ప్రేమకు.. నమ్మకమే పునాది (ఓ నిజజీవిత కథనం)

ప్రేమకు.. నమ్మకమే పునాది (ఓ నిజజీవిత కథనం)

ఇద్ద‌రు వ్య‌క్తులు ఒక‌రినొక‌రు గాఢంగా ప్రేమిస్తూ.. ఇద్ద‌రూ ఒక్క‌రే అన్నంత‌గా జీవితం కొన‌సాగిస్తే అలాంటి ప్రేమ కథ‌లు నిజ‌మైన ప్రేమ‌కు ఎప్పుడూ సాక్ష్యంగానే నిలుస్తాయి. ప్రేమ‌లో ఒక‌రికొక‌రు ఇచ్చుకునే అవ‌కాశాల సంఖ్య‌ను బ‌ట్టి కాకుండా ప్రేమించిన వ్య‌క్తిని ఎన్న‌టికీ కోల్పోని విధంగా ఎవ‌రైతే ప్ర‌య‌త్నిస్తారో అలాంటి వారు ప్రేమ‌పై ఉన్న న‌మ్మ‌కాన్ని (faith) పెంచిన వార‌వుతారు. హ్యూమ‌న్స్ ఆఫ్ బాంబే పేజీ నుంచి అలాంటి ఒక అంద‌మైన ప్రేమ‌క‌థ‌ (love story)తో ఇప్పుడు మీ ముందుకు వ‌చ్చాం.


love


7 సంవ‌త్స‌రాల క్రితం ఒక అమ్మాయి జీవితంలో మొద‌లైన ప్రేమ క‌థ (ఓ నిజజీవిత కథనం):


మేమిద్ద‌రం మా భాగ‌స్వాముల నుంచి విడిపోయాం. మాకు ఉన్న ఒక కామ‌న్ ఫ్రెండ్ ద్వారా ఇద్ద‌రం క‌లుసుకున్నాం. మొద‌టిసారి క‌లిసిన త‌ర్వాత అత‌ని సాన్నిహిత్యం నాకు బాగా న‌చ్చింది. అందుకే ఇద్ద‌రం త‌ర‌చూ క‌ల‌వ‌డం ప్రారంభించాం. అలా ఆయ‌న సాన్నిహిత్యాన్ని నేను చాలా బాగా ఆస్వాదించేదాన్ని. మేము ఏకాంతంగా క‌లుసుకున్న ప్ర‌తిసారీ అత‌ను నా మ‌న‌సులోని మాట‌ల‌ను త‌న‌తో పంచుకోమ‌నేవాడు. మీకు తెలుసా?? మా తొలి డేట్లోనే మేము మా గ‌తాల గురించి పూర్తిగా మాట్లాడుకున్నాం. ఏదేమైతేనేం.. మా క‌థ స‌జావుగా సాగుతుంది క‌దా అనుకునే లోపే అత‌ను నా నుంచి విడిపోవ‌డానికి సిద్ధ‌ప‌డ్డాడు.


కార‌ణం అడిగితే "నీ తీరు నాకు చాలా బాగా న‌చ్చింది. కానీ మ‌న ఇద్ద‌రి ప్ర‌పంచాలు పూర్తిగా భిన్న‌మైన‌వి. మ‌నం క‌లిసి ఉంటే సంతోషంగా జీవించ‌డం కుద‌ర‌ని ప‌ని అనిపిస్తోంది" అంటూ త‌న మ‌నసులోని సందేహాన్ని వెలిబుచ్చాడు. కానీ నేను మేమిద్ద‌రం క‌లిసి ఉన్న స‌మ‌యంలో ఇద్ద‌రం ఎంత సంతోషంగా ఉన్నామో, ఒక‌రి సాన్నిహిత్యాన్ని ఇంకొక‌రం ఎంత‌గా ఆస్వాదించామో ఒక్క‌సారి గుర్తుచేశా. అలాగే మా బంధాన్ని కొన‌సాగిద్దామ‌ని.. ఒక‌వేళ తను అన్న‌ట్లుగా ఏవైనా ఇబ్బందులు, గొడ‌వ‌లు వ‌స్తే అప్పుడు తను అన్న దాని గురించి ఆలోచిద్దామని స‌ర్దిచెప్పా. కొంత సమయం తీసుకొని.. అత‌ను కూడా నా మాట‌ల‌కు అంగీక‌రించ‌డంతో నా మ‌న‌సు కాస్త కుదుట‌ప‌డింది.


