ADVERTISEMENT
home / Celebrations
ఉగాది వేళ.. ఈ వంట‌కాలు నోరూరించ‌డ‌మే కాదు.. ఆరోగ్యాన్నీ అందిస్తాయి..!

ఉగాది వేళ.. ఈ వంట‌కాలు నోరూరించ‌డ‌మే కాదు.. ఆరోగ్యాన్నీ అందిస్తాయి..!

ఉగాది (ugadi) తెలుగువారి ప్ర‌త్యేక పండ‌గ‌.. వ‌సంత రుతువులో ప్రారంభ‌మ‌య్యే తెలుగు కొత్త సంవ‌త్స‌రానికి (new year) ప్రారంభం చైత్ర‌మాసం. ఆ నెల మొద‌టిరోజే ఈ ప్ర‌త్యేక‌మైన ఉగాది పండ‌గ‌. ఇత‌ర రాష్ట్రాల్లోనూ గుడిప‌డ్వా, యుగాది, పుతండు, బైసాఖీ పేర్ల‌తో ఈ పండ‌గ‌ను చేసుకున్నా.. మ‌న తెలుగు సంవ‌త్స‌రాది మ‌న‌కు ఎంతో ప్ర‌త్యేకం. ఈ సంవ‌త్స‌రం మ‌నం వికారి నామ సంవ‌త్స‌రంలోకి అడుగుపెట్ట‌బోతున్నాం.

ఉగాది అన‌గానే మ‌న‌కు ముందుగా గుర్తొచ్చేది ఉగాది ప‌చ్చ‌డి.. ఆ త‌ర్వాత పంచాగ శ్ర‌వ‌ణం.. కొత్త ఏడాది మొద‌టిరోజున సంవ‌త్సర‌మంతా ఎలా ఉంటుందో తెలుసుకోవ‌డానికి ఉగాది పంచాంగ శ్ర‌వ‌ణం చేయించుకోవ‌డం ఎప్ప‌టి నుంచో వ‌స్తోన్న ఆచారం. ఇక సంవ‌త్స‌ర‌మంతా ష‌డ్రుచుల్లా అన్ని ర‌కాల భావోద్వేగాల‌కు సిద్ధంగా ఉండాల‌ని చెబుతూ.. ఉగాది ప‌చ్చ‌డిని తీసుకోవ‌డం కూడా ప‌రిపాటే.

ఇవే కాదు.. బొబ్బ‌ట్లు, పులిహోర వంటివి కూడా ఉగాది ప్ర‌త్యేక‌మే.. అయితే కేవ‌లం శాస్త్రప‌రంగానే కాదు.. ఆరోగ్య‌ప‌రంగా కూడా ఈ ఆహారం తిన‌డం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయంటున్నారు పోష‌కాహార నిపుణులు. మ‌రి, ఉగాది వేళ వివిధ వంట‌కాలు ఎలా చేయాలి? వాటిలోని పోష‌క విలువ‌లేంటో తెలుసుకుందాం రండి.

17457445 1288432171233270 3500691499683072582 n

1. ఉగాది ప‌చ్చ‌డి

కావాల్సిన‌వి

మామిడికాయ ముక్క‌లు – రెండు టేబుల్ స్పూన్లు
వేప‌పువ్వు – టేబుల్ స్పూన్‌
ఉప్పు – చిటికెడు
బెల్లం – మూడు టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి – చిటికెడు (కొంద‌రు కారం కూడా ఉప‌యోగిస్తారు. కానీ మిరియాలు ఆరోగ్యానికి మంచిది అని చాలామంది వీటినే వాడ‌తారు.)
చింత‌పండు గుజ్జు – టేబుల్ స్పూన్‌
నీళ్లు – ఒక‌టిన్న‌ర క‌ప్పులు

ADVERTISEMENT

త‌యారీ

ముందుగా చింత‌పండును నీళ్లలో నాన‌బెట్టి ర‌సంలా చేసుకోవాలి. అందులో బెల్లం వేసి క‌రిగేవ‌ర‌కూ తిప్ప‌డం వ‌ల్ల అది నీటిలో క‌రుగుతుంది. ఆపై అందులో మామిడికాయ ముక్క‌లు, వేప‌పువ్వు, మిరియాల పొడి, ఉప్పు వేసి క‌లుపుకోవాలి. కావాలంటే అర‌టిపండు ముక్క‌లు, పుట్నాలు, చెరుకు ముక్క‌లు, జీడిప‌ప్పు, కిస్ మిస్ కూడా చేర్చుకోవ‌చ్చు.

ప‌చ్చ‌డిలో ఉప‌యోగించే ప్ర‌తి ప‌దార్థం మ‌న ఆరోగ్యానికి మంచిదే. మామిడికాయ నుండి విట‌మిన్ సి ఎక్కువ‌గా అందుతుంది. ఇక బెల్లంలోని ఐర‌న్‌ని మ‌న శ‌రీరం పూర్తిగా తీసుకునేందుకు ఈ విట‌మిన్ సి తోడ్ప‌డుతుంది. అన్ని ర‌కాల రుచులూ బ్యాల‌న్స్‌గా ఉన్న ఇలాంటి ఆహారం తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు జ‌రుగుతుంది.

50527316 291650381497646 5149676473782632448 n

2. బొబ్బ‌ట్లు

కావాల్సిన‌వి

గోధుమ పిండి -క‌ప్పు
మైదా – అర క‌ప్పు
నెయ్యి – పావు క‌ప్పు
ఉప్పు – అర టీస్పూన్‌
నీళ్లు – త‌గిన‌న్ని
శెన‌గ ప‌ప్పు – క‌ప్పు
బెల్లం – క‌ప్పు
యాల‌కుల పొడి – అర టీస్పూన్‌

త‌యారీ

ముందుగా గోధుమ పిండి, మైదా క‌లిపి చ‌పాతీ పిండిలా త‌డిపి ప‌క్క‌న పెట్టుకోవాలి. పిండి త‌డుపుతున్న‌ప్పుడు అందులో కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి. ఆ త‌ర్వాత నాన‌బెట్టిన శెన‌గ‌ప‌ప్పును ఉడికించి మెత్త‌ని మిశ్ర‌మంగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుతున్న‌ప్పుడే అందులో బెల్లం వేయ‌డం వ‌ల్ల మొత్తం క‌లుస్తుంది. ఒక‌వేళ అలా చేయ‌డం ఇష్టం లేక‌పోతే బెల్లాన్ని లేత పాకం ప‌ట్టుకొని అందులో ఈ ప‌ప్పు మిశ్ర‌మం వేయ‌వ‌చ్చు. దీన్ని బాగా క‌లుపుకోవాలి. ఇలా క‌లుపుకున్న త‌ర్వాత వీటిని గుండ్ర‌ని ముద్ద‌లుగా చేసుకొని పెట్టుకోవాలి.

ADVERTISEMENT

ఆ త‌ర్వాత ఇంతకు క్రితం త‌డిపి ప‌క్క‌న పెట్టుకున్న పిండితో చ‌పాతీ చేసుకొని ఆ చ‌పాతీ మ‌ధ్య‌లో ఈ ముద్ద‌ను పెట్టి చుట్టూ ఉన్న పిండిని తీసుకొచ్చి మ‌ళ్లీ దాన్ని ముద్ద‌గా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముద్ద‌ను పొడి పిండి చ‌ల్లుకుంటూ మెల్లిగా వ‌త్తుకోవాలి. ఆ త‌ర్వాత నెయ్యి వేసుకొని చ‌పాతీల‌లాగే కాల్చుకోవాలి. ఇందులోని బెల్లం ఎన్నో పోష‌కాల‌ను, ఐర‌న్‌ని అందిస్తే.. ప‌ప్పు మ‌న‌కు కావాల్సిన ప్రొటీన్ల‌ను అందిస్తుంది . గోధుమ పిండిలోని కార్బొహైడ్రేట్లు మ‌న‌కు శ‌క్తిని అందిస్తాయి. నెయ్యిలోని ఫ్యాట్ కూడా క‌ల‌వ‌డంతో కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు క‌లిసిన సంపూర్ణ వంట‌కంగా ఇది మ‌న‌కు పోష‌కాల‌ను అందిస్తుంది.

50868946 298725810790103 2890570156222709760 n

3. పులిహోర‌

కావాల్సిన‌వి

అన్నం – రెండు క‌ప్పులు
మామిడి కాయ తురుము -మూడు టేబుల్ స్పూన్లు
క‌రివేపాకు – రెండు రెబ్బ‌లు
ప‌చ్చిమిర్చి- మూడు
ఎండుమిర్చి – రెండు
ఉప్పు- త‌గినంత‌
ప‌సుపు – చిటికెడు
వేరుశెన‌గ గింజ‌లు – మూడు టేబుల్ స్పూన్లు
శెన‌గ ప‌ప్పు – టేబుల్ స్పూన్‌
మిన‌ప్పప్పు- టేబుల్ స్పూన్‌
ఆవాలు – టీస్పూన్‌
జీల‌క‌ర్ర – టీస్పూన్‌
అల్లం ముక్క – అంగుళం
నూనె – మూడు టేబుల్ స్పూన్లు

