Celebrity gossip

దొరసాని.. మల్లేశం.. ఫలక్‌నామా దాస్ … తెలుగులో మొదలైన “ఆఫ్ – బీట్” సినిమాల ట్రెండ్..!

Sandeep Thatla  |  May 30, 2019
దొరసాని.. మల్లేశం.. ఫలక్‌నామా దాస్ … తెలుగులో మొదలైన “ఆఫ్ – బీట్” సినిమాల ట్రెండ్..!

తెలుగు సినిమాలంటే – నిన్న మొన్నటి వరకూ మూడు ఫైట్లు, ఆరు పాటలు గల కమర్షియల్ ఫార్ములా చిత్రాలు. చాలాకాలం హిట్ల కోసం ఇదే ట్రెండ్ కొనసాగించారనే వాదన ఉంది. అయితే గత కొంతకాలంగా పద్ధతి మారుతోంది. రొటీన్ కమర్షియల్ ఫార్ములా నుండి కాస్త పక్కకి జరిగి “ఆఫ్ – బీట్” సినిమాల వైపు తెలుగు సినిమా మళ్ళిందా అనే సందేహాలు కలుగుతున్నాయి.

అలాంటి సందేహాలు ప్రేక్షకులకు కలగడానికి కూడా కారణాలు అనేకం..!

ఈ మధ్యకాలంలో విడుదలైన – ఫలక్ నుమా దాస్ (Falaknuma Das) చిత్రం చూశారా. హైదరాబాద్ నగరంలోని ఓల్డ్ సిటీ దగ్గరున్న ఫలక్ నుమా అనే ప్రాంత నేపథ్యంలో సాగే కథ ఇది. దీనిని వెండితెర పై విభిన్నంగా చూపే ప్రయత్నం చేశాడు హీరో – దర్శకుడు విశ్వక్ సేన్.

మలయాళంలో వచ్చిన అంగమలై డైరీస్‌కి (Angamaly Dairies)  రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రం.. ఇప్పటికే పరిశ్రమలో చర్చకు దారితీసింది. జయాపజయాలను పక్కన పెడితే.. ఎలాంటి సబ్జెక్టులపై యువ దర్శకులకు ఆసక్తి ఉందన్న విషయం కూడా ఇండస్ట్రీకి అవగతమైంది.

తమిళ, మలయాళ చిత్రాల ప్రభావం.. టాలీవుడ్ పై పడుతుందన్న వాదనను పక్కన పెడితే.. ఫలక్ నుమా దాస్  చిత్రం విషయంలో మాత్రం.. మూల కథనే తీసుకుని.. లోకల్ కల్చర్‌కు తగ్గట్లుగా.. కాస్త వాస్తవికతని జోడించి సినిమా తీశామని దర్శకుడు విశ్వక్ సేన్ చెప్పాడు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించే ముందు విశ్వక్ సేన్ హీరోగా వెళ్ళిపోమాకే, ఈనగరానికి ఏమైంది అనే రెండు చిత్రాలు విడుదలయ్యాయి. ఇప్పుడు ఇది మూడవ చిత్రం.

కెరీర్‌లో మూడవ చిత్రానికే దర్శకుడిగా మారిన విశ్వక్ సేన్.. సొంతంగా సినిమాకి దర్శకత్వం వహించడానికి కారణం కూడా తెలిపారు. ఫలక్‌నుమాలో పుట్టి పెరిగిన తనకన్నా.. ఈ చిత్రాన్ని ఇంకెవరు బాగా తీయలేరని అనిపించడం వల్లే తాను దర్శకుడిగా మారానని అభిప్రాయపడ్డారు విశ్వక్ సేన్. 

 

ఇక మరికొన్ని ఆఫ్ బీట్ చిత్రాల విషయానికి వస్తే.. ఇటీవలి కాలంలో మనం చెప్పుకోదగ్గ మరో చిత్రం “మల్లేశం”. ఈ సినిమా కథ కాస్త వైవిధ్యమైంది.  తెలంగాణ రాష్ట్రంలోని పాత భువనగిరి జిల్లాలోని షారాజిపేటకి చెందిన చింతకింది మల్లేశం (Chintakindi Mallesham) జీవితకథే ఈ చిత్రం. ఇంతకీ ఈ చింతకింది మల్లేశం ఎవరో తెలుసా – చీరలు నేసే “ఆసు యంత్రం”ని కనిపెట్టడం ద్వారా ఫోర్బ్స్ మ్యాగజైన్‌లో చోటు సంపాదించిన తెలంగాణ వ్యక్తి. చేనేత పరిశ్రమకు తాను అందించిన సేవలకు గాను..  ప్రతిష్టాత్మక “పద్మశ్రీ” పురస్కారాన్ని కూడా ఆయన పొందాడు. 

సాధారణంగా ఆసు పనిలో భాగంగా.. రోజుకి 18 వేల సార్లు దారాన్ని కందుల చుట్టూ తిప్పుతూ ఉంటే గాని చీర సిద్ధం కాదు. ఈ పనిచేస్తూనే మల్లేశం తల్లి, భుజాలు బలహీనపడి.. అనారోగ్యం పాలవుతుంది. ఆ సమయంలో తల్లి శ్రమ తగ్గించాలనే ఉద్దేశంతో.. ఆసు యంత్రాన్ని కనుగొనడానికి సంకల్పిస్తాడు మల్లేశం. ఆయన కథే ఇప్పుడు సినిమాగా తెరకెక్కుతోంది. 

 

నటుడు ప్రియదర్శి ఈ చిత్రంలో చింతకింది మల్లేశం పాత్రలో నటించగా.. ఆయన తల్లి పాత్రలో ఝాన్సీ నటించడం విశేషం. ప్రస్తుతం ఈ చిత్ర ట్రైలర్.. నెటిజన్లలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. జూన్ 21న విడుదల కాబోయే ఈ చిత్రం తెలుగు సినిమాల రొటీన్ ఫార్ములాకి ఆమడదూరంలో ఉన్న చిత్రం. మరి ఈ చిత్రం ప్రేక్షకులకు ఎంతవరకు నచ్చుతుందో చూడాలి. 

ఇక ఈ సంవత్సరం మొదటి భాగంలో విడుదలై విజయవంతమైన తొలి ఆఫ్ – బీట్ చిత్రంగా “జెర్సీ”ని (Jersey) చెప్పుకోవచ్చు. న్యాచురల్ స్టార్ నాని (Nani) తన స్టార్ స్టేటస్‌ని పక్కకుపెట్టి మరీ నటించిన చిత్రమిది. కొడుకు అడిగిన జెర్సీ కోసం తండ్రి ఏం చేశాడు? అనే ఒక చిన్న లైన్‌తో మొదలైన ఈ కథ.. ప్రేక్షకులను భావోద్వేగాలతో కట్టిపడేస్తుంది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి (Gowtham Tinnanuri) కూడా దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు.

పైగా ఈ చిత్రంలో హీరో పాత్ర సహజత్వానికి దగ్గరగా ఉండడంతో.. సినిమాని చూసే ప్రేక్షకుడు కూడా దానితో పాటు ప్రయాణిస్తాడు. సినిమా పతాక సన్నివేశాల్లో.. పాత్రలతో పాటు తానూ కన్నీరు పెడతాడు.

ఇక ఈ మధ్యకాలంలో తెలుగు సినీ పరిశ్రమలో ఆసక్తిని రేపుతున్న మరో చిత్రం “దొరసాని”. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ.. ఓ జమిందారీ యువతికి, ఓ పేదింటి అబ్బాయికి మధ్య సాగుతుంది. ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ హీరోగా పరిచయం కాగా.. రాజశేఖర్, జీవితల కుమార్తె శివాత్మిక హీరోయిన్‌గా నటిస్తోంది.

 

 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో లభ్యమవుతోంది: ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ మరియు బెంగాలీ

కలర్ ఫుల్‌గా, క్యూట్‌గా ఉండే వస్తువులను మీరూ ఇష్టపడతారా? అయితే సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ ఇంకా మరెన్నో.. వాటికోసం POPxo Shop ని సందర్శించండి !

ఇవి కూడా చదవండి

తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ‘దొరసాని’ చిత్రం.. టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ ..!

‘జెర్సీ’ తో నానీ సిక్స్ (సక్సెస్) కొట్టాడా లేదా? – మూవీ రివ్యూ

మజిలీ సినిమాతో అబ్బాయిలందరికీ.. ఓ డ్రీమ్ వైఫ్ దొరికేసింది..!

 

 

Read More From Celebrity gossip