Beauty

ఆముదం నూనెతో కలిగే.. సౌందర్య ప్రయోజనాలివే..! ( Castor Oil Benefits In Telugu)

Lakshmi Sudha  |  Mar 14, 2019
ఆముదం నూనెతో కలిగే.. సౌందర్య ప్రయోజనాలివే..! ( Castor Oil Benefits In Telugu)

డిస్నీ ప్రిన్సెస్ మాదిరిగా పెద్ద జుట్టు ఉండాలని కోరుకోని అమ్మాయిలు ఎవరైనా ఉంటారా? పొడవాటి జడ ఉన్న అమ్మాయిని చూడగానే.. నాక్కూడా అలాంటి జడ ఉంటే బాగుండునని అనుకొంటాం. అయితే జుట్టు తెగిపోవడం, బలహీనంగా తయారవడం, రాలిపోవడం మొదలైన సమస్యల వల్ల కురుల అందం దెబ్బతింటుంది. చర్మం విషయంలోనూ ఇంతే.. ఆరోగ్యంగా, సున్నితంగా ఉండాలని కోరుకొంటాం. తగిన జాగ్రత్తలు పాటిస్తాం.

కానీ మనం కోరుకొన్న ఫలితం రాదు. అప్పుడప్పుడూ తలకు, ఒంటికి పనికొచ్చే బ్యూటీ ప్రొడక్ట్ ఏదైనా ఉంటే బాగుండుననిపిస్తుంది. అసలు అలాంటిది ఏమైనా ఉందా? అనిపిస్తుంది. ఎలాంటి సందేహమూ అవసరం లేదండి. అటు కురులు.. ఇటు చర్మం సౌందర్యాన్ని రక్షిస్తూనే మన ఆరోగ్యాన్ని కాపాడే ప్ర‌కృతి వరప్రసాదం ఒకటుంది. అదే ఆముదం(Castor oil).

ఆముదమా? అని ఆశ్చర్యపోవద్దు. మన దేశంలో కొన్ని శతాబ్దాల నుంచి ఆముదాన్ని ఉపయోగిస్తున్నారు. దీనిలో మనకు అసవరమైన ఎన్నో పోషకాలున్నాయి. ముఖ్యంగా రిసినోలియెక్ ఆమ్లం(Ricinoleic Acid), ఒమెగా – 6 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఆముదం గింజల నుంచి ఈ నూనెను తీస్తారు. లేత పసుపు రంగులో చిక్కగా ఉంటుంది ఆముదం. మరి, ఆముదం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? తెలుసుకొందాం.

చర్మానికి ఆముదం అందించే ప్రయోజనాలు

ఆముదం వల్ల కురులకు కలిగే ప్రయోజనాలు

ఆరోగ్యానికి ఆముదం

మేలు రకం ఆముదాన్ని ఎలా ఎంపిక చేసుకోవాలి?

రోజువారీ జీవితంలో ఆముదాన్ని ఎలా భాగం చేసుకోవాలంటే..

మార్కెట్లో లభించే ఉత్తమమైన బ్రాండ్స్

ఆముదం ఉపయోగించడం వల్ల ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా

ఆముదం విషయంలో మహిళలకుండే సందేహాలు ఇవే..

చర్మానికి ఆముదం అందించే ప్రయోజనాలు (Castor (Amudham) Oil Benefits For Skin)

మంట తగ్గిస్తుంది (Reduces inflammation)

చర్మం పొడిగా మారి పగలడం, సూర్యరశ్మి ప్రభావం కారణంగా కొన్ని సందర్భాల్లో చర్మం బాగా మంటపెడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆముదం నూనె (Castor Oil) రాసుకొంటే.. ఈ మంట నుంచి చక్కటి ఉపశమనం లభిస్తుంది. దీని కోసం మీరు చేయాల్సిందల్లా దూదిని ఆముదంలో ముంచి మంట పెడుతున్న చోట రాసుకోవాలి. గంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకొంటే సరిపోతుంది. మరింత మంచి ఫలితం రావాలంటే.. నెల రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ చిట్కాను పాటించాల్సి ఉంటుంది.

ముదిమి ఛాయలు రాకుండా కాపాడుతుంది (To Get Youthful Skin)

నమ్మశక్యంగా లేదు కదా..! ఆముదం కొల్లాజెన్ ఉత్పత్తిని క్రమబద్ధం చేస్తుంది. అలాగే చర్మానికి అవసరమైన హైడ్రేషన్, మాయిశ్చరైజేషన్ అందిస్తుంది. దీని వల్ల చర్మం ముడతలు పడకుండా ఆరోగ్యంగా ఉంటుంది.

మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది (Used As Moisturizer)

మీ ఇంట్లో ఆముదం (Castor Oil) ఉంటే మాయిశ్చరైజర్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. ఈ నూనె చర్మానికి అవసరమైన పోషణ అందిస్తుంది. మాయిశ్చరైజ్ చేసి మృదువుగా మార్చేస్తుంది. టేబుల్ స్పూన్ ఆముదాన్ని ముఖానికి రాసుకొని సున్నితంగా మర్ధన చేసుకోవాలి. ఇలా ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.

ఆలివ్ నూనె వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మొటిమలు తగ్గుతాయి (Reduce Acne)

ఆముదం ఉపయోగించడం వల్ల మొటిమలు వెంటనే తగ్గకపోయినా.. క్రమంగా తగ్గుముఖం పడతాయి. ఆముదంలో ఉన్న ఫ్యాటీ ఆమ్లాలు చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తాయి. పాడైన చర్మకణాలకు తిరిగి జీవం పోస్తాయి. ఫలితంగా మొటిమలు నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి.

స్ట్రెచ్ మార్క్స్ తగ్గిస్తుంది (Reduce Stretch Marks)

హెల్త్ లైన్ వెబ్ సైట్ ప్రకారం రోజూ ఉదయం, సాయంత్రం స్ట్రెచ్ మార్క్స్ పై ఆముదాన్ని క్రమం తప్పకుండా కొన్ని రోజుల పాటు రాసుకోవడం ద్వారా అవి క్రమంగా చర్మంలో కలసిపోతాయి.

పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది (Reduce Pigmentation)

స్కిన్ టోన్ అసమానంగా ఉన్నా.. ముఖంపై మచ్చలు ఎక్కువగా ఉన్నా మీ స్కిన్ కేర్ రొటీన్ లో ఆముదాన్ని భాగంగా చేసుకొంటే.. మంచి ఫలితం కనిపిస్తుంది. దీనిలో ఉన్న ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పిగ్మెంటేషన్ తగ్గించి చర్మ ఛాయ అంతా ఒకేలా మారేలా చేస్తాయి. ఈ ఫలితం పొందాలంటే మాత్రం ఆముదాన్ని రెండు మూడు నెలల పాటు క్రమం తప్పకుండా వాడాల్సిందే.

జొజోబా నూనె వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ చదవండి.

ఆముదం వల్ల కురులకు కలిగే ప్రయోజనాలు (Castor (Amudham) Oil Benefits For Hair)

స్కాల్ప్(మాడు)కి పోషణ ఇస్తుంది (Removes Dandruff)

జుట్టు రాలిపోవడానికి ప్రధానమైన కారణం మాడు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం. చుండ్రు, స్కాల్ప్ పొడిగా ఉండటం, పొట్టు రాలడం వంటి సమస్యల కారణంగా జుట్టు రాలే సమస్య అధికంగా ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. ఆముదం ఉపయోగించాల్సిందే. ఆముదంలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలుంటాయి. ఇవి వివిధ రకాల స్కాల్ఫ్ సమస్యలను తగ్గిస్తాయి. అలాగే తలలో దురద, మంట వంటి సమస్యలను కూడా తగ్గిస్తాయి.

ఆముదంలో రిసినోలియెక్ ఆమ్లం అధికంగా ఉంటుంది. ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. కాబట్టి ఈ నూనె తలకు రాసుకొంటే.. మాడులో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దీని కారణంగా జుట్టు పెరుగుదల శాతం మూడు రెట్లు పెరుగుతుంది. జుట్టు పొడవుగా మాత్రమే కాదు.. ఒత్తుగా, బలంగా కూడా తయారవుతుంది.

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది (Good For Hair Growth)

ఆముదం (Castor Oil) వెంట్రుకల కుదుళ్లకు అవసరమైన పోషణ ఇచ్చి బలంగా మారేలా చేస్తుంది. ఆముదం రాసుకొన్నట్లయితే.. జుట్టు పొడవుగా, బలంగా తయారవుతుంది. దీని వల్ల జుట్టు తెగిపోదు. కురుల చివర్లు చిట్లకుండా ఉంటాయి. దీని కోసం గోరువెచ్చని ఆముదాన్ని తలకు రాసుకోవాలి. వారానికి రెండు సార్లు చొప్పున ఈ చిట్కాను పాటిస్తే.. మంచి ఫలితం కనిపిస్తుంది.

సహజసిద్ధమైన కండిషనర్ (Act As Natural Conditioner)

ఆముదం జుట్టును బాగా కండిషనింగ్ చేస్తుంది. దీనిలో సుమారు 18 రకాల ఫ్యాటీ ఆమ్లాలు ఉన్నాయి. ఇవి జుట్టుకి పోషణ ఇవ్వడం మాత్రమే కాకుండా.. సూర్యరశ్మి, కాలుష్య ప్రభావం కురులపై పడకుండా కాపాడతాయి. అలాగే స్కాల్ప్ విడుదల చేసే సహజసిద్ధమైన నూనెలను స్థిరీకరిస్తుంది. షాంపూ చేసుకొన్న వెంటనే అంటే జుట్టు తడిగా ఉన్నప్పుడే కుదుళ్లకు కొద్దిగా ఆముదం రాసుకొని పావుగంట వదిలేయాలి. ఆ తర్వాత గోరువెచ్చిని నీటితో తలను శుభ్రం చేసుకొంటే సరిపోతుంది.

జుట్టు బలంగా మారుతుంది (Strengthens Hair)

వయసు పెరిగే కొద్దీ శరీరంలో కెరాటిన్ స్ట్రక్చర్ బలహీనపడుతుంది. దీని వల్ల వెంట్రుకలు సైతం బలహీనంగా తయారవుతాయి. ఫలితంగా జుట్టు తెగిపోవడం, చివర్లు చిట్లడం, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. మీకు కూడా ఇలాంటి సమస్య ఉంటే.. ఆముదం మీ హెయిర్ కేర్ రొటీన్ లో భాగంగా చేసుకోండి. ఆముదం ఉపయోగించి మీరే స్వయంగా హెయిర్ సీరమ్ తయారుచేసుకోండి. మూడు టేబుల్ స్పూన్ల ఆముదాన్ని టీస్పూన్ జొజోబా ఆయిల్ తో కలిపి చిన్న స్ప్రే బాటిల్లో పోసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా షేక్ చేసి స్ప్రే చేసుకొంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

జుట్టు తెల్లబడకుండా చేస్తుంది (Prevents Hair Whitening)

ఇటీవలి కాలంలో చాలామందికి చిన్న వయసులోనే జుట్టు తెల్లగా మారిపోతోంది. మీరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నారా? అయితే రోజూ ఉదయం, సాయంత్రం ఆముదం తలకు అప్లై చేసుకోవడం ద్వారా హెయిర్ పిగ్మెంటేషన్ తగ్గకుండా ఉంటుంది. దీని వల్ల జుట్టు తెల్లబడదు.

పట్టులాంటి కురులను పొందడానికి రోజ్ మేరీ ఆయిల్ ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకోండి.

ఆరోగ్యానికి ఆముదం (Amudham Oil Uses For Health)

తామర తగ్గుతుంది (Reduces Eczema )

ఆముదంలో undecylenic acid ఉంటుంది. ఇది తామరను ప్రభావవంతంగా తగ్గిస్తుంది. సమపాళ్లలో కొబ్బరినూనె, ఆముదం తీసుకొని బాగా కలిపి మిశ్రమంగా చేయాలి. దీన్ని తామర ఉన్న చోట క్రమం తప్పకుండా నెల రోజుల పాటు రాస్తే నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది.