త‌యారీ

ముందుగా ప్యాన్లో నూనె తీసుకొని అందులో వేరుశ‌న‌గ గింజ‌లు, ప‌ప్పులు వేసి బాగా వేయించాలి. ఇవి వేయించిన త‌ర్వాత ఆవాలు, జీల‌క‌ర్ర, ప‌చ్చిమిర్చి, ఎండు మిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. ఆ త‌ర్వాత మామిడికాయ తురుము, ఉప్పు, ప‌సుపు వేసి బాగా వేగ‌నిచ్చి ఈ మిశ్ర‌మాన్ని అన్నంలో వేసి బాగా క‌ల‌పాలి. అంతే మామిడికాయ పులిహోర సిద్ధం. పులిహోర వ‌ల్ల అటు కార్బొహైడ్రేట్ల‌తో పాటు ఇటు వేరుశ‌న‌గ గింజ‌లు, ప‌ప్పుల్లోని ప్రొటీన్లు కూడా మ‌న‌కు అందుతాయి. ఇక మామిడికాయ‌తో దీన్ని చేయ‌డం వ‌ల్ల విట‌మిన్ సి అత్య‌ధిక మోతాదులో అందే వీలుంటుంది.

17553943 1290348641041623 8422349176097534331 n

4. పాన‌కం

కావాల్సిన‌వి

బెల్లం – క‌ప్పు
యాల‌కుల పొడి – అర టీస్పూన్‌
మిరియాల పొడి – అర టీస్పూన్‌
శొంఠి పొడి – కొద్దిగా
చ‌ల్ల‌ని నీళ్లు – నాలుగు క‌ప్పులు

ADVERTISEMENT

త‌యారీ

ముందుగా బెల్లాన్ని నీటిలో వేసి క‌ర‌గ‌నివ్వాలి. దాన్ని వ‌డ‌గట్టి అందులో యాల‌కుల పొడి, మిరియాల పొడి, శొంఠి పొడి వేసుకోవాలి. దీనితో పాటు వ‌డ‌ప‌ప్పును కూడా స‌ర్వ్ చేయ‌చ్చు. దాన్ని త‌యారుచేయ‌డానికి నాన‌బెట్టిన పెస‌ర‌ప‌ప్పు తీసుకొని అందులో కొన్ని బెల్లంముక్కలు వేసి అందించాలి. కావాలంటే కొద్దిగా ప‌చ్చికొబ్బ‌రి ముక్క‌లు కూడా చేర్చుకోవ‌చ్చు. బెల్లం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఐర‌న్‌తో పాటు ఎన్నో అత్య‌వ‌స‌ర‌మైన విట‌మిన్లు, మిన‌రల్స్ అందుతాయి. అంతేకాదు.. వేస‌విలో ఇది మ‌న శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రుస్తుంది. అతి దాహం నుంచి ర‌క్షిస్తుంది.

10562642 10202175162890896 2180308305509056377 o

5. పూర్ణం బూరెలు

పూర్ణం బూరెల కోసం సాధార‌ణంగా మనం బొబ్బ‌ట్ల కోసం త‌యారుచేసుకున్న పూర్ణాన్నే ఉప‌యోగించ‌వచ్చు. శెన‌గ‌పప్పు బెల్లంతో త‌యారుచేసిన ఈ పూర్ణాన్ని పిండిలో ఉంచి బూరెల్లా చేసుకొని కాల్చుకోవాలి. దీని కోసం ముందు రోజున బియ్యం, మిన‌ప్ప‌ప్పు స‌మ‌పాళ్ల‌లో తీసుకొని నాన‌బెట్టుకోవాలి. ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని జారుడుగా కాకుండా కాస్త గ‌ట్టిగా ఉండేలా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇందులో కాస్త ఉప్పు వేసి ప‌క్క‌న పెడితే అది పులుస్తుంది. ఆ త‌ర్వాత శెన‌గ‌ప‌ప్పు, బెల్లంతో త‌యారుచేసుకున్న పూర్ణాన్ని అందులో వేసి నూనెలో లేదా నెయ్యిలో వేయించాలి. శెన‌గ‌పప్పుతో పాటు మిన‌ప్ప‌ప్పులోని ప్రొటీన్లు కూడా అందుతాయి కాబ‌ట్టి ఈ వంట‌కం నుంచి పోష‌కాల‌ను ఎక్కువ‌గా పొందే వీలుంటుంది.

Featured Image: https://www.instagram.com/subham_kitchens/

ఇవి కూడా చ‌ద‌వండి.

ADVERTISEMENT

ఈ పసందైన వంట‌కాలు.. ఊరి పేర్ల‌తో ఎందుకు ప్ర‌సిద్ధి చెందాయో తెలుసా?

ఈ ఫన్నీ ఫీలింగ్స్.. ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చాక.. మీకూ వచ్చాయా..?

మీరూ బిర్యానీ ప్రియులేనా? అయితే ఇవి మీ జీవితంలోనూ జ‌రుగుతుంటాయి..

Images : facebookFacebook

ADVERTISEMENT
05 Apr 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT