Bigg Boss

“బిగ్‌బాస్ తెలుగు”కి కోర్టు చిక్కులు తొలుగుతాయా? అసలు ఈ సీజన్ ప్రారంభమవుతుందా?

Sandeep Thatla  |  Jul 17, 2019
“బిగ్‌బాస్ తెలుగు”కి  కోర్టు చిక్కులు తొలుగుతాయా? అసలు ఈ సీజన్ ప్రారంభమవుతుందా?

బిగ్‌బాస్ షో (Bigg Boss) గురించి తెలియనివారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే గత రెండు సీజన్లలో ఈ షో అంత పాపులర్ కావడానికి కారణం అందులో పాల్గొన్నవారే. కంటెస్టెంట్స్ మధ్య జరిగిన గొడవలు.. ఆ తరువాత జరిగిన ఫ్యాన్ వార్స్.. ఇలా ఒకటేమిటి.. ఎన్నో అంశాలు ఈ బిగ్‌బాస్ షో తెలుగు ప్రజానీకంలో బాగా ఆదరణ పొందడానికి దోహదపడ్డాయి. 

ఇక మూడు రోజుల్లో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 మొదలుకానుంది. అయితే మొదటి రెండు సీజన్స్‌లో షో మొదలయ్యాక కాని హైప్ రాలేదు! అలాంటిది ఈ సీజన్‌లో అయితే.. ఏకంగా షో మొదలు కాకమునుపే కావాల్సిన దానికన్నా ఎక్కువ హైప్ వచ్చేసింది. దీనికి ప్రధాన కారణం ఈ బిగ్‌బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్స్‌ని ఎంపిక చేసే సమయంలో.. నటి గాయత్రీ గుప్త, జర్నలిస్ట్ శ్వేత రెడ్డితో నిర్వాహకులు అభిషేక్ ముఖర్జీ అభ్యంతరకర రీతిలో ప్రవర్తించారని వార్తలు రావడమే. 

బిగ్ బాస్ పై వచ్చిన.. కాస్టింగ్ కౌచ్ ఆరోపణల్లో నిజమెంత?

రెండు నెలల క్రితమే తమని ఈ సీజన్‌కి సెలెక్ట్ చేశామని చెప్పి సైన్ చేయించుకుని.. ఇప్పుడు షో మొదలయ్యే ముందు తమని ఎంపిక చేయకుండా మోసం చేశారని నటి గాయత్రి గుప్త, జర్నలిస్ట్ శ్వేతారెడ్డి పలు ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో బిగ్‌బాస్ తెలుగు నిర్వాహకుల పై పోలీసు కంప్లైంట్ కూడా ఇచ్చారు.

కాగా తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, తాను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయలేదని.. తను ఒక నిరపరాధినని.. తనపై పెట్టిన కేసుల్ని కొట్టివేయాలని హైకోర్టు‌లో పిటీషన్ వేశారు అభిషేక్ ముఖర్జీ. దీని పైన న్యాయస్థానం తీర్పు వెలువరించాల్సి ఉంది.

ఇవి అన్నీ ఒక ఎత్తయితే, బిగ్ బాస్ తెలుగు సీజన్ 3  ప్రారంభం కాకుండా ఆపమని నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి తెలంగాణ హై కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ షో వల్ల సమాజానికి వచ్చే ఉపయోగం ఏమి లేదని.. పై పెచ్చు హింస, అసభ్యం, దురుసుతనం వంటి వాటిని ఈ షో ప్రోత్సహించేదిలా ఉందని ఆ వ్యాజ్యంలో తెలిపారు. ఆ విధంగా ఇప్పటికే ఈ బిగ్ బాస్ 3 సీజన్ (Big Boss Season 3) నిర్వాహకులపై ఫిర్యాదులు  రిజిస్టర్ కావడంతో.. సగటు టీవీ ప్రేక్షకులందరూ ఈ విషయాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే హైకోర్టు ఈ వ్యాజ్యాన్ని విచారణకి స్వీకరిస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

“బిగ్ బాస్ 3” తెలుగు రియాల్టీ షో.. కంటెస్టంట్స్ వీరేనా..?

ఇంత హడావుడి ఒకపక్కన జరుగుతుంటే.. మరోపక్క ఈ సీజన్‌ కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తి అయ్యింది. వారంతా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయట. ఇక ఈ సీజన్‌కి వ్యాఖ్యాతగా వ్యవహరించబోయే కింగ్ నాగార్జునకి ఒక్కో ఎపిసోడ్‌కి ఇచ్చే రెమ్యునరేషన్ పై కూడా ఊహాగానాలు వస్తున్నాయి. పలు వార్తా కథనాల ప్రకారం, నాగార్జునకి ఒక్కో ఎపిసోడ్‌కి సుమారు 12 లక్షల రూపాయలు చెల్లిస్తారని సమాచారం. దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు.. బిగ్‌బాస్‌కి క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో.

బిగ్‌బాస్ హౌస్ నిర్మాణం ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూర్తవ్వగా, గత సీజన్లతో  పోలిస్తే, ఈ సారి బిగ్‌బాస్ హౌస్‌ని చాలా ఆకర్షణీయంగా నిర్మించారని సమాచారం. దానికి తోడు.. ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే వారిని కూడా చాలా పకడ్బందీగా సెలెక్ట్ చేశారట. విభిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులను క్షుణంగా పరిశీలించి ఈ షోకి ఎంపిక చేసినట్టుగా సమాచారం.

మరి ఈ సారి పాల్గొనబోయే  14 మంది కంటెస్టెంట్స్ ఎవరనేది? ఈ ఆదివారం రాత్రి 9 గంటల తరువాతే తెలియనుంది. చిత్రమేంటంటే.. బిగ్‌బాస్ షోకి సంబంధించి మొదటి రెండు సీజన్స్ మొదలయ్యాక వివాదాలొస్తే, ఈ సారి సీజన్ మొదలుకాక ముందే వివాదాలు మొదలయ్యాయి.

చూద్దాం.. ఈ సీజన్ ఇంకెంత ఆసక్తి రేపనుందో!!

ఫన్నీ ఫ్రెండ్‌షిప్ విషెస్ కోసం క్లిక్ చేయండి

 

 

Read More From Bigg Boss