నెల‌స‌రి స‌మ‌యంలో క‌ల‌యిక.. ఆరోగ్యానికి మంచిదేనా?? | POPxo

నెల‌స‌రి స‌మ‌యంలో క‌ల‌యిక.. ఆరోగ్యానికి మంచిదేనా?

నెల‌స‌రి స‌మ‌యంలో క‌ల‌యిక.. ఆరోగ్యానికి మంచిదేనా?

రుతుక్రమం మొదలైన తర్వాత ప్రతి అమ్మాయినీ నెలకోసారి నెలసరి వచ్చి పలకరించి వెళుతుంది. అయితే ఆడ‌పిల్ల‌లు ఆ స‌మ‌యంలో  పీరియడ్ క్రాంప్స్ వల్ల నీరసంగా ఉంటారు. అందుకే.. ఇలాంటి సమయంలో సెక్స్  అంటే మరికాస్త ఇబ్బందిగా ఫీలవుతారు. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో మనకయ్యే బ్లీడింగ్, పీరియడ్ క్రాంప్స్.. ఆ ఇబ్బందికి కార‌ణం అని చెప్ప‌వ‌చ్చు. మరి, ఆ సమయంలో అసలు సంభోగంలో పాల్గొనడం మంచిదేనా? పీరియడ్స్ సెక్స్ వల్ల ఎలాంటి లాభాలున్నాయి? ఆ సమయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందా? పీరియడ్స్(periods) సమయంలో లైంగిక చర్యలో పాల్గొంటే గర్భం ధరించే అవకాశం ఉంటుందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.


పీరియడ్స్ సమయంలో సెక్స్ - లాభాలు


పీరియడ్స్ సమయంలో మనల్ని ఎక్కువగా కడుపు నొప్పి, నడుము నొప్పి వంటివి ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. కానీ ఆ సమయంలో సెక్స్(sex) లో పాల్గొంటే ఆ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. వినడానికి కాస్త ఆశ్చర్యంగానే ఉన్నా ఇది నిజం. సాధారణంగా పీరియడ్స్‌లో నొప్పులు ఎందుకు వస్తాయి?


ఎందుకంటే.. ప్రతి నెలా గర్భాశయం పిండం ఎదుగుదలకు అవసరమైనవన్నీ ముందుగానే సిద్ధం చేసి పెట్టుకొంటుంది. మీరు లైంగిక చర్యలో పాల్గొన్నా.. పాల్గొనకపోయినా.. ఇది అందరిలోనూ జరిగేదే. అండాశయం విడుదల చేసిన అండం ఫలదీకరణం చెందకపోతే మనకు నెలసరి వస్తుంది. ఆ సమయంలో అండంతో పాటుగా.. పిండం ఎదుగుదల కోసం గర్భాశయం సిద్ధం చేసి పెట్టుకొన్నవన్నీ బయటకు వచ్చేస్తాయి. వీటిని బయటకు పంపించే క్రమంలో మనకు నొప్పి వస్తుంటుంది. మరి, సెక్స్‌కు, ఈ నొప్పి తగ్గడానికి మధ్య సంబంధం ఏంటి అనుకుంటున్నారా?? లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు మన శరీరం ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. ఇవి మ‌న‌కు నొప్పుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. పైగా పీరియడ్స్ సమయంలో కలిగే అసౌకర్యం దూరమవుతుంది.


Also Read: ల‌వ్ మేకింగ్.. సెక్స్ కు మ‌ధ్య ఉన్న తేడా మీకు తెలుసా??


నెల‌స‌రి సమయంలో సెక్స్‌లో పాల్గొనడం వల్ల మీరు నెలసరి ఉండే రోజులు తగ్గిపోతాయి. ఇదెలా సాధ్యం? లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు ప్రతిఒక్కరిలోనూ ఆర్గాజమ్ కలుగుతుంది. ఆర్గాజమ్ కలిగిన సమయంలో గర్భాశయంలో ఉన్న రక్తం, ఇతర పదార్థాలు బయటకు వచ్చేస్తాయి. కాబట్టి మీకు బ్లీడింగ్ అయ్యే రోజులు తగ్గిపోతాయి.


నెలసరి సమయంలో దాదాపు సగం మంది మహిళలు మైగ్రైన్‌తో బాధపడుతుంటారు. అయితే వారిలో కొందరు పీరియడ్స్ సమయంలో సెక్స్‌లో పాల్గొనడం వల్ల తమకు మైగ్రైన్ నుంచి కాస్త ఉపశమనం లభించిందని చెబుతున్నారు.


అంతేకాదు.. పీరియడ్స్ సమయంలో లైంగిక చర్యలో పాల్గొనడం వల్ల ఆ సమయంలో కలిగే మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. నిద్ర బాగా పడుతుంది.


1-sex-periods


Also Read: పార్టీ టైంలో పీరియ‌డ్ వ‌చ్చిందా? అయితే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..!


కొన్ని ఇబ్బందులూ ఉన్నాయి..


నెలసరి సమయంలో సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఎన్ని లాభాలున్నాయో.. తగినన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే.. అంతకంటే ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. పీరియడ్స్ సమయంలో సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఎస్టీడీ(సెక్సువల్ ట్రాన్సిమిషన్ డిసీజెస్) వచ్చే అవకాశం ఉంది. HIV, గనేరియా, హెపటైటిస్ బి వంటివి ఒకరి ద్వారా మరొకరికి సంక్రమించే అవకాశం ఉంటుంది.


గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌కు కారణమైన హ్యూమన్ పాపిలోమా వైరస్ సోకే అవకాశమూ ఎక్కువగా ఉంటుంది.  అలాగే పీరియడ్స్‌లో ఉన్నప్పుడు లైంగిక చర్యలో పాల్గొంటే గర్భం ధరించే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే.. శుక్రకణాలు గర్భాశయంలో మూడు నుంచి ఐదు రోజుల పాటు సజీవంగా ఉంటాయి. వీటి వల్ల మీకు అవాంఛిత గర్భమూ రావచ్చు. అందుకే.. పీరియడ్స్ సమయంలో సెక్స్‌లో పాల్గొనాలంటే.. తప్పనిసరిగా కండోమ్ వంటి సురక్షితమైన పద్ధతులు అవలంబించాల్సిందే. లేదంటే మీ శారీర‌క‌, లైంగిక ఆరోగ్యం రెండూ దెబ్బతింటాయి.


పీరియడ్స్ సమయంలో సెక్స్‌లో పాల్గొనడం, పాల్గొనక పోవడం అనేది పూర్తిగా మీ, మీ భాగస్వామి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. మీ ఇష్టంతో ప్రమేయం లేకుండా పీరియడ్స్ సమయంలో మీ భాగస్వామి మీపై లైంగికపరమైన ఒత్తిడి తెస్తుంటే.. ఈ విషయంలో నిజాయతీగా వ్యవహరించండి. ఆ సమయంలో సెక్స్ పట్ల మీకున్న అభిప్రాయం చెప్పండి. మీకు అసౌకర్యంగా అనిపిస్తే.. ఆ కారణాన్ని కూడా వారికి తెలియ‌జేయండి. అలాగే ఆ సమయంలో మీ భాగస్వామి కండోమ్ తప్పనిసరిగా ధరించేలా చూసుకోండి. ఎందుకంటే ఈ సమయంలో మీ లైంగిక ఆరోగ్యాన్ని దెబ్బ తీసే వ్యాధులు మీకు సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.


Also Read: ఈ తొలిరేయి జ్ఞాప‌కాలు.. కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా ఉంటాయి..


Image: Shutterstock

Read More from Lifestyle
Load More Lifestyle Stories