సినిమా రివ్యూ: స్టీరియోటైప్స్ బ్రేక్ చేసిన.. వినూత్న ప్రయోగం "ఆమె"

సినిమా రివ్యూ: స్టీరియోటైప్స్ బ్రేక్ చేసిన.. వినూత్న ప్రయోగం "ఆమె"

ప్రతీ మనిషికి స్వేచ్ఛ అనేది అవసరం. ఒకరిని ఇబ్బంది పెట్టనంత వరకూ.. ఒకరికి అసౌకర్యాన్ని కలిగించనంత వరకూ ఏ వ్యక్తైనా ఆ స్వేచ్ఛను యధేచ్ఛగా ఎంజాయ్ చేయవచ్చు. తనకు నచ్చినట్టూ జీవించవచ్చు. కానీ అదే స్వేచ్ఛ,  నడవడిక, ప్రవర్తన మరో మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తే..? మన ఆనందం మరొకరికి బాధను కలిగిస్తే..? ఒకరి వల్ల మరొకరు జీవితాన్ని కోల్పోతే.. ఇలా అనేక అంశాలను చర్చించిన సినిమా.. అమలాపాల్ నటించిన చిత్రం "ఆమె" (Aame). తమిళ చిత్రం "ఆడయ్" (Aadai) చిత్రానికి డబ్బింగ్ వెర్షన్ ఈ చిత్రం. ఈ సినిమా విడుదలలో జాప్యం జరగడం.. అలాగే సినిమా రిలీజ్‌కు ముందు అమలా పాల్ పాత్రపై విమర్శలు రావడం.. ఇదే చిత్రంపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచాయి. 

కథ - ఓ టీవీ ఛానల్‌లో పనిచేసే స్వతంత్ర భావాలు కలిగిన యువతి కామిని (అమలా పాల్). తన తల్లితో కలిసి ఓ చిన్న ఇంట్లో నివసిస్తూ ఉంటుంది. అహంకారం, మితిమీరిన ఆత్మవిశ్వాసం.. అంతకు మించి ఎంత క్లిష్టమైన పనినైనా సాధించాలన్న పట్టుదల కలిగిన యువతి ఆమె. ప్రాంక్ వీడియోలు చేస్తూ.. తన టీవీ ఛానల్ రేటింగ్స్ పెరగడానికి ఆమె ప్రతిభ ఎంతగానో దోహదపడుతుంది.

స్నేహితులతో బెట్టింగ్స్ కట్టి గెలవడం.. తనకున్న మరో హాబీ. ఓ రోజు లీజ్ పూర్తవ్వడంతో.. కామిని పనిచేస్తున్న టీవీ ఛానల్ ఆఫీసుని ఖాళీ చేయించేస్తుంది యాజమాన్యం. కానీ నిర్మానుష్యమైన ఆఫీసులో.. తన ఫ్రెండ్స్‌తో కలిసి మందు కొట్టి.. ఓ రాత్రి అక్కడే గడుపుతుంది కామిని. కానీ తెల్లారయ్యేసరికి.. తన స్నేహితులు అదృశ్యమైపోతారు.

'ఆమె' టీజర్‌తో.. ఆడియన్స్‌కి షాక్ ఇచ్చిన అమల పాల్

అయితే ఆమె మాత్రం ఒంటి మీద ఎలాంటి అచ్ఛాదనా లేకుండా నగ్నంగా మిగిలిపోతుంది. తెలివి వచ్చేసరికి.. తన పరిస్థితిని చూసి నిర్ఘాంతపోతుంది. అనేక గంటలు అత్యంత దయనీయ పరిస్థితిలో అక్కడే గడుపుతుంది. కామిని ఆ బిల్డింగ్‌లో ఉన్నప్పుడే... అదే భవంతిలోకి మరో అమ్మాయి కూడా వస్తుంది? ఆ అమ్మాయి మీద హత్యా ప్రయత్నం కూడా జరుగుతుంది? దాంతో పోలీసులు కూాడా ఆ బిల్డింగ్‌లోకి వస్తారు? అదే సమయంలో కథ ఎవరూ ఊహించని ఒక అనూహ్య మలుపు తిరుగుతుంది? ఒక సందేశాత్మక కోణాన్ని కూడా పరిచయం చేస్తుంది.. అదేమిటి అన్నది తెరపై చూడాల్సిందే. 

ప్లస్ పాయింట్స్ - ఈ సినిమాని మొత్తం అమలాపాల్ భుజాన వేసుకొని నడిపించింది అని చెప్పచ్చు. ఆమె నగ్నంగా ఈ చిత్రంలో నటించిందనే విషయాన్ని కొంత సేపు పక్కన పెడితే.. అనేక సన్నివేశాలలో ఆమె భావోద్వేగాలను పండించిన తీరు విశేషమనే చెప్పాలి. ఆర్ద్రత నిండిన సన్నివేశాలలో ఆమె నటన నిజంగానే ఆకట్టుకుంటుంది. యాక్టింగ్‌కు మంచి స్కోప్ ఉన్న పాత్ర ఇది. గతంలో బాలీవుడ్‌లో రాజ్ కుమార్ రావ్ నటించిన "ట్రాప్డ్" అనే ఒక సినిమా విడుదలైంది. కొన్ని సన్నివేశాలలో ఆ సినిమాని గుర్తుకు తెస్తుంది ఈ చిత్రం.

మహానటి సావిత్రి' పాత్ర కోసం.. అమలా పాల్‌కి ఆఫర్..?

