హీరో నుంచి బిజినెస్‌మెన్ వరకు.. "సూపర్ స్టార్ మహేష్ బాబు" బర్త్ డే స్పెషల్ ..!

హీరో నుంచి బిజినెస్‌మెన్ వరకు.. "సూపర్ స్టార్ మహేష్ బాబు" బర్త్ డే స్పెషల్ ..!

సూపర్ స్టార్ కొడుకు.. సూపర్ స్టార్ అవ్వడం అనేది సినిమాల్లో అయితే సులువుగానే చూపించవచ్చు. కానీ నిజ జీవితంలో మాత్రం అది అంత సులువైన విషయం అస్సలు కాదు. అటువంటి ఒక కష్టతరమైన పనిని సూపర్ స్టార్ కృష్ణ గారి అబ్బాయి..  మహేష్ బాబు (Mahesh Babu) చేసి చూపించాడు. తండ్రి కేవలం ఒక సినిమా హీరోగా సూపర్ స్టార్ స్థాయికి చేరుకుంటే.. ఈ తనయుడు మాత్రం సినిమా వెలుపల కూడా ఒక బిజినెస్‌మెన్‌గా సూపర్ స్టార్ స్టేటస్‌ అందుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు "సరిలేరు నీకెవ్వరు" తో.. లేడీ సూపర్ స్టార్ రీ ఎంట్రీ..!

ఈ రోజుతో 43వ పడిలోకి అడుగుపెడుతున్న  మహేష్ బాబు తాను సినిమాల్లోనే కాదు.. ఒక బిజినెస్‌మెన్‌గా కూడా ఏ మాత్రం తక్కువ కాదని నిరూపిస్తున్నాడు. తాజాగా ఆయన ఆధ్వర్యంలో మొదలైన క్లోతింగ్ లైన్ - 'ది హంబుల్', అలాగే ఏడాది క్రితం మొదలైన AMB సినిమాస్ వంటివి ఆయనలోని బిజినెస్‌మెన్‌ని మనకు పరిచయం చేస్తున్నాయి.

ఇవే కాకుండా మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థలో.. మరొక హీరో అడవి శేష్‌ని కథానాయకుడిగా పెట్టి నిర్మాతగా ఒక సినిమాని తీస్తున్నాడు. దీన్ని బట్టి భవిష్యత్తులో కూడా ఆయన తన నిర్మాణ సంస్థ ద్వారా మరింతమంది హీరోలు, దర్శకులను సినీ పరిశ్రమకు పరిచయం చేస్తాడని తెలుస్తోంది.

మహేష్ బాబు దాదాపుగా ఒక డజన్ బ్రాండ్స్‌కి ప్రమోటర్‌గా ఉన్నాడు. దాదాపు భారతీయ చిత్ర సీమలోనే అత్యధిక సంఖ్యలో బ్రాండ్స్‌ని ప్రమోట్ చేస్తున్న వారిలో ఆయన కూడా ఒకరు. దీన్ని బట్టి ఆయన క్రేజ్ సినిమాని ఎప్పుడో దాటేసింది అని అర్థం చేసుకోవాలి. ఈ క్రేజ్ పుణ్యమాని, సోషల్ మీడియాలో.. అలాగే దేశ విదేశాల్లో మిలియన్ల సంఖ్యలో ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు.

ఆయనకి సంబంధించి ఏ విషయంలోనైనా అండగా నిలిచేందుకు వారు సిద్ధంగా ఉంటారన్నది కాదనలేని సత్యం. ఇక ఈ పుట్టినరోజు సందర్భంగా వారు ట్రెండ్ చేస్తున్న #HappyBirthdaySSMB ఇప్పుడు ట్విట్టర్‌లో టాప్ ట్రెండ్స్‌లో ఒకటిగా ఉంది. దీని బట్టి ఆయనకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ మనకు స్పష్టమవుతుంది.

అదే సమయంలో ఆయన ఇలా కెరీర్‌లో దూసుకుపోవడానికి ప్రధాన కారణం ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే. మహేష్ బాబు ఇంట్లో కుటుంబంతో సమయం గడపడం.. షూటింగ్స్‌లో పాల్గొనడం వంటి వాటికే ప్రాధాన్యం ఇస్తే, మిగిలిన అన్ని విషయాల్లోనూ నమ్రత కీలక పాత్ర పోషిస్తుంటుంది. దీంతో ఎటువంటి టెన్షన్స్ లేకుండా ఆయన సినిమాల్లో నటిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే.. ఒక సూపర్ స్టార్ వెనుక మరొక లేడీ సూపర్ స్టార్ రూపంలో నమ్రత ఉందని చెబుతూ.. ఆ క్రెడిట్ ఆమెకు ఇచ్చేయచ్చు.

యూట్యూబ్‌లోకి అడుగుపెట్టిన.. మహేష్ బాబు గారాలపట్టి సితార ..!

ఇదిలావుండగా,మహేష్ కెరీర్ పరంగా.. ఈ సంవత్సరమే 25 సినిమాల మార్క్‌ని అందుకోగలిగారు. బాలనటుడిగా చిన్నప్పుడు చాలా సినిమాలే చేసినప్పటికి.. హీరోగా తెరగేట్రం చేసింది 1999వ సంవత్సరంలో ... అలా 20 ఏళ్ళ సినిమా కెరీర్‌లో 25 చిత్రాలని పూర్తి చేశాడు మహేష్ బాబు. ఈ 25 సినిమాలలో సింహభాగం సూపర్ హిట్స్ ఉన్నాయి. అయితే ఫ్లాప్ అయిన సినిమాల్లో సైతం మహేష్ నటనకి వంక పెట్టే అవకాశం లేనంతగా ఆయన నటించాడు.

ఇటీవలే తన 25వ సినిమా మహర్షితో గతంలో తన పేరిట ఉన్న అన్ని రికార్డులని తిరగరాసి.. సరికొత్త రికార్డులని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు మహేష్. తాజాగా తన 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా; దిల్ రాజు & మహేష్ బాబు & ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

మొన్నీమధ్యనే ఈ సినిమాలో కీలక భాగమైన సన్నివేశాలను కశ్మీర్‌లో చిత్రీకరించారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుంది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా "సరిలేరు నీకెవ్వరు" చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదలైంది. ఈ లుక్ చూస్తుంటే సూపర్ స్టార్ మహేష్ బాబు మిలిటరీ ఆఫీసర్ పాత్రలో కచ్చితంగా అదరగొట్టేస్తాడు అని స్పష్టమవుతోంది.

ఆఖరుగా.. సూపర్ స్టార్ అనే ట్యాగ్ లైన్‌కి సరిగ్గా సరిపోయే..  మహేష్ బాబుకి మా POPxo తెలుగు తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

నాన్నకు ప్రేమతో: తన తండ్రికి.. ప్రిన్స్ మహేష్ బాబు ఇచ్చే బర్త్‌డే కానుక ఇదేనా?