ADVERTISEMENT
home / Health
గ్యాస్ నొప్పితో (ఎసిడిటీ) బాధపడుతున్నారా? ఈ చిట్కాలతో ఉపశమనం లభిస్తుంది (Home Remedies For Acidity In Telugu)

గ్యాస్ నొప్పితో (ఎసిడిటీ) బాధపడుతున్నారా? ఈ చిట్కాలతో ఉపశమనం లభిస్తుంది (Home Remedies For Acidity In Telugu)

ఎసిడిటీ, గ్యాస్ నొప్పి, గ్యాస్ట్రిక్ ట్రబుల్.. పేరేదైతేనేం.. ఈ సమస్యతో బాధపడుతున్నవారు రోజురోజుకీ పెరుగుతున్నారు. ‘గ్యాస్ నొప్పే కదా.. పెద్ద సమస్య కాదులే’ అని తీసిపారేస్తుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో అది మన శరీరంలో దాగున్న మరో అనారోగ్యానికి సూచన కావచ్చు. అందుకే ఎసిడిటీ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. మన ఆహారపు అలవాట్లు, జీవన విధానం సైతం ఎసిడిటీ రావడానికి కారణమవుతున్నాయి. అసలు ఎసిడిటీ ఉందని ఎలా గుర్తించాలి? ఎసిడిటీ రావడానికి ముఖ్య కారణాలేంటి? ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది? ఇలాంటి ముఖ్యమైన అంశాలు తెలుసుకొని మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యం కాపాడుకొందాం. ఎసిడిటీకీ దూరంగా ఉందాం.

ఎసిడిటీకి కారణాలు

ఎసిడిటీని గుర్తించడానికి చేసే పరీక్షలు

కడుపులో మంటను తగ్గించే ఇంటి చిట్కాలు

ADVERTISEMENT

ఎసిడిటీని తగ్గించే ఇతర చిట్కాలు

ఎసిడిటీని గుర్తించే సూచనలు (Symptoms Of Acidity)

జీర్ణాశయంలో విడుదలైన ఆమ్లాలు జీర్ణవ్యవస్థపై చూపే ప్రభావం మీద ఎసిడిటీ తీవ్రత ఆధారపడి ఉంటుంది. కొన్ని లక్షణాల ఆధారంగా ఎసిడిటీ సమస్యను మనం గుర్తించవచ్చు. వాటి ఆధారంగా సమస్య తీవ్రతను గుర్తించవచ్చు.

  • గుండెల్లో మంట: ఎసిడిటీ సమస్యతో బాధపడేవారిలో సాధారణంగా కనిపించే లక్షణం ఇది. జీర్ణాశయంలో విడుదలైన ఆమ్లాలు అన్నవాహికలోకి రాకుండా చిన్న వాల్వ్ లాంటిది ఉంటుంది. అది మనం తిన్న ఆహారం, నీరు వంటి వాటిని సైతం తిరిగి అన్నవాహికలోనికి రాకుండా అడ్డుకొంటుంది. ఒకవేళ ఇది అలా అడ్డుకోలేకపోతే ఆమ్లాలు అన్నవాహికలోకి వస్తాయి. దీని వల్ల ఛాతీ భాగంలో నొప్పి, మంటగా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఇది చాలా ఎక్కువగా అనిపిస్తుంది.
  • పుల్లటి రుచి: అన్నవాహికలోనికి ప్రవేశించిన ద్రవాలు కొన్ని సందర్భాల్లో తేన్పుల ద్వారా నోటిలోకి వస్తాయి. అప్పుడు నోరంతా పుల్లగా లేదా చేదుగా అనిపిస్తుంది. నోటితోపాటు గొంతులోనూ ఇలాగే ఉన్నట్టుగా అనిపిస్తుంది.
  • ఏదో కదులుతున్నట్టుగా అనిపించడం: గొంతు, అన్నవాహిక, జీర్ణాశయంలో ఏదో కదులుతున్నట్టుగా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇలా అనిపించినప్పుడు కొంతమందిలో వాంతులు అవుతుంటాయి. ఇది పెద్దవాళ్లలో చాలా అరుదుగా కనిపిస్తుంది. దీని వల్ల ఎలాంటి హాని జరగదు.
  • అజీర్తి: అజీర్తి కూడా ఎసిడిటీకి ఒక సూచన కావచ్చు. అజీర్తితో పాటు ఛాతీలో మంటగా ఉండటం, వికారంగా అనిపించడం, ఎక్కువగా తేన్పులు రావడం, వాంతులు, విరేచనాలు అవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి వారి సూచనల ప్రకారం చికిత్స తీసుకోవడం మంచిది. ఈ లక్షణాలు కనిపించినప్పుడు అశ్రద్ధ చేస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
  • పొడి దగ్గు: ఇది కూడా ఎసిడిటీకి సూచనే. గొంతులో ఏదో అడ్డుపడినట్టుగా ఉంటుంది. దీని కారణంగానే దగ్గు ఎక్కువగా వస్తుంది. అయితే అన్ని సందర్భాల్లోనూ ఇది ఎసిడిటీకి సూచనగా పరిగణించాల్సిన అవసరం లేదు.

ఆరోగ్యానికి, సౌందర్యానికి రక్ష.. ఈ పచ్చాపచ్చని కీరదోస..!

ఈ లక్షణాలుంటే అత్యవసర చికిత్స తప్పనిసరి (Symptoms Require Immediate Attention)

గుండెలో లేదా ఛాతీలో మంట భరించలేనంత ఎక్కువగా ఉండటం, ఛాతీలో తీవ్రమైన నొప్పి ఉండటం, ఛాతీలో చాలా ఇబ్బందిగా అనిపించడం (నొక్కుతున్నట్టుగా, మెలిపెడుతున్నట్టుగా అనిపిస్తున్నప్పుడు) వెంటనే చికిత్స తీసుకోవాలి. అలాగే శ్వాస సరిగ్గా తీసుకోలేకపోవడం, వికారం, తల తిరుగుతున్నట్టనిపించడం, చెమట ఎక్కువ పట్టడం, ఎడమ చేయి, భుజం, మెడ, వీపు, దవడ భాగాలకు నొప్పి క్రమంగా పాకుతుండటం – ఈ లక్షణాలు మీరు గమనించినప్పుడు అత్యవసర చికిత్స తీసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే ఈ లక్షణాలు ఎసిడిటీకి సంబంధించినవే అయినప్పటికీ అది గుండెకు సంబంధించిన సమస్య కూడా కావచ్చు. కొన్ని సందర్భాల్లో గ్యాస్ట్రో ఎంటరాలజీకి సంబంధించిన సూచనలు గుండెనొప్పి వంటి సమస్యలకు కూడా సూచన కావచ్చు. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవడం మంచిది.

ADVERTISEMENT

మధుమేహం యొక్క కారణాలు

ఎసిడిటీకి కారణాలు (What Causes Acidity)

  1. అధికంగా ఆహారం తినడం
  2. తిన్న వెంటనే పడుకోవడం
  3. అధిక బరువు ఉండటం
  4. నిద్రపోయే ముందు ఆహారం తినడం
  5. ఆల్కహాల్ సేవించడం, పొగ త్రాగడం
  6. కార్బొనేటెడ్ డ్రింక్స్, కాఫీ, టీ అధికంగా తీసుకోవడం
  7. మసాలా ఎక్కువగా ఉన్న ఆహారం తినడం
  8. కండరాల నొప్పిని తగ్గించే కొన్ని రకాల ఔషధాలు తీసుకోవడం
  9. ఒత్తిడి

ఎసిడిటీని గుర్తించడానికి చేసే పరీక్షలు (How To Diagnose Acidity)

ఎసిడిటీ కి సంబంధించిన లక్షణాలున్నంత మాత్రాన అన్ని సందర్భాల్లోనూ అది ఎసిడిటీ కాకపోవచ్చు. అందుకే దాన్ని నిర్ధరించడానికి కొన్ని పరీక్షలు చేస్తారు వైద్యులు. ఇసోఫాగ్రామ్(esophagram) మానోమెట్రీ(అన్నవాహిక పనితీరు తెలుసుకోవడానికి), పీహెచ్ మానిటరింగ్, ఎండోస్కోపీ, బయాప్సీ వంటి పరీక్షల ద్వారా తెలుసుకొంటారు. వీటి ద్వారా ఎసిడిటీ తీవ్రతను తెలుసుకోవడంతో పాటు అల్సర్లు ఏమైనా ఉన్నాయా? ఇతర కారణాలేమైనా ఎసిడిటీ రావడానికి ప్రభావితం చేస్తున్నాయా? అని గుర్తించి చికిత్స అందిస్తారు. 