డిసిన్ఫెక్టెంట్ గా పనిచేస్తుంది (Protects From Infection)

essentialoilacadamia ప్రకారం ఆముదంలో ఉండే రిసినోలియెక్ ఆమ్లం ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. కాబట్టి గాయాలు తగిలిన చోట దీన్ని రాసుకోవచ్చు. ఆముదంలో దూది ముంచి దెబ్బ తగిలిన చోట రాయాలి. చిన్న చిన్న గాయాలకు దీన్ని రాసుకోవచ్చు. కానీ పెద్ద దెబ్బలు తగిలితే.. వైద్యున్ని సంప్రదించాల్సిందే.

కీళ్ల నొప్పులు తగ్గిస్తుంది (Reduce Joint Pain)

కీళ్లనొప్పులతో బాధపడేవారికి ఆముదం మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. దీని కోసం ఆముదంలో మెత్తని వస్త్రాన్ని ముంచి కీళ్ల నొప్పులున్న చోట గట్టిగా చుట్టాలి. ఆ తర్వాత హాట్ వాటర్ బ్యాగ్ పెట్టుకొంటే చక్కని ఉపశమనం దొరుకుతుంది.

నడుము నొప్పికి ఉపశమనం (Relieve Waist Pain)

మీకు నడుము నొప్పిగా ఉందా? అయితే ఆముదం ఉపయోగిస్తే.. చక్కటి ఉపశమనం లభిస్తుంది. ఆముదంతో నడుముని 15-20 నిమిషాలు మర్దన చేసుకొని హాట్ వాటర్ బ్యాగ్ పెట్టుకొంటే మీ నడుము నొప్పి తగ్గుతుంది.

జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది (Cleans Digestive System)

కనీసం నెలకోసారైనా మన జీర్ణవ్యవస్థను మనం శుభ్రం చేసుకోవాల్సిందే. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఆముదం కడుపుబ్బరం, మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలను మన దగ్గరికి రాకుండా చేస్తుంది. దీని కోసం ఆహారంలో ఆముదాన్ని భాగంగా చేసుకోవాలి.  మరి దాన్ని ఆహారంగా ఎలా తీసుకోవాలంటే..

ఆరెంజ్ జ్యూస్ లో కలిపి.. (Helps In Constipation)

ఫుడ్ పాయిజన్ అయినా లేదా మలబద్ధకంతో బాధపడుతున్నా ఆరెంజ్ జ్యూస్ లో కొద్దిగా ఆముదం కలిపి తాగాల్సి ఉంటుంది. గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్ల ఆముదం కలపాలి. దీన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాలి. అరగంట తర్వాత పెద్ద గ్లాసుడు నీళ్లు తాగాలి. అలాగే అప్పుడప్పుడూ గోరువెచ్చని నీటిని తాగుతూ ఉండాలి. ఆముదం కలిపిన జ్యూస్ రుచి కాస్త తేడాగా ఉంటుంది. అయినా దాన్ని తాగడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

పాలలో మిశ్రమంగా (Helps At Time Of Acidity)

పేగులకు సంబంధించిన సమస్యలను తగ్గించడానికి ఆయుర్వేదంలో ఆముదాన్ని ఉపయోగిస్తారు. పాలల్లో ఆముదం కలిపి తాగితే ఎసిడిటీ, కడుపుబ్బరం వంటి సమస్యలు సైతం తగ్గుముఖం పడతాయి. దీని కోసం గ్లాసు పాలల్లో టేబుల్ స్పూన్ ఆముదం వేసి బాగా కలిపి తాగాలి.

అల్లం-ఆముదం మిశ్రమం (Cleans Digestive System)

జీర్ణవ్యవస్థను శుభ్రం చేసుకోవడానికి ప్రయత్నించాల్సిన మరో మిశ్రమం ఇది. జింజర్ వాటర్ లో ఆముదం కలిపి ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. గిన్నెలో నీరు పోసి బాగా మరిగించాలి. దీనిలో చిన్న చిన్న ముక్కలుగా చేసిన అల్లం వేసి పది నిమిషాల పాటు మరిగించాలి. ఈ నీటిని గ్లాసులో పోసి టేబుల్ స్పూన్ ఆముదం కలిపి తాగితే సరిపోతుంది. వారానికోసారి ఈ మిశ్రమాన్ని తాగితే జీర్ణాశయం శుద్ధి అవుతుంది.

