పెళ్లి.. ప్రతిఒక్కరి జీవితంలోనూ ఎంతో ప్రత్యేకమైన ఘట్టం. ఎంతోమంది అమ్మాయిలు యుక్తవయసుకు వచ్చిన నాటి నుంచే.. “నా పెళ్లి వేడుక ఘనంగా జరగాలి.. మండపం అలంకరణ ఈ విధంగా ఉండాలి.. నవవధువుగా నా వస్త్రధారణ అందంగా ఉండాలి.. ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ అందమైన ఊహలతో స్వప్నలోకంలో విహరిస్తూ ఉంటారు.
చాలామంది ఆడపిల్లల విషయంలో.. తాము కన్న ఈ కలలు కాస్త అటుఇటుగా నిజమవుతాయి కూడా! ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ వయసు క్రమంగా పెరుగుతున్న కొద్దీ.. సింగిల్‌గా ఉండే అమ్మాయిల పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఏ ఫంక్షన్‌కు వెళ్లినా కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు.. ఇలా ఎంతోమంది నుండి ఎన్నో అనుభవాలు ఎదుర్కొంటూ ఉంటారు.
ముఖ్యంగా ఒంటరి (single) అమ్మాయిల పెళ్లి గురించి.. ఆమె కంటే తన చుట్టూ ఉన్నవారికే ఆరాటం మరింత ఎక్కువగా ఉంటుంది. ఆ ఆరాటాన్నే పలు సందర్భాల్లో రకరకాలుగా వ్యక్తం చేస్తూ ఉంటారు. ఏవైనా ఫంక్షన్లకు వెళ్లినప్పుడు పెళ్లి కాని అమ్మాయిలకు ఎదురయ్యే ఆ సమస్యలు, అనుభవాలేంటో మనమూ చూద్దామా..
వయసును గుర్తు చేస్తూనే ఉంటారు..
శుభకార్యాలు, పెళ్లిళ్లు వంటి వేడుకల్లో ఎవరైనా పెద్దవాళ్ల కంటపడితే చాలు.. “ఏం అమ్మాయ్.. 27ఏళ్లు వచ్చాయి.. ఇంకా పెళ్లి చేసుకోవా??” అని సరదాగా అడుగుతూ ఉంటారు. ఆ ఒక్కసారికి అది నవ్వు తెప్పించినా.. ఆ తర్వాత అదే మాట చెవిన పడిన ప్రతిసారీ మనకు ఎక్కడలేని కోపం వస్తూ ఉంటుంది. అంతేకాదు.. ఇంకొందరు పెద్దలైతే మరో అడుగు ముందుకు వేసి పెళ్లి చేసుకోవడం ఆలస్యం అయితే మంచి అబ్బాయిలు దొరకరని, సంతానం విషయంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, బంధువులంతా పలువిధాలుగా మాట్లాడుకుంటారని.. రకరకాలుగా మనకు క్లాస్ తీసుకోవడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు.
పెళ్లి వేడుకల్లో భాగం చేసేస్తారు..
ఈ రోజుల్లో జరుగుతోన్న పెళ్లిళ్లలో మెహెందీ, సంగీత్.. వంటివి కూడా భాగమైపోయాయి. ముఖ్యంగా పంజాబీ పెళ్లి వేడుకల్లో ప్రధానంగా భావించే వాటిలో కలీరా కూడా ఒకటి. నవవధువు వేసుకునే గాజులకు ఉండే పెద్దపెద్ద గంటలు వంటి డిజైన్లతో.. పెళ్లికాని అమ్మాయిల తలపై సుతిమెత్తగా కొట్టే ఘట్టం ఇది. ఇలా కలీరా వేడుకల్లో ఎవరి మీద అయితే నవవధువు గంటలు వాయిస్తుందో వారికి త్వరలో వివాహం అవుతుందన్నది వారి నమ్మకం. ఇలాంటి పెళ్లి వేడుకలు జరిగే వివాహానికి మీరు కూడా వెళితే.. అక్కడున్న పెద్దలు మీ ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా మిమ్మల్ని కూడా అందులో భాగం చేసేస్తారు.
మంచి అబ్బాయిని చూడనా??
పెళ్లి కాని అమ్మాయి కనిపిస్తే చాలు.. కొందరు ఆంటీలు వెంటనే.. “మా బంధువుల్లో మంచి అబ్బాయిని చూడనా??” అంటూ పెళ్లి ప్రతిపాదన తీసుకొస్తూ ఉంటారు. అంతేకాదు.. మనకు ఉండే అర్హతలను బట్టి మంచి వరుడిని వెతకడానికి వారి గుణగణాలతోపాటు చదువు, జీతం, ఆర్థిక స్థోమత.. వంటి విషయాలన్నీ కూడా ముందుగానే పూర్తి విచారణ జరిపి మరీ తెలుసుకునేందుకు తెగ ఆసక్తి చూపుతారు.
ఇరకాటంలో పడేసే సందర్భాలు..!
పెళ్లి కాని అమ్మాయిలను కేవలం కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు మాత్రమే కాదు.. కొన్ని సందర్భాలు కూడా ఇరకాటంలో పడేస్తూ ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి.. పాటలు. అవును.. పెళ్లి వేడుకల్లో భాగంగా ఏర్పాటుచేసే డీజే వంటి వాటిలో మొదట అందరిలోనూ హుషారు పుట్టించే మాస్ పాటలు ప్లే చేస్తే; కాసేపటి తర్వాత రొమాంటిక్ పాటలు ప్లే చేస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో హుషారుగా స్టెప్పులేసేవారు. కాస్తా ఒకేసారి నీరసించిపోయినట్లుగా అయిపోతారు. అంతేకాదు.. ఆ సమయంలో చుట్టూ ఉన్నవారిని చూస్తే అధిక భాగం జంటలుగానే కనిపిస్తారు. అటువంటప్పుడు ఇంకా సింగిల్‌గానే ఉన్నందుకు మన మనసుకి కూడా కాస్త బాధ అనిపించవచ్చు!
ఇలా ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రశ్నించినా, ఆటపట్టించినా.. ఆ చిరాకు ముఖంపై కనిపించకుండా పెళ్లి వేడుకలో నవ్వుతూ కనిపించడమంటే మాటలా?? మీరే చెప్పండి! మీ జీవితంలో ఏది ఎప్పుడు, ఎలా జరగాలో ముందుగానే మీరు పక్కాగా ప్లాన్ చేసుకున్నప్పుడు.. ఇలాంటి వ్యక్తులు లేదా సందర్భాలకు తలవంచాల్సిన అవసరం అస్సలు ఉండదు. కాబట్టి మీరు ఇకపై పెళ్లి వేడుకలకు వెళ్లినప్పుడు అక్కడి పనులు, వేడుకల్లో భాగం అవుతూనే అన్నింటి గురించీ తెలుసుకోండి. ఆ వేడుకల్లో జరిగిన పొరపాట్లు మీ పెళ్లిలో జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి..!
ఇవి కూడా చదవండి
ప్రేమ వివాహం.. ప్రేమతో మీకు నేర్పించే విషయాలు ఇవే..
పెళ్లయ్యాక.. మీరు మీ భాగస్వామితో చర్చించకూడని 9 విషయాలు ఇవే..!