 

1-acidity-home-remedies

Image: Shutterstock

ADVERTISEMENT

గర్భం దాల్చిన వారిలో సుమారుగా 80 శాతం మంది ఎసిడిటితో బాధపడుతుంటారు. గర్భం దాల్చిన సమయంలో హార్మోన్ల విడుదలలో తేడాలు ఏర్పడతాయి. కండరాల నొప్పిని తగ్గించే హార్మోన్లు ఈ సమయంంలో ఎక్కువగా విడుదలవుతుంటాయి. వీటి కారణంగా ఎసిడిటీ వచ్చే అవకాశాలుంటాయి. దీని వల్ల మీరు మాత్రమే కాకుండా మీ కడుపులో ఉన్న బిడ్డ సైతం ఇబ్బంది పడుతుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య రాకుండా చూసుకోవచ్చు.

  • ఆహారాన్ని తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తినడం మంచిది.
  • ఆహారాన్ని నెమ్మదిగా, పూర్తిగా నమిలి తినాలి.
  • వేపుళ్లు, మసాలాలు అధికంగా దట్టించిన ఆహార పదార్థాలు, కూల్ డ్రింక్స్ ఇలా ఎసిడిటీని కలిగించే వాటికి దూరంగా ఉండాలి.
  • తిన్న వెంటనే పడుకోకూడదు. కాసేపు కూర్చొనే ఉండాలి.
  • కూర్చున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు భుజాల కింద దిండు పెట్టుకోవాలి. దీనివల్ల జీర్ణాశయంలో విడుదలైన ఆమ్లాలు అన్నవాహికలోనికి రాకుండా ఉంటాయి.

కడుపులో మంటను తగ్గించే ఇంటి చిట్కాలు (Home Remedies For Acidity In Telugu)

తులసి (Tulsi)

తులసి మొక్కకు ఆయుర్వేదంలో చాలా ప్రాధాన్యం ఉంది. దీనికున్న ఔషధ గుణాల కారణంగా వివిధ రకాల వ్యాధులను తగ్గిస్తుంది. అందుకే ఇంటి వైద్యంలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కడుపులో మంట లేదా ఎసిడిటీకి సైతం దీన్ని మందుగా ఉపయోగించవచ్చు. గ్యాస్ నొప్పి(Acidity) వస్తుందని మీరు పసిగట్టిన వెంటనే కొన్ని తులసి ఆకులను నమలడం ద్వారా ఎసిడిటీ తగ్గుముఖం పడుతుంది. లేదా మరో చిట్కాను సైతం పాటించవచ్చు. దీని కోసం కప్పు నీటిలో మూడు నుంచి నాలుగు తులసి ఆకులు వేసి కొన్ని నిమిషాల పాటు అలా వదిలేయాలి. అప్పుడప్పుడూ ఈ నీటిని తాగడం ద్వారా సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. తులసి గింజల్లో యాంటీ అల్సర్ గుణాలుంటాయి. ఇవి జీర్ణాశయంలో విడుదలయ్యే ఆమ్ల ఉత్పత్తిని నియంత్రిస్తాయి.

