కేన్స్ వేదికపై మెరిసిన భారతీయ రైతు.. రహీబాయి సోమా..!

కేన్స్ వేదికపై మెరిసిన భారతీయ రైతు.. రహీబాయి సోమా..!

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes film festival).. ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన చిత్రాలన్నింటినీ ఒక్క చోట చేర్చి వాటిలో అత్యుత్తమమైన వాటిని ఎంపిక చేసి బహుమతులు అందజేసే చిత్రోత్సవం ఇది. ప్రపంచవ్యాప్తంగా సాధారణంగా ఎన్నో చిత్రోత్సవాలు జరుగుతున్నా.. కేన్స్‌కి ఉన్న ప్రత్యేకత గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.


అలాంటి చిత్రోత్సవానికి ఈసారి మన దేశం నుంచి కనీసం ఒక్క సినిమా కూడా ఎంపిక కాలేదు. కనీసం మన దేశం నుంచి ఒక్క జ్యూరీ మెంబర్ కూడా ఎంపిక కాకపోవడం గమనార్హం. అయితే మన దేశం నుంచి షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో వెళ్లిన సీడ్ మదర్ (Seed mother) అనే మూడు నిమిషాల లఘు చిత్రం మాత్రం.. నెస్ ప్రెసో టాలెంట్స్ కేటగిరీలో మూడో స్థానాన్ని సంపాదించి అవార్డు గెలుచుకుంది.


ఈ ఏడాది మన దేశం నుంచి కేన్స్‌కి ఎంపికై అవార్డును కూడా గెలుచుకున్న ఈ చిత్రం భారతీయ మహిళా రైతు జీవితానికి సంబంధించినది. ప్రముఖ దర్శకుడు అచ్యుతానంద ద్వివేది ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. మహారాష్ట్రకి చెందిన రహీబాయి సోమా అనే మహిళా రైతు జీవిత కథ ఆధారంగా ఈ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కింది.


seed mother 617936


Source : FilmCompanion


అచ్యుతానంద ద్వివేది ప్రముఖ దర్శకుడు. ముంబయి జీవితం తన ఆరోగ్యానికి హానికరమైందని గుర్తించి పుదుచ్చెరికి మారిపోయారట. అక్కడ తన ఇంటి కిచెన్ గార్డెన్ కోసం మంచి ఆర్గానిక్ సీడ్స్ గురించి వెతుకుతున్నప్పుడు.. ఆయనకు రహీబాయి సోమా గురించి తెలిసిందట. స్వతహాగా ద్వివేది కెమెరామ్యాన్ కావడంతో.. వింటేజ్ లెన్స్‌ల ఉపయోగాన్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటారట. అందుకే ఈ సీడ్ మదర్ చిత్రాన్ని మిర్రర్ లెన్స్ సాయంతో తీశారట.


ఇలా విభిన్న తరహా డాక్యుమెంటరీలు తీస్తూ ఆసక్తికరమైన థీమ్స్‌తో ముందుకు రావాలన్నదే తన ప్రయత్నం అని చెబుతారు ద్వివేది. గతంలోనూ ముంబయికి చెందిన మిక్స్‌డ్ మార్షల్ ఆర్టిస్ట్ ఫర్హాన్ సిద్ధిఖీ జీవితంపై తీసిన ఇంటర్నల్ ఫైట్ అనే డాక్యుమెంటరీకి ఆయన కేన్స్ లయన్స్ పురస్కారాన్ని గెలుపొందారు.


123 746503


Source : mittra


ప్రస్తుతం కేన్స్ పురస్కారం పొందిన ఈ లఘు చిత్రంలో రహీబాయి సోమా జీవితం కళ్లకు కట్టినట్లు కనబడుతుంది. తన పొలాల్లో.. సంప్రదాయ పద్ధతులను అనుసరించి విత్తనాలను సేకరించడం, భద్రపర్చడం రహీబాయి పని. ఈ అంశాన్నే లఘుచిత్రంలో చూపించారు. మహారాష్ట్రలోని కొంబల్నే గ్రామానికి చెందిన రహీబాయి సోమా 1964 సంవత్సరంలో జన్మించారు. చిన్నతనం నుంచి ఆమె వ్యవసాయమే తన జీవితంగా మార్చుకున్నారు.


అందుకే స్కూల్‌కి కూడా వెళ్లలేదట. ఆగ్రో బయో డైవర్సిటీ గురించి అవగాహన కల్పిస్తూ.. వ్యవసాయ రంగంలో తనదైన సేవ చేస్తూ తనకున్న యాభై ఎకరాల భూమిలో.. పదిహేడు రకాలకు చెందిన పంటలు పండిస్తున్నారామె. కొత్త వంగడాలను సృష్టించడమే మాత్రమే కాదు.. ఆర్గానిక్ విత్తనాలను కాపాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు.


seed mother1


ఆమె పండిస్తోన్న వంగడాల్లో వరి నుంచి చిక్కుళ్లు, బీన్స్ వరకూ ఒక కుటుంబానికి అవసరమయ్యే అన్ని రకాల పంటలు ఉండడం విశేషం. ఇలా విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చి, రైతులు హైబ్రిడ్ వంగడాల కన్నా.. సాధారణ పంటలనే పండించేలా ప్రోత్సహిస్తుంటారు.


అంతేకాదు.. విత్తనాలు సేకరించడం, మట్టిలో సారాన్ని పెంచడం, పురుగులను అరికట్టడం.. వంటి అంశాలలో శిక్షణ ఇస్తూ సేంద్రియ వ్యవసాయ అభివృద్ధికి కృషి చేస్తున్నారు ఆమె. తన సేవలకు గాను ఆమె 'బీబీసీ 100 వుమెన్ 2018'గా ఎంపికవడంతో పాటు బెస్ట్ సీడ్ సేవర్ అవార్డ్, బెస్ట్ ఫార్మర్ అవార్డ్, నారీ శక్తి పురస్కారం వంటి ఎన్నో అవార్డులను సాధించారు.


ఈ ఏడాది కేన్స్ నెస్ ప్రెస్సో టాలెంట్ అవార్డ్స్ థీమ్ 'వీ ఆర్ వాట్ వీ ఈట్'. ఈ థీమ్‌లో భాగంగా.. ప్రపంచంలోని వివిధ దేశాల సంస్కృతులు, వారి ఆహారపద్ధతుల గురించి తీసిన లఘుచిత్రాలను ఎంపిక చేస్తారన్నమాట. ఇందులో భాగంగా 47 దేశాల నుండి 371 వీడియోలు పోటీ పడ్డాయి. అందులో మొదటి అవార్డును న్యూజిలాండ్‌కు చెందిన సాబుక్ అనే షార్ట్ ఫిల్మ్ గెలుచుకుంది. బాలీలో బియ్యం పండించే పద్దతి పద్ధతిపై తీసిన లఘుచిత్రం ఇది. రెండో అవార్డు మెక్సికోకి చెందిన రఫ్ఫో అనే షార్ట్ ఫిల్మ్‌కి దక్కింది.


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో లభ్యమవుతోంది: ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ మరియు బెంగాలీ


కలర్ ఫుల్‌గా, క్యూట్‌గా ఉండే వస్తువులను మీరూ ఇష్టపడతారా? అయితే సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ ఇంకా మరెన్నో.. వాటికోసం POPxo Shop ని సందర్శించండి !


ఇవి కూడా చదవండి.


స్వలింగ బంధంలో ఉన్నా.. ఆ అమ్మాయినే పెళ్లాడి జీవితంలో స్థిరపడతా: ద్యుతీ చంద్


ఈ ఏడాది కేన్స్‌లో.. ఈ భామ‌ల అందాల‌ను చూడొచ్చు. ఎప్పుడో తెలుసా?


పొట్టి దుస్తులు వేసుకుంటే.. రేప్ చేయాల్సిందే: గుర్గావ్‌లో ఓ మహిళ షాకింగ్ స్టేట్‌మెంట్