Entertainment

చంపడమో.. చావడమో… కాదు.. గెలవడం ముఖ్యం! ‘సైరా నరసింహా రెడ్డి’ ట్రైలర్ అదిరింది

Sandeep Thatla  |  Sep 26, 2019
చంపడమో.. చావడమో… కాదు.. గెలవడం ముఖ్యం! ‘సైరా నరసింహా రెడ్డి’ ట్రైలర్ అదిరింది

(Megastar Chiranjeevi starrer Sye Raa Narasimha Reddy Trailer Talk)

కేవలం ఇంకొక ఆరు రోజులలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహా రెడ్డి’ చిత్రం ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించి అభిమానుల్లో.. అలాగే సాధారణ ప్రేక్షకుల్లో ఇప్పటికే ఎన్నో అంచనాలు ఉండగా.. కొద్దిసేపటి క్రితమే ఆ అంచనాలను పదింతలు చేస్తూ.. మరొక ట్రైలర్‌ని విడుదల చేశారు.

మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ ట్రైలర్ లో.. మీకు ‘సై.. సైరా’ అనిపించే 7 అంశాలు ..!

గత నెలలో రిలీజైన టీజర్.. అలాగే మొన్న 18వ తేదిన విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే . ఈ క్రమంలో ఈరోజు విడుదలైన ట్రైలర్.. ఆ రెండింటిని మించి ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఈ ట్రైలర్‌లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ తన ఉగ్రస్వరూపాన్ని చూపించారు. మరీ ముఖ్యంగా ఆయన టీజర్ చివరలో పలికిన పవర్ ఫుల్ డైలాగ్స్ చూస్తుంటే.. వీటితో కచ్చితంగా థియేటర్స్‌లో అభిమానులు పండగ చేసుకుంటారనే చెప్పవచ్చు. 

‘సైరా’ కొత్త ట్రైలర్ మీకోసం

బ్రిటిష్ వారు అప్పటి మన ప్రజలని ఎలా దోచుకోవాలని ప్రయత్నించారో ఒకవైపు తెలియజేస్తూనే.. మరోవైపు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఈ అన్యాయాలను ఏ విధంగా ప్రతిఘటించాడనే అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుంటూ ఈ ట్రైలర్ సాగింది.

అలాగే ఆనాడు ఆయన ప్రజలని ఎలా ముందుండి నడిపించారు?  వారందరికి మార్గదర్శిగా ఎలా నిలబడ్డారు.. అలాగే  తన చుట్టూ ఉన్న పాలెగాళ్ళని ఎలా ఒక తాటి పైకి తీసుకు వచ్చి.. బ్రిటిష్ వారి పై తిరుగుబాటు చేశారనే విషయాలు.. ఇక్కడ కీలకంగా కనిపిస్తున్నాయి. 

ఈ ట్రైలర్‌లో ప్రధానంగా కెమెరాపనితనం.. అలాగే విజువల్ ఎఫెక్ట్ షాట్స్ చాలా కొత్తగా కనిపించడం విశేషం. పైగా ఆఖరి షాట్‌లో ఆయనని ఉరి తీసే సమయంలో.. కొన్ని వేలమంది ఆయన చుట్టూ ఉన్నట్లు కనిపించే సన్నివేశాలు చిత్రానికే హైలైట్‌గా నిలవనున్నాయి. అదే సమయంలో ఆయన ఉరి కంబం ముందు నిలబడి చెప్పే డైలాగ్ చాలా వైవిధ్యంగా ఉండడం విశేషం – “ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరి లక్ష్యం ఒక్కటే.. స్వాతంత్య్రం! స్వాతంత్య్రం!! స్వాతంత్య్రం!!!” అనే ఈ డైలాగ్ ఈ ట్రైలర్ మొత్తానికి హైలైట్ అని చెప్పాలి.

‘ప్రతి ప్రేమకథ కంచికి చేరదు’ అని తెలిపే.. ‘పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్‌’ల లవ్ స్టోరీ ..!

ఇంతటి పవర్ ఫుల్ డైలాగ్స్‌తో పాటు.. మరి కొన్ని ఆలోచింపజేసే డైలాగ్స్ కూడా ఈ ట్రైలర్‌లో మనకి వినిపిస్తాయి. అవేంటంటే..

‘అది మనది.. మన ఆత్మగౌరవం’

‘గడ్డిపరక కూడా గడ్డ దాట కూడదు’

అలాగే ఈ చిత్రంలో నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న పాత్రలో నటించిన అమితాబ్ బచ్చన్  చెప్పే డైలాగ్ – “చంపడమో .. చావడమో .. ముఖ్యం కాదు!! గెలవడం ముఖ్యం” ఎంతో స్ఫూర్తిని నింపేదిగా ఉంది. సినిమాలో సైతం నరసింహా రెడ్డి పాత్రలో స్ఫూర్తి నింపుతూ.. బ్రిటిష్ వారి పైన తిరుగుబాటు చేసేందుకు సమాయత్తం చేసే వ్యక్తిగా అమితాబ్ బచ్చన్ పాత్రని తీర్చిదిద్దడం విశేషం. ఈ పాత్ర చిత్రంలో చాలా కీలకమని దర్శకులు అంటున్నారు.

ఇక ఈ ట్రైలర్‌లో కనిపించిన మరో అంశం – పోరాటాలు. బ్రిటిష్ సైన్యం పై పోరాటం చేసే సమయంలో.. రకరకాలైన ప్రణాళికలతో దాడి చేసినట్టు మనకు స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఎద్దులతో పోరాటం చేసే.. ఒక సీక్వెన్స్‌ను మనకి ఈ ట్రైలర్‌‌లో చూపెట్టడం జరిగింది. బహుశా ఈ పోరాట సన్నివేశం.. చిత్రంలో ఆకట్టుకునే అంశాలలో ఒకటిగా ఉంటుందని అనుకోవచ్చు. 

చిత్రం విడుదలయ్యే ఆరు రోజుల ముందు.. ఇంతటి ఆసక్తిగొలిపే ట్రైలర్‌ని విడుదల చేయడం ద్వారా ప్రేక్షకులు… అలాగే అభిమానుల్లో మరోసారి ‘ఈ చిత్రం తప్పక విజయం సాధిస్తుంది’ అనే నమ్మకాన్ని పెంచినట్లయింది.

ఈ ట్రైలర్ చూసాక ‘అక్టోబర్ 2’ ఎప్పుడు వస్తుందా అన్న ఆత్రుత.. సగటు సినీ అభిమానిలో మొదలవ్వక మానదు. ఆఖరుగా.. సై .. సైరా నరసింహారెడ్డి.

మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ మేనియాకి ప్రతిరూపమే.. ‘సైరా తాలి’ @ హోటల్ రాజుగారి తోట

Read More From Entertainment