Family

పెళ్లైన వారి కంటే.. సింగిల్‌గా ఉండేవారే ఎక్కువ కాలం ఆనందంగా జీవిస్తారట.. ఎందుకో తెలుసా?

Soujanya Gangam  |  Jun 4, 2019
పెళ్లైన వారి కంటే.. సింగిల్‌గా ఉండేవారే ఎక్కువ కాలం ఆనందంగా జీవిస్తారట.. ఎందుకో తెలుసా?

మన దేశంలో 25 ఏళ్లు నిండినా.. అమ్మాయి పెళ్లి (marriage) చేసుకోలేదంటే తనలో ఏదో లోపం ఉందన్నట్లుగా చూస్తుంటారు. అందుకే తల్లిదండ్రులు తమ కుమార్తెలు చదువు పూర్తి చేసుకున్నప్పటి నుంచే.. సంబంధాల కోసం వెతుకుతూ ఉంటారు. ఇంకొందరికైతే చదువు పూర్తి కాకముందే పెళ్లి కూడా చేసేస్తారు.

25 ఏళ్ల తర్వాత ఇంకా మీరు సింగిల్‌గానే ఉంటే మీ బంధువులు, తెలిసినవాళ్లు.. ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకోమని సతాయిస్తారు. ఫలానా అబ్బాయి ఉన్నాడని.. ఒకసారి కలిసి మాట్లాడమని మీకు సలహాలు ఇస్తూనే ఉంటారు. అయితే మీకో సంగతి తెలుసా? పెళ్లి చేసుకున్న వారి (Married) కంటే సింగిల్‌గా (Single) ఉన్నవారే ఎక్కువ ఆనందంగా ఉంటారట. అలాగే తమ జీవితాన్ని చివర వరకూ కొనసాగిస్తారట. ఈ విషయం తాజాగా జరిగిన ఓ పరిశోధనలో తేలిందట.

అవును.. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌కి చెందిన బిహేవియరల్ సైన్స్ ప్రొఫెసర్ పౌల్ డోలన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన తను రాసిన హ్యాపీ ఎవర్ ఆఫ్టర్ : ఎస్కేపింగ్ ద మిత్స్ ఆఫ్ ద పర్ఫెక్ట్ లైఫ్ అనే పుస్తకంలో పెళ్లికి సంబంధించిన అపోహల గురించి.. పెళ్లి, ఆ తర్వాత జీవితం మహిళలపై చూపించే ప్రభావం గురించి చెప్పుకొచ్చారు. తాజాగా వేల్స్‌లో ని ఓ పుస్తక ప్రదర్శనలో పాల్గొన్న ఆయన ఈ విషయంపై తన అభిప్రాయాన్ని కూడా పంచుకున్నారు.

పెళ్లైన వ్యక్తులు ఆనందంగా ఉండాలంటే తమ భాగస్వామి కూడా అదే గదిలో ఉండి తమతో మాట్లాడుతూ ఉండాలని.. అలా జరగకపోతే వారిలో ఆనందం అనేది ఉండదని చెప్పారు. పెళ్లైన వారు ఇతరులతో పోల్చితే ఆనందంగా ఉన్నారు. కానీ తమ భాగస్వామి కూడా తమతో పాటు ఉన్నప్పుడు మాత్రమే వారు ఆనందాన్ని ఫీలవ్వగలిగారు. తమ భాగస్వామి తమ గదిలో లేకపోతే వారు ఏదో కోల్పోయినట్లుగా.. చాలా బాధగా ఫీలయ్యారట.

అయితే ఈ బాధ కేవలం ఆడవారి విషయంలోనే ఉందని చెప్పిన ఆయన.. ఓ చక్కటి సలహా కూడా ఇచ్చారు. “మగవారు పెళ్లి చేసుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉన్నారు. కాబట్టి వారికి వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోమని నేను సలహా ఇస్తాను. అదే పెళ్లయిన ఆడవారు మాత్రం ఆనందాన్ని కోల్పోతున్నారు. అందుకే ఆడవారికి మాత్రం నేను పెళ్లి చేసుకోవద్దని సలహా ఇస్తాను” అని చెప్పారు.

పెళ్లయిన ఆడవారి గ్రూప్‌ని పరిశీలించిన ఆయన.. అదే వయసులో ఉండి పెళ్లి కాని వారినీ పరిశీలించి కేస్ స్టడీ చేశారు. ఆ స్టడీలో ఆయన వివాహితులైన మహిళలు, వివాహం కాని మహిళలతో పోలిస్తే.. ఎక్కువ అనారోగ్యంతో బాధపడుతూ ఉండడం మాత్రమే కాదు.. ఆనందంగా కూడా లేరని చెప్పుకొచ్చారు. కానీ పెళ్లయిన మగవారు దీనికి భిన్నంగా ఎంతో ఆనందంగా ఉన్నారట. దీనికి ఆయన కారణం కూడా చెప్పుకొచ్చారు.

మగవారికి పెళ్లయితే వారి బాధ్యతలు తగ్గుతాయి. చాలా తక్కువ రిస్కులు తీసుకుంటారు. ఆఫీస్‌లోనూ అనుభవంతో పాటు ఎక్కువ సంపాదించే వీలుంటుంది. ఇవన్నీ ఆనందాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఆనందంగా కాస్త ఎక్కువ సమయం జీవించే వీలుంటుంది.

కానీ మహిళలు మాత్రం పెళ్లి చేసుకుంటే.. అటు ఇల్లు, పిల్లలతో పాటు వర్కింగ్ వుమన్ అయితే ఆఫీస్ బాధ్యతలు కూడా నిర్వహించాలి. కానీ గర్భం ధరించడం, పిల్లలు వంటి కారణాల వల్ల వారు కెరీర్‌లో ముందుకు వెళ్లలేరు. జీతంలోనూ తేడా ఉంటుంది. కాబట్టి వారు అసంతృప్తితో జీవిస్తారు. అందుకే ప్రపంచంలోనే ఆనందకరమైన వాళ్లెవరంటే పెళ్లి చేసుకోని అమ్మాయిలే.. అని ఆయన చెబుతారు.

ఈ కారణాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని “అమ్మాయిలు ఫలానా వయసుకి తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాలి” అంటూ సమాజంలో ఉన్న ఆలోచనను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. అమ్మాయిలు పెళ్లి చేసుకోకుండా ఉండడం తప్పు కాదని.. ఇలా చేయడం వల్ల వారు ఆనందంగా ఉంటున్నారు కాబట్టి వారు చేసే పని సరైనదేనని భావించాలి.

అందుకే నలభై ఏళ్ల వయసులో ఇంకా పెళ్లి చేసుకోకుండా ఎవరైనా మీకు కనిపిస్తే అది చాలా తప్పని.. ఇప్పటికైనా మంచి వ్యక్తి తన జీవితంలోకి రావాలని విష్ చేయడం కంటే.. తను జీవితంలో ఆనందంగా ఉండాలని విష్ చేయడం మంచిదట. ఎందుకంటే పెళ్లి చేసుకున్న వ్యక్తి ఆమెను జీవితంలో ఆనందంగా, ఆరోగ్యంగా ఉండకుండా చేసే వీలుంటుందట. ఈ విషయాన్నింటినీ ఆయన తన పుస్తకంలోనూ రాశారట. మరి, మీరూ ఈ పుస్తకాన్ని ఒకటి కొని మీ పెళ్లి గురించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న బంధువులకు అందించండి.

ఇవి కూడా చదవండి.

స్వలింగ బంధంలో ఉన్నా.. ఆ అమ్మాయినే పెళ్లాడి జీవితంలో స్థిరపడతా: ద్యుతీ చంద్

ఈ లక్షణాలుంటే మీ బాయ్ ఫ్రెండ్.. మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నట్లే..!

పెళ్లి తర్వాత.. మీరు బరువు ఎందుకు పెరుగుతారో తెలుసా?

Images : Giphy

Read More From Family