ఆ త‌ర్వాత మేమిద్దరం క‌లిసి స‌ర‌దాగా రోడ్ ట్రిప్స్‌కు వెళ్లాం. ఇంట్లో కూడా చాలా స‌మ‌యం గ‌డిపాం. మేమిద్ద‌రం ఒక‌రితో మ‌రొక‌రం క‌లిసి ఉండ‌డాన్ని బాగా ఎంజాయ్ చేసేవాళ్లం. అన్నింటినీ మించి నా అవ‌స‌రాలు, మాన‌సిక స్థితికి అనుగుణంగా ఉండే అత‌ని స‌మ‌య‌స్ఫూర్తి అంటే నాకు ఇంకా ఇష్టం. ఇలా 10 నెల‌ల పాటు ఇద్ద‌రం క‌లిసి సంతోషంగా స‌మ‌యం గ‌డిపిన త‌ర్వాత మేమిద్ద‌రం మా మ‌న‌సుల్లో ఒక‌రి మీద మ‌రొక‌రికి ఉన్న ప్రేమ‌ను వ్య‌క్తీక‌రించుకున్నాం. నిజానికి అత‌ను న‌న్ను ప్రేమిస్తున్నాన‌ని చెప్పిన‌ప్పుడు నేనూ అదే భావ‌న‌లో ఉన్నాను. కాబ‌ట్టి నా సంతోషానికి అవ‌ధుల్లేకుండా పోయాయి. ఆ రోజు సాయంత్రం స‌మ‌య‌మే తెలియ‌కుండా ఇద్ద‌రం ఎంత సంతోషంగా గ‌డిపామో జీవితంలో ఎప్ప‌టికీ గుర్తే.


love1


కానీ విధి మా క‌థ‌ను మ‌రో విధంగా మార్చేందుకు ప్ర‌య‌త్నిస్తుంద‌ని మేమ‌స్స‌లు ఊహించ‌లేదు. 2014లో నేను ఆఫీసులో ఉండ‌గా, ఆయ‌న‌కు గుండెపోటు వ‌చ్చింద‌ని నాకు ఫోన్ వ‌చ్చింది. ఆసుప‌త్రికి వెళ్ల‌గా అప్ప‌టికే ఆయ‌న చ‌నిపోయార‌ని వైద్యులు చెప్పారు. క‌ళ్లు మూసుకుని ఉన్న ఆయ‌న్ను చూడ‌గానే నాలో స‌గ‌ప్రాణం పోయిన‌ట్ల‌నిపించింది. డాక్ట‌ర్లు ఆయ‌న్ని బ‌తికించే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ప్పుడు.. నా ప్రేమ‌ను నాకు ద‌క్కించ‌మ‌ని నా గుండెలోనే ఎంత‌మంది దేవుళ్ల‌ను వేడుకున్నానో నాకే తెలుసు. అదృష్ట‌వ‌శాత్తు ఆయ‌న తిరిగి ప్రాణాలు ద‌క్కించుకున్నారు.


అయితే చికిత్సా స‌మ‌యంలో.. ఆయ‌న మ‌ళ్లీ నాతో ప్రేమ‌లో ప‌డ్డాన‌ని అంటూ ఉంటారు. ఆ స‌మ‌యంలో నేను ఆయ‌న‌తోనే ఉండ‌డం, ఆరోగ్య‌ప‌రంగా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం.. వంటివి చూసి ఆయ‌న‌కు నేను ఇంకా న‌చ్చాన‌ని అంటూ ఉంటారు. కానీ ఆ చికిత్స జ‌రుగుతున్న స‌మ‌యంలో ఆయ‌న దృష్టి ఎక్కువ‌గా ప‌ని మీదే కేంద్రీక‌రించేవారు. దీంతో మా మ‌ధ్య బాంధ‌వ్యం కాస్త బ‌ల‌హీన‌ప‌డింది. ఫ‌లితంగా ఆయ‌న పై క్ర‌మంగా న‌మ్మ‌కాన్ని కోల్పోతూ వ‌చ్చా. అందుకే నేను వెళ్లాల‌నుకున్న యూరోప్ ట్రిప్‌కు ఒంట‌రిగానే వెళ్లాలని నిర్ణ‌యించుకున్నా. అలా ఆయ‌న‌తో కూడా విడిపోయా.


మొద‌టిసారి ఆయ‌న విడిపోతాన‌న్న‌ప్పుడు మా బంధంపై త‌న‌కు న‌మ్మ‌కం క‌లిగేలా చేసి మా బంధాన్ని కొన‌సాగించా. కానీ ఈసారి అలా జ‌ర‌గదులే అనుకున్నా. కానీ నా అంచ‌నా పొర‌పాటైంది. ఆయ‌న న‌న్ను క‌లిసేందుకు, మా బంధాన్ని కొన‌సాగించేందుకు న‌న్ను ఒప్పించేందుకు యూరోప్‌కి వ‌చ్చారు. త‌న‌కు మ‌రొక అవ‌కాశం ఇవ్వాల‌ని చిన్న‌పిల్లాడిలా మారాం చేస్తూ అడిగేస‌రికి కాద‌న‌లేక‌పోయా. అలా నేనూ త‌న‌కి మ‌రొక అవ‌కాశం ఇచ్చాను. ఇప్పుడు మాకు పెళ్లై ఏడేళ్ల‌వుతోంది. ఇద్ద‌రం చాలా సంతోషంగా జీవిస్తున్నాం.


అయితే ఇక్క‌డ మేము చెప్ప‌ద‌లుచుకున్న‌ది ఒక్క‌టే. ప్రేమించుకునే క్ర‌మంలో ఆ ప్రేమ‌ను నిల‌బెట్టుకునేందుకు లేదా ప్రేమ ప‌ట్ల న‌మ్మ‌కం క‌ల్పించేందుకు ఒక‌రికి మ‌రొక‌రు అవ‌కాశాలు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక్క‌డ మ‌న‌మంతా గ‌మ‌నించాల్సిన ఒక ముఖ్య‌ విష‌యం ఏంటంటే.. మ‌నం ఎన్ని అవ‌కాశాలు ఇచ్చాం అనేదాని కంటే ఆ అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకునేందుకు అవ‌త‌లివారు ఎంత ఓర్పు, ప‌ట్టుద‌ల‌తో.. గ‌ట్టిగా, స‌మ‌ర్థంగా ప్ర‌య‌త్నించార‌నేదే ముఖ్యం. నిజంగా మ‌నం ఒక వ్య‌క్తిని ప్రేమిస్తే అస‌లు వారి నుంచి విడిపోవాల‌నే ఆలోచ‌నే మ‌న‌కు రాదు. మా క‌థ‌లో కూడా ఇలా ఇద్ద‌రం ఆలోచ‌న వ‌చ్చింది క‌దాని విడిపోయి ఉంటే.. ఇలా ఈ రోజు మా క‌థ‌ను మీతో పంచుకుని ఉండేవాళ్లం కాదు. కాబ‌ట్టి మీరు కూడా ఈ విష‌యం గుర్తుంచుకుని మీ ప్రేమ‌లో విజ‌యం సాధించి సంతోషంగా జీవించేందుకు సిద్ధ‌మైపోండి.


ఇవి కూడా చదవండి


పొట్టి వారే.. కానీ ఆత్మస్థైర్యంలో గట్టివారు..!


#నా క‌థ‌: మ‌న‌ల్ని మ‌నం ప్రేమించుకుంటేనే ఇంకొక‌రు మ‌న‌ల్ని ప్రేమిస్తారు..!


ఆలుమగల ఆనంద దాంపత్యానికి అద్దం పట్టే.. అద్భుత చిత్రాలు..!