తాజ్ మహల్ (Taj mahal).. అద్భుతమైన ప్రేమకు చిహ్నం. భారత్‌లో ఉన్నవారే కాదు.. ప్రపంచంలో ఉన్న ప్రతిఒక్కరూ తాజ్ మహల్‌ని తమ జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాలని తహతహలాడడం మనకు తెలిసిందే. అలాంటి తాజ్ ఇప్పుడు మరో ఘనత సాధించింది. పాలిచ్చే తల్లుల కోసం ప్రత్యేకంగా గదిని (Breastfeeding room) నిర్మించిన తొలి భారతీయ యునెస్కో హెరిటేజ్ ప్లేస్‌గా తాజ్ మహల్ ఘనత సాధించింది.
పాలరాతితో కట్టిన ఈ కట్టడాన్ని చూసేందుకు ఏటా ఎనభై లక్షల మంది వరకూ పర్యటకులు ఇక్కడికి వస్తుంటారు. వీరిలో అన్ని వయసులకు చెందిన వారితో పాటు పాలిచ్చే తల్లులు కూడా ఉంటారు. అలాంటివారి కోసం ప్రత్యేకంగా ఓ గదిని నిర్మిస్తోంది భారత పురావస్తు శాఖ. ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ యునెస్కో హెరిటేజ్ ప్లేస్ తాజ్ మహల్. దీన్ని సాధించేందుకు ముఖ్య కారణం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉన్నతాధికారి వసంత్ కుమార్ స్వర్ణకార్. ఆయన విధుల్లో భాగంగా తాజ్ మహల్‌ని సందర్శించినప్పుడు.. అక్కడ జరిగిన సంఘటన ఈ నిర్ణయం తీసుకునేలా చేసిందట.
In a monumental move to make spaces safer and more comfortable for women, the #TajMahal becomes the first of three @UNESCO heritage sites to get a breastfeeding 🤱🏾room in its premises: https://t.co/q45eambSZX pic.twitter.com/b9WakdjyLX
— United Nations India (@UNinIndia) May 25, 2019
ఆయన తాజ్ మహల్ మెట్ల కింద తన బిడ్డకు పాలివ్వడానికి ఇబ్బంది పడుతున్న ఓ తల్లిని చూశారట. ఆమె భర్త తనని ఎవరూ చూడకుండా అడ్డంగా నిలబడ్డా.. అంతమంది మధ్యలో బిడ్డకు పాలివ్వడానికి ఆ తల్లి ఇబ్బందిగా ఫీలవ్వడం స్వర్ణ కార్ గమనించారు. బిడ్డకు పాలివ్వడం అనేది తల్లికి ఉండే హక్కు. ఆ హక్కును ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు పొందేందుకు ఏదైనా చేయాలని మేం భావించాం. అందుకే తాజ్ మహల్‌తో పాటు ఆగ్రా ప్రాంతంలో ఉన్న మరో మూడు ప్రాంతాల్లో బిడ్డలకు పాలిచ్చేందుకు వీలుగా బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేయాలని భావించాం.. అని ఆయన ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్‌తో పంచుకున్నారు.
తాజ్ మహల్‌తో పాటు మిగిలిన కట్టడాల్లో కూడా ఇలాంటి గదులను ఏర్పాటు చేయడం గురించి ఆయన చెబుతూ.. కేవలం ఆగ్రా, ఇండియాలో మాత్రమే కాదు.. ప్రపంచంలోనే ఎన్నో కట్టడాలు ఈ దిశగా ముందడుగు వేయాలని నేను భావిస్తున్నా. దీని వల్ల తల్లులు తమ పిల్లలకు సులభంగా పాలు పట్టే వీలుంటుంది.. అంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
తాజ్ మహల్ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న ఈ బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్ జులై కల్లా పూర్తయిపోతుంది. తాజ్ మహల్‌ని సందర్శించే మహిళలు ఎవరైనా సరే.. ఈ గదిని ఉపయోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ గదిలో కూర్చోవడానికి ఏర్పాట్లతో పాటు ఫ్యాన్, లైట్ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంచుతారట.
గతంలో పశ్చిమ బెంగాల్‌లోని ఓ మాల్‌లో పాలిస్తున్న తల్లిని.. బాత్రూంలోకి వెళ్లి పాలు ఇవ్వమని మాల్ యాజమాన్యం కోరడం పై సర్వత్రా నిరసన వ్యక్తమైన సంగతి తెలిసిందే. మన దేశంలో బహిరంగ ప్రదేశాల్లో పిల్లలకు పాలు పట్టడం అనేది ఇంకా కొందరు ఓ తప్పుగానే భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్‌ల అవసరం ఎంతైనా ఉంది. తాజ్ మహల్‌తో ప్రారంభమైన ఈ మార్పు కొద్దికొద్దిగా.. అన్ని ప్రదేశాలకు చేరుకొని దేశమంతటా ఇలాంటివి నెలకొల్పే రోజు రావాలని.. తల్లులు తమ బిడ్డలకు ఏమాత్రం ఇబ్బంది, సిగ్గు, భయం లాంటివి లేకుండా పాలిచ్చే స్థితి రావాలని కోరుకుందాం.
Featured Image: https://twitter.com/TajMahal
ఇవి కూడా చదవండి.
మంచి హాలీడేని ఎంజాయ్ చేయాలంటే.. ముస్సోరీ ట్రిప్‌ని ప్లాన్ చేసేయండి..!
వాలెంటైన్స్ డే రోజున.. ప్రకృతితోనూ ప్రేమలో పడిపోండి..
బిడ్డను ఎయిర్‌పోర్ట్‌లో మర్చిపోయి ఫ్లైట్ ఎక్కిందో తల్లి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
Image Source : UNESCO.