ప్రేమ కోసం.. నిరాహారదీక్షకు దిగిన ఓ యువకుడి కథ..!

ప్రేమ కోసం.. నిరాహారదీక్షకు దిగిన ఓ యువకుడి కథ..!

ప్రేమించినవాడు తనని మోసం చేశాడంటూ బాధిత మహిళ అతని ఇంటి ముందు దీక్ష చేయడం.. నిరసన తెలపడం.. న్యాయం జరిగే వరకు అక్కడి నుండి కదలకుండా ఉండడం లాంటి ఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. ఇప్పటివరకు మనం సినిమాల్లో, వార్తా ఛానల్స్‌లో మాత్రమే ఇలాంటి సంఘటనలు చూశాం. ఇలాంటి సందర్భాల్లో బాధితుల పక్షాన మహిళా సంఘాలు, ఎన్జీఓలు నిలుస్తుంటాయి. 


అయితే ఇలాంటిదే ఓ సంఘటన పై చెప్పినదానికి రివర్స్‌లో జరిగింది. అదెలాగంటే - పశ్చిమ బెంగాల్  రాష్ట్రంలోని హైలాకండి జిల్లా అబ్దుల్లాపూర్ పరిధిలో నివాసముండే..  పింకు రాయ్ అనే యువకుడు.. సోమవారం మధ్యాహ్నం నుండి.. అదే పట్టణంలో నివసించే తన ప్రేయసి ఇంటి ముందు నిరాహార దీక్షకి కూర్చున్నాడు.


ఇక తాను దీక్ష చేసేందుకు వచ్చే సమయంలోనే ఒక టెంట్, టవల్‌తో పాటు.. తనకి కావాల్సిన సామాన్లను కూడా తీసుకువచ్చాడట. అయితే అసలు పింకు రాయ్ ఇలా నిరాహార దీక్షకి (Hunger Strike) దిగడానికి అసలు కారణం యువతి తల్లిదండ్రులు వీరి పెళ్ళికి ఒప్పుకోకపోవడమే అని తెలిసింది.


అయితే ఇప్పటికే పలుమార్లు తమ ప్రేమని అంగీకరించమని యువతి తల్లిదండ్రులని బ్రతిమిలాడిన తరువాత కూడా వారు వినని పక్షంలో ... ఇక చేసేది లేక, ఇది కూడా ఒక మార్గమని నిర్ణయించుకుని ఈ నిరాహార దీక్షకి దిగాడు పింకు రాయ్.


అసలు ఇలాంటి పరిణామాన్ని ఊహించని అబ్దుల్లాపూర్ ప్రజలు వెంటనే నిరాహార దీక్ష జరిగే ప్రాంతానికి చేరుకోవడంతో.. ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నిరాహార దీక్ష గురించి విని కొందరు ఆశ్చర్యపోగా.. మరికొందరు మాత్రం ఈ ప్రేమికుడు చేస్తున్న పోరాటాన్ని చూసి "నిజమైన ప్రేమికుడు" అంటూ కితాబు కూడా ఇచ్చేశారు.


అయితే ఈ విషయం వెంటనే వూరిలో ఉన్న పంచాయితీ పెద్దలకు తెలియడంతో.. వారు పొలీస్ శాఖకి సమాచారం ఇచ్చారట. పోలీసులు, పంచాయతీ పెద్దలు ఆఖరికి నిరాహార దీక్ష జరిగే స్థలానికి చేరుకొని పింకు రాయ్‌కి నచ్చజెప్పే ప్రయత్నం చేయడం విశేషం. కానీ తను వారి మాట వినడం లేదని తెలియగానే.. అబ్దుల్లాపూర్‌లోని అవుట్ పోస్ట్‌కి పింకు రాయ్‌ని తరలించడంతో.. స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.


ఇక పింకు రాయ్‌ని అవుట్ పోస్ట్‌కి తరలించాక.. పోలీసులు, గ్రామ పెద్దలు తనకు కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారట. కానీ తమ ప్రేమని గెలిపించుకునేదాకా తాను చేస్తున్న పోరాటం ఆగదని  డంకా బజాయించి మరీ చెప్పేశాడట పింకు రాయ్.


ఇంత జరుగుతున్నా... పింకు రాయ్‌ని ప్రేమించిన యువతి కానీ.. ఆమె తల్లిదండ్రులు కానీ ఇంటి బయటకి రాకపోవడం విచిత్రం. పోలీసులు అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడడానికి ప్రయత్నించగా - ప్రేమికులిద్దరి కులాలు ఒక్కటి కాకపోవడంతోనే వారు ఈ పెళ్ళికి అంగీకరించలేదని తెలిసిందట.


ప్రస్తుతం అటు పింకు రాయ్‌కి.. ఇటు యువతి తల్లిదండ్రులకి నచ్చజెప్పే పనుల్లో పోలీసు శాఖ  బిజీ‌గా ఉన్నట్టు తెలుస్తోంది. మరి వీరి ప్రేమ... పెళ్లి వరకు దారి తీస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయయించాలి.


ఏదేమైనా పింకు రాయ్ తను చేసిన ఈ ప్రయత్నంతో.. అతని ప్రేమ గురించి బెంగాల్ రాష్ట్రం మొత్తం తెలిసేలా చేయగలిగాడు. అలాగే ఆ రాష్ట్రంలో పింకు రాయ్ ఒక సెలబ్రిటీ అయిపోయాడట.


ఇవి కూడా చదవండి


మీ ప్రేమ బంధం .. ఎలాంటి అనుబంధమో తెలుసుకోవాలని భావిస్తున్నారా..?


ఓ నిర్ణయానికి వచ్చేముందు.. మీ బాయ్ ఫ్రెండ్‌ను ఈ ప్రశ్నలు అడగండి


టీనేజ్ క్రష్.. కట్ చేస్తే బాయ్ ఫ్రెండ్.. అచ్చం సినిమా లాంటి ప్రేమకథ