KGF చిత్రం గురించి సినీ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇది ఒక సాధారణ కన్నడ చిత్రంగా రూపొంది తెలుగు, తమిళ, మలయాళ & హిందీ భాషల్లోనూ అనువాదమై.. 2018లో సంచలనం సృష్టించింది. ఒక వైవిధ్యమైన చిత్రంగా భారతదేశ సినీచరిత్రలోనూ స్థానం సంపాదించుకుంది. రూ. 60 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ 250 కోట్లు వసూళ్లను రాబట్టింది అంటే.. ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో మనం అర్ధం చేసుకోవచ్చు.
బిగ్‌బాస్ తెలుగు: హేమ వెళ్లింది… తమన్నా వచ్చింది…
ఇక కేజీఎఫ్ మొదటి భాగంలో మనకి కేవలం పేరు మాత్రమే వినపడిన ‘అధీర’ పాత్ర.. ఇప్పుడు KGF చాప్టర్ 2 లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే మొదటి భాగంలో మనకు కనిపించే రెండు ముఖ్య పాత్రలు చనిపోగా.. చివరలో వచ్చే అధీర పాత్ర రెండవ భాగంలో అత్యంత కీలకమని మనకి దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక హింట్ ఇచ్చేశాడు. దానితో ఈ పాత్రలో ఎవరు కనిపిస్తారు? అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ తరుణంలో మూడు రోజుల క్రితం ఈ పాత్రకి సంబంధించి ప్రకటన రానుందని దర్శకుడు ట్వీట్ చేయగా.. KGF సినిమా అభిమానులలో ఓ ఉత్కంఠ నెలకొంది.
ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితమే KGF 2 లో.. ఆ పాత్రకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే – అధీర పాత్రలో బాలీవుడ్ రాక్ స్టార్ సంజయ్ దత్ నటించనున్నారట. ఈ సందర్భంగా ఆయన పాత్ర లుక్‌ని కూడా విడుదల చేశారు. అయితే ఈ రోజే దీనిని ప్రకటించడానికి కారణమేంటంటే.. సంజయ్ దత్ 60వ పుట్టిన రోజు కావడం విశేషం. ఈ సందర్భంగా.. ఆయన తన అభిమానులందరికీ ఈ పాత్ర ద్వారా ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారన్నమాట..
BIG ANNOUNCEMENT… Sanjay Dutt as #Adheera in #KGFChapter2… #SanjayDuttAsAdheera pic.twitter.com/VJ1lKifmla
— taran adarsh (@taran_adarsh) July 29, 2019
60వ పడిలోకి అడుగుపెడుతున్న ఖల్ నాయక్… అధీర పాత్ర ద్వారా దూసుకుపోనున్నారు అంటూ KGF హీరో యశ్ ట్వీట్ చేయగా; దానికి సంజయ్ దత్ సమాధానమిస్తూ – KGF2 లో భాగమవుతున్నందుకు ఆనందంగా & ఆసక్తిగా ఉందంటూ ట్వీట్ చేశారు. హీరోయిజానికి పెద్ద పీట వేసిన KGF వంటి చిత్రంలో ఇప్పుడు మాస్ అప్పీల్‌కి మారుపేరైన సంజయ్ దత్ కూడా వచ్చి చేరడంతో.. ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయనే చెప్పచ్చు.
హిందీలో అగ్నీపథ్ చిత్రం ద్వారా విలన్‌గా ఎంట్రీ ఇచ్చిన సంజయ్ దత్‌కి… ఆ పాత్ర ద్వారా ఎంతోమంది ఫ్యాన్స్ అయిపోయారు. అలాంటిది KGF వంటి భారీ అంచనాలున్న చిత్రంలో దర్శకుడు ప్రశాంత్ నీల్.. మరోసారి తనను పవర్‌ఫుల్ పాత్రలో ఎంపిక చేసుకోవడం విశేషం. ఈ క్రమంలో ఆ పాత్ర ప్రేక్షకులను ఎలా ఆకట్టుకోనుందా.. అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ పాత్ర ఎలా ఉంటుందో తెలియాలంటే.. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.
ప్రస్తుతం KGF చాప్టర్ 2 షూటింగ్ జరుగుతోంది. మార్చి 13, 2019న మొదలైన ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ లేదా వచ్చే ఏడాది మొదటి భాగంలోగా పూర్తవుతుందని సమాచారం. అయితే ఈ సారి ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో కూడా నటిస్తుండడంతో.. హిందీలోనూ ఇది నేరుగా విడుదలయ్యే అవకాశాలున్నాయి. అలాగే అక్కడ మంచి బిజినెస్ జరిగే ఆస్కారం కూడా ఉందని అంటున్నారు సినీ పండితులు.
ఇక సంజయ్ దత్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన చేతిలో KGF తో కలిపి ఆరు చిత్రాలు ఉన్నాయి. తెలుగులో సూపర్ హిట్ అయిన ప్రస్థానం చిత్రం హిందీ రీమేక్ కూడా అందులో ఒకటి కావడం విశేషం. ఇక ఈ ఆరు చిత్రాలలో 2019 సంవత్సరంలో ఆయన నటించిన 4 చిత్రాలు; 2020లో రెండు చిత్రాలు విడుదలకానున్నాయి. ఇవే కాకుండా దర్శకుడు రాజ్ కుమార్ హిరానీతో చేయనున్న మున్నాభాయ్ 3 కూడా ట్రాక్‌లో ఉంది.
60ల పడిలోకి అడుగు పెడుతున్నా.. సంజయ్ దత్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అనన్య సామాన్యం. ఈ నేపథ్యంలో ఆయన చేయనున్న ఈ అధీర పాత్ర కూడా సంజయ్ కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోయేదిగా ఉండాలని ఆశిద్దాం.
‘విజయ్ దేవరకొండ’ని హిందీలో.. లాంచ్ చేయనున్న కరణ్ జోహార్…?
నాగార్జున ‘మన్మథుడు 2’ ట్రైలర్ టాక్ – “ఒక్కపూట భోజనం కోసం వ్యవసాయం చేయను”