బ్రహ్మాండమైన ఆరోగ్యాన్ని అందించే.. బహు చక్కని దుంప ‘బీట్రూట్’

సోంపు గింజలు (Fennel Seeds) 

మనలో చాలామందికి ఆహారం తిన్న తర్వాత సోంపు గింజలు నమిలే అలవాటు ఉంటుంది. ఏదైనా హోటల్ కి వెళ్లినప్పుడు ఆహారం తిన్న తర్వాత కొన్ని సోంపు గింజలను నోటిలో వేసుకొంటాం. దీని వల్ల ఆహారం త్వరగా జీర్ణమవడంతో పాటు గ్యాస్ట్రిక్ సమస్య రాకుండా ఉంటుంది. అలాగే సోంపు గింజలతో తయారు చేసిన టీ తాగడం ద్వారా ఎసిడిటీ నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. సోంపు గింజల్లో Anethole అనే పదార్థం ఉంటుంది. ఇది ఎసిడిటీ సమస్యను తగ్గిస్తుంది. దీనిలో ఉండే విటమిన్లు, పీచుపదార్థం ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తాయి. అలాగే దీనిలో యాంటీ అల్సర్ గుణాలుంటాయి. ఫలితంగా ఎసిడిటీ నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.

ADVERTISEMENT

దాల్చిన చెక్క (Cinnamon)

మనం తెలుగు వంటల్లో దాల్చిన చెక్కకు చాలా ప్రాధాన్యం ఉందని చెప్పాలి. మసాలా దినుసుల్లో దీన్ని ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఆహారానికి ప్రత్యేకమైన రుచిని అందించడం కోసం మనం ఉపయోగించే దాల్చిన చెక్క ఎసిడిటీ సమస్య నుంచి మనకు ఉపశమనం అందిస్తుంది. దాల్చిన చెక్కలో యాంటాసిడ్ గుణాలుంటాయి. ఇవి కడుపులో మంటను తగ్గించడంతో పాటు జీర్ణ ప్రక్రియ మెరుగుపడేలా చేస్తాయి. ఎసిడిటీ నుంచి తక్షణ ఉపశమనం కోసం దాల్చిన చెక్కతో తయారు చేసిన టీ తాగాల్సి ఉంటుంది. ఇది ఎసిడిటీ సమస్యను తగ్గించడంతో పాటు జీర్ణవ్యవస్థలో ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉంటే వాటిని కూడా తగ్గిస్తుంది.

2-acidity-home-remedies

మజ్జిగ (Buttermilk)

కాస్త కడుపులో మంటగా ఉందంటే.. ఇంట్లో ఉన్న పెద్దవాళ్లు ఓ గ్లాసుడు మజ్జిగ తాగు చల్లగా ఉంటుంది అని చెబుతారు. ఈసారి మీకు అలా ఎవరైనా చెబితే వారి మాటలను కొట్టిపారేయకండి. నిజంగానే మజ్జిగ తాగడం వల్ల కడుపులో మంట, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. దీనిలో ఉన్న లాక్టిక్ యాసిడ్ ఎసిడిటీని తగ్గిస్తుంది.  అంతేకాదు.. దీనిలో ఉన్న ప్రొబయాటిక్స్ ఆహారం జీర్ణమవడానికి తోడ్పడటంతో పాటు జీర్ణప్రక్రియకు తోడ్పడే మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. అలాగే ఎసిడిటీకి కారణమైన వాటిని శరీరం నుంచి బయటకు పంపిస్తుంది.  ఎప్పుడైనా భోజనం చేసిన తర్వాత భుక్తాయాసంగా అనిపిస్తే గ్లాసు మజ్జిగలో చిటికెడు మిరియాల పొడి కలుపుకొని తాగండి. ఆహారం జీర్ణమవడంతో పాటు గ్యాస్ నొప్పి రాకుండా ఉంటుంది.

పైనాపిల్ జ్యూస్ (Pineapple Juice)

పైనాపిల్ జ్యూస్ తో ఎసిడిటీ తగ్గించుకోవచ్చా? అని ఆలోచిస్తున్నారా? కచ్చితంగా. పైనాపిల్ జ్యూస్ గ్యాస్ నొప్పి నుంచి ఇన్స్టంట్ రిలీఫ్ ఇస్తుంది. దీనిలో ఉన్న బ్రొమెలైన్ అనే ఎంజైమ్ జీర్ణాశయంలో విడుదలయ్యే హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని తటస్థీకరిస్తుంది. అంతేకాదు.. ఆహారం పూర్తిగా జీర్ణమయ్యేలా కూడా చేస్తుంది.

ADVERTISEMENT

బెల్లం (Jaggery)

బెల్లంలో ఐరన్ తో పాటు మాంగనీస్ కూడా అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చూస్తుంది. అంతేకాదు acidity కారణమైన జీర్ణరసాలను తటస్థీకరిస్తుంది. కాబట్టి ఓ చిన్న బెల్లం ముక్క తినడం  ద్వారా ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందవచ్చు. మరింత వేగంగా ఫలితం పొందడానికి చల్లటి నీటిలో బెల్లం కలిపి తాగాల్సి ఉంటుంది. ఎసిడిటీ సమస్యతో బాధపడేవారు భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క తింటే ఈ సమస్య ఉత్పన్నమవకుండా ఉంటుంది.

లవంగాలు (Cloves)

మసాలా దినుసుల్లో లవంగాలు ప్రత్యేకమనే చెప్పుకోవాలి. ఇవి ఆహార పదార్థాలకు రుచిని, ప్రత్యేకమైన సువాసనను అందిస్తాయి. మాంసాహార వంటకాలతో పాటు శాఖాహార వంటలకు సైతం వీటిని ఉపయోగిస్తాం. మసాలా ఎక్కువగా తింటే ఎసిడిటీ వస్తుందంటారు. కానీ ఆ ఎసిడిటీని తగ్గించడానికి మసాలా దినుసుల్లో ముఖ్యమైన లవంగాలను ఉపయోగిస్తారు. లవంగ మొగ్గల్లో కడుపు ఉబ్బరాన్ని, మంటను తగ్గించే లక్షణాలుంటాయి. ఇవి జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తిని క్రమబద్ధీకరిస్తాయి. దీని వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడదు. ఈ ఫలితం పొందడానికి లవంగాలు, యాలకులను సమపాళ్లలో తీసుకొని రెండింటినీ కలిపి నమలాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల గ్యాస్ సమస్య తగ్గడంతో పాటు.. నోటి దుర్వాసన సైతం దూరమవుతుంది.

జీలకర్ర (Cumin Seeds)

జీలకర్ర యాసిడ్ న్యూట్రలైజర్ గా పనిచేసి ఆహారం జీర్ణమయ్యేలా చేయడంతో పాటు కడుపు నొప్పిని తగ్గిస్తుంది. నూనె లేకుండా వేయించిన జీలకర్రను మెత్తగా చేయాలి. గ్లాసు వేణ్నీళ్లలో కొద్దిగా జీలకర్రపొడి కలిపి భోజనం చేసిన తర్వాత తాగితే.. ఎసిడిటీ సమస్య రాకుండా ఉంటుంది. కడుపులో మంటగా అనిపించిన సందర్భంలోనూ ఈ నీటిని తాగితే ఉపశమనం దొరుకుతుంది.

అల్లం (Ginger)

మన భారతీయ సంప్రదాయ వంటకాల్లో అల్లం ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆయుర్వేదం ప్రకారం దీనిలో చాలా ఔషధ గుణాలున్నాయి. దీనిలోని వేడి తగ్గించే గుణాలు, ఆహారం జీర్ణం చేసే లక్షణాలుంటాయి. అంతేకాదు.. ఇది జీర్ణరసాలను సైతం తటస్థీకరిస్తుంది. ఫలితంగా గ్యాస్ట్రిక్ సమస్య రాకుండా ఉంటుంది. జింజర్ టీ తాగితే ఎసిడిటీ సమస్య తగ్గుముఖం పడుతుంది. కప్పు నీటిలో అల్లం ముక్కను వేసి బాగా మరిగిస్తే జింజర్ టీ తయారవుతుంది. ఎసిడిటీ నుంచి తక్షణ ఉపశమనం పొందడానికి చెంచా అల్లం రసం, చెంచా నిమ్మరసం, రెండు చెంచాల తేనెను గోరువెచ్చని నీటిలో కలిపి తాగాల్సి ఉంటుంది. ఇది మీకు తక్షణ ఉపశమనం అందించడం మాత్రమే కాకుండా.. మీ మెటబాలిజం ప్రక్రియను మెరుగుపరుస్తుంది.

ADVERTISEMENT

3-acidity-home-remedies

జుట్టు ఎక్కువగా రాలుతోందా? అయితే ఈ నేచురల్ టిప్స్ మీకోసమే..

పాలు (Milk)

పాలల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. దీని వల్ల మన ఎముకలు బలంగా తయారవుతాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ మీకు తెలియని మరో విషయం కూడా ఉంది. అదే క్యాల్షియం యాంటాసిడ్ గా పనిచేస్తుంది. అంటే ఆమ్లాలను విరిచేస్తుంది. జీర్ణాశయ పీహెచ్ విలువను క్రమబద్ధీకరించి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అందుకే పాలను ఎసిడిటీ నుంచి ఉపశమనం అందించే మందుగా చెబుతున్నారు. మీకెప్పుడైనా ఎసిడిటీ(Acidity) కారణంగా కడుపులో మంట వచ్చినట్లయితే.. ఒక గ్లాసు చల్లని పాలను తాగండి. ఈ పాలు ఎంత చల్లగా ఉంటే అంత త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఈ చిట్కా ఇన్స్టంట్ రిలీఫ్ ఇవ్వడంతో పాటు జీర్ణాశయంలో అధికంగా ఉన్న ఆమ్లాలను తటస్థీకరిస్తుంది. గ్యాస్ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి చల్లటి పాలనే తాగాలి. వేడిపాలను కాదు. అలాగే పాలల్లో పంచదార, చాక్లెట్ పౌడర్ లాంటివి సైతం కలపకూడదు.

పుదీనా ఆకు (Mint Leaves)

పుదీనా ఆకు సైతం ఎసిడిటీ సమస్యను తగ్గిస్తుంది. దీన్ని ఆహారంగా తీసుకోవడం ద్వారా జీర్ణ ప్రక్రియ మెరుగుపడటంతో పాటు గ్యాస్ట్రిక్ సమస్య రావడానికి కారణమైన  ఆమ్లాల ఉత్పత్తిని తగ్గిస్తాయి. కొన్ని పుదీనా ఆకులను నమలడం ద్వారా ఎసిడిటీ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. లేదా కొన్ని పుదీనా ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి చల్లారిన తర్వాత ఆ నీటిని తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.

ADVERTISEMENT

ఉసిరికాయలు (Gooseberries)

మన ఆరోగ్యాన్ని రక్షించే ప్రక్రుతి వరప్రసాదం ఉసిరి. అందుకే దీనికి త్రిఫలాల్లో చోటు దక్కింది. దీనిలో ఉన్న విటమిన్ సి ఎసిడిటీ  రాకుండా చేస్తుంది. ఉసిరికాయలను ఎండబెట్టి పొడిగా చేయాలి. ప్రతి రోజూ ఓ చెంచా పొడిని నీటిలో కలిపి తాగడం ద్వారా ఎసిడిటీ సమస్య రాకుండా జాగ్రత్తపడచ్చు.

యాపిల్ సిడర్ వెనిగర్ (Apples Cider Vinegar)

కప్పు నీటిలో 1 నుంచి 2 చెంచాల శుద్ధి చేయని యాపిల్ సిడర్ వెనిగర్ కలిపి రోజూ తాగడం వల్ల acidity సమస్య రాకుండా ఉంటుంది.

కొబ్బరి నీరు (Coconut Water)

ఏ చిన్న అనారోగ్యం ఎదురైనా మనం కొబ్బరి నీరు తాగడానికి ప్రాధాన్యమిస్తాం. అది నీరసాన్ని, అనారోగ్యాన్ని రెండింటినీ తగ్గిస్తుంది. ఎసిడిటీని తగ్గించుకోవడానికి సైతం దీన్ని ఉపయోగించవచ్చు. ఇది జీర్ణవ్యవస్థలో అధిక మొత్తంలో ఆమ్లాలు విడుదల అవడం వల్ల జీర్ణాశయానికి నష్టం కలగకుండా చేస్తుంది. పైగా ఎసిడిటీని సైతం రాకుండా చేస్తుంది. అంతేకాదు.. జీర్ణవ్యవస్థలో మ్యూకస్ పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దీని వల్ల ఎసిడిటీ వచ్చే అవకాశం తగ్గుతుంది.

