Lifestyle

ఆ మాత్రలు గర్భం రాకుండా ఆపుతాయా? వాటిని ఉపయోగించడం శ్రేయస్కరమేనా?

Lakshmi Sudha  |  Mar 21, 2019
ఆ మాత్రలు గర్భం  రాకుండా ఆపుతాయా? వాటిని ఉపయోగించడం శ్రేయస్కరమేనా?

సెక్స్ శారీరక పరమైన అవసరం మాత్రమే కాదు. అది భావోద్వేగానికి సంబంధించినది కూడా. కొన్నిసార్లు ఉద్వేగానికి లోనై ఎలాంటి రక్షణ లేకుండా కలయికలో పాల్గొనే అవకాశాలున్నాయి. మొత్తం పూర్తయిన తర్వాత అసలు విషయం గుర్తొచ్చి నాలుక కరుచుకొనేవారెంతో మంది ఉంటారు.

అలాంటి సమయంలో గర్భం ధరించకుండా ఉండటానికి అత్యవసరం గర్భ నిరోధక మాత్రలను (emergency contraceptive pills) ఆశ్రయిస్తారు. మరి ఇవి మనం అనుకొన్నంత ప్రభావవంతంగా పనిచేస్తాయా? వీటిని ఉపయోగించడం వల్ల ఏమైనా దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉందా? అసలు వీటిని ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిదేనా? తెలుసుకొందాం.

ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్ అంటే ఏంటి?

సరైన గర్భనిరోధక పద్ధతులు అవలంబించకుండా.. సెక్స్‌లో పాల్గొన్నప్పుడు గర్భం దాలుస్తామనే భయం ఉంటే అత్యవసర గర్భనిరోధక మాత్రలు ఉపయోగిస్తారు. సెక్స్‌లో పాల్గొన్న 72 నుంచి 120 గంటల లోపులో ఈ మాత్రను తీసుకోవాల్సి ఉంటుంది. మాత్రను వేసుకోవాల్సిన సమయం బ్రాండ్‌ను బట్టి ఆధార పడి ఉంటుంది. మొదటి 72 గంటల లోపు మాత్రను తీసుకొన్నట్లయితే.. మంచి ఫలితం కనిపిస్తుంది.

అత్యవసర గర్బనిరోధక మాత్రలు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. సెక్స్‌లో పాల్గొన్న వెంటనే గర్భం రాదు. గర్భాశయంలో వీర్యకణాలు సుమారుగా 5 రోజుల వరకు బతికి ఉంటాయి. ఈ సమయంలో అండం విడుదల అయితే ఫలదీకరణం చెంది గర్భం దాలుస్తాం. అండం విడుదల కాస్త ఆలస్యమైతే.. వీర్యకణాలు మరణిస్తాయి. గర్భనిరోధక మాత్రలు సైతం ఇదే పని చేస్తాయి. అండం విడుదలను వాయిదా వేయడం ద్వారా గర్భం దాల్చనీయకుండా చేస్తాయి.

గర్భనిరోధక మాత్రల వల్ల కలిగే దుష్ప్రభావాలు

గర్భం దాల్చకుండా చేయడంలో ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్ ప్రభావవంతంగా పనిచేస్తాయి. కానీ తరచూ వీటిని ఉపయోగించడం అంత మంచిది కాదు. అలాగే మనం కరెక్ట్‌గానే ఈ మాత్రలు వేసుకొన్నప్పటికీ.. గర్భం ధరించే అవకాశం లేకపోలేదు. అలాగే లైంగికంగా సంక్రమించే వ్యాధుల నుంచి ఎలాంటి రక్షణ కల్పించవు. అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. తరచూ ఉపయోగించడం వల్ల పిల్ అంత ప్రభావవంతంగా పనిచేయదు. అలాగే మరికొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటంటే..

  1. వికారం లేదా వాంతులు
  2. నిస్సత్తువగా ఉండటం
  3. నీరసంగా అనిపించడం
  4. తలనొప్పి
  5. స్తనాలు నొప్పిగా అనిపించడం
  6. నెలసరికి, నెలసరికి మధ్య రక్తస్రావం అవ్వడం.
  7. పీరియడ్స్‌లో అధిక రక్తస్రావం
  8. పొత్తికడుపులో నొప్పి
  9. పీిరియడ్స్ ఆలస్యంగా రావడం

ఈ లక్షణాలన్నీ అందరిలోనూ ఒకేలా ఉండవు. అత్యవసర గర్భనిరోధక మాత్రలు ఒక్కొక్కరిలోనూ ఒక్కో రకమైన ప్రభావాన్నిచూపిస్తాయి.

బర్త్ కంట్రోల్ పిల్స్, ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్ రెండింటి మధ్య తేడా ఏంటి?

ఈ రెండూ గర్భ నిరోధక మాత్రలే. కానీ రెండింటికీ మధ్య చాలా తేడా ఉంది. బర్త్ కంట్రోల్ పిల్స్‌ను ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అత్యవసర గర్భనిరోధక మాత్రలను పేరుకు తగినట్టుగా లైంగిక కలయిక తర్వాత వీలైనంత త్వరగా వేసుకోవాల్సి ఉంటుంది.

ఈ రెండు మాత్రల పనితీరు సైతం వేరుగానే ఉంటుంది. బర్త్ కంట్రోల్ పిల్స్ వేసుకొనేవారిలో అండం విడుదలైనప్పటికీ ఫలదీకరణం చెందదు. కాబట్టి గర్భం ధరించే అవకాశాలు ఉండవు. అందుకే వీటిని దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్ అండం విడుదల ఆలస్యంగా జరిగేలా చేస్తాయి. అప్పటికే అండం విడుదలై ఉంటే.. అప్పటికే ఫలదీకరణ చెంది ఉంటే ఈ మాత్రలు ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాగే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్ వల్ల గర్భస్రావం జరగదు.

బర్త్ కంట్రోల్ పిల్స్‌ను 21 నుంచి 28 రోజుల పాటు క్రమం తప్పకుండా వేసుకోవాల్సి ఉంటుంది. అదే ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్ అయితే.. ఒక్కసారి తీసుకొంటే సరిపోతుంది. కలయికలో పాల్గొన్న 24 గంటలలోపు వీటిని వేసుకొంటే చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఆ తర్వాత వేసుకొంటే అవి పనిచేసే ప్రభావం తగ్గిపోతుంది.

చివరిగా ఓ మాట

గర్భం ధరించకుండా ఉండే విషయంలో అత్యవసర గర్భనిరోధక మాత్రలను ఉపయోగించడం వల్ల మంచి ఫలితమే కనిపించినప్పటికీ.. వాటిని తరచూ ఉపయోగించడం మంచిది కాదు. ఎందుకంటే ఇవి లైంగిక పరమైన వ్యాధులను సంక్రమించకుండా ఆపలేవు. అలాగే మీరు తరచూ సెక్స్‌లో పాల్గొనేవారైతే.. ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం కనిపించదు. నెలసరికి, నెలసరికి మధ్య ఒకటి కంటే ఎక్కువ అత్యవసర గర్భనిరోధక మాత్రలు ఉపయోగించడం వల్ల దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవి హార్మోన్ సంబంధిత ఔషధాలు అవడం వల్ల నెలసరులు క్రమం తప్పవచ్చు. కాబట్టి సెక్స్‌లో పాల్గొనే సమయంలో కండోమ్ ఉపయోగించడం శ్రేయస్కరం. అలాగే వైద్యులను సంప్రదించి మీకు సరిపోయే గర్భనియంత్రణ పద్ధతులను పాటించడం మేలు.

GIFs: Giphy

Featured Image: Unsplash

Must Read: నెల‌స‌రి స‌మ‌యంలో క‌ల‌యిక.. ఆరోగ్యానికి మంచిదేనా?

Also Read: అమ్మాయిలూ.. యోని విషయంలో ఈ అపోహలను తొలగించుకోండి!

Also Read: ల‌వ్ మేకింగ్.. సెక్స్ కు మ‌ధ్య ఉన్న తేడా మీకు తెలుసా??

Read More From Lifestyle