ADVERTISEMENT
home / Bollywood
ఆ ఆలోచనలను తరిమికొట్టాలంటే.. సినిమా ఒక్కటే మార్గం కాదు: తాప్సీ

ఆ ఆలోచనలను తరిమికొట్టాలంటే.. సినిమా ఒక్కటే మార్గం కాదు: తాప్సీ

ఝుమ్మంది నాదం చిత్రంతో 2010లో టాలీవుడ్లో తెరంగేట్రం చేసిన సొట్టబుగ్గల సుందరి తాప్సీ. తెలుగులో వరుస అవకాశాలతో బిజీగా ఉన్న సమయంలోనే బాలీవుడ్ దిశగా అడుగులు వేయడమే కాదు.. చష్మే బద్దూర్, బేబీ, పింక్, ఘాజీ, ముల్క్, నామ్ షబానా, మన్మర్జియాన్, బద్లా.. మొదలైన చిత్రాలతో తనని తాను నిరూపించుకుంది కూడా. అంతేనా.. చక్కని అవకాశాలను అందిపుచ్చుకుంటూ మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లోనూ నటిస్తోంది. ఎలాంటి సినీనేపథ్యం లేకపోయినప్పటికీ పరిశ్రమలోని పరిస్థితులకు ఎదురొడ్డి తన అందం, నటనతో నటీమణిగా ఈ స్థాయికి ఎదిగింది తాప్సీ (Taapsee).

ప్రొఫెషనల్‌గా ఎంతో పక్కాగా వ్యవహరించే తాప్సీ మహిళలకు సంబంధించిన అంశాలకు సంబంధించి తన నిర్ణయాలను కూడా అంతే స్పష్టంగా వెల్లడిస్తుంది. అందుకే బాలీవుడ్‌లోని బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ నటీమణుల జాబితాలో ఈమె కూడా స్థానం సంపాదించుకుంది. తాజాగా అమ్మాయిల పీరియడ్స్ (menstruation) గురించి మాట్లాడుతూ ఈ విషయంలో సమాజంలో నెలకొన్న మూసధోరణులను తరిమి కొట్టడానికి సినిమాలు ఒక్కటే మార్గం కాదని చెప్పుకొచ్చింది.

2017లో మేఘన్ మెర్కల్ ఏ స్వచ్ఛంద సంస్థ ద్వారా కొన్ని అంశాలకు సంబంధించి మహిళల్లో అవగాహన కల్పించడానికి ప్రయత్నించారో.. అదే సంస్థతో తాజాగా తాప్సీ కూడా చేతులు కలిపింది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ- ‘పీరియడ్స్ రావడం అనేది నాకైనా, మేఘన్ మెర్కల్ కైనా లేక ఈ ప్రపంచంలో ఏ మహిళకైనా చాలా సర్వసాధారణ విషయం. ఒక గొప్ప శక్తితోనే గొప్ప బాధ్యత కూడా వస్తుందని నేను భావిస్తాను. అందుకే మేఘన్ మెర్కల్ వంటి శక్తిమంతురాలైన మహిళ దీని గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తే అది ఎక్కువ మందికి చేరుతుందని అనుకుంటున్నా.. అలాంటి శక్తిమంతమైన స్థానంలో ఆమె ఉన్నారు..’ అంటూ పీరియడ్స్ గురించి అవగాహన కల్పించాలని అన్నారు. అంతేకాదు.. పీరియడ్స్ గురించి మాట్లాడుకోవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితుల నుంచి బయటకు వచ్చి.. దాని గురించి స్వేచ్ఛగా మాట్లాడే రోజులు రావాలని తన అభిప్రాయం వ్యక్తం చేసింది తాప్సీ.

అయితే ఇది సాధ్యం కావాలంటే విద్యార్థి దశలోనే ఇందుకు సంబంధించిన అవగాహన అందరిలోనూ కలిగించాలంటోంది తాప్సీ. ‘ఈ రోజుల్లో కూడా దిల్లీ, ముంబయి వంటి సిటీల్లోనూ మధ్య తరగతి కుటుంబాల్లో పీరియడ్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇబ్బందికరంగా కనుసైగలు చేసుకోవడం లేదా చాలా చిన్న వాయిస్‌తో మాట్లాడడం వంటివి చేస్తుంటారు. ఇది నిజంగా చాలా శోచనీయం. విద్యార్థులు చదువుకునే బయాలజీ సబ్జెక్ట్‌లో పీరియడ్స్ గురించి ఒక పాఠం ఉంటుంది. కానీ ఆ పాఠం వినేటప్పుడు లేదా చెప్పుకోవాల్సిన సమయం వచ్చేటప్పటికే దాని గురించి రకరకాల మాటలు వారి చెవిన పడుతూ ఉంటాయి. వాటిలో కొన్ని వారికి ఇబ్బందికరంగానూ అనిపిస్తాయి. ఈ కారణంగా ఆ పాఠం చెప్పుకోవాల్సిన లేదా చర్చించుకోవాల్సిన సందర్భం వచ్చే సరికి అదొక హడావుడి తంతుగా, నామమాత్రంగా పూర్తి చేసేస్తూ ఉంటారు’ అంటూ విద్యార్థులు ఎదుర్కొనే పరిస్థితుల గురించి కూడా మాట్లాడింది తాప్సీ.

ADVERTISEMENT

అయితే ఇది ఏ మాత్రం సరికాదని, ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే.. మనందరం తీసుకోవాల్సిన మొదటి స్టెప్ పీరియడ్స్ గురించి నిర్భయంగా, నిస్సందేహంగా మాట్లాడాలని తెలిపిందామె.

ఎందుకంటే సక్రమంగా వచ్చే పీరియడ్స్ అమ్మాయిల ఆరోగ్యానికి ఓ సూచిక. మనం దాని గురించి మాట్లాడకపోవడం వల్ల మహిళలకు ఎదురయ్యే అనారోగ్య సమస్యలు చాలానే ఉంటున్నాయంటూ మహిళలు.. ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా తన గళాన్ని వినిపించింది తాప్సీ. అలాగే ఈ విషయంలో సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు సినిమాలు కేవలం ఒక మాధ్యమమేనని, అదొక్కటే మార్గం కాదని అభిప్రాయపడింది. ప్రతిఒక్కరూ ధైర్యంగా ముందడుగు వేసి.. ఈ పరిస్థితుల నుంచి సమాజాన్ని ముందుకు నడిపించాలని కోరింది.

ఇక కెరీర్ పరంగా చూస్తే.. తాప్సీ ప్రస్తుతం మూడు హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. వాటిలో మిషన్ మంగళ్, శాండ్ కి ఆంఖ్ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతుండగా; తడ్కా చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

ఇవి కూడా చదవండి

ADVERTISEMENT

మిషన్ మంగళ్ చిత్రం కోసం.. “ఇస్రో శాస్త్రవేత్తలు”గా మారిన స్టార్ హీరోయిన్స్

డియర్ కామ్రేడ్ మూవీ రివ్యూ – ప్రతి అమ్మాయికి ఒక ‘కామ్రేడ్’ అవసరం

RRR చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించేందుకు.. సిద్దమైన హాలీవుడ్ నటి ఎమ్మా రాబర్ట్స్ ?

26 Jul 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT