ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
మీకూ విహార‌యాత్ర‌ అంటే ఇష్ట‌మా? అయితే ఈ ల‌క్ష‌ణాలు మీకూ ఉంటాయి..

మీకూ విహార‌యాత్ర‌ అంటే ఇష్ట‌మా? అయితే ఈ ల‌క్ష‌ణాలు మీకూ ఉంటాయి..

వారాంతాల్లో బ‌య‌ట‌కు వెళ్ల‌డం అంటే మీకిష్ట‌మా? రెండు రోజుల ట్రిప్స్ (trips)కి వెళ్లినా మీ ఆనందం రెట్టింప‌వుతుందా? ఎవ‌రైనా మీకు ఏం బ‌హుమ‌తి కావాలి అని అడ‌గ‌గానే ఫ్లైట్ టికెట్స్ లేదా టూర్ ప్యాకేజ్ అని చెబుతుంటారా? ఉచితంగా ప్ర‌యాణాలు (travel)చేయ‌గ‌లిగితే న‌న్ను ఎవ‌రూ చూసి ఉండ‌క‌పోయేవారు.. అని మీరు ఎప్పుడూ చెబుతుంటారా? అయితే క‌చ్చితంగా మీరు విహార‌యాత్ర ప్రేమికులే.. అయితే ఇలా ట్రావెల్ ఫ్రీక్‌గా ఉండ‌డం చాలా మంచి విష‌యమ‌ట‌. దీనివ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి. ఒక‌వేళ మీరూ నాలాగే ట్రావెలింగ్‌ ని ఇష్ట‌ప‌డితే.. ఈ కింది అంశాల్లో చాలావ‌ర‌కూ మీకు సంబంధించిన‌ట్లుగానే అనిపిస్తూ ఉంటాయి. మ‌రి, మీరూ నాలాగే టూర్లంటే ఎగిరి గంతేసే టైప్ వ్య‌క్తులేనా ఓసారి చెక్ చేసుకోండి..

1. చేయాల్సిన ప‌నులంటే అవే..

సాధార‌ణంగా ఇత‌రులు చేయాల్సిన ప‌నులంటే ఆ సంవ‌త్స‌రం తాము చేరుకోవాల్సిన ల‌క్ష్యాల గురించో లేక‌.. ఆ నెల‌లో తాము మ‌ర్చిపోకూడ‌ని విష‌యాల గురించో రాసుకుంటూ ఉండ‌డం స‌హజం. అయితే ట్రావెలింగ్ అంటే ఇష్ట‌ప‌డే వారి డైరీలో మాత్రం త‌ర్వాత ఏ ప్ర‌దేశానికి టూర్‌కి వెళ్లాలి. అక్క‌డి వాతావ‌ర‌ణం ఎలా ఉంటుంది. దాని కోసం ముందుగానే ఎలా సిద్ధం కావాలి? అక్క‌డి వంట‌కాల్లో ఏవి బాగుంటాయి. వాటిని ఏయే రెస్ట‌రంట్ల‌లో రుచిచూడాలి.. వంటి వివ‌రాల‌న్నీ రాసుకుంటూ ఉంటారు. మ‌రో ప్ర‌యాణ‌మే వారికి అన్నిటికంటే ముఖ్య‌మైన అంశం మ‌రి..

2. న‌చ్చిన‌ప్పుడే చేసేయాలి

సాధార‌ణంగా అంద‌రూ స్నేహితులు లేదా కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ట్రిప్‌కి ప్లాన్ చేసుకుంటారు. మీరు వారంద‌రితో క‌లిసి వెళ్లినా ఒక్కోసారి ఒంట‌రిగా ప్ర‌యాణాలు చేయ‌డానికి కూడా ఆస‌క్తి చూపిస్తుంటారు. సోలో ట్రిప్స్ అంటే సాధార‌ణ‌మైన‌వి కూడా కాదు.. అడ్వెంచ‌ర్ ట్రిప్స్ కూడా అందులో భాగ‌మే. అంతేకాదు.. ఒక్కోసారి ముందుగా ఎలాంటి ప్లానింగ్ లేక‌పోయినా.. మీకు ఏదైనా ప్ర‌దేశానికి వెళ్లాల‌నిపించ‌డ‌మే ఆల‌స్యం.. బ‌య‌ల్దేరి అక్క‌డికి వెళ్లిపోతూ ఉంటారు. దీనికోసం మీకు పెద్ద‌గా ప్లానింగ్ కూడా అవ‌స‌రం ఉండ‌దు. ఆయా ప్ర‌దేశాల గురించి మీకు ముందుగానే తెలిసి ఉంటుంది కాబ‌ట్టి బ్యాగ్ స‌ర్దుకొని వెళ్లిపోవ‌డ‌మే..

ADVERTISEMENT

3. పైసా పైసా దానికోస‌మే..

సాధార‌ణంగా మీకు వ‌చ్చే జీతంలో ఎక్కువ శాతం మీకు విహార‌యాత్ర‌ ల‌కే ఖ‌ర్చుపెడుతూ ఉంటారు. దీనికోసం కావాలంటే మిగిలిన ఖ‌ర్చు త‌గ్గించుకోవ‌డానికి కూడా మీరు సిద్ధ‌మే. స్నేహితులంతా మిమ్మ‌ల్ని పిసినారి అని పిలిచినా మీరు పెద్ద‌గా ప‌ట్టించుకోరు.. మీరు వెళ్లాల‌నుకున్న ఆ ట్రిప్‌లోని ఆనందం కోసం కొన్ని స‌ర‌దాల‌ను వ‌దులుకోవ‌డానికి కూడా మీరు ఎల్ల‌ప్పుడూ సిద్ధంగా ఉంటారు.

4. అవి మీకు కొట్టిన పిండి

ఏ ప్ర‌దేశానికి ఎంత ఖ‌ర్చులో వెళ్లిరావ‌చ్చ‌న్న‌దానిపై మీకు మంచి అవ‌గాహ‌న ఉంటుంది. అయినా స‌రే.. అంత‌కంటే త‌క్కువ ఖ‌ర్చుకే వెళ్లేందుకు ఏవైనా ఆఫ‌ర్లు ఉంటాయేమోన‌ని ఎప్పుడూ ట్రావెల్ వెబ్‌సైట్లు వెతుకుతూనే ఉంటారు. ఆ వెబ్‌సైట్లు చ‌ద‌వ‌డం మీ రోజువారి రొటీన్‌లో భాగం అని చెప్పుకోవ‌చ్చు. ట్రావెల్ స్టోరీల‌ను చ‌దువుతూ ఆయా ప్రాంతాల‌ను సంద‌ర్శించిన‌ప్పుడు ఎలా ఉండాలో నేర్చుకుంటూ ఉంటారు. ఎప్ప‌టిక‌ప్పుడు విహార‌యాత్ర‌ ల‌పై డీల్స్ చెక్ చేసి ఏదైనా ప్ర‌దేశానికి టికెట్ ధ‌ర త‌గ్గితే వెంట‌నే అక్క‌డికి వెళ్లిపోవ‌డానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు.

ADVERTISEMENT

5. ఎప్పుడూ అవే గుర్తొచ్చేలా..

మీ ఇల్లంతా మీరు వివిధ ప్ర‌దేశాల‌కు వెళ్లిన‌ప్పుడు ఆ ప్ర‌దేశానికి జ్ఞాప‌కంగా తెచ్చుకున్న బ‌హుమ‌తుల‌తో నిండిపోయి ఉంటుంది. అందులో ఒక్కో వ‌స్తువుని చూసిన‌ప్పుడు ఒక్కో జ్ఞాప‌కం మీ మ‌న‌సును ఆహ్లాద‌భ‌రితంగా మారుస్తుంది. కేవ‌లం ఇవేనా విహార‌యాత్ర‌ లంటే మీకున్న ఇష్టాన్ని చాటేందుకు.. ఎప్పుడూ మీ మ‌న‌సులో ఆ అనుభ‌వాల‌ను ప‌దిలంగా దాచుకునేందుకు మీరు ట్రిప్స్ కి సంబంధించిన ట్యాటూల‌ను కూడా వేయించుకోవ‌డానికి ఆస‌క్తి చూపిస్తుంటారు. చేతిపై చిన్న పేప‌ర్‌తో చేసిన విమానం.. కాలిపై బీచ్‌ని గుర్తుకు తెచ్చేలా ఓ మంచి కొబ్బ‌రి చెట్టు.. లేదా చిన్న ప‌డ‌వ‌.. ఒక‌ట‌నేం కాదు.. ఆయా ప్ర‌దేశాల‌ను గుర్తుచేసేలా మీకు న‌చ్చిన ట్యాటూలు వేసుకోవ‌డం మీకెంతో ఇష్టం.

6. స్నేహానికైనా.. బంధానికైనా ముందు అదే..

మీ మ‌న‌సులో మీరు ఒక చెక్‌లిస్ట్ త‌యారుచేసుకొని పెట్టుకొని ఉంటారు. అది మీతో ఎదుటివారు స‌రితూగ‌గ‌ల‌రా లేదా అన్న‌ది చెక్‌చేసుకోవ‌డానికి వీల‌వుతుంది. అయితే ఈ చెక్‌లిస్ట్‌లో ఎక్కువ పాయింట్లు మీ విహార‌యాత్ర‌ల గురించే ఉంటాయి. ఎవ‌రైనా మీతో స్నేహం చేయాల‌న్నా.. లేక మీరు ఎవ‌రినైనా ప్రేమించాల‌న్నా ముందు వారికీ ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉండి ఉండాలి. మీ భాగ‌స్వామిలోనూ మీరు వెతికే మొద‌టి అంశం ఇదే.. ఎందుకంటే న‌చ్చిన వారితో మెచ్చిన ప్ర‌దేశంలో గ‌డిపితే ఆ ఆనందమే వేరు..

