గణపతి బొప్పా మోరియా: మన రాష్ట్రాల్లోని ఈ వినాయకుని ఆలయాలు.. ఎందుకు ప్రసిద్ధి చెందాయంటే..?

గణపతి బొప్పా మోరియా: మన రాష్ట్రాల్లోని ఈ వినాయకుని ఆలయాలు.. ఎందుకు ప్రసిద్ధి చెందాయంటే..?

ఏ కొత్త పనిని ప్రారంభించాలన్నా మొదట మనం పూజించేది వినాయకుడినే. మనసులో తలచుకునేది గణనాథుడినే. ‘వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ’ అంటూ గణనాథుడ్ని కొలుస్తూ.. విద్యాబుద్ధులు, సిరిసంపదలు ప్రాప్తించేలా చూడమని అందరూ కోరుకుంటారు. ఈ క్రమంలో తరచూ విఘ్నేశ్వరుడి ఆలయాలను అనేకమంది సందర్శిస్తుంటారు. వినాయక చవితి సందర్భంగా.. మనం కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రముఖ వినాయక దేవాలయాల(Vinayaka Temples) గురించి ఇప్పుడు తెలుసుకుందామా..!

వరసిద్ధి వినాయక దేవాలయం, కాణిపాకం

Pinterest

గణపతి (Ganapathi) స్వయంభూగా బాహుదా నదీ తీరంలో బావిలో వెలసిన క్షేత్రం కాణిపాకం (Kanipakam). ఈ ఆలయానికి సుమారుగా వెయ్యేళ్ల చరిత్ర ఉంది. పూర్వం విహారపురి అనే గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు గుడ్డి, మూగ, చెవిటి వాళ్లుగా జన్మించారు. అయినా తమకున్న పొలాన్ని సాగు చేస్తూ ఉండేవారు. ఓసారి కరవుకాటకాలు సంభవించడంతో.. పంటను పండించడానికి నీటి కోసం పొలంలో ఉన్న బావిని మరింత లోతు తవ్వాలనుకున్నారు. ఆ ప్రయత్నంలో ఉండగానే రాయికి గడ్డపార తగిలి రక్తం రాసాగింది. ఆ రక్తం ముగ్గురు సోదరులకు తగలగానే వారికున్న వైకల్యం తొలగిపోయింది.

దీని గురించి తెలుసుకున్న గ్రామస్థులు అక్కడికి వచ్చి బావిని పూర్తిగా తవ్వితే అందులో గణనాథుని విగ్రహం బయటపడింది. గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని పూజించి కొబ్బరికాయలు సమర్పించారు. ఆ కొబ్బరికాయల నీరు కాణి భూమి మేర పారిందట. కాణి అంటే ఎకరమని అర్థం. అప్పటి నుంచి విహారిపురానికి కాణిపారకరమ్ అనే పేరు వచ్చింది. అదే కాలక్రమంలో కాణిపాకంగా రూపాంతరం చెందింది.

కాణిపాకం గణపతికి సత్యప్రమాణాల దేవుడని పేరు. స్వామి వారి ఎదుట ఎవరైనా అసత్య ప్రమాణం చేస్తే వారిని వినాయకుడే స్వయంగా శిక్షిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. ఈ క్షేత్రంలోని స్వామి వారి విగ్రహం అనునిత్యం పెరుగుతూనే ఉంది. దీనికి నిదర్శనంగా యాభైఏళ్ల నాడు చేయించిన వెండి కవచం, 2002లో చేయించిన మరో వెండి కవచం ఇప్పుడు స్వామివారికి సరిపోవడం లేదు. తిరుపతికి వచ్చిన భక్తులు కాణిపాకాన్ని కూడా దర్శించుకోవడానికి వస్తుంటారు.

ఎలా వెళ్లాలి? కాణిపాకం క్షేత్రం చిత్తూరుకు 12 కి.మీ., తిరుపతికి 75 కి.మీ. దూరంలో ఉంది. ఈ రెండు ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఇక్కడ బస చేయడానికి తితిదే వసతి గృహం ఉంది.

సిద్ధివినాయక దేవాలయం, అయినవిల్లి

Pinterest

ఆంధ్రప్రదేశ్‌లో కాణిపాకం తర్వాత అంతటి ప్రశస్తి గాంచిన వినాయకుడు తూర్పుగోదావరి జిల్లాలోని అయినవిల్లిలో(Ainavilli) వెలసిన సిద్ధివినాయకుడు. వృద్ధగోదావరీ తీరాన కొలువైన ఈ గణపయ్యను గోదావరి జిల్లా ప్రజలు భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ఈ ఆలయానికి చారిత్రక, పౌరాణిక ప్రాధాన్యముంది. దక్షప్రజాపతి యజ్ఞం చేయడానికి ముందు.. అయినవిల్లి వినాయకుడినే పూజించాడట. ఇక్కడ గణపతికి గరికలతో విశేష పూజలు జరిపిస్తారు. అయినవిల్లి సిద్ధి వినాయకుడికి భక్తులు కొబ్బరికాయల రూపంలో మొక్కులు చెల్లించుకుంటారు. ఈ ఆలయానికి ఉన్న మరో విశిష్టత ఏంటంటే... ఏటా ఫిబ్రవరి నెలలో సుమారుగా లక్ష పెన్నులతో వినాయకుడికి పూజ చేస్తారు. వాటిని పరీక్షలు రాసే విద్యార్థులకు అందిస్తారు.

ఎలా వెళ్లాలి..? అయినవిల్లి కోనసీమలో ఉంది. అమలాపురానికి 12 కి.మీ, రాజమహేంద్రవరానికి 54 కి.మీ. దూరంలోనూ  ఈ ఆలయం ఉంది. రాజమహేంద్రవరం నుంచి రావులపాలెం, కొత్తపేట మార్గంలో ప్రయాణిస్తే ఈ ఆలయానికి చేరుకోవచ్చు. అమలాపురం నుంచి ఆటో, బస్సు సౌకర్యం ఉంటుంది.

శ్వేతార్క మూల గణపతి, కాజీపేట

Facebook

వరంగల్ జిల్లాలోని కాజీపేటలో(Kazipet) ఉంది శ్వేతార్క మూల గణపతి ఆలయం. తెల్లజిల్లేడు మూలం నుంచి వెలిశాడు కాబట్టి ఈ వినాయకుని శ్వేతార్క గణపతి అని పిలుస్తున్నారు. వాస్తవానికి ఈ ఆలయంలో ఇద్దరు గణపతులుంటారు. ఒకరు శ్వేతార్క గణపతి కాగా.. మరొకరు ఆది గణపతి. వినాయకుడు 62 రూపాల్లో భక్తులను కరుణిస్తాడని హిందువులు విశ్వసిస్తారు. అందులో ఈ శ్వేతార్క గణపతి శ్రేష్ఠుడని నమ్మకం. ఈ విగ్రహాన్ని ఎవరూ చెక్కలేదు. సాధారణంగా శ్వేతార్క గణపతి విగ్రహాలు అంత స్పష్టంగా ఉండవు.

కానీ కాజీపేటలో వెలసిన గణేశుడి(Ganesh) తొండం, దంతాలు, కళ్లు, ఉదరం, మూషిక వాహనం అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. ఈ శ్వేతార్క గణపతిని సేవించడానికి మండల దీక్షలు, అర్థమండల దీక్షా మాలధారణ చేస్తారు. కాజీపేట ఆలయంలో ఉన్న మరో విశిష్టత.. నవగ్రహాలకు వారి దిక్కులను అనుసరించి ఆయా దిక్కుల్లో విడివిడిగా ఆలయాలున్నాయి. మరో విశేషమేంటంటే.. ఈ ఆలయంలో సుమారుగా 29 ఉపాలయాలున్నాయి.

ఎలా చేరుకోవాలి? ఈ ఆలయం హైదరాబాద్‌కి 120 కి.మీ. దూరంలో ఉంది. వరంగల్‌కు సుమారుగా 11 కి.మీ. దూరంలో ఈ ఆలయం ఉంటుంది. కాజీపేటకు బస్సు, రైలు సదుపాయం ఉంది.

గణపతి దేవాలయం, సికింద్రాబాద్

Ganesh Temple Secunderabad

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కి దగ్గర‌లో ఉన్న.. శ్రీ గణపతి దేవాలయం జంటనగరాల్లో బాగా ప్రసిద్ధి. పద్దెనిమిదో శతాబ్ధంలో  తవ్వకాల్లో బయటపడిన గణపతి విగ్రహానికి గుడి కట్టి.. భక్తులు నిత్య పూజలు జరిపిస్తున్నారు. ఈ ఆలయానికున్న విశిష్టత ఏంటంటే.. ఇక్కడ గణపతి తన కుటుంబ సభ్యులందరితో కలసి వెలిశాడు. ఈ ఆలయంలో నిత్యం సత్య గణపతి వ్రతం జరుగుతుంది. గణపతి నవరాత్రులు ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతాయి.

లక్ష్మీగణపతి ఆలయం, బిక్కవోలు

eastgodavari.nic.in

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులో (Bikkavolu) లక్ష్మీ గణపతిగా వెలిశాడు గణనాథుడు. చారిత్రక ప్రాధాన్యమున్నఈ ఆలయంలో గణపతి విగ్రహం ఏడడుగుల ఎత్తుంటుంది. ఇక్కడి వినాయకుడు కాస్త వెనక్కి వాలి కూర్చున్నట్టుగా ఉంటుంది. చాళుక్యుల కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. బిక్కవోలు లక్ష్మీగణపతిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి..

సర్వసంపదలు సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. భక్తులు తమ బాధలను, కోరికలను లక్ష్మీ గణపతి చెవిలో చెప్పుకుంటారు. ఇలా చెప్పి ముడుపు కడితే కోరిన కోరికలు తీరతాయని నమ్మకం. ఈ గణపతి విగ్రహం కూడా రోజురోజుకీ పెరుగుతుంది. దీనికి గతంలో ఆయనకు చేయించిన వెండి తొడుగు ఇప్పుడు సరిపోకపోవడమే నిదర్శనంగా చెబుతారు.

ఎలా వెళ్లాలి? రాజమండ్రి, కాకినాడ నుంచి రోడ్డు, రైలు మార్గం ద్వారా బిక్కవోలుకు చేరుకోవచ్చు.

మత్స్య గణపతి ఆలయం, చోడవరం

facebook

విశాఖపట్నం జిల్లాలోని చోడవరం(Chodavaram) గ్రామంలో వెలసిన మత్స్యగణపతికి శతాబ్ధాల చరిత్ర ఉంది. సుమారుగా 600 ఏళ్ల క్రితం మత్స్య వంశపు రాజులు దీన్ని నిర్మించినట్టు చెబుతారు. గర్భగుడి ద్వారంపై ఉన్న చేప గుర్తుల కారణంగా ఇక్కడి గణపతిని మత్స్య గణపతి అని పిలుస్తారు. నీటి ఊటలో ఉన్న గణపతి విగ్రహం నడుము భాగం వరకు మాత్రమే కనిపిస్తుంది. తొండం చివరి భాగం కూడా కనిపించదు. ఓసారి విగ్రహాన్ని బయటకు తీసి మరో చోట ప్రతిష్టించాలని ప్రయత్నించినప్పటికీ తొండం చివర కనిపించకపోవడంతో.. ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారట.

ఎలా వెళ్లాలి?: విశాఖపట్నానికి సుమారుగా 50 కి.మీ. దూరంలో ఉంటుంది. విశాఖపట్నం బస్ కాంప్లెక్స్ నుంచి చోడవరానికి బస్సు సౌకర్యం ఉంది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.