Lifestyle

“చిరుత” నుండి “రంగస్థలం” వరకు.. అలుపెరగని పయనం: హ్యాపీ బర్త్‌డే రామ్ చరణ్

Lakshmi Sudha  |  Mar 26, 2019
“చిరుత” నుండి “రంగస్థలం” వరకు.. అలుపెరగని పయనం: హ్యాపీ బర్త్‌డే రామ్ చరణ్

‘చిరు త’నయడిగా టాలీవుడ్‌లో అడుగుపట్టిన రామ్ చరణ్ (Ram charan).. ‘మగధీరుడి’గా ‘ధీర ధీర మనసాగలేదురా..’ అనిపించాడు. ‘ఆరెంజ్’ లో రామ్‌గా అసలు సిసలు ప్రేమ ఎలా ఉంటుందో చూపించాడు. ఆపై చిచ్చర పిడుగులా ‘రచ్చ’ చేసి హే ‘నాయక్’ అనిపించాడు. ‘ఎవడు’ అని అడిగిన వారికి ‘తుఫాన్’ లా వచ్చి ‘గోవిందుడు అందరి వాడేలే’ అని సమాధానం చెప్పాడు. ‘బ్రూస్ లీ’లా తెగువ చూపించి ‘ధృవ‌’లా తెలివిగా అందరినీ మెస్మరైజ్ చేశాడు. చెల్లుబోయిన చిట్టిబాబులా సినీ ‘రంగస్థలం’పై తాను  ‘వినయ విధేయ రాముడి’నన్నాడు. 

చిరు వారసుడిగా తన ప్రయాణం మొదలుపెట్టినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందడానికి చాలా కాలమే ఎదురు చూడాల్సి వచ్చింది రామ్ చరణ్. మొదటి సినిమాకి.. ఇప్పటికీ రామ్ చరణ్ నటనలో చాలా మార్పు కనిపిస్తుంది. ఇప్పుడు ఆయన పరిణతి చెందిన నటుడు. నటుడిగా మాత్రమే కాదు.. ఆయన వ్యక్తిత్వంలోనూ ఎంతో మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు దూకుడుగా ఉండే రామ్ చరణ్ కాస్తా.. కుదురుగా ఉండే పక్కింటి అబ్బాయిలా మారిపోయాడు.

అంతేనా ప్రొడ్యూసర్ గానూ మారాడు. తన తండ్రి చిరంజీవి హీరోగా ఖైదీ నెం 150 నిర్మించాడు. ప్రస్తుతం ‘సైరా’ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. నటుడిగా, నిర్మాతగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేసుకొనే పనిలో ఉన్నాడు రామ్ చరణ్.  ప్రస్తుతం RRR సినిమాలో ఎన్టీఆర్‌తో కలసి తెరను పంచుకోబోతోన్న ‘మిస్టర్ సి’ రామ్ చరణ్ కు POPxo తెలుగు చెబుతోంది హ్యాపీ బర్త్ డే.

అల్లు రామలింగయ్య, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, స్టార్ ప్రొడ్యూసర్ నాగబాబుల సినీవారసుడిగా రామ్ చరణ్ తెలుగు సినీ రంగంలోకి ప్రవేశించారు.ఇదేనా ఆయన ప్రత్యేకత. కాదు. సినిమా రంగంలోనే కాకుండా మరెన్నో విషయాల్లో ఆయన ప్రత్యేకం. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా చెర్రీ గురించి కొన్ని ఆసక్తి కరమైన విశేషాలు మీకోసం..

* రామ్ చరణ్ నటుడు మాత్రమే కాదు. వ్యాపారవేత్త కూడా. విమానయాన రంగంలోని ట్రూజెట్ సంస్థలో ఆయన పెట్టుబడులు పెట్టారు. స్టార్ మా ఛానెల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో రామ్ చరణ్ కూడా ఒకరు.

* రామ్ చరణ్ కు గుర్రాలంటే మక్కువ ఎక్కువ. మగధీరలో ఆయన స్వారీ చేసిన గుర్రం ఆయనదే. దాని పేరు కాజల్. దీని కోసం తన ఇంటి వెనుక ప్రత్యేకంగా గుర్రపు శాలను నిర్మించారు చెర్రీ. గుర్రాలు మాత్రమే కాదు శునకాలు, కోళ్లను సైతం చెర్రీ చాలా ప్రేమగా పెంచుతారు.

* ఉపాసన, చరణ్ ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. పాఠశాల రోజుల్లో ఉపాసన చరణ్ జూనియర్. అప్పటి నుంచి మంచి స్నేహం ఉన్నప్పటికీ ఆరెంజ్ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వీరికి 2012లో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది.

* చెర్రీ, ఉప్సి ఇద్దరికీ కామన్ ఇంట్రెస్ట్ లు చాలానే ఉన్నాయి. వీరిద్దరికీ జంతువులంటే మక్కువ ఎక్కువ. పుట్టిన రోజు బహుమతులుగా ఒకరికొకరు జంతువులనే ఇచ్చుకొంటారు.

* రామ్ చరణ్ ఫిట్ నెస్ ఫ్రీక్. ఫిట్ గా ఆరోగ్యంగా ఉండటానికి డైట్ చాలా కచ్చితంగా పాటిస్తారు. ఈ విషయంలో భార్య ఉపాసన సూచనలను ఆయన పాటిస్తారు.

* రామ్ చరణ్ పాటలు కూడా పాడారు తెలుసా? తుఫాన్ సినిమాలో ‘ముంబయి కా హీరో’ పాట చెర్రీనే పాడాడు. గతంలో తన తండ్రి స్థాపించిన ప్రజారాజ్యం కోసం సైతం ఓ పాట పాడారు చెర్రీ.

* రానా, చరణ్, శర్వానంద్ ముగ్గురూ మంచి స్నేహితులు. వీరు స్కూల్ డేస్ లో క్లాస్మేట్స్. అల్లు అర్జున్ భార్య స్నేహ కూడా వీరి క్లాస్మేటే.

* శీతల పానీయం పెప్సికోకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు చరణ్.

* ధ్రువ సినిమాలో స్టంట్స్ అన్నీ చెర్రీనే స్వయంగా చేశారు.

* రామ్ చరణ్ కు సైక్లింగ్ అంటే చాలా ఇష్టమట.

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సెలబ్రిటీలు సోషల్ మీడియాలో చెప్పిన శుభాకాంక్షలను ఓసారి చూద్దాం.

 

ఇవి కూడా చ‌ద‌వండి

మీకు జన్మనిచ్చింది కూడా ఓ మహిళే.. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి : నయనతార

కూతురి డ్యాన్స్ చూసి.. మురిసిపోయిన సూపర్ స్టార్ మహేశ్ బాబు

స్వచ్ఛమైన ప్రేమకు అందమైన నిర్వచనం.. చైతూ, సమంతల జంట..!

Read More From Lifestyle