4-acidity-home-remedies

ADVERTISEMENT

అరటిపండు (Banana)

అరటిపండులో యాంటాసిడ్స్ ఉంటాయి. ఇవి ఎసిడిటీ నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. దీనిలో ఉండే పొటాషియం జీర్ణవ్యవస్థలో మ్యూకస్ పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దీని వల్ల అధిక మొత్తంలో ఆమ్లాలు విడుదల అవకుండా ఉంటాయి. ఫలితంగా జీర్ణప్రక్రియ సక్రమంగా సాగిపోతుంది. బాగా మగ్గిన అరటిపండు తినడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి.

ఎసిడిటీని తగ్గించే ఇతర చిట్కాలు (Other Tips To Treat Acidity)

జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచే ఆహారాన్ని తీసుకోవడంతో పాటు మరికొన్ని చిట్కాలను పాటించడం ద్వారా కూడా ఎసిడిటీ రాకుండా చూసుకోవచ్చు.

ఎడమవైపు నిద్రించడం (Sleep On Your Left Side)

నిద్రపోయే విషయంలో ఒక్కొక్కరికీ ఒక్కోరకమైన అలవాటు ఉంటుంది. కొందరు బోర్లా పడుకొంటే, మరికొందరు వెల్లకిలా, ఇంకొదరు పక్కకి తిరిగి పడుకొంటారు. ఎసిడిటీతో బాధపడేవారు పడుకొనే విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. ఎడమ చేతి వైపుకి తిరిగి నిద్రపోవడం ద్వారా ఈ గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం దొరుకుతుంది. అదెలాగంటే.. జీర్ణవ్యవస్థ విడుదల చేసిన జీర్ణ రసాలు అన్నవాహిక లోకి రాకుండా ఉంటాయి. దీని వల్ల కడుపులో మంటగా అనిపించదు.

6-acidity-home-remedies

ADVERTISEMENT

ఆహారం సరిగ్గా నమిలి తినడం (Chew Food Properly)

ప్రస్తుతం అందరివీ హడావుడి జీవితాలే. అన్నీ ఉరుకుల పరుగుల జీవితాలే. అందుకే తిండి తినే విషయంలోనూ ఆ హడావుడి కనిపిస్తోంది. కంగారుగా తినడం వల్ల ఆహారం సరిగ్గా నమలకుండానే మింగేస్తున్నాం. దీని వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కావడం లేదు. ఫలితంగా పోషకాలు కూడా సరిగ్గా అందవు. ఎసిడిటీ(Acidity) సమస్య ఉన్నవారు ఆహారం బాగా నమిలి తినడం మంచిది. వారు మాత్రమే కాదు మిగిలిన వారు కూడా అలా చేస్తేనే పోషకాలన్నీ మనకు అందుతాయి. అలాగే ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా తక్కువ తక్కువగా ఎక్కువసార్లు తినడం మంచిది. అంటే ఒకసారి తినే భోజనాన్ని రెండు భాగాలుగా చేసుకొని రెండు సార్లు తినడం వల్ల కడుపు ఖాళీగా ఉండదు. ఆకలిని కలిగించే హైడ్రోక్లోరికామ్లం ఎక్కువగా విడుదల కాదు. అలాగే నిద్రపోవడానికి రెండు మూడు గంటల ముందే డిన్నర్ చేయడం మంచిది.

తగినంత నీరు తాగడం (Drink Enough Water)

తగినంత నీరు తాగకపోతే ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే నీరు తగినంత తాగడం వల్ల కూడా కొన్ని రకాల ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుంచి ఉపశమనం కూడా పొందవచ్చు. ఎసిడిటీ కూడా అలాంటిదే. రోజూ తగినంత నీటిని తాగడం ద్వారా ఎసిడిటీ ప్రభావాన్నితగ్గించుకోవచ్చు. ఎసిడిటీని కలిగించే జీర్ణరసాలను నీరు తటస్థీకరిస్తుంది. ఎప్పుడైనా కాస్త కడుపులో మంటగా అనిపించినా.. తేన్పులు ఎక్కువగా వస్తున్నా.. గోరువెచ్చని నీరు తాగడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.  అలాగే రోజుకి రెండు నుంచి మూడు లీటర్ల నీటిని తాగడం మరచిపోవద్దు.

5-acidity-home-remedies

Image: Unslpash

ADVERTISEMENT

రోజూ వ్యాయామం (Exercise Regularly)

వ్యాయామం కూడా కొన్ని రకాల అనారోగ్యాలను తగ్గించుకోవచ్చని చెబుతుంటారు. Acidity తగ్గడానికి కూడా రోజూ వ్యాయామం చేయాల్సిందే. ఎందుకంటే.. పొట్ట భాగంలో కొవ్వు ఎక్కువగా చేరడం వల్ల జీర్ణరసాలు అన్నవాహికలోకి చేరతాయి. ఇది ఎసిడిటీకి కారణమవుతుంది. అందుకే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరం. రోజుకి కనీసం అరగంట పాటు వ్యాయామం చేయడం వల్ల ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. జాగింగ్, క్రంచెస్ చేయడం ద్వారా మంచి ఫలితం లభిస్తుంది.

చూయింగ్ గమ్ నమలడం (Chewing Gum)

చూయింగ్ గమ్ కి, ఎసిడిటీ తగ్గడానికి సంబంధమేంటని సందేహం వచ్చిందా? ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియ నోటిలోనే మొదలవుతుంది. చూయింగ్ గమ్ నమలడం వల్ల నోట్లో లాలాజలం అధికంగా ఊరుతుంది. దీని వల్ల జీర్ణాశయంలో విడుదలయ్యే ఆమ్లాల పీహెచ్ విలువ సమతౌల్యమవుతుంది. ఆహారం తిన్న తర్వాత పది నిమిషాల పాటు చూయింగ్ గమ్ తినడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమై ఎసిడిటీ రాకుండా ఉండటంతో పాటు తాజా శ్వాస మీ సొంతమవుతుంది.

బిగుతైన దుస్తులకు దూరంగా (Avoid Wearing Tight Cloths)

టైట్ గా ఉండే దుస్తులు ధరించడం వల్ల మన పొట్ట లోపలికి నొక్కినట్టుగా తయారవుతుంది. దీని వల్ల మనం తిన్న ఆహారం జీర్ణమైన తర్వాత జీర్ణాశయం నుంచి పేగుల్లోకి పూర్తిగా వెళ్లలేదు. ఫలితంగా ఎసిడిటీ వచ్చే అవకాశాలుంటాయి. కాబట్టి వీలైనంత వరకు వదులుగా ఉండే దుస్తులనే ధరించడం మంచిది.

పొగ తాగడానికి దూరంగా (Avoid Smoking)

పొగ తాగడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందులో ఎసిడిటీ ఒకటి. సిగరెట్లో ఉన్ నికోటిన్ జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఆహారం జీర్ణమవడానికి విడుదలయ్యే ఆమ్లాలను జీర్ణాశయం నుంచి బయటకు పోనీయకుండా ఆపేస్తాయి. అందుకే సిగరెట్, బీడీ, చుట్ట వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది.

ADVERTISEMENT

కాసేపు ఎండలో

ఎండలో కాసేపు సమయం గడపడం వల్ల జీర్ణప్రక్రియ వేగవంతమవుతుంది. సూర్యకిరణాలలోని విటమిన్ డి జీర్ణ వ్యవస్థలో ఆరోగ్యాన్ని కాపాడే మైక్రోబయల్ బాడీ కెమికల్స్  విడుదలయ్యేలా చేస్తాయి. వీటిలో చాలా వరకు కెమికల్స్ ఎసిడిటీ రాకుండా ఆపుతాయి.

గమనిక: ఇవన్నీ ఎసిడిటీ(Acidity) ప్రభావాన్ని తగ్గించే కొన్ని చిట్కాలు మాత్రమే. తాత్కాలిక ఉపశమనం ఇస్తాయి. కానీ పూర్తిగా సమస్యను నయం చేయవు. కాబట్టి సంబంధిత వైద్యనిపుణులను సంప్రదించి చికిత్స తీసుకోవడం తప్పనిసరి.

Featured Image: Shutterstock

ADVERTISEMENT

Running Images: Pixabay

25 Apr 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT