Food & Nightlife

హైదరాబాద్ నగరవాసులను విశేషంగా అలరిస్తోన్న తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ 2019..

Sandeep Thatla  |  Jun 2, 2019
హైదరాబాద్ నగరవాసులను విశేషంగా అలరిస్తోన్న తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ 2019..

తెలంగాణ (Telangana) రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏటా హైదరాబాద్ నగరంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ (Telangana Food Festival)… ఈ సంవత్సరం కూడా నగరవాసులను అలరించేందుకు సిద్ధమైపోయింది. ఈ ఫెస్టివల్ లో భాగంగా ప్రతి సంవత్సరంలానే ఈ ఏడాది కూడా నెక్లెస్ రోడ్డు (Necklace Road) వద్ద ఉన్న పీపుల్స్ ప్లాజా (Peoples Plaza)లో తెలంగాణ రాష్ట్ర సంప్రదాయ వంటకాలను రుచికరంగా ఆహూతులకు అందిస్తున్నారు.

గత నాలుగు సంవత్సరాలుగా ఈ ఫుడ్ ఫెస్టివల్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో లభ్యమయ్యే సంప్రదాయ వంటకాలతో పాటు ఇక్కడి సంస్కృతిని సైతం ప్రతిబింబిస్తూ దాని గురించి అందరికీ తెలియజేసేందుకు ప్రయత్నిస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర సంప్రదాయ రుచులతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి కొత్త రకం వంటకాలతో ఇక్కడకు వచ్చి మహిళలు కూడా ఈ ప్రదర్శనలో భాగం కావడం విశేషం.

ఎప్పటిలానే ఈ ఏడాది కూడా మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఫుడ్ ఫెస్టివల్ జూన్ 1న ఘనంగా ప్రారంభమైంది. జూన్ 3 వరకు నిర్వహించనున్న ఈ ప్రదర్శనకు నగరవాసుల నుంచి మంచి స్పందన కూడా లభిస్తోంది. గత నాలుగేళ్లుగా క్రమం తప్పకుండా నిర్వహిస్తోన్న కారణంగా ఫుడ్ లవర్స్ ఈ ఫెస్టివల్ కోసం ఏటా ఎదురుచూస్తుండడం పరిపాటిగా మారిపోయింది.

ఈ క్రమంలో ఈ ఫుడ్ ఫెస్టివల్ ని ప్రారంభించిన కొద్ది సమయంలోనే నగర వాసులు దీనిని సందర్శించడం, ఇక్కడ ఏర్పాటు చేసిన ఆహార పదార్థాలను రుచి చూసేందుకు ఆసక్తి చూపడం.. చకచకా మొదలైపోయాయి. మరి, ఇక్కడ సందర్శకులను ఆకర్షిస్తోన్న కొన్ని రుచికరమైన వంటకాలేంటంటే..

పిండి వంటకాలు –

* సకినాలు

* మురుకులు

* సర్వపిండి

* చెక్క గారెలు

* పల్లీ చెక్కలు

* బూందీ

* లడ్డు

 ఇవే కాదు.. ఇలాంటి ఎన్నో రకాల రుచికరమైన పిండివంటలు మనం ఇక్కడ రుచి చూడవచ్చు.

ఇక మాంసాహార వంటకాల విషయానికి వస్తే;

* తెలంగాణ ఫేమస్ అంకాపూర్ చికెన్ (Ankapur Chicken)

* దమ్ బిర్యాని (Dum Biryani)

* పథర్ కా ఘోష్ (Phattar Ka Ghosh)

* కబాబ్స్ (Kababs) 

* నాటు కోడి కూర (Desi Chicken Curry)

* చేపల పులుసు

* పుంటికూర చికెన్

* జొన్న చికెన్

* పాయా

* మటన్ లో వెరైటీలు (తలకాయ, భేజా, భోటి)

* లివర్ ఫ్రై.. మొదలైనవి.

ఇక స్నాక్స్ విషయానికి వస్తే –

* మిర్చీ బజ్జీ

* ఆలూ బజ్జీ

* అప్పడాలు

* గుడాలు (కొబ్బరి గుడాలు, శెనగ గుడాలు, పెసర గుడాలు)

* దోశలు.. మొదలైనవి.

ఇవి కాకుండా తొక్కు అన్నం (Pickle Rice) & రాగి బేబీ కార్న్ వంటకం ఇక్కడ ప్రజాదరణ పొందిన వంటకాల్లో ప్రధానమైనవి.

ఏంటీ?? ఈ ఆహార పదార్థాల పేర్లన్నీ చదువుతుంటే మీకూ నోట్లో నీళ్లూరిపోతున్నాయా?? అయితే ఇంకెందుకాలస్యం.. ఎలానూ ఈ రోజు ఆదివారం కాబట్టి మీ కుటుంబ సభ్యులతో సరదాగా నెక్లెస్ రోడ్డులో విహరించేందుకు ప్లాన్ చేసుకోండి. పనిలో పనిగా అక్కడ పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన ఈ ఫుడ్ ఫెస్టివల్ కి వెళ్లి నచ్చిన ఆహార పదార్థాలను రుచి చూసేయండి. తద్వారా ఫన్ కి ఫన్.. ఫుడ్ కి ఫుడ్.. రోజు భలేగా గడిచిపోతుందంటే నమ్మండి.. ఇక ఫుడ్ లవర్స్ అయితే ఈ ఫెస్టివల్ అస్సలు మిస్ కాకుండా ముందే జాగ్రత్త పడండి. ఒకవేళ ఈ రోజు కుదరని పక్షంలో రేపైనా దీనిని సందర్శించేందుకు ప్రణాళిక వేసుకోండి. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ ఫెస్టివల్ నగరవాసులను అలరిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఎంఐ 17 హెలికాప్టర్ నడపడంలో.. సూపర్ రికార్డ్ సాధించిన మన మహిళలు

రంజాన్ స్పెషల్: భాగ్యనగరంలో బెస్ట్ బిర్యానీ.. లభించేది ఈ హోటల్స్‌లోనే..!

అట్లాంటిక్ సంద్రాన్ని ఒంటరిగా చుట్టివచ్చిన.. భారతీయ సాహసనారి ఆరోహి పండిట్..!

Read More From Food & Nightlife