టీ.. ఇది లేనిదే చాలామందికి రోజు గడవదు. మరికొంతమందికి తెల్లవారదు. ఇంకొందరికి సరైన సమయానికి టీ కడుపులో పడకపోతే.. తలనొప్పి కూడా వస్తుంది. టీ, కాఫీ.. ఈ రెండింటిలో ఏది బెటర్ అని కూడా అనిపిస్తుంది. కానీ నిజం చెప్పాలంటే పాలతో తయారుచేసిన టీతో పోల్చితే.. బ్లాక్ టీ (black tea) చాలా బెటర్. దీని వల్ల చాలా ప్రయోజనాలు (benefits) ఉన్నాయి. కొందరు బ్లాక్ టీని ఇష్టపడి తాగితే.. మరికొందరు ఎసిడిటీని తగ్గించుకోవడానికి తాగుతారు. మామూలు టీ కంటే కాస్త చేదుగా అనిపించినా.. ఇందులో చాలా మంచి గుణాలుంటాయి. మరి మనం కూడా.. బ్లాక్ టీ ద్వారా మనకు ఎలాంటి ప్రయోజనాలు అందుతాయో తెలుసుకుందామా
Table of Contents
‘బ్లాక్ టీ’లోని పోషక విలువలు
బ్లాక్ టీ తాగడం వల్ల ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలున్నాయి. అలాగే ఎన్నో వ్యాధులూ దూరమవుతాయి. కానీ దీన్ని తక్కువ మోతాదులోనే తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా తీసుకోవడం వల్ల పలు అనర్థాలున్నాయి. అలాగే బ్లాక్ టీని తగిన మోతాదులో తాగితే అలసట, బద్ధకం వంటివి దూరమవుతాయి. అదేవిధంగా ఎన్నో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి.
బ్లాక్ టీ అనేది పర్ఫెక్ట్ ఎనర్జీ డ్రింక్. ఇది అందాన్ని కూడా మెరుగుపర్చేందుకు తోడ్పడుతుంది. దీన్ని రెగ్యులర్‌గా తాగితే కాలేయం, జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడంతో పాటు చర్మ రుగ్మతలూ దూరమవుతాయి. కప్పు బ్లాక్ టీలో 200 మిల్లీ గ్రాముల ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి వివిధ వ్యాధులు రాకుండా కాపాడతాయి. అలాగే 47.4 ఎంజీ కెఫీన్ కూడా ఉంటుంది.
బ్లాక్ టీ – చర్మ ప్రయోజనాలు
బ్లాక్ టీ వల్ల సౌందర్య ప్రయోజనాలెన్నో ఉన్నాయి. ఇది నిజం.
1. కళ్ల కింద వాపును తగ్గిస్తుంది.
కంటి కింద వాపును తగ్గించేందుకు బ్లాక్ టీ ఉపయోగపడుతుంది. కళ్లు మన ముఖారవిందాన్ని పెంచుతాయి. అవే కళ్ల కింద వలయాలు ఏర్పడితే .. ముఖం వాచిపోయినట్లు కనిపిస్తుంది. ఈ రుగ్మతను తగ్గించేందుకు.. చల్లటి బ్లాక్ టీతో.. కళ్ల క్రింది భాగాన్ని నెమ్మదిగా కడగాలి. అలా చేస్తే కాసేపట్లోనే ఫలితం కనిపిస్తుంది.
2. చర్మం దురదను తగ్గిస్తుంది.
దురదలను నివారించడానికి బ్లాక్ టీ.. ఒక మంచి మందులా పనిచేస్తుంది. దీనికి చేయాల్సిందేంటంటే.. ఓ టీ బ్యాగ్‌ని నానబెట్టి దాంతో దురదగా ఉన్న చోట రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఏవైనా మలినాలు ఉంటే తొలిగిపోతాయి. అలాగే మచ్చలు కూడా సులభంగా తగ్గుముఖం పడతాయి.
3. సన్ బర్న్‌ను తగ్గిస్తుంది.
కొంతమంది ఎండలో అలా బయటకు వెళ్తే చాలు.. సన్ ట్యాన్ వల్ల చర్మ మాడినట్లు కనిపిస్తుంది. కానీ అలా ట్యాన్ అయిన చర్మంపై.. టీ బ్యాగ్ నానబెట్టిన నీటిని అప్లై చేసుకొని..పావుగంట తర్వాత శుభ్రం చేసుకుంటే చాలు.. ట్యాన్ మొత్తం తొలగిపోతుంది. దీనికోసం మీరు కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. .
4. పళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
మనం తరచూ ఏదో ఒకటి తింటూనే ఉంటాం. అందువల్ల మన పళ్లు పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి. అలాగే నోటిలో బ్యాక్టీరియా కూడా పెరుగుతుంది. ఈ సమస్యను నివారించేందుకు బ్లాక్ టీ బాగా ఉపయోగపడుతుంది. బ్లాక్ టీలోని పాలీ ఇథిలీన్.. పళ్ల పిప్పిని తగ్గించడంతో పాటు దంత సమస్యలు రాకుండా కూడా చేస్తుంది. నోటిలోని బ్యాక్టీరియాను కూడా తగ్గిస్తుంది. అయితే దీన్ని తగిన మోతాదులో మాత్రమే తాగాల్సి ఉంటుంది.
5. కాళ్ల వాసనను పోగొడుతుంది.
మనం రోజూ బయట తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు.. మన కాళ్లు, పాదాలు పూర్తి మలినాలతో నిండి ఉంటాయి. కనుక వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. చాలామందికి తమ పాదాల నుంచి వచ్చే ఒక విధమైన చెడు వాసన ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ సమస్యను నివారించడానికి కూడా బ్లాక్ టీ తోడ్పడుతుంది. దీనికి మనం చేయాల్సిందల్లా.. బ్లాక్ టీని చల్లార్చి ఆ మిశ్రమంలో పాదాలను పూర్తిగా ముంచి కాసేపు వెయిట్ చేయాలి. అలా ఓ పావు గంట సేపు చేసిన తర్వాత.. బ్యాక్టీరియా లేదా ఫంగస్ తొలిగిపోతాయి కాబట్టి.. వాసన కూడా పోతుంది.
బ్లాక్ టీ – కేశ ప్రయోజనాలు
కేవలం చర్మానికి మాత్రమే కాదు.. అందమైన, ఆరోగ్యకరమైన జుట్టు కోసం కూడా బ్లాక్ టీ ఎంతగానో తోడ్పడుతుంది. దీనివల్ల మన జుట్టుకు ఎలాంటి ప్రయోజనాలు అందుతాయంటే..
1. వెంట్రుకలకు మెరుపునిస్తుంది.
మెరిసే వెంట్రుకలను కోరుకోని వ్యక్తులు ఎవరుంటారు చెప్పండి? ఇలాంటి మెరుపు కోసం జుట్టుకు బ్లాక్ టీని వాడచ్చు. దీనికోసం చేయాల్సిందల్లా కొన్ని టీ బ్యాగ్స్ తీసుకొని.. ఇరవై నిమిషాల పాటు వాటిని నీటిలో నానబెట్టుకోవాలి. అలా రాత్రంతా ఉంచి ఉదయాన్నే ఆ నీటితో తలస్నానం చేయాలి. ఇది మీ జుట్టుకు పోషణను అందించడంతో పాటు.. కేశాలను మెరిసేలా చేస్తుంది. అలాగే మీ వెంట్రుకలను నల్లగా మార్చేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.
2.జుట్టు వేగంగా పెరిగేలా చేస్తుంది.
ఆస్పర్జిల్లస్ అనే బ్యాక్టీరియాతో పులియబెట్టిన బ్లాక్ టీని.. కేశాలకు అప్లై చేయడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుందని జపనీస్ శాస్త్రవేత్తల పరిశోధనలలో తేలింది. దీనికోసం మనం చేయాల్సిందల్లా బ్లాక్ టీని స్టవ్ పై పెట్టిన తర్వాత.. దాన్ని గది ఉష్ణోగ్రత వరకూ చల్లార్చి ఆ తర్వాత జుట్టుకు అప్లై చేసుకోవాలి. కేవలం కుదుళ్లకు మాత్రమే కాదు.. కేశాలు మొత్తానికీ అప్లై చేసుకోవడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది.
3.జుట్టుకు రంగును అందిస్తుంది.
బ్లాక్ టీ సహజంగా ఎరుపు, నలుపు కలగలిసిన రంగులో ఉంటుంది. అలాగే సహజసిద్ధమైన హెయిర్ డైగా కూడా పనిచేస్తుంది. దీనికి చేయాల్సిందల్లా హెన్నాని, బ్లాక్ టీని కలిపి జుట్టు మొత్తానికి అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత రెండు గంటల పాటు ఉంచుకొని .. మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది.
4. జుట్టు రాలడాన్ని అరికడుతుంది.
ప్రస్తుతం మనం వివిధ రసాయనాలు కలగలిసిన ఉత్పత్తులను వాడడం వల్ల.. జుట్టు రాలడం అనేది సర్వసాధారణమైపోయింది. దీనికి తోడు కాలుష్యం, దుమ్ము లాంటివి కూడా జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణాలు. అయితే ఈ సమస్య బ్లాక్ టీ వాడకం వల్ల తగ్గుతుంది. బ్లాక్ టీని వారానికి రెండు లేదా మూడు సార్లు తలస్నానం చేయడానికి ఉపయోగించడం వల్ల.. వెంట్రుకలు పొడిబారే సమస్య తగ్గుతుంది. అలాగే జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.
‘బ్లాక్ టీ’ ఫేస్ ప్యాక్స్
బ్లాక్ టీని కేవలం తాగేందుకు మాత్రమే కాదు.. అనేక రుగ్మతలను నివారించడానికి కూడా ఉపయోగిస్తారు. అలాగే ఇది సౌందర్య పరిరక్షణలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీంతో ఫేస్ ప్యాక్స్ ఎలా తయారుచేయాలంటే..
1. బ్లాక్ టీ, కలబందతో..
చర్మ రుగ్మతలను దూరం చేయడంలో కలబంద ఎంతగానో తోడ్పడుతుందనే విషయం మనకు తెలిసిందే. అలాగే సహజ చర్మ సంరక్షణలో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. బ్లాక్ టీ, కలబందను మిక్స్ చేసి.. ఆ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్‌గా వేసుకుంటే.. అది చర్మ రంధ్రాలలోని మురికిని తొలగించడంతో పాటు మంచి మాయిశ్చరైజర్‌గా కూడా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాత్రి అప్లై చేసుకొని ఉదయం వరకూ ఉంచుకోవాలి
ఎలా ఉపయోగించాలంటే..
ఈ ఫేస్ ప్యాక్ తయారీ కోసం టీ స్పూన్ కలబంద, రెండు టేబుల్ స్పూన్ల బ్లాక్ టీని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత.. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని గుండ్రంగా మసాజ్ చేసుకోవాలి. అలాగే రాత్రంతా దీన్ని అలాగే ఉంచుకోవడం వల్ల.. ఈ మిశ్రమం చర్మంలోకి బాగా ఇంకుతుంది. ఇలా వారం రోజుల పాటు.. ప్రతి రోజూ చేయాలి. అప్పుడు వెంటనే మార్పు కనిపిస్తుంది.
2.బ్లాక్ టీ, గ్రీన్ టీతో..
గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిపిస్తాయి. బ్లాక్ టీతో పాటు, గ్రీన్ టీని మిక్స్ చేసి రాసుకుంటే మీ చర్మం మెరిసిపోతుంది. ముఖ్యంగా జిడ్డు తొలగిపోయి.. చర్మం మామూలుగా మారుతుంది. చర్మాన్ని డీటాక్సిఫై కూడా చేస్తుంది.
ఎలా ఉపయోగించాలంటే..
ఒక టీ స్పూన్ బ్లాక్ టీలో టీస్పూన్ వేప పొడి, మరో టీ స్పూన్ గ్రీన్ టీ పౌడర్ కలుపుకొని.. ఈ మిశ్రమాన్ని పూర్తిగా ముఖానికి అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఓ పావు గంట అలాగే ఉంచి.. చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి నాలుగు సార్లు చేస్తే చాలు.. చర్మం మెరిసిపోతుంది.
3.బ్లాక్ టీ, నారింజ తొక్కతో
నారింజలో చాలా యాంటీ ఆక్సిడెంట్ గుణాలుంటాయి. ట్యాన్ బారిన పడిన చర్మానికి తిరిగి మామూలు రంగు అందించేందుకు ఇది తోడ్పడుతుంది. ఇందులోని విటమిన్ సి చర్మం పై నలుపు రంగు మచ్చలు తగ్గించేందుకు తోడ్పడుతుంది. అందుకే ఈ ప్యాక్ ఉపయోగించడం మంచిది.
ఎలా ఉపయోగించాలంటే..
టీ స్పూన్ నారింజ తొక్కల పొడి, రెండు టీస్పూన్ల బ్లాక్ టీ, టీస్పూన్ టొమాటో రసం మిక్స్ చేసి కలుపుకోవాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి అప్లై చేసుకొని.. పొడిబారే వరకూ ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే సరిపోతుంది. ముఖం మెరుస్తూ కనిపిస్తుంది.
4.బ్లాక్ టీ, ముల్తానీ మట్టితో
ముల్తానీ మట్టిని ఉపయోగించడం వల్ల చర్మం పై పేరుకుపోయిన దుమ్ము, కాలుష్యం వంటివి తొలిగిపోతాయి. బ్లాక్ టీ, టీ ట్రీ ఆయిల్‌లను దీనికి కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల.. ఓ ప్రత్యేకమైన మెరుపు మీ సొంతమవుతుంది. అలాగే మృత కణాలు వంటివి తొలగి పోతాయి.
ఎలా ఉపయోగించాలంటే..
టీస్పూన్ ముల్తానీ మట్టిలో.. రెండు మూడు చుక్కల టీ ట్రీ ఆయిల్, మూడు టేబుల్ స్పూన్ల బ్లాక్ టీ కలిపి.. ఈ మిశ్రమాన్ని పేస్ట్ మాదిరిగా తయారుచేసి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత పావు గంట పాటు.. దాన్ని అలాగే ఉంచుకొని గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి మూడు సార్లు అప్లై చేసుకోవడం వల్ల.. చర్మం మెరుస్తూ కనిపిస్తుంది.
బ్లాక్ టీ – ఆరోగ్య ప్రయోజనాలు
బ్లాక్ టీ వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలున్నాయి. కానీ దీని గురించి చాలామందికి తెలీదు. బ్లాక్ టీని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే వీలుంటుంది. మరి, బ్లాక్ టీ వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటే..
1. నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఎవరికైనా నోటి దుర్వాసన వల్ల వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. మనం రోజంతా ఏదో ఒకటి తింటూనే ఉంటాం. దీనివల్ల పంటిలో క్యావిటీలు ఏర్పడతాయి. అందుకే రోజుకి రెండు సార్లు బ్రష్ చేసుకోవాలి. బ్లాక్ టీ తాగడం వల్ల క్యావిటీలను కలిగించే బ్యాక్టీరియా.. నోటి నుంచి తొలగిపోతుంది. అలాగే బ్లాక్ టీలోని పాలిఫినాల్స్ పళ్ల పిప్పిని తొలగిస్తాయి.
2. గుండె ఆరోగ్యంగా ఉండేలా..
ప్రస్తుత జీవన శైలి వల్ల చాలా మంది గుండె జబ్బుతో బాధపడుతున్నారు. కానీ రోజూ బ్లాక్ టీ తాగడం వల్ల.. ఇలాంటి జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఇది చాలా అధ్యయనాల్లో తేలింది. బ్లాక్ టీ తాగేవారికి గుండె జబ్బులు తక్కువగా వస్తాయట.
3.క్యాన్సర్ అవకాశాలను తగ్గిస్తుంది.
బ్లాక్ టీ మన శరీరంలోకి కొన్ని రకాల క్యాన్సర్ కణాలు అడుగుపెట్టకుండా.. వాటిని సమూలంగా నాశనం చేస్తాయి. ముఖ్యంగా పాలీ ఇథిలీన్ అనే కాట్చిన్స్ క్యాన్సర్ నుంచి మన శరీరాన్ని కాపాడతాయి. బ్లాక్ టీని రెగ్యులర్‌గా తాగే మహిళల్లో గర్భాశయ, అండాశయ క్యాన్సర్ రాకుండా ఉంటుంది. అందుకే మహిళలు కనీసం రోజుకు ఒక కప్పు బ్లాక్ టీ అయినా తాగాల్సి ఉంటుంది.
4.ఎముకలను బలంగా మారుస్తుంది.
ముప్ఫైల తర్వాత మహిళల్లో ఎముకల సాంద్రత తగ్గుతూ వస్తుంది. అవి బిరుసుగా మారి విరుగుతూ ఉంటాయి. అయితే రోజూ బ్లాక్ టీ తాగడం వల్ల.. ఎముకలు బలంగా మారే వీలుంటుంది. అంతేకాదు.. అర్థరైటిస్ వంటి వ్యాధులు కూడా దూరంగా ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఎముకలను బలంగా ఉండేలా చేస్తాయి.
5. డయాబెటిస్ ముప్పు తగ్గిస్తుంది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఏ వయసులో అయినా డయాబెటిస్ వచ్చేస్తోంది. కానీ రీసర్చ్ ప్రకారం మీరు రోజూ ఒకటి లేదా రెండు కప్పుల బ్లాక్ టీ తాగితే.. 70 శాతం మేర డయాబెటిస్ వచ్చే ముప్పు తగ్గుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు టైప్ 2 డయాబెటిస్‌ని రాకుండా చేస్తాయి.
6.కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా..
కిడ్నీలోని రాళ్లు చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. కానీ బ్లాక్ టీని రెగ్యులర్‌గా తాగితే మాత్రం ఈ రాళ్లు తగ్గిపోతాయట. ఈ రుగ్మతతో బాధపడేవారు నీళ్లు ఎక్కువగా తాగడంతో పాటు.. బ్లాక్ టీని కూడా తాగాల్సి ఉంటుంది. రోజూ ఓ కప్పు బ్లాక్ టీ.. వీరికి మందులా పనిచేస్తుంది. ఇది కిడ్నీలపై మంచి ప్రభావం చూపుతుంది.
7. ఒత్తిడిని తగ్గిస్తుంది.
ప్రస్తుతం బిజీ లైఫ్ స్టైల్ వల్ల ప్రతి ఒక్కరూ ఒత్తిడితోనే జీవిస్తున్నారు. బ్లాక్ టీలోని లిథినైన్ యాసిడ్.. ఒత్తిడితో పాటు అలసటను కూడా తగ్గిస్తుంది. అలాగే వేడి వేడి బ్లాక్ టీ తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అలాగే మనం రెగ్యులర్‌గా బ్లాక్ టీ తాగడం వల్ల ఒత్తిడి బారిన పడకుండా ఉండే వీలుంటుంది.
8. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
బ్లాక్ టీ మన రోగ నిరోధక శక్తిని పెంచి.. వివిధ రకాల వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు మనకు సహాయపడతాయి. జీర్ణ వ్యవస్థను కాపాడేందుకు ఇది తోడ్పడుతుంది. అలాగే జ్వరం, జలుబు వంటి చిన్న చిన్న సమస్యలను కూడా ఇది ఇట్టే తగ్గించేస్తుంది. అలాగే మన శరీరంలోని వైరస్, బ్యాక్టీరియాలను బయటకు పంపడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
9. బరువు తగ్గేందుకు కూడా..
బ్లాక్ టీ తాగడం వల్ల మెటబాలిజం పెరిగే వీలుంటుంది. దీనివల్ల బరువు తగ్గే అవకాశాలు ఎక్కువ. అయితే మెటబాలిజం పెరుగుతుంది కదా అని.. తరచూ బ్లాక్ టీ తీసుకోవడం కూడా సరికాదు. రోజూ ఒకటి లేదా రెండు కప్పుల బ్లాక్ టీ తాగుతూ ఆరోగ్యకరమైన ఆహారం, మంచి వ్యాయామం చేయడం వల్ల బరువు సులభంగా తగ్గే వీలుంటుంది.
10. ఆస్తమాను తగ్గిస్తుంది.
బ్లాక్ టీ ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. అందులో ముఖ్యమైంది ఆస్తమాను తగ్గించడం. అవును.. ఇందులోని పాలీ ఇథిలీన్, యాంటీ ఆక్సిడెంట్లు ఆ వ్యాధిని దూరం చేసేందుకు ఉపయోగపడతాయి. ఆస్తమాకి రెగ్యులర్‌గా బ్లాక్ టీని ఉపయోగిస్తే.. అది కొన్నాళ్లలోనే తగ్గిపోతుంది.
బ్లాక్ టీ తయారు చేయడం ఎలా?
బ్లాక్ టీని తయారుచేసేందుకు రెండు రకాల పద్ధతులు ఉంటాయి. ఈ రెండు దాదాపు ఒకేలా ఉన్నా.. చక్కెర వేయడం లేదా వేయకపోవడం అనేది టీ తీసుకునే వారి ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది.
1. బ్లాక్ టీని కూడా మామాలు టీ మాదిరిగానే తయారుచేయవచ్చు. కాకపోతే ముందుగా నీటిని మరిగించి.. అందులో టీ పౌడర్ వేసుకోవాలి. ఇది మరుగుతున్నప్పుడు కావాలంటే చక్కెర కూడా వేసుకోవచ్చు. అలాగే యాలకులు, అల్లం లేదా నిమ్మరసం కలుపుకోవచ్చు.
2.మార్కెట్లో చాలా రకాల టీ బ్యాగ్స్ అందుబాటులో ఉంటాయి. వీటిని వివిధ పదార్థాలతో కలిపి తయారుచేస్తారు. మనం ఇంట్లో నీటిని వేడి చేసి.. అందులో టీ బ్యాగ్స్ వేసి నిమిషం పాటు ఉంచాలి. తర్వాత బ్లాక్ టీ ని తాగేయడమే..
బ్లాక్ టీ ఎక్కువ తాగడం వల్ల దుష్ప్రభావాలు
ప్రతి దానికి ఒక పరిమితి ఉంటుంది. దేనినైనా పరిమితిలో తీసుకుంటే దాని వల్ల మంచి ఫలితాలు అందుతాయి. ఆ పరిమితి దాటితే చాలు.. ఎన్నో దుష్ప్రభావాలు ఉంటాయి. బ్లాక్ టీకి కూడా అంతే. దీని ద్వారా ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయంటే..
1.కడుపులో సమస్యలు
జీర్ణ శక్తి తక్కువగా ఉండడం వల్ల కోశ సంబంధిత వ్యాధులు తలెత్తుతాయి. బ్లాక్ టీ వల్ల ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. కానీ దీన్ని ఎక్కువగా తీసుకుంటే మాత్రం పలు ఇబ్బందులు మాత్రం ఉన్నాయి. ముఖ్యంగా ఈ టీలో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. అది మన ఉదరంపై ప్రభావం చూపిస్తుంది. అల్సర్, క్యాన్సర్‌తో బాధపడుతున్నవారు బ్లాక్ టీ తాగకపోవడం మంచిది.
2. డయేరియా
ఏదైనా ఎక్కువగా తీసుకోవడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. బ్లాక్ టీని తీసుకోవడం వల్ల కూడా అంతే. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల.. డయేరియా వచ్చే ప్రమాదం ఉంటుంది.ఇందులో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. బ్లాక్ టీని ఎక్కువగా తాగడం వల్ల నరాలు కూడా దెబ్బతింటాయి. జీర్ణ వ్యవస్థ పై కూడా ప్రభావం పడుతుంది. అందుకే మీ శరీరానికి ఎంత మొత్తం అవసరమో అంత కంటే ఎక్కువ తీసుకోకపోవడం మంచిది.
3.మలబద్ధకం
బ్లాక్ టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల మల బద్ధకం వచ్చే ప్రమాదం ఉంటుంది. బ్లాక్ టీని రోజూ తాగడం వల్ల మీ శరీరం దానికి అలవాటు పడుతుంది. అనవసరమైన పదార్థాలు శరీరంలో నిల్వ ఉండిపోతాయి. ఇది మీ జీర్ణ శక్తి పై ప్రభావం చూపిస్తుంది. అందుకే ప్రతి రోజు కేవలం రెండు కప్పుల కంటే ఎక్కువ తాగకపోవడం మంచిది.
4.గుండె జబ్బులు
గుండె జబ్బులు ఉన్నవారు బ్లాక్ టీని ఎక్కువగా తీసుకోవడం సరికాదు. ఇలాంటివారు కెఫీన్ తీసుకోవడం సరికాదు. అందుకే బ్లాక్ టీని కూడా తీసుకోకపోవడం మంచిది. కేవలం బ్లాక్ టీ మాత్రమే కాదు.. కెఫీన్ ఉన్న ఏ ఉత్పత్తినీ ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది. బ్లాక్ టీ వల్ల గ్యాస్ పెరగడంతో పాటు గుండెపై ఒత్తిడి పెరుగుతుంది.
5.ఇతర ఆరోగ్య సమస్యలు
గర్భణీ స్త్రీలు కూడా బ్లాక్ టీ తీసుకోకపోవడం మంచిది. ఇందులోని కెఫీన్ కడుపులోని బిడ్డపై ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది. అందుకే మరీ అవసరం అయితే ఒక కప్పు తాగడం తప్ప.. తొమ్మిది నెలల పాటు బ్లాక్ టీకి దూరంగా ఉండడం మంచిది.
తరచూ అడిగే ప్రశ్నలు
1.రోజుకి ఎన్ని సార్లు బ్లాక్ టీ తాగవచ్చు?
బ్లాక్ టీలో కెఫీన్ కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కేవలం ఒకటి లేదా రెండు కప్పుల బ్లాక్ టీ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ తీసుకోవడం వల్ల.. శరీరానికి హాని కలిగే ప్రమాదం ఉంటుంది.
2.మిగిలిన టీల కంటే బ్లాక్ టీలో కెఫీన్ ఎక్కువగా ఉంటుందా?
మిగిలిన టీల కంటే.. బ్లాక్ టీలో కెఫీన్ స్థాయులు ఎక్కువగా ఉంటాయి. అందుకే రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల కంటే ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు.
3.గ్రీన్ టీ కంటే బ్లాక్ టీ మంచిదా?
బ్లాక్ టీ కంటే గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అయితే బ్లాక్ టీలో మన ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఆక్సిడేషన్ లెవెల్స్‌లో చూసుకుంటే గ్రీన్ టీ కంటే బ్లాక్ టీ మంచిది.
4.బ్లాక్ టీ బరువు తగ్గడానికి ఎలా సహాయపడుతుంది?
కప్పు బ్లాక్ టీలో కేవలం రెండు క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఇందులో కొవ్వు కూడా ఉండదు. ఇది జీర్ణ క్రియ వేగంగా కొనసాగేందుకు తోడ్పడుతుంది. ఇదే క్రమంలో బరువును కూడా తగ్గించేందుకు తోడ్పడుతుంది.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.