీసుకున్నవారు సైతం కొన్ని దారుణాలకు పాల్పడుతున్నారు. రుణదాతలను బెదిరించడం, వారిని హత్య చేయడం లాంటి వార్తలు సైతం మనం వింటూనే ఉన్నాం. డబ్బు మనిషి చేత ఎంతపనైనా చేయిస్తుందంటే.. ఇదేనేమో?

కేవలం డబ్బు కోసం ఇలాంటి పనులు చేయడం ఎంతవరకు సమంజసమనేది పెద్ద ప్రశ్న? డబ్బు కోసం మానవత్వం మరిచి  ప్రవర్తించడం న్యాయమేనా? అన్నది కూడా జవాబు లేని ప్రశ్నే.  ప్రస్తుతం సామాజిక రుగ్మతగా ఉన్న ఈ సమస్య భవిష్యత్తులో.. ఒక అలవాటుగా మారే అవకాశమూ లేకపోలేదు. కఠినమైన చట్టాలు తీసుకొచ్చి.. వాటిని అమలు చేయడంతోనే ఈ సమస్య తీరిపోతుందనుకొంటే పొరపాటే. డబ్బుకి ప్రాధాన్యం తగ్గించి మానవతా విలువలకు ప్రాధాన్యం పెరిగినప్పుడే ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది. సమాజంలో అలాంటి మార్పు రావాలని ఆశిద్దాం..!

Featured Image: Shutterstock

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.