మహిళా ప్రాధాన్య చిత్రాలు అనగానే ఠక్కున గుర్తుకొచ్చే సినిమాల్లో క్వీన్ (Queen) కూడా ఒకటి. బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ కంగనా రనౌత్ (Kangana Ranaut) ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్‌ని ఎంతగా షేక్ చేసిందో మనందరికీ తెలిసిన విషయమే! 2014లో విడుదలైన ఈ సినిమా కంగనకు ఉత్తమ కథానాయికగా జాతీయ అవార్డుని అందించడం మాత్రమే కాదు.. ప్రాంతీయ ఉత్తమ చిత్రంగానూ కితాబు అందుకుంది. అంతేనా.. 6 ఫిలింఫేర్ అవార్డులను సైతం తన ఖాతాలో వేసుకొని చక్కటి వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ క్వీన్ అని కూడా అనిపించుకుంది.
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు వికాస్ బేల్ ఈ చిత్రాన్ని రూపొందించడం ఒక ఎత్తైతే; కంగన తన రాణీ మెహ్రా పాత్రకు ప్రాణం పోసిన తీరు మరొక ఎత్తని చెప్పచ్చు. అమాయకురాలిగా, ఆత్మవిశ్వాసం తక్కువ ఉన్న అమ్మాయిగా విదేశాల్లో అడుగుపెట్టి అక్కడ తను నడుచుకున్న తీరు, ఎదుర్కొన్న సందర్భాలు.. ఇవన్నీ ప్రేక్షకుల్లో బాగా ఆసక్తిని రేకెత్తించాయి. ఒక్కమాటలో చెప్పాలంటే స్త్రీ స్వేచ్ఛను ప్రధానాంశంగా చేసుకొని రూపొందించిన చిత్రం ఇది.
ఈ చిత్రం కథ విషయానికొస్తే పెళ్లికి సరిగ్గా ఒక్క రోజు ముందు కాబోయే వరుడు వివాహం చేసుకునేందుకు తిరస్కరించడంతో ఒక రోజంతా గదిలోనే ఉండిపోతుంది వధువు. ఆ తర్వాత బయటకు వచ్చి.. పెళ్లి తర్వాత భర్తతో కలిసి వెళ్లాలని అనుకున్న హనీమూన్‌కి తన తల్లిదండ్రులను ఒప్పించి తానొక్కతే బయల్దేరుతుంది. అక్కడకు వెళ్లి తాను ఏం చేసింది, ఆ తర్వాత తన జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయన్నదే ఈ చిత్ర కథ. సాధారణ ఆడపిల్లల మనస్తత్వాలకు చేరువగా ఉన్న కథ కాబట్టే ప్రేక్షకుల మనసులనే కాదు.. బాక్సాఫీస్‌ని సైతం తన కలెక్షన్స్‌తో చక్కగా మురిపించింది.
ఇంతటి ఘన విజయాన్ని సాధించిన ఈ చిత్రాన్ని దక్షిణాదిలో నాలుగు భాషల్లో రీమేక్ చేయడం ప్రారంభించారు పలువురు దర్శక, నిర్మాతలు. తెలుగులో దటీజ్ మహాలక్ష్మి (That Is Mahalakshmi), తమిళంలో ప్యారిస్ ప్యారిస్ (Paris Paris), మలయాళంలో జామ్ జామ్ (Zam Zam) & కన్నడలో బటర్ ఫ్లై (Butterfly) పేర్లతో ఆ చిత్రాలను రూపొందించారు. ఈ నాలుగు సినిమాలు త్వరలోనే ఆయా భాషలలో విడుదల కానున్నాయి. ఈ నాలుగు చిత్రాలలోనూ నలుగురు వేర్వేరు నటీమణులు టైటిల్ రోల్‌ని పోషించారు. కన్నడలో పారుల్ యాదవ్ (Parul Yadav), తమిళంలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), మలయాళంలో మంజిమ మోహన్ (Manjima Mohan) & తెలుగులో తమన్నాలు (Tamannaah)నటించారు.
మిగతా చిత్రాల విషయం కాసేపు పక్కన పెట్టి, దటీజ్ మహాలక్ష్మి సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా చెప్పుకోవాల్సింది తమన్నా గురించే! సుకుమార్ దర్శకత్వంలో ఆమె నటించిన 100% లవ్ చిత్రంలో దటీజ్ మహాలక్ష్మి అంటూ సాగే ఓ పాటని తమన్నా పై స్పెషల్‌గా చిత్రీకరించారు. అంతేకాదు.. ఇందులో మహాలక్ష్మి పాత్రలో నటించిన తమన్నా సందర్భోచితంగా దటీజ్ మహాలక్ష్మి అనే పదాన్ని చాలాసార్లు అంటుంటుంది. ఇప్పుడు అదే టైటిల్‌తో తెలుగు క్వీన్ రీమేక్ తెరకెక్కుతుండడం, కథానాయికగా తమన్నా నటిస్తుండడంతో ఈ సినిమాపై చాలానే అంచనాలు ఏర్పడ్డాయి. వీటికి తోడు ఇప్పటి వరకు విడుదలైన దటీజ్ మహాలక్ష్మి ప్రచార చిత్రాల్లో తమన్నా తన చక్కని నటప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో అందరూ ఈ సినిమా ఎప్పుడెప్పడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది (Amit Trivedi) ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చగా ‘అ’ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ దటీజ్ మహాలక్ష్మి చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇక తమన్నా విషయానికొస్తే ఈ సంక్రాంతికి విడుదలైన F2 చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకుని ఈ ఏడాదిని సక్సెస్‌ఫుల్‌గా మొదలుపెట్టింది. ఎప్పటిలానే అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించి మంచి మార్కులు సంపాదించుకుంది.
ఈ క్రమంలో హిందీలో ఎంతోమంది మనసులను కొల్లగొట్టిన క్వీన్‌కు రీమేక్‌గా రూపొందుతున్న దటీజ్ మహాలక్ష్మితో తమన్నా టాలీవుడ్ ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకోనుందో తెలియాలంటే ఇంకొద్ది రోజులు వేచి చూడాల్సిందే!
ఇవి కూడా చదవండి
“లక్ష్మీస్ ఎన్టీఆర్” హీరోయిన్ యజ్ఞ శెట్టి గురించి.. ఎవరికీ తెలియని విషయాలివే..!
సోషల్ మీడియాలో #10YearChallengeకి సై అంటోన్న సెలబ్రిటీలు..!
2019 సంవత్సరంలో పెళ్లి పీటలెక్కనున్న హీరో-హీరోయిన్స్ వీరేనా!
Read More From Entertainment
సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పక్కన.. ఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ పూజా హెగ్డే
Sandeep Thatla