పాటలతో జనాల్లో చైతన్యాన్ని తీసుకొస్తున్న.. హైదరాబాద్ ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్

పాటలతో జనాల్లో చైతన్యాన్ని తీసుకొస్తున్న.. హైదరాబాద్ ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్

సంగీతం.. ఎంతటి ఒత్తిడినైనా ఇట్టే ఉఫ్‌మని ఊదేసి మన మనసును తేలికపరుస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇదే సంగీతాన్ని నలుగురిలో అవగాహన పెంపొందించడానికి ఉపయోగిస్తే..? చాలా బాగుంటుంది కదా.  ఇందుకు  ప్రత్యక్ష ఉదాహరణే హైదరాబాద్‌కు (Hyderabad) చెందిన ట్రాఫిక్ పోలీస్ అంజపల్లి నాగమల్లు.


ఇంతకీ ఈయన ఏం చేశారు అనేగా మీ సందేహం.. అక్కడికే వస్తున్నామండీ.. నగరంలో జరిగే పలు నేరాలు, సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా గళంగా విప్పుతూ.. పాటలు రాస్తున్నారాయన. తద్వారా.. నేటి యువతకు చట్టం, న్యాయం, సామాజిక బాధ్యత మొదలైన విషయాలపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు అంజపల్లి నాగమల్లు.


అంతేకాదు.. తన పాటల ద్వారా పలు సమస్యలకు పరిష్కారం చూపేందుకు కూడా యత్నిస్తున్నారు. అయితే ఈ పాటలు రాయాలన్న ఆలోచన తనకు ఎలా వచ్చిందన్న విషయంలోకి వెళితే.. చాలా ఆసక్తికరమైన అంశాలు తెరమీదికొచ్చాయి. 


సాధారణంగా పాటలనేవి మనలో స్ఫూర్తిని నింపడం మాత్రమే కాకుండా.. జీవితం నిస్సారంగా, నిరుత్సాహంగా మారిపోయిందని భావించే వారిలో కూడా తిరిగి ఉత్సాహం నింపుతాయి. వారిని చైతన్యవంతులనూ చేస్తాయి. అందుకే సంగీతానికి ఎప్పుడూ ప్రతీ ఒక్కరి జీవితంలోనూ ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే ఇదే సంగీతం నుండి ప్రేరణను పొంది..  దాని సహాయంతో సమాజానికి ఏదో చేయాలని సంకల్పించానని, అందుకే పాటలు రాయడం ప్రారంభించానని అంటున్నారు నాగమల్లు.


ఈ క్రమంలో  సమాజంలో జరుగుతోన్న అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, విద్యార్థుల ఆత్మహత్యలు.. ఇలాంటి సున్నితమైన అంశాలపై  అర్థవంతమైన పాటలు రాస్తున్నారు  నాగమల్లు.


అంజపల్లి నాగమల్లు (Anjapally Nagamallu) నిరుపేద రైతు కూలీ కుటుంబంలో జన్మించారు. ఆయన స్వగ్రామం సూర్యాపేట జిల్లాలోని చిల్పకుంట (Chilpakunta). దాదాపు బాల్యం మొత్తం వలస జీవితమే గడిపిన ఆయన పట్టుదలతో చదివి.. పదో తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. ఆ తరువాత కోదాడలో (Kodad) ఇంటర్మీడియట్ పూర్తి చేసి నల్గొండలో డీఈడీ చేశారు.


ఆ తర్వాత డీఎస్సీతో పాటు పోలీసు రిక్రూట్మెంట్ పరీక్షలు రాశారు. అయితే రెండింటిలోనూ మెరిట్ సాధించడంతో.. ఎటువైపు వెళ్ళాలి? అన్న ప్రశ్న తనకు తలెత్తింది. ఆ సమయంలో పోలీసు శాఖలో ఉంటే ప్రజలకు నేరుగా సహాయం చేయవచ్చు అన్న భావన తనకు కలిగింది. అందుకే పోలీసుగానే తన జీవితాన్ని ప్రారంభించారు నాగమల్లు.


ఇక్కడి వరకు ఓకె.. మరి, ఆయనకు ఈ పాటలు రాయాలి, పాడాలి అన్న ఆలోచనకు బీజం ఎక్కడ పడింతో తెలుసా.. ఆ విషయం తెలియాలంటే అతను చదువుకున్న రోజుల్లోకి వెళ్లాలి! ఆ రోజుల్లో నల్గొండలో చేతబడి,  బాణామతి వంటి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా అవగాహన సదస్సులను నిర్వహించేవారు. అప్పటి నల్గొండ ఎస్పీ మహేష్ భగవత్ (Mahesh Bhagawath) నేతృత్వంలో వాటిని ఏర్పాటు చేసేవారు. ఆ సదస్సుల్లో పాటల ద్వారా సందేశాన్ని జనాల్లోకి తీసుకెళ్లేవారు వాలంటీర్లు.  అలా పాటల ద్వారా  సామాజిక రుగ్మతుల పై అవగాహన కల్పించడాన్ని స్వయంగా చూశారు నాగమల్లు. ఆ పాటలకు ప్రజల నుంచి విశేషమైన స్పందన రావడాన్ని కూడా గమనించారు. అలా పాటకు ఉండే అసలైన పవర్ గురించి ఆ రోజే తెలుసుకున్నారు నాగమల్లు.నాగమల్లు కూడా పోలీసు శాఖలోకి వచ్చిన తర్వాత.. పలు అంశాలపై ప్రస్తుత యువతలో అవగాహన కలిగించేందుకు ఇదే పద్ధతిని అవలంబించడం ప్రారంభించారు. అంతేకాదు.. ఇప్పుడు ఆయన రాసి, పాడే పాటలను సోషల్ మీడియా ద్వారా కూడా ఇప్పటి తరం వారికి చేరవేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫేస్ బుక్ (Facebook) , ట్విట్టర్ (Twitter) & యూ ట్యూబ్ (YouTube).. ఇలా అనేక సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.


నాగమల్లు తన తొలి పాటను.. పోలీసు అమరవీరుల జ్ఞాపకార్ధం నిర్వహించే రోజుని పురస్కరించుకొని రాశారు. ఇది విన్న తర్వాత జన విజ్ఞాన వేదిక వారు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఓ పాట రాయమని కోరగా.. వారికి కూడా ఒక పాట రాసిచ్చారు. ఆ పాట ఆయనకు బాగా పేరు తేవడంతో పాటు.. అందరికీ ఆయన ప్రతిభ గురించి తెలిసేలా చేసింది. ఇదంతా ఆయన పోలీసు శాఖలో చేరినప్పటి నుంచే ప్రారంభమైందంటారు నాగమల్లు.


ఇక ఆయన రాసిన పాటల్లో బాగా ప్రజాదరణ పొందినవి ఎన్నో ఉన్నాయి - ఉదాహరణకు, "జిలేడమ్మ జిట్టా" - పుల్వామా అమరవీరుల పైన రాసిన పాట; అలాగే యువతలో స్ఫూర్తిని రగిలించేందుకు రాసిన 'వెయ్ అడుగెయ్'.. అలాగే మొన్నీమధ్యనే ఇంటర్మీడియట్ ఫలితాల నేపథ్యంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థులలో ధైర్యాన్ని నింపేందుకు పాడిన పాట.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.


ఓవైపు పాటలు రాస్తూ, వాటిని పాడడమే కాకుండా.. మరోవైపు హైదరాబాద్ మహా నగరంలో ట్రాఫిక్ ఇన్స్‌పెక్టరు‌గా విధులు కూడా నిర్వర్తిస్తున్నారు నాగమల్లు. అంతేకాదు.. రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో సత్వరమే స్పందించి తన సొంత ఖర్చులతోనే బాధితులకు చికిత్సను కూడా అందిస్తున్నారు.  అలాగే ఇప్పటికే 20 సార్లుకి పైగా రక్తదానం చేసి ఎందరికో స్ఫూర్తివంతంగా నిలిచారు.


మరి, ఓ అధికారిగా బాధ్యతాయుతంగా తన విధులను నిర్వర్తిస్తూనే.. మరోవైపు ఆదర్శప్రాయంగా నిలుస్తోన్న అంజపల్లి నాగమల్లు మనందరికీ కూడా స్ఫూర్తిప్రదాతే కదా..!


ఇవి కూడా చదవండి


హైదరాబాద్ హుసేన్ సాగర్‌లో.. మనమూ బోటు షికారు చేసేద్దామా..!


ప్రేమ కోసం.. నిరాహారదీక్షకు దిగిన ఓ యువకుడి కథ..!


తెలంగాణ ప్రభుత్వానికి.. తాగుబోతుల వెరైటీ విన్నపం (వింటే.. షాకవుతారు)