‘బాబీ’.. పాత్ర కోసం చాలా కష్టపడ్డాను: కంగనా రనౌత్

‘బాబీ’.. పాత్ర కోసం చాలా కష్టపడ్డాను: కంగనా రనౌత్

బాలీవుడ్ బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ భామ కంగనా రనౌత్ (Kangana Ranaut), విలక్షణ నటనకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రాజ్‌కుమార్ రావు జంటగా నటించిన చిత్రం ‘జడ్జిమెంటల్ హై క్యా’ (Judgemental hai kya??). ఈ సినిమా విభిన్నమైన పోస్టర్స్‌తో ముందు నుంచీ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర యూనిట్ తాజాగా ట్రైలర్ కూడా విడుదల చేసింది. టైటిల్‌కు తగ్గట్లుగానే ట్రైలర్ సైతం అత్యంత ఉత్కంఠభరితంగా సాగడం విశేషం.

‘సాధారణంగా పోలీసులు అందరినీ భయపెడుతూ ఉంటారు.. కానీ వీళ్లు మాత్రం పోలీసులనే భయపెడుతున్నారు..’ అంటూ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ప్రారంభమయ్యే డైలాగ్స్‌తో ఆసక్తికరంగా మొదలవుతుందీ ట్రైలర్. ఇదే ట్రైలర్‌లో బాబీ (కంగనా రనౌత్), కేశవ్ (రాజ్‌కుమార్ రావు) పాత్రలను, ఆ పాత్రల స్వభావాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తారు.

ఒక హత్య.. ఇద్దరు నిందితులు.. వీరిలో ఎవరు నేరస్థులు?? అంటూ బ్యాక్ గ్రౌండ్‌లో వినిపించే మాటలకు అనుగుణంగానే పలు సన్నివేశాలు సైతం మనకు స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తూ చాలా చిత్రమైన స్వభావాన్ని ప్రదర్శిస్తాయి ఈ పాత్రలు. దీనికి తోడు ఈ చిత్రంలో కంగన ఓ మానసిక రోగిలా నటించడం.. పోలీసులకు, ఆమెకు మధ్య జరిగే సంభాషణలు సరదాగా సాగడంతో అందరిలోనూ నవ్వుల పువ్వులు పూస్తాయి.

శోభాకపూర్, ఏక్తాకపూర్, శైలేష్ ఆర్ సింగ్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తూన్న ఈ చిత్రం జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర కథను కణికా థిల్లాన్ రచించగా;  దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.

రెండు నిమిషాల 37 సెకన్ల నిడివి పాటు సాగే.. ఈ చిత్ర ట్రైలర్‌ని వీక్షించిన తర్వాత సినిమా కథ మొత్తం కంగన, రాజ్‌కుమార్‌ల పాత్రల చుట్టూనే తిరుగుతుందని మనకు అర్థమవుతోంది. వీరిరువురిలో అసలు నిందితులు ఎవరు? వారి మధ్య జరిగే కథ ఏంటి?? వంటి అంశాల ఆధారంగా అల్లుకున్న సినిమా ఇది.

ఈ ఏడాది ప్రారంభంలోనే మణికర్ణిక చిత్రంతో ప్రేక్షకులను అలరించిన కంగన మరోసారి తనదైన శైలిలో, విభిన్నమైన పాత్రతో అభిమానులను అలరించేందుకు సిద్ధమైపోతోంది. బాబీ అనే మానసిక రోగిగా ఆమె కనబరిచిన నటన ట్రైలర్‌లోనే అద్భుతంగా ఉందని చెప్పచ్చు.

ఇక సినిమాలో ఆమె పాత్ర ప్రేక్షకుల్లో ఎలాంటి ముద్ర వేయనుందో చూడాలి. ఈమెకు జంటగా స్క్రీన్ షేర్ చేసుకున్న రాజ్‌కుమార్ రావు సైతం నటనలో తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మేటి అనే చెప్పవచ్చు. ఇక, వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండనుందో తెలియాలంటే.. ఈ సినిమా విడుదలయ్యే వరకు కాస్త వేచి చూడాల్సిందే.

ఈ సినిమాకు టైటిల్‌ను మొదట మెంటల్ హై క్యా? అని పెట్టగా.. అదే టైటిల్ పలు వివాదాలు ఎదుర్కొంది. ఈ క్రమంలో సినిమా పేరును  జడ్జిమెంటల్ హై క్యా? అంటూ మార్చిందీ చిత్రయూనిట్. అయితే ఇది సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కోరిక మేరకు జరిగినట్లు స్పష్టం చేస్తున్నారు దర్శక, నిర్మాతలు. ప్రారంభం నుంచే ఓ స్థాయిలో వివాదాలు ఎదుర్కొంటున్న ఈ చిత్రం.. విడుదల తర్వాత ఇంకెన్ని వివాదాలు ఎదుర్కోనుందో.. అలాగే ప్రేక్షకుల నుంచి ఏ విధమైన ఫలితాన్ని సంపాదించుకుంటుందో చూడాలి..

ఈ పాత్ర కాస్త కష్టమైందే..

కంగన ఇప్పటివరకు ప్రతి చిత్రంలోనూ విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ విలక్షణమైన నటిగా గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె నటించిన జడ్జిమెంటల్ హై క్యా? సినిమాలోని బాబీ పాత్ర కూడా తన కెరీర్‌లోనే కష్టమైన పాత్రల్లో ఒకటి అంటూ చెప్పుకొచ్చింది కంగన. ఒక వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా కంగన ఇందులో కనిపించనుంది. తన పాత్ర స్వభావం మేరకు కంగన తన వాయిస్, పిచ్‌ని మార్చుకోవడానికి చాలా కష్టపడిందట.

దీని గురించి ఇటీవలే ఓ ప్రముఖ మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ- ‘ఈ సినిమాలో నేను మొట్టమొదటిసారిగా ఒక వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా నటించాను. ఇందులో నా క్యారెక్టర్ కొన్ని సౌతిండియా సినిమాలతో పాటు ఒక భోజ్ పురి చిత్రానికి కూడా డబ్బింగ్ చెప్పాల్సి ఉంటుంది. ఇందుకోసం నా వాయిస్‌కి చాలా పని చెప్పాల్సి వచ్చింది. అలాగే దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి కూడా నాకు ఈ విషయంలో సహాయం చేయడంతో పాటు నాలుక, గొంతుకు సంబంధించిన కొన్ని వ్యాయామాలు చేయాలని సూచించారు. వాటి ద్వారా స్పష్టమైన ఉచ్ఛరణ, మాండలికాలు పలకవచ్చని వివరించారు.

ఆయన చెప్పిన విధంగానే నా వాయిస్‌ని మాడ్యూల్ చేసుకునేందుకు ప్రయత్నించా. దీనికి తోడు సినిమాలో మా పాత్రలు చాలావరకు టంగ్ ట్విస్టర్స్ కూడా పలకాల్సి ఉంది. అందుకే నేను కేవలం పాత్రపరంగానే కాకుండా వ్యక్తిగతంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరీ దీని కోసం సన్నద్ధమయ్యా..’ అంటూ తన కష్టం గురించి వివరించింది. జూలై 26న జడ్జిమెంటల్ హై క్యా?? చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న.. ఈ అందాల భామ ప్రస్తుతం ప్రముఖ బాలీవుడ్ దర్శకురాలు అశ్వినీ అయ్యర్ తివారీ రూపొందిస్తోన్న ‘పంగ’ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

దొరసాని ట్రైలర్ టాక్ - ప్రేమ కూడా ఒక ఉద్యమమే..!

నలుగురు హీరోయిన్స్‌తో రొమాన్స్‌కి.. సై అంటున్న టాలీవుడ్ లక్కీ హీరో ఎవరు?

మరోసారి ప్రేక్షకులని 'ఫిదా' చేస్తామంటున్న సాయి పల్లవి - శేఖర్ కమ్ముల