Bollywood

Saaho Movie Review: ప్రభాస్ “సాహో” చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందా.. లేదా..?

Sandeep Thatla  |  Aug 30, 2019
Saaho Movie Review: ప్రభాస్ “సాహో” చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందా.. లేదా..?

(Saaho Movie Review)

బాహుబలి.. వంటి ఒక లైఫ్ టైం బ్లాక్‌బస్టర్ అందుకున్న ప్రభాస్‌కి ప్రాంతీయ స్థాయి నుంచి ఏకంగా అంతర్జాతీయ స్థాయి వరకు ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అలా తన అంతర్జాతీయ ఫ్యాన్స్ … అలాగే ‘డై-హార్డ్ ఫ్యాన్స్’ కోసం ఒక అంతర్జాతీయ స్థాయి చిత్రాన్ని నిర్మించాలనుకున్నాడో ఏమో కాని… ఆ ఆలోచనల నుండి తెరకెక్కిన సినిమాలా ఉంది ఈ ‘సాహో’ చిత్రం.

* కథ

ఇది ఒక రొటీన్ గ్యాంగ్‌స్టర్ సినిమా. కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్స్ నివసించే వాజీ సిటీలో ఈ సినిమా కథ మొదలవుతుంది.  అండర్‌ వరల్డ్‌ సామ్రాజ్య నేత పృథ్వీ రాజ్‌ (టిను ఆనంద్‌).. తన మాఫియా సామ్రాజ్యానికి కొడుకు దేవరాజ్‌‌ను (ఛంకి పాండే) వారసుడిని చేయాలనుకుంటాడు. కానీ పృథ్వీ రాజ్‌ వద్ద ఒకప్పుడు పనిచేసిన రాయ్ (జాకీ ష్రాఫ్).. రాయ్ గ్రూప్ పేరుతో మరో క్రైమ్ సిండికేట్ నడుపుతుంటాడు.

దీంతో రాయ్ మీద పృథ్వీ రాజ్‌ పగ పెంచుకుంటాడు. ఇదే క్రమంలో రాయ్ ముంబయిలో అనుమానాస్పద రీతిలో చనిపోతాడు. అలాగే రూ.2 లక్షల కోట్ల రూపాయలతో ముంబయి చేరుకున్న రాయ్ షిప్ కూలిపోతుంది. ఈ కేసును ఛేదించడానికి అండర్ కవర్ కాప్‌గా అశోక్ చక్రవర్తి (ప్రభాస్) సీన్‌లోకి ఎంటర్ అవుతాడు. క్రై‌మ్‌ బ్రాంచ్‌కు చెందిన అమృతా నాయర్‌ (శ్రద్ధ కపూర్‌)తో కలసి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. మరి అందులో ఆయన కృతకృత్యుడవుతాడా.. లేదా అన్నది చిత్ర కథ. 

ప్రభాస్ ‘సాహో’లో.. మీరు చూడాలనుకునే ‘7’ అంశాలు ఇవేనా!

ఇక సినిమా విడుదలకి ముందు చెప్పినట్టుగానే.. ఈ చిత్రం మొత్తం భారీతనంతో నిండి ఉంది. అయితే సినిమా నిర్మాణంలో కనిపించిన భారీతనం… కథ & కథనంలో లోపించింది. ఆ విషయం మనం ఈ చిత్రం చూస్తే తెలిసిపోతుంది. అయితే సినిమాలో మనకి కనిపించే యాక్షన్ సన్నివేశాలు చాలా బాగున్నప్పటికి… ఆయా సన్నివేశాలకి లీడ్‌గా వచ్చే సందర్భాల్లో ఉండాల్సినంత బలం లేకపోవడంతో.. మనం వాటిని ఎంజాయ్ చేయాల్సినంతగా చేయలేము.

ప్రేక్షకుల భారీ అంచనాలు, ఊహాగానాల మధ్య ఈ రోజు ఘనంగా విడుదలైందీ చిత్రం. ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి మూడు భాషల్లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి ఓ వైపు హిట్ టాక్ సంపాదించుకున్నప్పటికీ.. మరోవైపు కాస్త నెగెటివ్ టాక్ కూడా వినిపిస్తోంది. ఫలితంగా కొందరు అభిమానులు నిరుత్సాహానికి లోనయ్యారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి, సాహో (Saaho) చిత్రం గురించి వినిపిస్తోన్న ఈ టాక్ వెనుక గల ప్రధాన కారణాలేంటో ఓసారి చూద్దాం రండి..

 

1. నేటివిటీ

ప్రభాస్‌కి (Prabhas) జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన గుర్తింపును దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని మూడు భాషల్లో నిర్మించారు. అలాగే మరో రెండు భాషల్లోకి డబ్బింగ్ కూడా చేశారు. అయితే దాదాపు తెలుగుతో కలిపి ఇతర చిత్రసీమల మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకుని.. ఆయా పరిశ్రమలకి చెందిన నటులని సినిమాలో పలు పాత్రల కోసం ఎంపిక చేసుకుందీ చిత్రయూనిట్. ఫలితంగా ఈ చిత్రంలో దాదాపు అన్ని పరిశ్రమలకి చెందిన నటీనటులూ కనిపిస్తారు. కానీ ఏ ఒక్క ప్రాంతానికి చెందిన నేటివిటీ కూడా లేకుండా పోయింది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు చూస్తే.. డబ్బింగ్ తాలూకా ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి. ఫలితంగా సినిమాను చూసే సగటు ప్రేక్షకుడు కూడా నేటివిటీ ఫీలింగ్‌ని కోల్పోయాడనే చెప్పాలి.