వేడి నీటిలో కలిపి (Aid To Tuberculosis)

బాగా మరిగిన నీటిలో టేబుల్ స్పూన్ ఆముదం కలిపి తాగితే మెటబాలిజం ప్రక్రియ మెరుగుపడుతుంది. దీన్ని కూడా ఖాళీ కడుపుతోనే తాగాల్సి ఉంటుంది. వారంలో రెండు సార్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.

ఓ బాటిల్ నీరు మీ ఆరోగ్యాన్ని ఎలా మార్చేస్తుందో తెలుసుకోవడానికి ఇక్కడ చదవండి.

మేలు రకం ఆముదాన్ని ఎలా ఎంపిక చేసుకోవాలి? (Types Of  Castor Oil)

మార్కెట్లో వివిధ రకాలకు చెందిన ఆముదం మనకు లభ్యమవుతోంది. అయితే వాటిలో మూడు రకాల ఆముదం మనం ఉపయోగించడానికి వీలుగా ఉంటుంది. ఆర్గానిక్ ఆముదం, జమైకన్ బ్లాక్ ఆముదం ఈ రెండింటినీ తలకు రాసుకోవడానికి ఉపయోగిస్తారు. ఇక మూడోది  హైడ్రోజినేటెడ్ ఆముదం. దీన్ని సౌందర్య ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తారు.

ఆముదం గింజల్ని కోల్డ్ ప్రెస్సింగ్ చేయడం ద్వారా ఆర్గానిక్ ఆముదం తీస్తారు. దీన్ని హెయిర్ కేర్ కోసం ఉపయోగిస్తారు. పొడి జుట్టు కలిగిన వారు ఈ నూనెను రాసుకొంటే.. జుట్టుకు తగినంత తేమ అందించి ఆరోగ్యవంతంగా మారుస్తుంది.

జమైకన్ బ్లాక్ ఆముదాన్ని కూడా కోల్డ్ ప్రెస్సింగ్ చేయడం ద్వారానే తీస్తారు. కాకపోతే దాని కంటే ముందు వాటిని కాలుస్తారు. నూనె తీసిన తర్వాత  కాల్చినప్పుడు వచ్చిన బూడిదను కలుపుతారు. దీన్ని నార్మల్ హెయిర్ కలిగినవారు ఉపయోగించవచ్చు.

రోజువారీ జీవితంలో ఆముదాన్ని ఎలా భాగం చేసుకోవాలంటే.. (How To Use Castor Oil)

ముందుగా మనం చెప్పుకొన్నట్లుగానే ఆముదం చాలా చిక్కగా ఉంటుంది. కాబట్టి జుట్టుకు రాసుకొన్నప్పుడు దాన్ని శుభ్రం చేయడ కష్టం. అయితే మరి దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి? తెలుసుకొందాం. దీని కోసం మీరు జమైకన్ బ్లాక్ ఆముదం లేదా ఆర్గానిక్ ఆముదం.. ఈ రెండింటిలో దేన్నైనా ఉపయోగించవచ్చు. జమైకన్ బ్లాక్ ఆముదం వాడాలనుకొంటే మాత్రం మీరు పాత దుస్తులు ధరించి ఆ తర్వాత దాన్ని అప్లై చేసుకోవడం మంచిది. ఎందుకంటే.. ఈ నూనె వల్ల దుస్తులపై మరకలయ్యే అవకాశం ఉంటుంది.

మొదటి పద్ధతి – ఆముదం మాత్రమే (First Method)

మీ జుట్టు పొడవు, ఒత్తుని బట్టి మీకు అవసరమైనంత ఆముదం తీసుకొని తలకు రాసుకొని స్కాల్ప్ మర్దన చేసుకోవాలి. అలాగే కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకొని షవర్ క్యాప్ పెట్టుకోవాలి. రెండు గంటల తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. జుట్టు మరింత కండిషనింగ్ అవ్వాలంటే.. నిద్రపోయే ముందు రాసుకొని ఉదయాన్నే తలస్నానం చేయవచ్చు. అయితే ఆముదం జిడ్డు, వాసన పూర్తిగా వదలాలంటే ఒకటికి రెండు సార్లు షాంపూ చేసుకోవాల్సి ఉంటుంది.

రెండో పద్ధతి- ఇతర నూనెల్లో మిశ్రమంగా చేసి (Second Method)

ఆముదంలో ఇతర నూనెలు కలిపి మిశ్రమంగా చేసి కూడా ఉపయోగించవచ్చు. దీని వల్ల జుట్టుకు అవసరమైన పోషణ అంది జుట్టు రాలడం తగ్గి.. ఒత్తుగా పెరుగుతుంది. ఈ ఫలితం పొందడానికి నాలుగు టీస్పూన్ల కొబ్బరి నూనె, నాలుగు టీస్పూన్ల గుంటగలగర నూనె, రెండు టీస్పూన్ల నువ్వుల నూనె, రెండు టీస్పూన్ల ఆముదం తీసుకొని మిశ్రమంగా చేయాలి. ఈ మిశ్రమాన్నిగోరువెచ్చగా ఉండేలా వేడి చేసి తలకు అప్లై చేసుకొని గంట తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని కాస్త ఎక్కువ మొత్తంలో తయారు చేసి నిల్వ చేసుకొంటే అవసరమైనప్పుడల్లా ఉపయోగించవచ్చు. ఈ మిశ్రమంలో విటమిన్ ఇ క్యాప్సూల్ వేసుకొంటే.. జుట్టు మరింత ఆరోగ్యంగా తయారవుతుంది.

ఇతర నూనెల మాదిరిగానే ఆముదం కూడా కొన్ని రోజుల పాటు క్రమం తప్పకుండా వాడితేనే మంచి ఫలితం కనిపిస్తుంది. వారానికోసారి ఈ నూనెను ఉపయోగించడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు.

ఆముదాన్ని కనురెప్పలకు, కనుబొమ్మలకు అప్లై చేసుకొంటే.. ఒత్తుగా పెరుగుతాయి.

మార్కెట్లో లభించే ఉత్తమమైన బ్రాండ్స్ (Best Castor Oil In Market You Must Buy)

Inatur హెర్బల్స్ కాస్టర్ స్కిన్ అండ్ హెయిర్ ఆయిల్ (Inatur Herbles Castor Skin And Hair Oil)

ఈ ప్యాక్ చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని చర్మం, కురుల ఆరోగ్యానికి ఉపయోగించవచ్చు. దీనిలో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయి. ఇవి కురులు, చర్మానికి పోషణ అందించి ఆరోగ్యంగా మారుస్తాయి. పగిలిన పెదవులను మామూలుగా అయ్యేలా చేస్తాయి. దీన్ని నేరుగా ఉపయోగించవచ్చు లేదా కొబ్బరి నూనె, బాదం నూనెలో కలిపి ఉపయోగించవచ్చు.

అరోమా మస్క్ యూఎస్డీఏ ఆర్గానిక్ 100% కోల్డ్ ప్రెస్డ్ కాస్టర్ ఆయిల్ ఫర్ హెయిర్ అండ్ స్కిన్ (Aroma Musk USDA Organic 100% Cold Prescribed Castor Oil For Hair And Skin)

మీ చర్మం అక్కడక్కడా పొడిగా మారుతుంటే(డ్రై ప్యాచెస్) లేదా గాయాలున్నా ఈ ఆముదం ఉపయోగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. మరో మంచి విషయం ఏంటంటే ఇది చాలా తక్కువ ధరకే లభిస్తుంది.

మోర్ఫీమ్ రెమెడీస్ ప్యూర్ కోల్డ్ ప్రెస్డ్ కాస్టర్ ఆయిల్ (Morpheme Remedies Pure Cold Prestored Castor Oil)

ఈ బ్రాండ్ ఆముదాన్ని మసాజ్ ఆయిల్ గా ఉపయోగించవచ్చు. ఈ నూనెను వేడి చేసి దానితో శరీరాన్ని సున్నితంగా మసాజ్ చేసుకొంటే చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది.

