కాజోల్.. ఈ పేరు వినని సినీ అభిమాని మన దేశంలో ఉండరంటే అది అతిశయోక్తి కాదు. వెండితెర పై బబ్లీ గర్ల్‌గా మెరిసే మన కాజోల్‌ని (Kajol) చూస్తే.. పక్కింటి అమ్మాయిని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అంతలా ప్రేక్షకులను తన సహజ నటనతో కట్టిపడేసిన ఆమె ఈ రోజు 45వ పడిలోకి అడుగుపెడుతోంది.
ఈ సందర్భంగా దాదాపు 27 ఏళ్ళ పాటు సినీ పరిశ్రమను ఏలిన.. కాజోల్ కెరీర్‌లోని కొన్ని ముఖ్యమైన ఘట్టాల గురించి ఓసారి తెలుసుకుందాం..
* 1992లో “భేఖుది” చిత్ర ప్రారంభ వేడుకలు జరుగుతున్న సమయంలో కాజోల్ తండ్రి షోము ముఖర్జీ ఆమెతో ఒక మాట అన్నారట. ఆ మాట తన జీవితాన్నే మార్చేసింది అని పలుమార్లు తెలిపింది. ఇంతకి ఆ మాటేంటంటే – “నువ్వు జీవితంలో సినిమా కోసం ఒక్కసారి ముఖానికి మేకప్ వేసుకుంటే … అది జీవితాంతం నిన్ను వదిలిపెట్టదు”. ఈ ఒక్క మాటే తను 27 ఏళ్ళుగా సినీ కెరీర్‌ని కొనసాగించేందుకు ప్రేరణగా నిలుస్తోందట.
* షారుఖ్ ఖాన్‌తో కలిసి కాజోల్ నటించిన బాజీఘర్ , దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే, కరణ్ అర్జున్ , కుచ్ కుచ్ హోతా హైన్, కభీ ఖుషి కభీ ఘమ్, మై నేమ్ ఈజ్ ఖాన్, దిల్ వాలే.. వంటివి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నాయి.
* 5 ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డులు సొంతం చేసుకున్న కథానాయికగా ఆమె రికార్డు కూడా సృష్టించింది. అదే సమయంలో ఉత్తమ విలన్‌గా కూడా ఒక ఫిలింఫేర్ అవార్డుని “గుప్త్” చిత్రానికిగానూ అందుకుంది కాజోల్.
* తోటి నటుడు అజయ్ దేవగణ్‌ని 1998లో వివాహం చేసుకుని సంచలనం సృష్టించింది. కెరీర్ విజయవంతంగా దూసుకుపోతున్న క్రమంలో.. ఆమె పెళ్లి చేస్కోవడం అప్పట్లో ఒక సంచలనమైంది.
* పెళ్లి చేసుకున్న తరువాత హీరోయిన్స్ నటన కొనసాగించినా .. వారికి హిట్స్ లభించవనే అభిప్రాయాన్ని బ్రేక్ చేసిన నటి కాజోల్. 1998లో వివాహం చేసుకున్న తరువాత.. తాను నటించిన కభీ ఖుషి కభీ ఘమ్, మై నేమ్ ఈజ్ ఖాన్ , ఫనా.. చిత్రాలు మంచి వసూళ్ళని రాబట్టాయి. ఈ మూడు చిత్రాలకు ఆమె ఫిలింఫేర్ అవార్డుని గెలుచుకోవడం మరొక సంచలనం.
* ఒక ప్రముఖ జాతీయ ఛానల్ నిర్వహించిన సర్వేలో “ది మోస్ట్ పాపులర్ యాక్ట్రెసెస్ ఆఫ్ ఆల్ టైం” జాబితాలో టాప్ 4 లో స్థానం దక్కించుంది కాజోల్.
నైసా దేవగన్ .. ఈ బాలీవుడ్ స్టార్కిడ్ గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిందే.. !
* భారత ప్రభుత్వం బహూకరించే “పద్మ శ్రీ” అవార్డుని ఆమె 2011లో అందుకున్నారు.
* 2006లో లండన్ నగరంలో “బాలీవుడ్ లెజెండ్స్” అనే ట్యాగ్ లైన్‌తో.. నలుగురు బాలీవుడ్ నటులని ప్రకటిస్తే అందులో కాజోల్ కూడా ఒకరిగా స్థానం సంపాదించుకోవడం విశేషం.
* కాజోల్ తల్లి “తనూజ” సమర్థ్ హిందీ చిత్రసీమలో పేరొందిన నటి. ఆమె వారసత్వాన్ని కాజోల్ కొనసాగించగా.. తరువాత కాలంలో కాజోల్ చెల్లెలు తనీషా కూడా హీరోయిన్గా కొన్ని చిత్రాల్లో నటించింది. మరొక ప్రముఖ హిందీ నటి నూతన్ కూడా కాజోల్‌కి దగ్గర బంధువు.
* కాజోల్ ఇద్దరు పిల్లలకి తల్లి. 2003లో నైసా, 2010లో కొడుకు యుగ్లకు జన్మినిచ్చింది.
* ఆమె తన కెరీర్లో కేవలం బాలీవుడ్లోనే కాకుండా.. తమిళంలో కూడా నటించింది. అది కూడా రెండు చిత్రాల్లో మాత్రమే. ఆమె తమిళంలో నటించిన “మినసర కనవు” చిత్రం.. తెలుగులో “మెరుపు కలలు”గా.. హిందీలో “సప్నే”గా డబ్బింగ్ చేయబడింది.
ఈ బాలీవుడ్ చిత్రాలు.. మీలో దేశభక్తిని మరింత పెంచుతాయి..!
* కాజోల్‌ని మంచి నటిగా మాత్రమే కాదు.. చాలా ముక్కుసూటి మనిషిగా కూడా చెబుతుంటారు. ఎందుకంటే ఒకసారి తన స్నేహితుడు కరణ్ జోహార్, భర్త అజయ్ దేవగణ్‌ల మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఆమె కరణ్‌తో తన స్నేహాన్ని వదులుకున్నారు. తన భర్త వైపు నుండి ఎటువంటి తప్పు జరగలేదు కాబట్టి.. ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆమె వ్యాఖ్యానించారు. అయితే తరువాతి కాలంలో కాజోల్, కరణ్ జోహార్లు మరలా తమ స్నేహాన్ని కొనసాగించేందుకు నిర్ణయించుకుని ప్రస్తుతం మిత్రులుగానే కొనసాగుతున్నారు.
* ఇప్పటివరకు కాజోల్ లేకుండా (కనీసం అతిథి పాత్ర) లేకుండా.. కరణ్ జోహార్ ఒక్క చిత్రానికి కూడా దర్శకత్వం వహించలేదు. వారి మధ్య విభేదాలు తలెత్తిన సమయంలో వచ్చిన “ఏ దిల్ హై ముష్కిల్” చిత్రంలో మాత్రమే కాజోల్ కనిపించదు.
టాలీవుడ్ ” మల్లీశ్వరి”.. బాలీవుడ్ “స్టార్ హీరోయిన్” కత్రినా బర్త్‌డే స్పెషల్ ..!
* సినిమా కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు కాజోల్ వివాహం చేసుకోగా.. ఆమె పెళ్లి ఎక్కువ రోజులు సాగదు అని మీడియా వ్యాఖ్యానించిన వేళ.. తమ వివాహం బంధంలో ఎటువంటి పొరపచ్చాలకి తావు లేకుండా ఉంటూ ఆ విమర్శలకు చెంపపెట్టు లాంటి సమాధానం చెప్పింది కాజోల్.
ఇవి నటి కాజోల్ జీవితంలోని కొన్ని ముఖ్య సంఘటనలు.
మనం కూడా POPxo తెలుగు తరపున కాజోల్‌కి జన్మదిన శుభాకాంక్షలు (Happy Birthday) చెప్పేదాం..!