Lifestyle

వాలెంటైన్ వీకే కాదు.. యాంటీ వాలెంటైన్ వీక్ కూడా ఉందండోయ్..!

Lakshmi Sudha  |  Feb 12, 2019
వాలెంటైన్ వీకే కాదు.. యాంటీ వాలెంటైన్ వీక్ కూడా ఉందండోయ్..!

ఏటా ఫిబ్రవరి నెల వచ్చిందంటే చాలు.. ప్రేమ పండగ మొదలవుతుంది. ఈ నెల 14 వ తేదీన ప్రేమికుల రోజుగా జరుపుకొంటారు. అంతేనా.. ప్రేమను సెలబ్రేట్ చేసుకోవడానికి వాలెంటైన్ వీక్ ను జరుపుకొంటాం. రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హ‌గ్ డే, కిస్ డే, వాలెంటైన్స్ డే అంటూ వారం రోజుల పాటు వాలెంటైన్ వీక్ పేరుతో  ప్రేమ పండగ చేసుకొంటాం. ప్రేమించిన వారికి అందమైన బహుమతులు ఇస్తూ.. వారి మనసు గెలుచుకొనే ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ చాలా ఉత్సాహంగా, ప్రేమగా జరుపుకొంటాం. 

మరి, బ్రేకప్ ను సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా కొన్ని రోజులున్నాయ‌ని మీకు తెలుసా? ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమండి..! ప్రేమికుల రోజు జరుపుకొనే ఫిబ్రవరి 14 తర్వాతి రోజు నుంచి ఈ యాంటీ వాలెంటైన్ వీక్ మొదలవుతుంది. యాంటీ వాలెంటైన్ వీక్(anti valentine week) అన్నారు కదా అని దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే బ్రేకప్ అయిన వారు  సరదాగా సమయం గడపడానికి, కొత్త జీవితాన్ని ఆరంభించడానికి ఉద్దేశించినది ఇది. ఫిబ్రవరి 15న స్లాప్ డే, 16న  కిక్ డే, 17న పర్ఫ్యూమ్ డే, 18న ఫ్లర్టింగ్ డే, 19న కన్ఫెషన్ డే, 20న మిస్సింగ్ డే, 21న బ్రేకప్ డేగా జరుపుకొంటారు.

అసలు ఏంటీ యాంటీ వాలెంటైన్స్ వీక్? వాలెంటైన్స్ డేకి ఉన్న చరిత్ర దీనికి లేదు. కానీ ఇటీవలి కాలంలో దీన్ని కూడా ఆనందంగా జరుపుకొనేవారు ఎక్కువ అవుతున్నారు. అయితే ఈ యాంటీ వాలెంటైన్ వీక్ లో ప్రతి రోజుకున్న ప్రాధాన్యత ఏంటో తెలుసుకొందాం. యాంటీ వాలెంటైన్ వీక్ లో మొదటిది స్లాప్ డే(Slap Day). అంటే దాని అర్థం ఈ రోజు ఒకరిని ఒకరు కొట్టుకోవాలని కాదు. రిలేషన్ షిప్ లో వచ్చే చిన్న చిన్న కలతలకు సంకేతంగా దీన్ని జరుపుకొంటారు.

యాంటీ వాలెంటైన్ వీక్ లో రెండో రోజు కిక్ డే(Kick day). స్లాప్ డే మాదిరిగానే దీనికి కూడా ఓ ప్రత్యేకత ఉంది. ఇది ఇద్దరు ప్రేమికుల మధ్య మాటల తీవ్రత పెరిగి గొడవలకు దారి తీస్తుంది. వాటికి సూచనగానే ఈ కిక్ డేను జరుపుకొంటారు.

యాంటీ వాలెంటైన్ వీక్ ల మూడో రోజు పర్ఫ్యూమ్ డే. తమ బంధంలో రేగిన కలతలు,గొడవల కారణంగా మానసికంగా కుంగిపోయిన వారికి కాస్త ఊరటనిచ్చేదే పర్ఫ్యూమ్ డే. బంధంలో రేగిన కలతలను పక్కన పెట్టి.. జీవితంలో ముందకు సాగిపోవాలనే సందేశాన్నిస్తుంది ఈ రోజు.

నాలుగో రోజుని ఫ్లర్ట్ డేగా జరుపుకొంటారు. బ్రేకప్ తర్వాత కొత్త జీవితానికి స్వాగత వాక్యం పలుకుతూ.. ఈ రోజుని జరుపుకొంటారు. బ్రేకప్ తర్వాత తమ లేటెస్ట్ హార్ట్ క్రష్ తో కలసి ఈ రోజుని జరుపుకొంటారు. 

ఇక ఐదో రోజు కన్ఫెషన్ డే. రిలేషన్ షిప్ లో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, గత అనుబంధం మిగిల్చిన గాయాలు, బాధలను పూర్తిగా మరచిపోయి.. సంతోషంగా ఆరంభించేందుకే ఈ రోజు జరుపుకొంటారు.

ఆరో రోజును మిస్సింగ్ డే గా జరుపుకొంటారు. ఎంత నిబ్బరంగా ఉందామన్నా.. అనుబంధంలో రేగిన కలతలు మనల్ని మనశ్శాంతిగా ఉండనివ్వవు. అంతేకాదు.. భాగస్వామిని, వారితో పాటు గడిపిన మధుర క్షణాలను మిస్సవుతుంటాం.

యాంటీ వాలెంటైన్ వీక్ లో చివరి రోజు బ్రేకప్ డే. మిస్సింగ్ డే తర్వాత తమ రిలేషన్ షిప్ విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకొనే రోజిది. ముఖ్యంగా టాక్సిక్ రిలేషన్ షిప్ లో ఉన్నవారు ఆ బంధం నుంచి బయటకు వచ్చే రోజు బ్రేకప్ డే.

ఇవీ యాంటీ వాలెంటైన్ వీక్ విశేషాలు. చివరిగా మేం చెప్పేదేంటంటే.. వాలెంటైన్స్ వీక్ అయినా.. యాంటీ వాలెంటైన్స్ వీక్ అయినా.. ఏది జరుపుకొన్నా మన వ్యక్తిగత సంతోషం కోసమే జరుపుకొంటాం. కాబట్టి మిమ్మల్ని సంతోషంగా ఉంచేవారితో సమయం గడపండి.

హ్యాపీ యాంటీ వాలెంటైన్ వీక్.

Images: Shutterstock

ఇవి కూడా చ‌ద‌వండి

ఈ రెసిపీల‌తో మీ వాలెంటైన్‌కి.. రొమాంటిక్ స‌ర్‌ప్రైజ్ ఇవ్వండి..

ఈ “వాలెంటైన్స్ డే” కానుకలతో.. మీ మనోహరుడి మనసుని మరోసారి దోచేయండి..!

డియర్ ఎక్స్ .. నీకెలా కృత‌జ్ఞ‌త‌లు చెప్పాలో తెలియడం లేదు..!

Read More From Lifestyle