సోల్ ఫ్లవర్ కోల్డ్ ప్రెస్డ్ కాస్టర్ కారియర్ ఆయిల్ (Sun Flower ColdCastor Carrier Oil)

జుట్టు రాలిపోయే సమస్యతో బాధపడేవారు ఈ ఆయిల్ ఉపయోగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. దీన్ని క్లెన్సర్ గా ఉపయోగించవచ్చు. ఈ ఆయిల్ ను ముఖానికి రాసుకొని ఐదు నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత వేడి నీటిలో ముంచి వస్త్రంతో శుభ్రం చేసుకొంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

అరోమా మ్యాజిక్ కాస్టర్ ఆయిల్ (Aroma Magic Castor Oil)

కొన్ని సందర్భాల్లో గోళ్లు మెరుపు కోల్పోయి కళావిహీనంగా తయారవుతాయి. ఇలాంటి సందర్భం మీకూ ఎదురైందా? అయితే ఈ అరోమా మ్యాజిక్ కాస్టర్ ఆయిల్ ఉపయోగిస్తే అవి తిరిగి అందంగా తయారవుతాయి. దీన్ని చర్మానికి, జుట్టుకు సైతం ఉపయోగించవచ్చు.

ఆముదం ఉపయోగించడం వల్ల ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? (Side Effects Of Castor Oil)

కచ్చితంగా దీని వల్ల కొన్ని దుష్ప్రభావాలుంటాయి.

వాంతులు అయ్యే అవకాశం (Vomiting)

అధికమొత్తంలో ఆముదాన్ని తీసుకొన్నట్లయితే దాని వల్ల వాంతులు అయ్యే అవకాశం ఉంది. ఫ‌లితంగా డీహైడ్రేషన్ కి గురవ్వచ్చు. అలాగే శరీరంలో ఎలక్ట్రోలైట్స్ అసమతౌల్యం ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో వాంతులు మరీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ సందర్బం మీకు ఎదురైతే.. తగినంత విశ్రాంతి తీసుకోవడంతో పాటు తరచూ నీటిని తాగుతూ ఉండంటం మంచిది.

డయేరియా (Diarrhea)

మీరు ఆముదం తీసుకొన్నట్లయితే.. ఆ రోజు సెలవు తీసుకోవడం మంచిది. ఎందుకంటే అస్తమానూ టాయిలెట్ కి వెళ్లాల్సిన అవసరం రావచ్చు. దీనిలో ఉన్న రిసిన్ కారణంగా కొందరిలో కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు కూడా హైడ్రేటెడ్ గా ఉండటానికి ప్రయత్నించండి.

చర్మ సమస్యలు వచ్చే అవకాశం (Possibility Of Skin Problems)

సున్నితమైన చర్మం కలిగినవారు ఆముదాన్ని వీలైనంత తక్కువ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే దీని వల్ల చర్మసంబంధమైన ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. దురద, దద్దుర్లు వంటివి వస్తే భయపడకుండా నీటిలో కొద్దిగా యాపిల్ సిడర్ వెనిగర్ కలిపి దద్దుర్లు వచ్చిన చోట అప్లై చేసి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకొంటే సరిపోతుంది.

ప్రాణానికే ప్రమాదం (Risk Of Life)

ఆముదం గింజల్లో రిసిన్ అనే ప్రొటీన్ ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. ఒకవేళ మీరు పొరపాటున ఆముదం గింజలు తింటే వెంటనే వైద్య సాయం తీసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే వీటి వల్ల వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశం ఉంది. దీని తీవ్రత మరింత పెరిగితే డీహైడ్రేషన్ కి గురయ్యే అవకాశం ఉంది. రక్తపోటు తగ్గిపోతుంది. పరిస్థితి విషమించితే ప్రాణం పోయే అవకాశం ఉంది.

గర్భిణులు ఆముదానికి దూరంగా ఉండటమే మంచిది (Not Good During Pregnancy)

గర్భిణి ఆముదం తీసుకోవడం వల్ల వికారం, వాంతులు, నొప్పులు వచ్చే అవకాశం ఉంది. చెప్పాలంటే.. దీని వల్ల తల్లీబిడ్డ ఇద్దరికీ అపాయమే. కాబట్టి ఆముదంతో పాటు దాని సప్లిమెంట్స్ కి సైతం దూరంగా ఉండటం మంచిది.

పిల్లలకు అస్సలు ఇవ్వద్దు (Keep It Away From Kids)

ఆరేళ్ల లోపు చిన్నారులకు ఆముదం అస్సలు పెట్టకూడదు. వారు చాలా సున్నితంగా ఉంటారు. దీంతో చిన్నారులకు ర్యాషెస్ రావడంతో పాటు.. వాంతులు అయ్యే అవకాశం ఉంది. వైద్యుల సలహా లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ మీ చిన్నారికి ఆముదం లేదా ఆముదం కలిపిన ఉత్పత్తులను ఇవ్వద్దు. ఎందుకంటే.. ఆముదం వల్ల చిన్నారులకు తీవ్రమైన పరిణామాలు ఎదురుకావచ్చు.

ఆముదం విషయంలో మహిళలకుండే సందేహాలు ఇవే.. (FAQ’s)

కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటే ఏంటి?

ఆముదం గింజల నుంచి నూనె తీసేటప్పుడు వేడి కారణంగా దానిలో ఉన్న పోషకాలు, ఫ్యాటీ యాసిడ్స్ పోతాయి. కోల్డ్ ప్రెస్డ్ పద్ధతిలో వేడి తగలకుండా లేదా నూనె తీసే క్రమంలో ఉష్ణోగ్రతలు పెరగకుండా జాగ్రత్తపడతారు. దీని వల్ల గింజల్లో ఉన్న పోషకాలు నూనెలోనూ ఉంటాయి.

ఆముదం తీసుకోవడం సురక్షితమేనా?

దీనికి సమాధానం అవుననీ చెప్పలేం. కాదనీ చెప్పలేం. గర్భిణులు, పిల్లలు ఆముదం తీసుకోకూడదు. అలాగే మోతాదుకు మించి ఆముదం తీసుకోవడం వల్ల ప్రాణాపాయం కలగొచ్చు.

రోజూ ఆముదం ఉపయోగించవచ్చా?

నిరభ్యంతరంగా ఉపయోగించవచ్చు. కానీ ఈ నూనె కాస్త చిక్కగా, జిడ్డుగా ఉండటం వల్ల రోజూ తలకు, చర్మానికి అప్లై చేసుకోవడానికి వీలుగా ఉండదు. రోజూ ఆముదాన్ని తలకు కొద్ది మొత్తంలో రాసుకోవడం వల్ల జుట్టు పొడవుగా, ఒత్తుగా తయారవుతుంది.

రాత్రంతా ఆముదాన్ని ముఖానికి రాసుకొని అలాగే ఉండొచ్చా?

ఉంచుకోవచ్చు. కాకపోతే.. ఆముదం రాసుకోవడానికి ముందే ముఖానికి ఆవిరి పట్టుకోవాలి. కాసేపు మసాజ్ చేసుకోవాలి. మరుసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో కడిగేసుకొంటే.. సరిపోతుంది.

ఆముదం ఉపయోగించడం వల్ల జుట్టు పెరుగుతుందా?

కచ్చితంగా పెరుగుతుంది. దీనిలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు, మినరల్స్, విటమిన్ ఇ, ఒమెగా 6 ఫ్యాటీ ఆమ్లాలు, ఇతర పోషకాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

కళ్ల కింద ఆముదం రాసుకోవచ్చా?

ఆముదంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కళ్ల కింద వాపుని తగ్గిస్తాయి. దీని వల్ల కళ్ల కింద ముడతలు సైతం తగ్గుముఖం పడతాయి.

ఇంకా చదవండి –

Benefits of Castor Oil in Hindi

Featured Image: Instagram

Read More From Beauty