పిరియడ్స్ (Periods).. ప్రతి మహిళను నెల నెలా పలకరించే ఓ బంధువు లాంటిది. ఇది వచ్చినప్పుడు మనల్ని కాస్త ఇబ్బంది పెట్టినా.. ప్రతి నెలా పిరియడ్స్ రావడం వల్ల మన ఆరోగ్యం మామూలుగా ఉంటుంది. సాధారణంగా ప్రతి మహిళకు 28 రోజులకోసారి నెలసరి రావాల్సి ఉంటుంది.
అయితే నెలసరి ప్రారంభమైన మొదటి సంవత్సరాల్లో.. ఇది ప్రతి నెలా రాకుండా… అప్పుడప్పుడు (Irregular) మాత్రమే వస్తుంది. ఆ తర్వాత మామూలుగా రావడం ప్రారంభమవుతుంది.
సాధారణంగా అమ్మాయిలకు.. మొదటి 14 రోజులు ఈస్ట్రోజన్ హార్మోన్ విడుదలవుతుంది. ఆ తర్వాత 14 రోజుల పాటు ప్రొజెస్టిరాన్ హార్మోన్ విడుదలవుతుంది. ఆ తర్వాత రుతుస్రావం ప్రారంభమై ఐదు రోజుల పాటు నిలుస్తుంది. ఇది ఒకసారి కాస్త త్వరగా లేదా ఆలస్యంగా రావచ్చు. 21 రోజుల నుంచి 35 రోజుల మధ్య పిరియడ్స్ రావడం సహజమని చెప్పుకోవచ్చు. కానీ అంతకంటే ఆలస్యం అయినా.. లేదా 20 రోజుల కంటే ముందు వచ్చినా ఇర్రెగ్యులర్ పిరియడ్స్ అని అంటారు.
పిరియడ్స్ సక్రమంగా రాకపోవడానికి కారణాలేంటి?
పిరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా మారేందుకు చాలా కారణాలే ఉండొచ్చు. అయితే అందులో కొన్ని ముఖ్యమైన కారణాల వల్ల.. ఎక్కువ మందిలో ఈ సమస్య మొదలవుతూ ఉంటుంది. అవేంటంటే..
1.ప్రసవం తర్వాత..
చాలామంది మహిళలకు ప్రసవం తర్వాత పిరియడ్స్ సక్రమంగా రావడం ఆగిపోతుంది. బిడ్డకు పాలు ఇచ్చినంత కాలం చాలామందికి రుతుస్రావం జరగదు. మరికొందరిలో అప్పుడప్పుడూ పిరియడ్స్ వస్తుంటాయి. ఇది ప్రసవం తర్వాత హార్మోన్లలో మార్పుల వల్ల జరుగుతుంది. అంతేకాదు.. ఎక్కువ క్యాలరీలున్న ఆహారం తినడం వల్ల కూడా జరుగుతుంది.
2. ఒత్తిడి
సాధారణంగా చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం వంటివి చేసేవారిలో.. ఇర్రెగ్యులర్ పిరియడ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. దీనికి వారి ఒత్తిడి కూడా కారణం కావచ్చు. ఒత్తిడి మన హార్మోన్ల పై ప్రభావం చూపుతుంది. అందుకే మీకు పని విషయంలో లేదా ఇతరత్రా ఏ విషయంలో అయినా సరే.. ఒత్తిడి ఎక్కువగా ఉంటే దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. యోగా, మెడిటేషన్ వంటివి చేస్తూ దాన్ని తగ్గించుకోండి.
3. బరువు పెరగడం లేదా తగ్గడం
ప్రస్తుతం లైఫ్ స్టైల్‌లో ఎక్కువ సమయం పాటు.. ఒక్క చోట కూర్చోవడం కామన్‌గా మారిపోయింది. దీంతో బరువు పెరగడం కూడా చాలా కామన్‌గా మారిపోయింది. దీనితో పాటు ఫాస్ట్ ఫుడ్ వంటివి కూడా బరువును పెంచుతాయి. చాలామంది ఈ బరువును తగ్గించేందుకు.. కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల ఆరోగ్యం పాడవుతుంది. మరికొంతమంది విపరీతంగా ప్రయత్నించి మరీ బరువు తగ్గుతుంటారు. సడన్‌గా బరువు తగ్గడం వల్ల కూడా పిరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
4. ప్రీ మెనోపాజ్
మెనో పాజ్ దశ అంటే పిరియడ్స్ ఆగిపోయే దశ. దీనికి కొన్ని నెలలు లేదా సంవత్సరాల ముందు నుంచి ప్రీ మెనోపాజ్ దశ ప్రారంభమవుతుంది. ఈ దశలో పిరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా ఉంటాయి. కొన్ని సార్లు మూడు నెలలకోసారి.. మరికొన్ని సార్లు ఆరు నెలలకోసారి అవి వస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఆలస్యమవుతూ అవుతూ.. ఒకానొక దశలో పూర్తిగా ఆగిపోతాయి.
5. హార్మోన్ సమస్యలు
ప్రస్తుతం ప్రతి ముగ్గురు మహిళల్లో.. ఒకరు హార్మోన్ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అందులో ముఖ్యమైనవి థైరాయిడ్, పీసీఓస్. ఇవి శరీర బరువులో సడన్‌గా మార్పు వచ్చేలా చేయడంతో పాటు.. హార్మోన్లలో హెచ్చుతగ్గులు జరిగేలా చేస్తాయి. అందుకే పిరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా మారతాయి. ఈ సమస్యలున్నవారు చాలా అలసటగా కూడా ఫీలవుతుంటారు. అందుకే ఇలాంటి వారు.. తొందరగా బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి.
మరి పరిష్కారం ఎలా..?
సమాధానం లేని ప్రశ్నలంటూ లేవని చెప్పుకోవచ్చు. అలాగే పరిష్కారం లేని సమస్య కూడా ఉండదు. పిరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా ఉండే సమస్యకు కూడా పరిష్కారం ఉంది. ఈ సమస్యను దూరం చేసుకోవడానికి కొన్ని రకాల పద్ధతులను ఉపయోగిస్తే సరిపోతుంది. అవేంటంటే..
1. ఒత్తిడిని వీలైనంత తగ్గించుకోవాలి. దీనికోసం మెడిటేషన్, యోగా వంటివి చేయడంతో పాటు పని ఒత్తిడి తగ్గించుకోవడం.. నచ్చిన వారితో సమయం గడపడం, గార్డెనింగ్, పెయింటింగ్, డ్రాయింగ్ వంటి హాబీలు కొనసాగించడం చేయాలి.
2. బరువు ఎక్కువగా ఉన్నవారు వీలైనంతగా దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అయితే దీనికోసం క్రాష్ డైట్లు వంటివి పాటించకుండా.. ఆరోగ్యవంతంగా బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి. మంచి ఆహారం తీసుకోవాలి. అలాగే బరువు తక్కువగా ఉన్నవారు కూడా సాధారణ బరువుకి చేరుకోవడానికి ప్రయత్నించాలి.
3. థైరాయిడ్, పీసీఓఎస్ వంటి సమస్యలతో బాధ పడుతున్న వారు.. డాక్టర్ సలహాతో మందులు వాడుతూ తమ జీవనశైలిని కూడా మార్చుకోవడం వల్ల.. వీటిని వీలైనంత త్వరగా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
4. మనం తీసుకునే ఆహారంలో రిఫైన్డ్ కార్బొహైడ్రేట్లు వీలైనంత తక్కువగా ఉండేలా చూసుకోవాలి. వీటితో పాటు ప్రాసెస్ చేసిన ఆహారం, బేకరీ ఫుడ్స్ వంటివి దూరంగా ఉంచాలి. వీటికి బదులుగా జొన్నలు, సజ్జలు, పాలిష్ చేయని బియ్యం, పప్పులు, గుడ్లు, చికెన్, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు వంటివి తీసుకోవాలి.
5. రోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం చేయాలి. దీనివల్ల శరీరం యాక్టివ్‌గా ఉంటుంది. హార్మోన్లు కూడా సమతులంగా ఉంటాయి. వ్యాయామం చేయడం ఇష్టం లేని వారు.. అరగంట పాటు నడవడం, పరిగెత్తడం లేదా ఏవైనా ఆటలాడడం వల్ల శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచుకోవడం అవసరం. ప్రసవం తర్వాత కూడా.. మూడు నుంచి ఆరు నెలల తర్వాత వ్యాయామం చేయడం ప్రారంభించవచ్చు. దీంతో పాటు.. ఎక్కువ సమయం ఒకే చోట కూర్చొని ఉండకుండా.. ప్రతి గంటకోసారి ఐదు నిమిషాల పాటు అటూ ఇటూ తిరగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
6. వీటితో పాటు హార్మోన్ల స్థాయుల్లో మార్పుల కోసం.. డాక్టర్‌ని సంప్రదించి మందులు వాడాల్సి ఉంటుంది.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.