2. కథనం

సాధారణంగా కథ అనేది సింగిల్ లైన్‌లో ఉన్నప్పుడు.. దానిని ప్రేక్షకులకి ఒక చిత్రంలా చూపించాలంటే  ఉండాల్సింది బలమైన కథనం. పైగా ఇటువంటి యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌లో.. కథనం బాగుంటేనే ప్రేక్షకులు సినిమాకి కనెక్ట్ అవుతారు. ఈ చిత్రంలో ప్రధాన లోపం కథనమే. దర్శకుడిగా వ్యవహరించడం మాత్రమే కాకుండా.. ఈ చిత్రానికి కథ-కథనం అందించిన సుజీత్ … యాక్షన్ & ట్విస్ట్‌లపై పెట్టిన సమయం.. కాస్త కథనంపై కూడా పెట్టి ఉంటే బాగుండేది. అప్పుడు ఈ చిత్రం ఫలితం మరో విధంగా ఉండి ఉండేది.

3. పాటలు

బాలీవుడ్ స్టైల్‌లో ఒక్కో పాటకి ఒక్కో సంగీత దర్శకుడు అనే ఫార్ములాని ఈ చిత్రానికి ఫాలో అయ్యారు. అయితే ఒక్కో పాట ఒక్కో సంగీత దర్శకుడి ఇచ్చినా ఏం ఫర్వాలేదు కానీ… అవి ఈ సినిమాకి సరిపోయే విధంగా ఉండేలా కూడా చూసుకోవాల్సింది. ఉన్న నాలుగు పాటల్లో రెండు పాటలు అర్థరహితంగానే ఉంటాయి. వాటిలో మనకు ఎలాంటి సాహిత్యమూ లేదు. మరో రెండు పాటలు ఫర్వాలేదనిపించాయి. కాకపోతే నేపధ్య సంగీతం అందించిన జిబ్రాన్ మాత్రం మంచి అవుట్‌పుట్ ఇవ్వగలిగాడు.

ప్రభాస్ డై – హార్డ్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చేలా సాగే సాహో టీజర్ మీకోసం..

4. ఎంటర్టైన్మెంట్

యాక్షన్ ఎంటర్ టైనర్ అన్నప్పుడు… యాక్షన్.. ఎంటర్‌టైన్‌మెంట్.. ఈ రెండు అంశాల పైన దృష్టిపెట్టాలి. అటువంటిది కేవలం యాక్షన్ పైన దృష్టి పెట్టి.. వినోదం సంగతి గాలికి వదిలేస్తే.. అది సాహో చిత్రంలా ఉంటుంది. ఎందుకంటే సినిమాలో సింహ భాగం యాక్షన్ సన్నివేశాలు ఉన్నప్పుడు వాటి ముందు & ఆ తరువాత వచ్చే సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలి. అలా కాకుండా సన్నివేశాలు చాలా పేలవంగా ఉంటే.. తరువాత వచ్చే యాక్షన్ సన్నివేశాల పైన కూడా ఆ ప్రభావం ఉంటుంది.

5. సినిమా నిడివి

ఇక ఈ సాహో చిత్రానికి మరో ప్రధాన అడ్డంకిగా నిలిచింది సినిమా నిడివి. దాదాపు తొమ్మిది నిమిషాలు తక్కువ 3 గంటలు ఉన్న ఈ చిత్రం.. ప్రేక్షకుల సహనానికి అప్పుడప్పుడూ పరీక్ష పెడుతుంది. సినిమాలో రైటింగ్ పార్ట్ (ట్విస్ట్‌లని మినహాయించి) యావరేజ్‌గా ఉండడంతో.. ప్రేక్షకులు థియేటర్‌లో అంతసేపు కూర్చోవడానికి ఆసక్తి చూపరు. కేవలం ఇంటర్వెల్, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టుల కోసం థియేటర్‌లో దాదాపు 3 గంటల పాటు సహనంగా ఎంతమంది ఉండగలరు అనేది ప్రశ్న.

పైన పేర్కొన్న ఈ అయిదు అంశాలు.. ప్రేక్షకుల అంచనాలని సాహో చిత్రం అందుకోకుండా చేశాయి. వీటిని కాస్త పక్కకు పెట్టి చూస్తే, రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సాహో చిత్రాన్ని అంతా తానై నడిపించిన తీరు భేష్. అలాగే ఈ సినిమా కోసం అనేక స్టంట్స్ కూడా చేశాడు. అవి వెండితెరపై చూసి తీరాల్సిందే..

అలాగే UV క్రియేషన్స్ నిర్మాతలైన వంశీ – ప్రమోద్‌లు ఈ చిత్రానికి పెట్టిన భారీ ఖర్చుని ఎక్కడా కూడా తగ్గకుండా తెర పైన భారీతనం ఉట్టిపడేలా ప్రేక్షకులకి చూపించాడు ఛాయాగ్రహకుడ. ఇక యాక్షన్ సన్నివేశాలే ప్రధానంగా సాగిన ఈ చిత్రంలో స్టంట్ డైరెక్టర్స్‌గా కెన్నీ బేట్స్, రామ్ లక్ష్మణ్ , స్టంట్ శివలు చూపిన పనితనం హైలైట్‌గా నిలిచాయి.

ఆఖరుగా… సాహో చిత్రం ప్రేక్షకులు అంచనాలను.. అనుకున్న స్థాయిలో అందుకోలేకపోయింది.

సాహో లో .. స్టైలిష్‌గా ఉన్న ప్రభాస్..!

Read More From Bollywood