Education

30 ఏళ్లు వచ్చే లోపు ఈ పథకాల్లో.. డబ్బు మదుపు చేయాల్సిందే

Chhavi Porwal  |  Dec 6, 2018
30 ఏళ్లు వచ్చే లోపు ఈ పథకాల్లో..  డబ్బు మదుపు చేయాల్సిందే

పప్పు, ఉప్పు దగ్గర నుంచి పెట్రోల్, డీజిల్ వరకు అన్ని రకాల వస్తువుల ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి కానీ తగ్గేలా కనిపించడం లేదు. అలాగని మనకొచ్చే ఆదాయం పెరుగుతుందా? అంటే అదీ లేదు. నెలనెలా బడ్జెట్లో లోటు పెరుగుతుందే కానీ.. ఆ లోటు పూడ్చే మార్గం మాత్రం కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదేమో. కానీ ఇప్పుడు నేనున్న వయసులోనే మా నాన్న భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయడం ప్రారంభించారు. ఆయన అలా చేయడం వల్లే ఇప్పుడు మేం సొంతింట్లో ఉంటున్నాం. ఈ విషయంలో నేను కూడా మా నాన్నని ఫాలో అయితే నాకొస్తున్న జీతాన్ని చక్కగా మదుపు చేయగలను.

అసలు డబ్బు ఎలా పొదుపు చేయాలి? అసలు మదుపు చేయడానికి ఎలాంటి పథకాలున్నాయి? వేటిలో రిస్క్ ఎక్కువ ఉంటుంది? ఏ పథకాల్లో మదుపు చేస్తే రిస్క్ తక్కువ? ఇలా పెద్ద పరిశోధనే చేశాను. ఆ తర్వాత ఇప్పటి వరకూ నేనెందుకు డబ్బు ఇన్వెస్ట్ చేయలేదే అని ఎంత బాధపడ్డానో తెలుసా? అందుకే రిస్క్ తక్కువ రాబడి ఎక్కువ ఉండే కొన్ని పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాను. అవేంటో మీక్కూడా చెబుతా.. మీరు కూడా మదుపు చేయడం ప్రారంభించండి. 

1.  మంత్లీ ఇన్ కమ్ స్కీమ్(MIS):

MIS అసలు రిస్కే లేని మదుపు పథకంగా చెప్పుకోవచ్చు. పోస్టాఫీసులో ఖాతా తీసుకోవడం ద్వారా ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. వడ్డీరేటు 7.3 %గా ఉంది. అయితే ఇతర పథకాలతో పోలిస్తే రాబడి తక్కువే. అయినప్పటికీ  పోస్టాఫీసు భారత ప్రభుత్వ ఆధీన వ్యవస్థ కావడం వల్ల మన డబ్బు భద్రంగానే ఉంటుందనే గ్యారంటీ ఉంటుంది.

2. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్):

నెలనెలా జీతమందుకొనే ఉద్యోగులు మదుపు చేయడానికి పీపీఎఫ్ అనువుగా ఉంటుంది. పైగా దీనిలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఇతర ప్రయోజనాలను సైతం పొందవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీ కింద పన్ను ప్రయోజనాలను అందుకోవచ్చు. ఈ పథకంలో మదుపు చేసిన మొత్తానికి ప్రస్తుతం 7.6 శాతాన్ని వడ్డీరేటుగా అందిస్తున్నారు. అయితే దీనికి కొన్ని పరిమితులు సైతం ఉన్నాయి. ఈ పథకంలో పెట్టుబడి పెడితే నిర్ణీత కాలవ్యవధి తర్వాత మాత్రమే సొమ్ము వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకు అవసరమైనప్పుడు డబ్బు తీసుకొనే అవకాశం ఉండదు. మరో ఇబ్బంది ఏంటంటే ప్రతి త్రైమాసికానికి ప్రభుత్వం వడ్డీరేట్లు మారుస్తూ ఉంటుంది. మరో విధంగా చెప్పాలంటే.. పీపీఎఫ్ లో పెట్టిన పెట్టుబడి పదవీవిరమణ తర్వాత జీవితానికి ఉపయోగపడుతుంది.

3.  సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్:

రిస్క్ లేని మరో మదుపు పథకం బ్యాంకు ఖాతాలో నిర్దుష్టమైన మొత్తాన్ని పొదుపు చేయడం. ఇది  చాలామందికి ఉండే అలవాటే. ప్రస్తుతం బ్యాంకులు వీటిపై ఆరు నుంచి ఏడు శాతం వరకు వడ్డీని అందిస్తున్నాయి. కానీ సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో మాత్రం మిగిలిన వాటి కంటే కాస్త ఎక్కువ వడ్డీరేటు ఇస్తున్నారు. 12 నుంచి 24 నెలల కాలవ్యవధికి డిపాజిట్ చేస్తే 8.5 శాతం వడ్డీని బ్యాంకు అందిస్తోంది. 24 నుంచి 36 నెలల కాల వ్యవధికి డిపాజిట్ చేస్తే 8.75 శాతం వడ్డీరేటుగా నిర్ణయించారు.

4. కేటీడీఎఫ్ సీ ఫిక్స్ డ్ డిపాజిట్:

కేరళ ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఈ పథకానికి 8.25 శాతం వడ్డీరేటుగా నిర్ణయించారు. ఏడాది నుంచి మూడేళ్ల వరకు ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆన్లైన్ లేదా మధ్యవర్తుల ద్వారా డిపాజిట్ చేయడం కుదరదు. మనమే దరఖాస్తుని నేరుగా కేరళకు కొరియర్ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి మనం పెట్టిన పెట్టుబడికి భరోసా ఉంటుంది.

5. మహీంద్రా ఫైనాన్స్ ఎఫ్ డీ:

33 నుంచి 40 నెలల కాలవ్యవధిలో చేసే ఫిక్స్డ్ డిపాజిట్లకు మహీంద్రా ఫైనాన్స్ అధికంగా 8.75% వడ్డీరేటుని అందిస్తోంది. 15 నెలల కాలవ్యవధికి చేసే ఎఫ్ డీలకు 7.95% వడ్డీ ఇస్తోంది. ఆన్ లైన్లోనే మదుపు చేసుకొనే అవకాశం ఉంది. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన మరో అంశం ఏంటంటే బ్యాంకు ఎంత చిన్నదైతే ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ అంత ఎక్కువగా అంటే.. సుమారు 9.50% వరకు ఇస్తున్నాయి.

మరింకెందుకు ఆలస్యం.. మీకు నచ్చని మదుపు పథకాల్లో మీ డబ్బుని పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయండి.

Read More From Education