Lifestyle

వామ్మో.. ఇలాంటి రెస్టారెంట్లు కూడా ఉంటాయా?

Lakshmi Sudha  |  Apr 24, 2019
వామ్మో.. ఇలాంటి రెస్టారెంట్లు కూడా ఉంటాయా?

సాధారణంగా మనం హోటల్స్‌కి ఎందుకెళుతుంటాం? నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసి సుష్టుగా భోజనం చేయడానికి. కానీ కొన్ని రకాల హోటల్స్ ఉంటాయి. అక్కడ ఫుడ్ తినడం కంటే.. ఆ హోటల్ థీమ్ చూసి ఎంజాయ్ చేయడానికి వెళుతుంటాం. అక్కడి ఇంటీరియర్, మెను, వడ్డించే విధానం కాస్త డిఫరెంట్‌గా ఉంటే చాలు అక్కడికి క్యూలు కడుతుంటారు భోజనప్రియులు.

అయితే ఇలా భిన్నమైన థీమ్స్‌తో ఉన్న కొన్ని హోటల్స్ చాలా పాపులర్ అయ్యాయి. అందులో కొన్ని వావ్ అనేలా ఉంటే.. మరికొన్ని మాత్రం బాబోయ్ అనేలా ఉన్నాయి. అలాంటి సూపర్ డిఫరెంట్ థీమ్డ్ రెస్టారెంట్ల (Weird restaurants) గురించి ఇప్పుడు తెలుసుకొందాం..

1. సేఫ్ హౌస్ – మిల్వాకీ, విస్కాన్సిన్

Source: Safe House

థీమ్డ్ రెస్టారెంట్స్ అంటే ఏంటో కనీస అవగాహన కూడా లేని రోజుల్లో ఈ సేఫ్ హౌస్ రెస్టరెంట్‌ను ప్రారంభించారు. 1966లో మొదలైన ఈ రెస్టరెంట్ బయటి నుంచి చూడటానికి చాలా సింపుల్‌గా కనిపిస్తుంది కానీ.. లోపలికి వెళితేనే ఉంటుంది అసలు కథ. ఇది స్పై థీమ్డ్ రెస్టారెంట్.

గూడఛర్యం కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ రెస్టారెంట్లో ఫర్నిచర్, ఇంటీరియర్ సైతం దానికి తగినట్టుగానే ఉంటుంది. గూఢచర్యం నేపథ్యంలో తెరకెక్కిన కొన్ని చిత్రాల ఆధారంగా ఈ రెస్టరెంట్‌కు రూపకల్పన చేశారు.

2. మోడ్రన్ టాయిలెట్, తైపీ సిటీ, తైవాన్ ప్రావిన్స్, చైనా

Source: Lifestylehappens

ఈ టాయిలెట్ రెస్టారెంట్ చైనాలో బాగా హిట్టయింది. ఈ హోటల్లో మనం టాయిలెట్ కమోడ్ మీదే కూర్చోవాలి. కమోడ్‌లోనే తినాలి.

అంటే మనకు ఆహారాన్ని చిన్నసైజ్‌లో ఉన్న షిట్ పాట్‌లో వడ్డిస్తారన్నమాట. చాలా అసహ్యంగా అనిపిస్తుంది కదా.. అయినా సరే ఈ రెస్టారెంట్‌కి మేం వెళతాం అనేవారు కూడా ఎక్కువగానే ఉన్నారు.

3. క్యాబెజెస్ అండ్ కండోమ్స్ – బ్యాంకాక్, థాయ్ ల్యాండ్

Source: Cabbages and Condoms

సురక్షితమైన శృంగారాన్ని ప్రోత్సహించే విధంగా ఈ రెస్టారెంట్ థీమ్ ఉంటుంది. ఈ రెస్టారెంట్లో ఏర్పాటు చేసిన బొమ్మలకు కండోమ్స్‌తో రూపొందించిన వస్త్రాలను అలంకరిస్తారు.

సీలింగ్‌కి సైతం విభిన్న ఆకారాల్లో కండోమ్స్‌ను వేలాడదీసారు. ఇక ఆహారం విషయానికి వస్తే.. కంగారు పడకండి… మామూలుగానే.. ప్లేట్లలోనే వడ్డిస్తారు.

4. నింజా న్యూయార్క్ – న్యూయార్క్

Source: Trip Adviser

నింజా సినిమాలను చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడుతుంటారు. మెరుపులాంటి వేగం, చిత్ర విచిత్రమైన స్టంట్స్ చేసే నింజాలను ఇష్టపడనివారెవరైనా ఉంటారా? మరి అలాంటి నింజాలే మనకు ఆహారం సర్వ్ చేస్తే..? చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది కదా..!

ఆ అనుభూతి పొందాలంటే న్యూయార్క్‌లోని నింజా న్యూయార్క్ రెస్టారెంట్‌కి వెళ్లాల్సిందే. అక్కడ నింజాలు ఎటు నుంచి వస్తారో మనకు తెలియదు. అచ్చం సినిమాలో మాదిరిగా ఒక్కసారిగా మన ముందుకు వచ్చి మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శిస్తూ మనకు ఆహారం వడ్డిస్తారు.

5. న్యూ లక్కీ రెస్టారెంట్ – అహ్మదాబాద్

Source: Amazing India

అహ్మదాబాద్‌లో ఉన్న ఈ రెస్టారెంట్ చిన్నదే అయిన చాలా ఫేమస్. ఎందుకంటే దీన్ని శ్మశానవాటికపై నిర్మించారు. దీన్ని నిర్మించి దాదాపు 50 ఏళ్లవుతోంది.

రెస్టారెంట్ నిర్మించే సమయంలో యజమాని కృష్ణ‌న్‌ కుట్టికి సమాధులను కూలగొట్టడం అసలు ఇష్టం లేదట. అందుకే సమాధులను అలాగే వదిలేసి వాటి చుట్టూ టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఈ శ్మశానం తనకు అదృష్టాన్నిచ్చింద‌ని కృష్ణ‌న్ న‌మ్ముతారు.

6. హార్ట్ ఎటాక్ గ్రిల్ – లాస్ ఏంజెల్స్, నెవాడా

Source: Fiscal Times

ఈ రెస్టారెంట్లో వడ్డించే వంటకాలు నిజంగానే హార్ట్ ఎటాక్ తెప్పించేవిగా ఉంటాయి. ఇక్కడి ఆహారంలో కొవ్వులు, చక్కెర ఇలా మన ఆరోగ్యాన్ని నాశనం చేసేవి చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు.

ఈ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లో ఫుడ్ సర్వ్ చేసేవారు డాక్టర్లు, నర్సుల గెటప్లో మనకు ఆహారం అందిస్తారు.

7. డిన్నర్ ఇన్ ది స్కై – 45 కంట్రీస్

Source: Dinner in the sky

బెల్జియంకు చెందిన ఈ రెస్టారెంట్ సంస్థ సుమారుగా 45 దేశాల్లో ఈ సేవలను అందిస్తోంది.  పేరుకి తగినట్టుగానే ఉంటుంది. క్రేన్ సాయంతో డిన్నర్ టేబుల్‌ను గాలిలో 150 మీటర్ల ఎత్తులో వేలాడదీస్తారు. అక్కడే మనం ఆహారం తినాల్సి ఉంటుంది. గాలిలో వేలాడుతున్న టేబుల్ ముందు కూర్చొని భోజనం చేయడమంటే డిఫరెంట్ ఎక్స్పీరియెన్స్ కదా.

అందుకే అందరూ డిన్నర్ ఇన్ ది స్కై అనుభవంలోకి తెచ్చుకోవడానికి క్యూ కడుతున్నారు. ఈ రెస్టారెంట్లో భోజనం చేయాలంటే డిన్నర్ ఇన్ ది స్కై వెబ్ సైట్‌కి వెళ్లి ముందుగానే రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఆకాశంలో డిన్నర్ చేసే సదుపాయం మనదేశంలో కూడా ఉంది.

8.  డైలాగ్ ఇన్ ది డార్క్ – హైదరాబాద్, చెన్నై

Source: Dialogue In The Dark

హైదరాబాద్‌కి చెందినవారికి ఈ రెస్టారెంట్ గురించి అవగాహన ఉండే ఉంటుంది. ఈ రెస్టారెంట్లో మనకు ఫుడ్ అందించేవారు అంధులు. వారికి ఉపాధి కల్పించడం కోసమే దీన్ని ఏర్పాటు చేశారు.

ఈ రెస్టారెంట్లో చిమ్మచీకటి అలముకొని ఉంటుంది. మన చేతులను సైతం మనం చూసుకోలేం. కానీ మనకు ఆహారం వడ్డించేవారు మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా వడ్డిస్తారు. అసలు అదెలా ఉంటుందో చూడాలంటే.. వీకెండ్స్‌లో ఓ సారి ఈ రెస్టారెంటుకు వెళ్లాల్సిందే.

9. టాకింగ్ హ్యాండ్స్ రెస్టారెంట్ – హైదరాబాద్

Source: Talking Hands

హైదరాబాద్‌లో ఉన్నఈ రెస్టారెంట్‌ను డెఫ్ ఎనేబుల్డ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తోంది. ఇక్కడ పనిచేసేవారంతా దాదాపుగా చెవిటి, మూగవారే. వీరికి ఉపాధి కల్పించడం కోసమే దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆర్డర్ చేయాలంటే సైగల భాషనే ఉపయోగించాల్సి ఉంటుంది.

ఎందుకంటే మన మాట వారికి వినిపించదు కాబట్టి. ఇక్కడ ఉండే మెనులో దానికి తగిన సూచనలుంటాయి. రెస్టారెంట్లోని గోడల మీద సైతం అలాంటి సూచనలుంటాయి. బేగంపేటలో ఉన్నఈ రెస్టారెంట్లో రుచికరమైన భోజనంతో పాటు విభిన్నమైన అనుభవం సైతం మన సొంతమవుతుంది.

ఇవి కూడా చదవండి

పోస్ట‌ర్ల‌తోనే ఆసక్తి రేపుతోన్న బ్రోచేవారెవరురా సినిమా టీం..!

ఈ హోట‌ల్స్ పేర్లు విభిన్నం.. కానీ రుచి మాత్రం అద్భుతం..!

ఈ సమ్మర్ అడ్వెంచర్ డెస్టినేషన్స్.. మీకోసం ఎదురుచూస్తున్నాయి..

Read More From Lifestyle