కానీ ఈ సినిమాకంటూ అనేక ప్రత్యేకతలున్నాయి. ముఖ్యంగా కెమెరా మ్యాన్ విజయ్ కార్తీక్‌ గురించి చెప్పుకోవాలి. ఒక అమ్మాయి నగ్నంగా నటించినా.. ఎక్కడా వల్గారిటీకి, అసభ్యతకు తావు లేకుండా.. కథలో ఎమోషనల్ ఫీల్‌ని తీసుకురావడంలో తాను సక్సెస్ అయ్యాడు. అదే ఎమోషనల్ ఫీల్.. ప్రేక్షకుల చేత ఉద్వేగంతో కన్నీళ్లు పెట్టించినా ఆశ్యర్యపోనవసరం లేదు. ఒ

ఒక నిస్సహాయత.. ఒక అభద్రతా భావం.. ఒక భయం.. ఆ ఆక్రందన నుండి బయటపడాలన్న తెగువ.. వెరసి అమలా పాల్ పాత్రకు అనేక ఛాలెంజింగ్ టాస్క్‌లు దర్శకుడు ఇవ్వకనే ఇచ్చాడు. ఈ క్రమంలో ఎంతో ధైర్యం చేసి.. ఇలాంటి పాత్రను పోషించినందుకు అమలా పాల్‌కు విమర్శకుల ప్రశంసలూ దక్కచ్చు. అలాగే కేవలం ఒకే ఒక పాత్రతో కథను మొత్తం నడపడం ఆషామాషీ విషయం కాదు. అందులో సక్సెస్ అయ్యాడు దర్శకుడు రత్నకుమార్. 

ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషించిన రమ్య సుబ్రహ్మణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినిమా కథకు బలాన్ని చేకూర్చడానికి ఈ క్యారెక్టర్ ఎంతగానో దోహదపడుతుంది. ఆమె నటన కూడా సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చింది. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి కీలకం. మంచి థ్రిల్లర్ సినిమా చూసిన ఫీలింగ్‌ను నిజంగానే కలిగించింది. 

 

ఈ టాలీవుడ్ బ్యూటీస్.. పెంపుడు జంతువులు అంటే ప్రాణమిస్తారు..

 

మైనస్ పాయింట్స్ - ఎంత మంచి థ్రిల్లర్ చిత్రమైనా.. కొన్ని లాజిక్ లేని అంశాలు ప్రేక్షకుల్లో ప్రశ్నలు రేకెత్తించడం సహజం. కానీ ఎమోషనల్ థ్రిల్లర్ కాబట్టి.. దర్శకుడు ఆ భావన రాకుండా జాగ్రత్తపడ్డాడు. అలాగే సినిమా నిడివి విషయంలో ఎడిటింగ్ టీమ్ కొంత కసరత్తు చేస్తే బాగుండేది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో కథానాయిక పాత్రను ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో.. చాలా అనవసర సన్నివేశాలకు చోటు ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఆ సన్నివేశాలు లేకపోయినా సినిమాకి నష్టమేం లేదు. 

విశ్లేషణ: ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు, సంభాషణలు నిజంగానే ఆసక్తికరంగా సాగుతాయి. ముఖ్యంగా కథానాయిక తన తల్లికి ఫెమినిజానికి, కమ్యూనిజానికి మధ్య తేడా చెప్పే సీన్ కామెడీగా ఉంటుంది. అలాగే 'సత్యమంటే పేరులోనే కాదు.. మాటల్లో, చేతల్లో కూడా ఉండాలి, 'మంచి పనులు చేయాలని ఉన్నా చేయలేం.. చెడ్డపనులు అలవాటు పడ్డాక వదులుకోలేం', 'సివిల్స్ పరీక్ష కోసం ఒక సంవత్సరం వేస్ట్ కావడం నీకు సింపుల్ కావచ్చు.. కానీ కొందరికి అది జీవన్మరణ సమస్య' లాంటి డైలాగ్స్ మనల్నీ ఆలోచింపజేస్తాయి.

ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు దక్షిణాది చిత్ర పరిశ్రమకు కొత్తేమీ కాదు. కానీ  ఇలాంటి సినిమాను ఇంత బోల్ఢ్‌గా తీయడం ఒక సాహసమనే చెప్పాలి. అలాగే ఎవరైనా తమ సంతోషం కోసం.. ఇతరుల భావోద్వేగాలతో ఆడుకోవడం, వారిని ఫూల్స్‌ని చేయడం తగదనే సందేశాన్ని అంతర్లీనంగా ఈ చిత్రంలో ఇవ్వడం జరిగింది. కొన్ని విపత్కర సమయాల్లో ప్రతీ క్షణం విలువైనది.. ప్రతి నిముషం ప్రాణాలను కాపాడే ఓ కల్పతరువు. అందుకే ఇతరుల సమయాన్ని వృధా చేసే హక్కు ఎవరికీ లేదు. సమయాన్ని మీరు చిన్నచూపు చూస్తే.. అది మీ జీవితాన్ని చిన్నచూపు చూస్తుందనే వినూత్న సందేశాన్ని.. ఈ చిత్రం ద్వారా దర్శకుడు ఇవ్వడానికి ప్రయత్నించడం విశేషం. 

మొత్తానికి.. నిజాన్ని బోల్డ్‌గా చెప్పిన.. బోల్డ్ ఫిల్మ్ "ఆమె" అని చెప్పచ్చు..