బిగ్‌బాస్ (Bigg Boss) హౌస్ అంటేనే అదొక ప్రెషర్ కుక్కర్ అని.. అందులోకి అడుగుపెట్టిన వారు అంటుంటారు. అలా అనడానికి కారణాలు లేకపోలేదు. ఎందుకంటే మనకి ఏవైనా మనస్పర్థలు వస్తే.. మనం మాట్లాడి సమస్యలను పరిష్కరించుకుంటాం. అదే బిగ్‌బాస్ హౌస్‌లో అయితే.. ఇంటి సభ్యులతో తప్ప.. ఇంకెవరితో కూడా మాట్లాడే అవకాశం ఉండదు. అప్పుడప్పుడు చిన్న చిన్న మనస్పర్థలు కూడా వాగ్వాదాలుగా మారిపోతుంటాయి.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 : హేమ, టీవీ 9 జాఫర్‌తో బాబా భాస్కర్ కామెడీ
అలాగే బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సభ్యులందరూ.. టైటిల్‌ని గెలవాలన్న ఆలోచనతో పాటు.. ఎలాగైనా తాము వీక్షకులని ఆకట్టుకోవాలన్న ‘పెర్ఫార్మన్స్ ప్రెషర్’లో ఉంటారు. ఇదే ఆలోచన వారిని సహనం కోల్పోయేలా చేస్తుంటుంది. అందుకే ఈ గేమ్ షోలో మానసికంగా దృఢంగా ఉన్నవారే గెలవగలరు అని చెబుతుంటారు.
అయితే ఈ ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 3’కి (Bigg Boss Telugu).. గత సీజన్లకు మధ్య కూడా ఓ వ్యత్యాసం ఉంది. అదేంటంటే.. సాధారణంగా ఇంటి సభ్యుల మధ్య వాగ్వాదాలు, ఘర్షణలు మొదటివారం చివర లేదా రెండవ వారంలో జరుగుతుండేవి. కాని ఈ సీజన్లో మాత్రం రెండవ రోజు నుండే ఘర్షణలు మొదలయ్యాయి. అవి మూడవ రోజుకి రాగానే ఇంకాస్త ముదిరాయి అని చెప్పాలి.
ఇక ఈరోజు వివాదానికి కారణం.. ఇంటిలో సభ్యులకి అందుబాటులో ఉన్న ‘ఆహారం’. అసలే తీవ్ర ఒత్తిడిలో ఉంటున్న వారికి ఇలా ఆహరం సరిపడా లేదనేసరికి సహనం కోల్పోవడం సహజం. మిగతా సీజన్లలో కూడా ఇటువంటి పరిణామాలే చూసాం. ఇవ్వాల్టి ఎపిసోడ్లో కూడా కిచెన్‌ని చూసుకుంటున్న హేమకి.. ఇంటి సభ్యులైన రాహుల్ సిప్లిగంజ్, అలీలతో తీవ్ర వాగ్వాదం జరిగింది.
ఎందుకంటే, మిగిలిన నాలుగు రోజులకి.. ఇప్పుడున్న ఆహారపదార్ధాలతో ఎలా సర్దుకోవాలని డిస్కస్ చేస్తుండగా.. హేమ జోక్యం చేసుకోవడంతో అది వివాదంగా మారింది. అదే హేమ (Hema), రాహుల్‌ల మధ్య వాగ్వాదానికి దారి తీయడం జరిగింది. మిగిలిన ఇంటి సభ్యులు వీరిద్దరికి అప్పటికి సర్ది చెప్పినా, వారిరువురు మాత్రం తాము అన్న మాటలని వెనక్కి తీసుకునే పరిస్థితి కనపడలేదు.
“బిగ్‌బాస్ తెలుగు”కి కోర్టు చిక్కులు తొలుగుతాయా?
ఇంతలో “చిన్న పిల్లల” టాస్క్ మొదలవ్వడం.. అందులో భాగంగా రవికృష్ణ … మహేష్ విట్టా పైన వ్యక్తిగతంగా చేసిన కామెంట్స్‌ని అతను తప్పుబట్టడం జరిగింది. “చదువుకున్నావుగా… మరి ఎందుకలా చదువు లేనోడిలా మాట్లాడుతున్నావు” అంటూ కాస్త ఘాటుగానే కౌంటర్ ఇచ్చాడు మహేష్ విట్టా (Mahesh Vitta). ఇక టాస్క్‌లో చిన్న పిల్లలుగా నటిస్తూ.. కేర్ టేకర్స్‌గా ఉన్న వరుణ్ సందేశ్, పునర్నవి భూపాలంకి చుక్కలు చూపెట్టారు ఇంటి సభ్యులు. చివరికి పునర్నవి ఇంటి సభ్యులకి – “దయచేసి మాకు సహకరించండి” అని విజ్ఞప్తి చేసే వరకు వాళ్ళ అల్లరి ఆగలేదు.
ఇక చిన్న పిల్లల టాస్క్‌లో కూడా కొందరు ఇంటి సభ్యులు… తాము ఎలాగైనా సరే, వీక్షకుల వద్ద నుండి మంచి మార్కులు కొట్టేయాలన్న తపనలో కాస్త శృతి మించి మరి పాల్గొన్నారు. అది చూసే వారికి కూడా కాస్త గందరగోళంగానే కనిపించింది. అలాగే రేపు ప్రసారమయ్యే ఎపిసోడ్ ప్రోమోలో, “ఇట్స్ .. సో సిల్లీ! సగం చపాతీ కోసం గొడవపడుతున్నా..” అంటూ తన మానసిక స్థితి గురించి పునర్నవి ఒక డైలాగ్‌లో చెప్పేసింది.
శ్రీముఖి (Sreemukhi) కూడా తాను వంట చేద్దామని ప్రయత్నాలు చేస్తుంటే.. కిచెన్‌ని చూసుకుంటున్న హేమ మాట్లాడుతూ – “దయచేసి నా పనుల్లో మీరెవరు తలదూర్చవద్దు. కావాలంటే మీరే వంట చేసుకుని నాకు కూడా వడ్డించండి, లేదంటే మీరే వంట చేసుకుని తినండి. కాస్త వండిన దానిలో నాకు కూడా వడ్డించండి” అని చెప్పి కుండబద్దలు కొట్టేసింది.
దీన్నిబట్టి మనం అర్ధం చేసుకోవచ్చు. రేపటి నుండి ప్రసారమయ్యే ప్రతి ఎపిసోడ్లో కూడా.. ఒక్కరో లేక ఇద్దరో తమ తోటివారితో కచ్చితంగా వాగ్వాదానికి దిగుతారు. ఇలా మొదటివారం నుండే ఇంటి సభ్యుల మధ్య సఖ్యత కొరవడితే… రాబోయే 96 రోజుల్లో ఇంకెన్ని గొడవలు చూడాలో!!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 రివ్యూ.. టైటిల్ గెలిచే కంటెస్టెంట్ ఎవరు?