Education

భర్త పాస్ పోర్టును.. పద్దుల పుస్తకంగా మార్చేసిన ఇల్లాలు..!

Lakshmi Sudha  |  Mar 28, 2019
భర్త పాస్ పోర్టును.. పద్దుల పుస్తకంగా మార్చేసిన ఇల్లాలు..!

సాధారణంగా మనం ఫోన్ నంబర్లు రాసుకోవడానికి, పచారీ కొట్లో అవసరమైన సరుకుల జాబితా రాసుకోవడానికి జేబులో, పర్సులో పట్టేంత చిన్న చిన్న పుస్తకాలు వాడతాం. టెక్నాలజీ వాడకం పెరిగినప్పటికీ ఇప్పటికీ మన అమ్మ, అమ్మమ్మ, నానమ్మలు ఇలాంటి పుస్తకాలనే వాడతారు. దాన్నిండా ఫోన్ నంబర్లుంటాయి. రాసి కొట్టేసిన సరుకుల పేర్లుంటాయి. కొన్నిసార్లు అయితే ఎవరికి ఎంత బాకీ ఉన్నాం.. ఎంత వడ్డీ ఇవ్వాలి ఇలాంటివి కూడా కనిపిస్తుంటాయి. 

ఈ విషయంలో కేేరళకు చెందిన ఓ మహిళ మాత్రం ఓ అడుగు ముందుకేసి ఏకంగా తన భర్త పాస్ పోర్ట్‌నే(Passport) పద్దుల పుస్తకంగా వాడేసింది. ఏకంగా దానిని పచారీ సామాన్ల లిస్ట్ రాయడానికి ఉప‌యోగించింది. అంతేనా.. ఫోన్ డైరెక్టరీగానూ మార్చేసింది. ఆ పుస్త‌కం చివ‌ర్లో కూడికలు, తీసివేతలు కూడా చేసేసేంది.

ఆవిడ ఇలా చేయడం వెనక బహుశ ఆమె అవగాహనా రాహిత్యం కారణమై ఉండొచ్చు. కానీ ఆమె దాన్ని మామూలు పుస్తకమే అనుకోవడానికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే మన పాస్ పోర్ట్‌లో ఏకంగా ముప్పై నుంచి అరవై వరకు పేజీలు ఉంటాయి. చివర్లో కొన్ని తెల్ల కాగితాలూ ఉంటాయి. సాధారణంగా ఆ పేజీల్లో వీసా తీసుకొన్న ప్రతిసారి ఓ స్టాంప్ వేస్తుంటారు. ఇదుగో ఆ పేజీల‌నే ఆ మహిళ పద్దుల పుస్తకంగా మార్చేసింది.

ఈ పాస్ పోర్ట్‌కి సంబంధించిన వీడియోను ఆమె కొడుకు సోషల్ మీడియాలో పంచుకొన్నారు. దానికి నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఫన్నీ కామెంట్లతో కడుపుబ్బ నవ్వించేస్తున్నారు. ‘ఇట్ హాపెన్స్ ఓన్లీ ఇండియా’, ‘ట్రూలీ ఇండియన్’, ‘జుగాడ్’ అంటూ వర్ణించేస్తున్నారు.

పాస్ పోర్ట్‌ను పద్దుల పుస్తకంగా మార్చేయడం మనకు నవ్వు తెప్పిస్తున్నప్పటికీ.. అది చాలా విలువైనది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. దాన్ని గుర్తింపు కార్డుగా ఉపయోగించవచ్చు. ఇతర దేశాలకు వెళ్లినప్పుడు కూడా అదే మనకు గుర్తింపు కార్డుగా పనిచేస్తుంది. కాబట్టి దీని విషయంలో జాగ్రత్తగా వ్య‌వ‌హ‌రించాల్సిందే..!

గతంలోనూ ఓ చిన్నారి తన తండ్రి పాస్ పోర్ట్ పై పిచ్చి గీతలు గీసి దాన్ని ఎందుకూ పనికి రాకుండా చేసేశాడు. అది అప్పుడు వైరల్‌గా మారింది. ఇప్పుడు ఈమె తన భర్త పాస్ పోర్ట్‌ను ఫోన్ డైరెక్టరీగా, పద్దుల పుస్తకంగా మార్చేసింది. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే.. ముందుగానే దాని విలువ గురించి ఇంట్లో వాళ్లకు చెప్పడం మంచిది. ఏమంటారు?

Also Read:

సినిమాలో చూపించినట్టు.. కాలేజీ జీవితం ఉండదమ్మా..!

తన జీవితంలో జరిగే ఈ సంఘటనలను ఏ ఆడపిల్ల ఎప్పటికీ మరచిపోదు..

ఏమయ్యా వార్నర్.. మా తెలుగు వారి దోశ రుచి చూస్తావేంటి?

Read More From Education