కాస్త జిప్ వేసుకోవాల్సింది.. : రకుల్ పై విమర్శలు చేస్తున్న నెటిజన్లు..

కాస్త జిప్ వేసుకోవాల్సింది.. : రకుల్ పై విమర్శలు చేస్తున్న నెటిజన్లు..

రకుల్ ప్రీత్ సింగ్ (Rakul preet singh).. ఎలాంటి సినీ నేపథ్యం లేకపోయినా.. దక్షిణాది సినీ పరిశ్రమలో అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగిందీ బ్యూటీ. తెలుగులోనూ ఎంతోమంది స్టార్ హీరోలతో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. తాజాగా అజయ్ దేవగన్ సరసన దే దే ప్యార్ దే సినిమాతో బాలీవుడ్ లో మరోసారి తన అద్రుష్టం పరీక్షించుకుందీ భామ. ఈ సినిమా కోసం రకుల్ పది కేజీల బరువు తగ్గిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే.

తన ఫిట్ నెస్ తోనే కాదు.. అద్భుతమైన లుక్స్ తో అందరినీ ఆకట్టుకునే రకుల్ తాజాగా ఇన్ స్టాగ్రామ్ (Instagram) లో చేసిన ఓ పోస్ట్ చర్చనీయాంశమైంది. ఓ మ్యాగజైన్ కవర్ ఫొటోషూట్ కి సంబంధించిన ఈ ఫొటొలో రకుల్ బటన్ పెట్టకుండా జిప్ తీసి ఉన్న జీన్స్ వేసుకుంది. దానిపైన నీలి రంగు లేస్ బ్రాలెట్ ధరించింది. డీప్ నెక్ ఉన్న ఈ బ్రాలెట్, జీన్స్ తో, స్ట్రెయిటెన్ చేసిన జుట్టుతో ఫొటోలో చక్కటి మేకప్ తో అద్భుతంగా కనిపించింది రకుల్. ఈ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ నన్ను తోడేళ్ల మందలోకి పడేసినా.. నేను వాటికే లీడర్ గా మారి ముందుకొస్తా.. అంటూ గర్ల్ పవర్ అనే హ్యాష్ ట్యాగ్ ని జత చేసింది. ఈ ఫొటో చూసి చాలామంది తను చాలా అందంగా, హాట్ గా ఉందని ప్రశంసల వర్షం కురిపించారు. ఈ పోస్ట్ మహిళా శక్తికి అద్దం పట్టకపోయినా.. తనకు నచ్చిన దుస్తులు వేసుకోవడమే గర్ల్ పవర్ కి నిదర్శనం అని రకుల్ చెప్పినట్లు మనం అర్థం చేసుకోవచ్చు.


rakul3


అయితే మరికొందరు మాత్రం రకుల్ దుస్తులు వేసుకున్న తీరును ఎండగడుతూ తన దుస్తులను, తన ఎంపికను ట్రోల్ చేస్తూ కామెంట్లు చేశారు. కొందరు జిప్ వేసుకోవడం మర్చిపోయారేమో అంటూ పోస్ట్ చేస్తే.. మరికొందరు మాత్రం ఇలా జిప్ వేసుకోకుండా ఫొటోషూట్ లో పాల్గొనడమే నువ్వు అనుకునే గర్ల్ పవరా? అంటూ కామెంట్లు చేశారు. మరొక యూజర్ అయితే రకుల్ వ్యక్తిత్వాన్నే తక్కువ చేసి మాట్లాడాడు. నీలాంటి చీప్ వ్యక్తులు ఇండస్ట్రీలో సరైన స్థానం సంపాదించుకోవడానికి ఇలా ప్రయత్నిస్తుంటారు. నువ్వెప్పుడైనా ఐశ్వర్యారాయ్ బచ్చన్ లేదా మాధురీ దీక్షిత్ వంటి వాళ్లు ఇలాంటి ఫొటోషూట్లలో పాల్గొనడం చూశావా? ఇలాంటి చీప్ పనులు చేసి మీరు ఎప్పటికీ పెద్ద హీరోయిన్లు కాలేరు.. అంటూ విమర్శించారు.


