Food & Nightlife

అమానవీయం.. అమానుషం: హైదరాబాద్‌లో సాటి మహిళనే.. వివస్త్రను చేసిన బార్ గర్ల్స్

Sandeep Thatla  |  Jun 17, 2019
అమానవీయం.. అమానుషం: హైదరాబాద్‌లో సాటి మహిళనే.. వివస్త్రను చేసిన బార్ గర్ల్స్

అంతరిక్షానికి సైతం అతివలు అవలీలగా వెళ్తున్న రోజులివి. రాకెట్ సైన్స్, సాంకేతికత.. అంటూ వికాస పథంలో మనం ఓవైపు దూసుకుపోతూనే ఉన్నా.. సభ్య సమాజంలో స్త్రీలకు భద్రత, రక్షణ.. అనేవి నేటికీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోతున్నాయి. ఇందుకు ఎన్నో ఉదాహరణలు తరచూ మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం.

ఇటీవలే హైదరాబాద్ (Hyderabad) బేగంపేట్ (Begumpet) ప్రాంతంలో జరిగిన ఓ అమానుషమైన ఘటన.. మానవత్వపు విలువలు ఎంతగా దిగజారిపోతున్నాయో చెప్పకనే చెప్పింది. ఓ ప్రముఖ బార్ అండ్ రెస్టరెంట్‌లో పని చేసే ఓ డ్యాన్సర్ (Bar Dancer) పై జరిగిన దాడి ప్రస్తుతం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే..

Bar Girls

ఈ మధ్యకాలంలో కసమర్లను  ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా పలు బార్లు.. యువతులతో డ్యాన్స్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఈ కార్యక్రమాల్లో కొంత అశ్లీలత ఉంటుందన్న మాట వాస్తవమే.  కొద్ది నెలల క్రితం ఇలాంటి ఓ బార్‌లో  డ్యాన్సర్‌గా చేరిన ఓ యువతిని.. పలు అశ్లీల నృత్యాలు చేయాలని యాజమాన్యానికి చెందిన పలువురు కోరారు.  అందుకు ఆమె నిరాకరించడంతో ఆ డ్యాన్సర్ పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించారు. ఆమెతో పనిచేస్తున్న సాటి బార్ డ్యాన్సర్స్‌తోనే.. ఆమెను వివస్త్రను చేయించి నడిరోడ్డుపై దారుణంగా కొట్టించారు. నిన్న రాత్రి జరిగిన ఈ సంఘటన నగరంలో సంచలనమైంది.

సదరు బార్‌లో డ్యాన్సర్‌గా పనిచేస్తున్న యువతిని..  నలుగురు మహిళా డ్యాన్సర్లు, సయ్యద్ అనే ఓ వ్యక్తి కలిసి అందరూ చూస్తుండగా.. రోడ్డు మీదికి ఈడ్చుకొచ్చారు.  తర్వాత దారుణంగా కొట్టారు. అంతే కాకుండా ఆమెను అక్కడికక్కడే వివస్త్రను చేశారు. బార్ యాజమాన్యం చెప్పిన పనులు చేయడానికి ఆమె ఒప్పుకోనందుకే ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది . ఈ దాడిలో బాధితురాలైన యువతి తీవ్రంగా గాయపడింది. ఈ క్రమంలో ఆమె స్వయంగా పోలీస్ స్టేషనుకి వెళ్లి ఫిర్యాదు చేయడం గమనార్హం.

ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే స్పందించి ఆమెపై దాడికి పాల్పడిన నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. అయితే యువతి పై దాడికి పాల్పడినవారిలో ముఖ్యపాత్ర పోషించిన సయ్యద్ అనే వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ దాడికి పాల్పడిన ఐదుగురిపైనా పోలీసులు.. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

ఒక స్త్రీ గౌరవానికి భంగం కలిగించినందుకు సెక్షన్ 354, స్త్రీ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నం చేసినందుకుగాను సెక్షన్ 509, హాని కలిగించాలనే ఉద్దేశంతో దాడి చేసినందుకు 506, ఉద్దేశపూర్వకంగా  దాడి చేసినందుకు సెక్షన్ 323.. దీంతోపాటు ఒకే వ్యక్తిపై ఎక్కువ మంది కావాలనే దాడి చేసినందుకు సెక్షన్ 34.. వంటి సెక్షన్లను నమోదు చేసి..  నిందితులపై కేసు ఫైల్ చేశారు.

ఇక ఈ దాడిలో తీవ్రంగా గాయాలపాలైన బాధిత మహిళ విషయానికి వస్తే; గత కొద్ది సంవత్సరాలుగా సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించి ఆమె విఫలం కావడం గమనార్హం. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ఈ బార్‌లో ఆమె డ్యాన్సర్‌గా చేరినట్లు తెలుస్తోంది. కానీ యాజమాన్యం విజ్ఞప్తిని ఆమె తిరస్కరించడంతో ఈ దాడికి గురైంది.

Bar Dancers in Hyderabad

అయితే ఈ దాడి జరిగాక.. తొలుత పోలీసులు సరిగ్గా స్పందించలేదని; ఆ తర్వాత పరిస్థితి తీవ్రతను గమనించి కేసు నమోదు చేశారని పలు వాదనలున్నాయి. తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఈ కేసుపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆయన ప్రత్యేక విచారణకు ఆదేశిస్తూ ..  నివేదికను అందజేయాల్సిందిగా పోలీసులకు తెలిపారు. 

నగరం నడిబొడ్డున ఓ మహిళపై సాటి మహిళలే ఇంతటి దారుణానికి ఒడిగట్టడంతో.. ఈ ఘటన స్థానికంగా చర్చకు దారితీసింది. సమాజంలో స్త్రీలకు రక్షణ కల్పించాలంటూ ఎన్ని ప్రచారాలు చేసినా.. ఎన్ని చట్టాలు అమల్లోకి తీసుకొచ్చినా ఇలాంటి సంఘటనలు జరుగుతుండడం బాధాకరమని ఈ సందర్భంగా పలు ఎన్జీఓలు, స్వచ్ఛంద సంస్థలు పేర్కొన్నాయి.  

ఇవి కూడా చదవండి

రుణమే పెనుభారమా..? బలిపశువులుగా మారుతున్న మహిళలు, బాలికలు ..!

మహిళలు ఇంకా మహారాణులు కాలేదు..

ఈ యువకుడు అమ్మ కు రెండో పెళ్లి చేశాడు.. ఎందుకో తెలుసా..?

Read More From Food & Nightlife