అలియా భట్ (Alia bhatt).. తన నటనతో ప్రతిఒక్కరినీ ఆకట్టుకోగలిగే బబ్లీ హీరోయిన్. హైవే, రాజీ చిత్రాలతో ఆకట్టుకున్న ఈ భామ ఇప్పుడు కళంక్ సినిమాతో మన ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇదొక్కటే కాదు.. తెలుగులో బాహుబలి దర్శకుడు రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తోన్న RRR సినిమాలో కథానాయికగా ఎంపికైందీ అందాల సుందరి. ఈ సినిమాలో అలియా రామ్ చరణ్ సరసన కనిపించనుంది.
ఈ సినిమాలో ఆమెది ఓ కీలకమైన పాత్ర. దానికోసం ముందు నుంచీ సిద్ధమవుతోంది అలియా. అందుకే ఈ పాత్ర కోసం సినిమాలో నటించడానికి ముందే.. ప్రిపరేషన్ ప్రారంభించేసిందట ఈ అందాల భామ. తాజాగా ఓ ప్రెస్ మీట్‌లో ఈ విషయాన్ని పంచుకుంది అందాల అలియా.
తన పాత్ర గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ “రాజమౌళి గారితో పనిచేయాలని నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడే భావించాను. బాహుబలి సినిమా చూసిన తర్వాత ఆయన చిత్రంలో నటించాలన్న కోరిక నాకు ఇంకా ఎక్కువైంది. అందుకే ఈ సినిమా అవకాశం వచ్చినప్పుడు నేను పెద్దగా ఆలోచించలేదు. నా పాత్ర గురించి వినగానే ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పేశా.
నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు నా డ్రీమ్ డైరెక్టర్లు ముగ్గురు. అందులో ఒకరు కరణ్ జోహార్. ఆయన దర్శకత్వంలో నటించాలన్న నా కోరిక మొదటి సినిమాతోనే తీరిపోయింది. ఇక నా లిస్టులో ఉన్న దర్శకులు ఇద్దరు. వాళ్లే సంజయ్ లీలా భన్సాలీ, రాజమౌళి. ఇప్పుడు చేయనున్న ఈ సినిమాతో నా మరో కోరిక నెరవేరనుంది. ఇక మిగిలింది మరొక్కరు మాత్రమే. సంజయ్ సర్ తోనూ ఇన్షాఅల్లా అనే సినిమా చేస్తున్నా” అని చెప్పుకొచ్చింది.
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తోన్న ఇన్షాఅల్లా సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన నటించనుందీ బ్యూటీ.
RRR సినిమాలో రామ్ చరణ్ సరసన అల్లూరి సీతారామరాజు ప్రేయసి సీత పాత్రలో నటించి మెప్పించనుందీ బ్యూటీ. ప్రస్తుతం కాలి నొప్పితో షూటింగ్‌కి దూరమైన రామ్ చరణ్ కోలుకున్నాక.. వీరిద్దరి షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈలోపే సినిమాలో అద్భుతంగా కనిపించేందుకు బాగా సిద్ధమవుతోందట ఈ అందాల తార. తెలుగు, హిందీ భాషల్లో రూపొందే ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా తెలుగు భాష నేర్చుకుంటోందట అలియా.
దీని కోసం ప్రత్యేకంగా ఓ ట్యూటర్‌ని పెట్టుకున్న అలియా.. రోజూ ఉదయాన్నే క్లాసులకు అటెండ్ అయ్యి తెలుగు నేర్చుకుంటోందట. అయితే తెలుగు పూర్తిగా నేర్చుకోవడం కాస్త కష్టమే అంటోన్న ఈ భామ.. కొన్నాళ్లు అయ్యాక.. పూర్తి డైలాగ్‌ని తెలుగులో చెప్పగలిగితే చాలు.. అదే గొప్ప అంటోంది.
“తెలుగులో సినిమా చేస్తున్నా.. దాని కోసం తెలుగు నేర్చుకుంటున్నా. కానీ ఇది అంత సులువైన భాషేమీ కాదు. ఈ భాష చాలా కష్టంగా ఉంది. దీన్ని నేర్చుకోవడం నాకో పెద్ద ఛాలెంజ్. అయితే అన్ని రకాల భావాలను పండించగలిగే చక్కటి భాష ఇది. తెలుగులోని నుడికారాలతో పాటు కొన్ని పదాలను అలా ఎందుకు పలుకుతారు.. వాటి అర్థాలేంటి? అన్న విషయాలను నేర్చుకుంటున్నా. ఇవన్నీ నేర్చుకుంటే తప్ప నా పాత్ర భావాలను స్పష్టంగా ముఖంలో చూపించలేను. అందుకే కష్టమైనా తెలుగు నేర్చుకుంటున్నా. ఎప్పటికైనా తెలుగులో మాట్లాడాలన్నదే నా కోరిక” అంటూ తన తెలుగు ట్రైనింగ్ గురించి చెప్పుకొచ్చింది.
ఈ RRR సినిమా కథ చాలా వైవిధ్యమైంది. ఇద్దరు నాయకులు స్వాతంత్ర సమరయోధులుగా మారక ముందు.. ఒకరినొకరు కలిసి; పరస్పరం ప్రేరణగా నిలిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో రూపొందిన కథ ఇది. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తే.. ఎన్టీఆర్ కొమరం భీం పాత్ర పోషించనున్నాడు. ఇందులో ఎన్టీఆర్ సరసన డైసీ ఎడ్గార్ జోన్స్ అనే బ్రిటిష్ నటి నటించాల్సి ఉంది. కానీ తాజాగా తాను ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు డైసీ ప్రకటించింది. అనివార్య కారణాల వల్ల డైసీ ఈ సినిమా నుంచి వైదొలిగినట్లు రాజమౌళి కూడా చెప్పడం గమనార్హం. మరి, డైసీ పాత్రలో ఎవరిని తీసుకుంటారో చూడాలి.
ఇటు రామ్ చరణ్‌కి గాయం, అటు ఎన్టీఆర్ సరసన నటించాల్సిన కథానాయిక సినిమా నుంచి తప్పుకోవడంతో RRR సినిమా చిత్రీకరణ ఆలస్యం కానుంది. అయితే ఇబ్బందులు ఎన్ని ఎదురైనా.. షూటింగ్ అనుకున్న సమయంలో పూర్తి చేస్తామని సినిమా యూనిట్ వెల్లడించడం విశేషం.
ఇవి కూడా చదవండి.
పుట్టిన రోజు నాడు.. రష్మిక ఎందుకు అలిగిందో మీకు తెలుసా..?