rakul 819194


గతంలో తన షార్ట్ డ్రస్ పై కామెంట్లు చేసిన ఓ వ్యక్తి కి రకుల్ దిమ్మదిరిగేలా సమాధానమిచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇలాంటి ట్రోల్స్ తనపై ప్రభావం చూపవని ఆమె గతేడాది ఓ ఇంటర్వ్యూలో భాగంగా ప్రకటించింది. నాకు ఏం చేయాలనిపిస్తుందో నేను అది చేస్తాను. నా కుటుంబానికి తప్పు అనిపించనంతవరకూ అది నాకు ఎలాంటి ఇబ్బంది కలిగించదు. దాన్ని ఎవరు ప్రశంసించినా లేదా విమర్శించినా నేను పెద్దగా పట్టించుకోను. నా జీవితం నేను జీవిస్తా. ఇంకా చెప్పాలంటే నేను అసలు నా పోస్ట్ లపై వచ్చే కామెంట్లను అస్సలు పట్టించుకోను. నాకు అంత సమయం కూడా ఉండదు.. అంటూ చెప్పుకొచ్చింది.


రకుల్ గతంలో యారియా అనే బాలీవుడ్ సినిమాలో నటించింది. మధ్యలో హేమామాలిని, రాజ్ కుమార్ రావ్ నటించిన శిమ్లా మిర్చి అనే సినిమాలో ఆమె నటించినా ఆ సినిమా విడుదల కాలేదు. తాజాగా అఖీవ్ అలీ దర్శకత్వం వహించిన దే దే ప్యార్ దే సినిమా ఆమెకు విజయాన్ని సంపాదించి పెట్టింది. ఈ సినిమా ఇప్పటికే రూ.75 కోట్ల కలెక్షన్లు సాధించడం విశేషం. ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య సరసన నటిస్తోన్న ఎన్ జీ కే చిత్రం ఈ నెల 31న విడుదలకు సిద్ధంగా ఉంది.


rakul2


తాజాగా తమ శరీరం గురించి, వేసుకునే దుస్తుల గురించి అమ్మాయిలపై.. ముఖ్యంగా హీరోయిన్లపై వచ్చే విమర్శలు ఎక్కువవుతున్నాయి. చాలామంది హీరోయిన్లు వీటిని తమదైన రీతిలో తిప్పికొడుతూనే ఉన్నా ఇలాంటి ట్రోల్స్ రోజురోజుకీ ఎక్కువవుతున్నాయే తప్ప తగ్గట్లేదు. అయితే రకుల్ వేసుకున్న దుస్తులు గర్ల్ పవర్ కి అద్దం పట్టకపోయినా తనకు నచ్చిన దుస్తులు వేసుకునే హక్కు ప్రతిఒక్కరికీ ఉంటుంది. అదే హక్కు రకుల్ కి కూడా ఉంది. ఆమె వేసుకున్న దుస్తులు తన ఇష్టానికి అద్దం పడతాయి కాబట్టి వాటిని తప్పుబట్టే హక్కు ఎవరికీ లేదని చెప్పుకోవాలి. ఇప్పటికైనా సెలబ్రిటీల శరీరం, వారి దుస్తులకు సంబంధించి జడ్జ్ చేయడం.. వాటిని తప్పుబడుతూ వారిని దూషించడం వంటివి చేసే ఫ్యాన్స్ వాటిని మానుకుంటారని ఆశిద్దాం.


ఇవి కూడా చదవండి.


పొట్టి దుస్తులు వేసుకుంటే.. రేప్ చేయాల్సిందే: గుర్గావ్‌లో ఓ మహిళ షాకింగ్ స్టేట్‌మెంట్


మీ ట్రోలింగ్ కోసం నా లైఫ్‌స్టైల్ మార్చుకోను.. అంటోన్న స‌మీర‌..!


గ్లామ‌ర్ వ‌ర‌ల్డ్‌కి ప‌రిచ‌య‌మైన‌ప్పుడు.. ఈ అందాల రాశులు ఎలా ఉన్నారంటే..! 


Images : Instagram