సినీ పరిశ్రమలోకి ఎంతో మంది కొత్త హీరోయిన్స్ వస్తూ ఉంటారు. వీరిలో అందంతో పాటు చక్కని నటన, అభినయం ఉన్నవారే కాస్త ఎక్కువ సమయం చిత్రసీమను ఏలగలరు. టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మలు శ్రియా శరణ్ (Shriya Saran), త్రిష (Trisha), అనుష్క (Anushka), తమన్నా (Tamannaah) నయనతార (Nayanthara), కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఈ కోవకు చెందినవారే! వీరంతా ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశబ్దానికి పైనే అయింది. తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు టాప్ హీరోలు అందరితోనూ నటించి, చక్కని ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మలు నటించిన తొలి సినిమాలు ఏవో మీకు తెలుసా?? వాటి గురించి సరదాగా కాసేపు మాట్లాడుకుందాం..
ఈ స్టార్ హీరోయిన్స్ అందరిలోనూ సీనియర్ అంటే మాత్రం శ్రియా శరణ్ అనే చెప్పాలి. ఆమె 2001లో వెండితెరకు పరిచయం అయింది. ప్రముఖ నిర్మాత రామోజీరావు సొంత బ్యానర్‌లో నిర్మించిన ఇష్టం (Ishtam) సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించిందీ ముద్దుగుమ్మ. ఈ చిత్రానికి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించారు. అంటే మరో రెండు సంవత్సరాలు గడిస్తే శ్రియ తెలుగు తెరకు పరిచయమై రెండు దశాబ్దాలు పూర్తి కానుందన్నమాట! అయితేనేం.. ఇప్పటికీ ఈ అమ్మడు తెలుగులో (Tollywood) తన హవాను చక్కగా చాటుతోంది. ఇటీవలే “ఎన్టీఆర్ కథానాయకుడు”లో మెరిసిన శ్రియ ప్రస్తుతం హిందీలో తడ్కా, తమిళంలో నగరసూరన్ చిత్రాల్లో నటిస్తోంది.
ఇక శ్రియ తర్వాత వెండితెరను చాలా కాలం నుంచి ఏలుతోన్న నేటి తరం నటీమణుల్లో మనం చెప్పుకోవాల్సింది త్రిష (Trisha) గురించి..! 2004లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రొమాంటిక్ యాక్షన్ డ్రామా “వర్షం” (Varsham)తో ఈ భామ తొలి టాలీవుడ్ హిట్ అందుకుంది. అయితే ఇప్పటికీ చాలామంది అదే ఆమె తొలిచిత్రం అని భావిస్తుంటారు. కానీ అది పొరపాటు.
ఎందుకంటే 2003లో త్రిష నటించిన తొలిచిత్రం ‘నీ మనసు నాకు తెలుసు’ (Nee Manasu Naaku Telusu) విడుదలైంది. ఇది ద్విభాషా చిత్రం. తెలుగు, తమిళ చిత్రాల్లో రూపొందింది. అయితే ఇది వూహించిన స్థాయిలో విజయం సొంతం చేసుకోవడంలో విఫలమైంది. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకున్న త్రిష.. ప్రస్తుతం తమిళంలో నాలుగు సినిమాల్లో నటిస్తోంది.
ఈ జాబితాలో తర్వాత మనం మాట్లాడుకునేది మన టాలీవుడ్ స్వీటీ అదేనండీ.. అనుష్క గురించి! 2006లో విడుదలైన ఎస్.ఎస్. రాజమౌళి చిత్రం విక్రమార్కుడు (Vikramarkudu)తో టాలీవుడ్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ.. అంతకంటే ముందు అంటే 2005లో రెండు సినిమాల్లో నటించింది. వాటిలో ఒకటి తన తొలిచిత్రం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సూపర్ (Super) కాగా; మరొకటి వి.సముద్ర దర్శకత్వం వహించిన మహానంది. ఈ రెండూ పెద్ద స్థాయిలో విజయాన్ని దక్కించుకోలేక పోవడంతో స్వీటీకి తన మూడో చిత్రం బాగా కలిసి వచ్చింది. ఆ తర్వాత ఇంకేముంది.. ఇప్పటి వరకు ఈ అమ్మడు వెనుదిరిగి చూసింది లేదు!
అనుష్కతో సమానంగా.. అంటే అదే ఏడాది తెలుగు తెరకు పరిచయమైంది మిల్కీ బ్యూటీ. చిన్న వయసులోనే హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయిన తమన్నాకు 2007లో శేఖర్ కమ్ముల రూపొందించిన హ్యాపీ డేస్ (Happy Days) చిత్రంతో స్టార్ ఇమేజ్ లభించింది. అయితే దీని కంటే ముందే ఈమె తెలుగులో రెండు సినిమాల్లో నటించింది. వాటిలో ఒకటి తన తొలి చిత్రం శ్రీ కాగా; మరొకటి జాదూ! ప్రస్తుతం తమన్నా తెలుగులో దటీజ్ మహాలక్ష్మితో పాటు సైరాలో కూడా నటిస్తోంది. అలాగే తమిళంలో దేవి 2, హిందీలో ఖామోషీ సినిమాలతో బిజీగా ఉంది.
ఈ జాబితాలో మనం తర్వాత మాట్లాడుకోబోయేది ముద్దుగుమ్మ నయనతార (Nayanthara) గురించి. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న భామల్లో తొలి సినిమా తెలుగులో విడుదలైనా.. దాని ద్వారా గుర్తింపు సంపాదించుకోలేకపోయిన వారే ఎక్కువ. కానీ నయనతార మాత్రం వీరందరికీ కాస్త భిన్నం. ఎందుకంటే ఈ అమ్మడు నేరుగా తెలుగు సినిమాలో నటించక ముందే ఆమెకు ఇక్కడ చక్కని గుర్తింపు లభించింది. అదెలా అంటే.. నయన్ తెలుగులో నటించిన తొలి చిత్రం లక్ష్మి (Lakshmi).
వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2006లో విడుదలైంది. కానీ అంతకంటే ముందే తమిళంలో నయనతార నటించిన చంద్రముఖి & గజిని సినిమాలు తెలుగులోకి కూడా డబ్బింగ్ అయ్యి విడుదల అయ్యాయి. వాటితో నేరుగా తెలుగులో తెరంగేట్రం చేయడానికి ముందే ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ఇమేజ్‌ని ఏర్పరుచుకుందీ లేడీ సూపర్ స్టార్. ప్రస్తుతం తెలుగులో సైరా చిత్రంలో నటిస్తోన్న నయన్ తమిళంలో నాలుగు, మలయాళంలో ఒక సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది.
వీరందరి కంటే తర్వాత వచ్చిన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). దాదాపు మెగా హీరోలందరితోనూ ఆడిపాడిన కాజల్ టాలీవుడ్‌లో స్టార్ హీరోలు అందరితోనూ నటించిన క్రెడిట్ సంపాదించుకుంది. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ఈ అందాల భామ తన తెలుగు సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది మాత్రం 2007లో విడుదలైన లక్ష్మీ కళ్యాణం (Lakshmi Kalyanam) అనే సినిమాతో! కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం కాజల్ తెలుగులో మూడు సినిమాల్లోను, తమిళంలో మూడు సినిమాల్లోనూ నటిస్తూ తీరిక లేకుండా గడుపుతోంది.
చూశారుగా.. ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దానికి పైనే కావస్తోన్నా.. ఇప్పటికీ చక్కని అవకాశాలను అందిపుచ్చుకొని తమని తాము నిరూపించుకుంటున్నారీ నటీమణులు. సినీ పరిశ్రమలో హీరోయిన్ కెరీర్ కేవలం మూణ్నాళ్ల ముచ్చట అనే ఈరోజుల్లో కూడా ఎన్నో ఏళ్లుగా కథానాయికలుగా తమ సత్తా చాటుతూ ప్రేక్షకుల్లో తమదైన ముద్రవేశారీ స్టార్ హీరోయిన్స్. వీరి ప్రతిభ, పట్టుదల, కృషి నిజంగా అభినందనీయం.. నవ కథానాయికలకు స్ఫూర్తిదాయకం అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇవి కూడా చదవండి
మణికర్ణికపై.. మెగాస్టార్ ప్రశంసల వర్షం..!
శ్రీదేవి బయోపిక్ పై.. కన్నేసిన రకుల్ ప్రీత్..?
నిక్, ప్రియాంక పెళ్లిలో.. డైమండ్ రింగ్ గెలుచుకున్న బాలీవుడ్ భామలు