అర్జున్ రెడ్డి (Arjun Reddy).. విజయ్ దేవరకొండకు ఒక్క రాత్రిలోనే స్టార్ డమ్ సంపాదించి పెట్టిన అద్భుతమైన చిత్రం. ఈ సినిమా సామాన్య ప్రేక్షకులనే కాకుండా ఇండస్ట్రీలోని ఇతర హీరోలను సైతం ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. అంతేకాదు.. అర్జున్ రెడ్డి సినిమా ప్రభావం కొన్ని నెలల పాటు ప్రేక్షకులపై.. ముఖ్యంగా యువతపై ఓ స్థాయిలో ముద్ర వేసిందంటే.. దానిని ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో మనం అర్థం చేసుకోవచ్చు.
వెండితెరపై తనదైన శైలిలో కొత్త ఒరవడితో చక్కని పేరు, ప్రఖ్యాతులు మూటగట్టుకున్న ఈ చిత్రం బాలీవుడ్ చూపుని కూడా తనవైపు తిప్పుకోగలిగింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అర్జున్ రెడ్డి, హిందీలో కబీర్ సింగ్ (Kabir Singh) పేరుతో తెరకెక్కాడు. తెలుగులో విజయ్ దేవరకొండ పోషించిన టైటిల్ రోల్‌ను హిందీలో షాహిద్ కపూర్ పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా అవుట్ లుక్ ఎలా ఉంటుందో అని అందరూ ఎంతో ఆత్రంగా ఎదురుచూశారు.
ఈ సినిమాకు సంబంధించిన టీజర్ తాజాగా విడుదల చేయడంతో ఈ ఎదురుచూపులకు బ్రేక్ పడినట్లైంది. అంతేకాదు.. టైటిలో రోల్లో అద్భుతంగా ఇమిడిపోయిన షాహిద్‌ను చూసి అభిమానులతో పాటు, తోటి నటీనటులు కూడా ఫిదా అయిపోయి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అయితే కబీర్ సింగ్ టీజర్ విడుదలైన దగ్గర్నుంచి.. అర్జున్ రెడ్డి & కబీర్ సింగ్.. ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న పోలికలు ఏంటా అని అందరూ ఆసక్తిగా చూడడం మొదలుపెట్టారు. అందుకు కారణం – హిందీలో రూపొందుతోన్న ఈ చిత్రానికి కూడా తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తుండడం. అందుకే ఈ రెండింటి మధ్య సారూప్యత ఎక్కువగా ఉంటుందని మొదట్నుంచీ కొందరు భావిస్తూ వచ్చారు. మరి, ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఒకసారి ఈ రెండు టీజర్స్ మధ్య గల పోలికలేంటో చూడాల్సిందే..
ఈ రెండు టీజర్స్ ని ఒకసారి గమనిస్తే.. మనకి కనిపించే పోలికలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని..
* గడ్డంతో ఉన్న లుక్‌లో.. హీరో నోట్లో సిగరెట్ పెట్టుకుని డోర్ తెరుచుకుని వస్తుండడం..
* హోలీ రోజు హీరోయిన్ని ఏడిపించారని ఫోన్లో విని.. వాళ్ళని తిట్టే సన్నివేశం..
* ఆ తర్వాత హీరోయిన్ దగ్గరకు “రాయల్ ఎన్ ఫీల్డ్” బైక్ పై వెళ్లడం..
* ఫుట్ బాల్ కోర్టులో అవతలి వ్యక్తిని హెచ్చరించే షాట్..
* బ్యాక్ గ్రౌండ్లో వినిపించే మ్యూజిక్
* హీరో పాత్ర డ్రగ్స్, ఆల్కహాల్ & సిగరెట్లకు అడిక్ట్ అయ్యే సన్నివేశాలు
ఈ పైన పేర్కొన్నవి పోలికలు అయితే.. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలని ఒకసారి పరిశీలిద్దాం…
* టీజర్ ప్రారంభంలోనే.. వాటర్ ట్యాంక్‌లో మందు బాటిల్ ముంచి తీసి తాగే సన్నివేశం.. (ఇది అర్జున్ రెడ్డి చిత్రంలో మనకు కనిపిస్తుంది).
* కానీ హీరో పాత్రకి యాంగర్ మ్యానేజ్మెంట్ లేదు అని చెప్పే విషయం.. కబీర్ సింగ్ టీజర్లో ఎక్కడా చెప్పలేదు.
* తెలుగు టీజర్లో హీరో-హీరోయిన్ల మధ్య ఉన్న లిప్ లాక్.. హిందీ టీజర్ లో మనకి కనిపించదు.
* హీరోయిన్ బుగ్గ పైన ముద్దుపెట్టి ఎవరు చూడలేదు అని హీరో చెప్పే షాట్…
ఈ నాలుగు షాట్స్ మనకు తెలుగు టీజర్లో కనిపించలేదు. ఇక కబీర్ సింగ్ (Kabir Singh) టీజర్ విడుదలయ్యాక విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) & షాహిద్ కపూర్ (Shahid Kapoor) లలో ఎవరు బాగా చేశారు అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక చర్చ మొదలవ్వడం.. అది ఒక రకమైన కోల్డ్ వార్‌కు దారి తీయడం గమనార్హం.
అయితే సినీ విశ్లేషకులు మాత్రం మిశ్రమ స్పందనలను వ్యక్తపరుస్తున్నారు. “ఇద్దరూ గొప్ప నటులే! అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఒకరితో మరొకరిని పోల్చడం సమంజసం కాదు” అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ టీజర్ విడుదలైన అప్పటి నుండీ.. అందరి చూపు తనవైపు తిప్పుకుంటూ యూట్యూబ్‌లో టాప్ 5 లో ఒకటిగా ట్రెండ్ అవుతూ వస్తోంది. ప్రస్తుతం వ్యూస్‌లో నెంబర్ 3 స్థానంలో ఉంది. ఈ చిత్రం జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవి కూడా చదవండి
“మేము ఓటేశాం.. మరి మీరు ? ” అంటున్న సెలబ్రిటీలు.. ఫొటోలతో అవగాహన కల్పించే యత్నం