7. విండోసీట్ మీ బెస్ట్‌ఫ్రెండ్‌

మీకు ప్ర‌యాణాలంటే ఎంత ఇష్టం ఉన్నా.. ఇప్ప‌టికి ఎన్ని చోట్ల‌కి వెళ్లొచ్చినా.. మ‌ళ్లీ మ‌రో ప్ర‌యాణ‌మంటే చిన్న‌పిల్ల‌లా ఎక్స‌యిటింగ్ గా ఫీల‌వుతారు. అంతేకాదు.. విమానంలో విండో సీటంటే మీకెంతో ఇష్టం. ఆ సీట్‌ని మాత్రం ఎట్టిప‌రిస్థితుల్లోనూ మీరు వ‌దిలిపెట్ట‌రు. దీనికోసం మీరు ముందుగా బుకింగ్ చేసుకోవ‌డానికి కూడా సిద్ధంగా ఉంటారు.

ADVERTISEMENT

8. దాన్నే త‌లుచుకుంటూ..

మీరు విహార‌యాత్ర‌ కు వెళ్లిన‌ప్పుడు ఎంతో ఆనందంగా ఫీల‌వుతారు. అక్క‌డి స‌హజ సౌంద‌ర్యాల‌ను చూస్తూ ఆనందంతో మునిగితేలుతారు. ప్ర‌తి నిమిషాన్ని ఆస్వాదిస్తూ స‌మ‌యాన్ని గ‌డుపుతారు. అయితే ట్రిప్ నుంచి తిరిగిరాగానే మీ సిటీలోని కాలుష్యం, ట్రాఫిక్ జాంలు, ఆఫీస్ ప‌ని మిమ్మ‌ల్ని ఆ స‌మ‌యాన్ని మిస్స‌య్యేలా చేస్తాయి. ఇక చేసేదేముంది.. దాన్నే త‌ల‌చుకుంటూ మ‌రో ట్రిప్‌కి ఎప్పుడు వెళ్తామా? అని ఎదురుచూడ‌డం త‌ప్ప‌.. మ‌రో ట్రిప్‌కి వెళ్లాల‌నే ఆలోచ‌నే అప్ప‌టివ‌ర‌కూ మిమ్మ‌ల్ని ప‌నిచేసేలా ప్రోత్స‌హిస్తుందంటే అతిశ‌యోక్తి కాదు.

9. నెల‌కు ముందే క్యాలండ‌ర్‌

ప్ర‌తి నెల ఒక‌టో తేదీ రాగానే క్యాలండ‌ర్ ప‌ట్టుకొని కూర్చోవ‌డం మీకు అల‌వాటు. ఆ నెల‌లో ఎన్ని లాంగ్ వీకెండ్స్ ఉన్నాయో గుర్తించి.. ఆ స‌మ‌యంలో ఎక్క‌డికి వెళ్తే బాగుంటుందో నిర్ణ‌యం కూడా తీసేసుకుంటారు. దాని సంబంధించి ఏవైనా సెల‌వులు కావాలంటే మీ ఆఫీస్‌లోనూ ముందే అడిగేయడం మీకు అల‌వాటే. ఇవి కాకుండా మ‌ధ్య‌లో ఆరోగ్యం మ‌రీ బాగోలేక‌పోతే త‌ప్ప‌.. సెల‌వులు పెట్ట‌డం మీకు ఇష్టం ఉండ‌దు. ఎందుకంటే ఆ సెల‌వుల‌ను మీ ట్రిప్స్ కి వాడుకోవ‌డానికి మీరు ఇష్ట‌ప‌డ‌తారు కాబ‌ట్టి.

10. మీరే సూప‌ర్‌స్టార్‌

కేవ‌లం విహార‌యాత్ర‌ ల‌కు వెళ్ల‌డం, మ‌న‌సుకు న‌చ్చిన ప‌నుల‌న్నీ చేస్తూ ఆనందాన్ని పొంద‌డం మాత్ర‌మే కాదు. ఆ ప్ర‌యాణాల‌కు సంబంధించిన క‌థ‌ల‌న్నీ మీ స్నేహితుల‌తో పంచుకోవ‌డం మీకెంతో ఇష్టం. మీరు చెప్పే ట్రావెల్ స్టోరీలు.. అక్క‌డ జ‌రిగిన సంఘ‌ట‌న‌లు విన‌డం మీ స్నేహితుల‌కు కూడా ఎంతో ఇష్టం. అందుకే మీతో స్నేహం చేయ‌డానికి చాలామంది ఇష్ట‌ప‌డుతూ ఉంటారు. మీ స్నేహితులు మీతో స‌మ‌యం గ‌డ‌ప‌డానికి ఆస‌క్తి చూపుతుంటారు. ఇలా వారంద‌రి మ‌న‌సుల్లో మీరో సూప‌ర్‌స్టార్‌గా మారిపోతారంటే అతిశ‌యోక్తి కాదు.

ADVERTISEMENT

ఇవ‌న్నీ చూస్తుంటే మీకూ మీరు ఇంత‌కుముందు వెళ్లిన విహార‌యాత్ర‌కు సంబంధించిన అనుభ‌వాలు గుర్తొస్తున్నాయి క‌దూ.. వెంట‌నే మ‌రో ట్రిప్‌కి వెళ్లాల‌ని కూడా అనిపిస్తోందా.. ఇంకెందుకాలస్యం మరి..

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

05 Nov 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT