Bigg Boss Telugu: తమన్నా అవుట్.. అప్పుడే నాల్గవ వారం నామినేషన్స్ కూడా షురూ..!

Bigg Boss Telugu: తమన్నా అవుట్..  అప్పుడే నాల్గవ వారం నామినేషన్స్ కూడా షురూ..!

"బిగ్ బాస్ తెలుగు సీజన్ 3"లో ( Bigg Boss Telugu 3)  మూడు వారాలు నిన్నటి ఎపిసోడ్‌తో పూర్తి అయిపోయాయి. ఇప్పటివరకు ఇంటిని విడిచి ముగ్గురు సభ్యులు వెళ్లిపోగా.. అందులో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇంటికి వచ్చిన తమన్నా సింహాద్రి (Tamanna Simhadri) కూడా ఈ వారం నిష్క్రమించడం జరిగింది. దీనితో ప్రస్తుతం ఇంటిలోని సభ్యుల  సంఖ్య 13 కి చేరింది.

Bigg Boss Telugu 3 : కంటెస్టెంట్స్ దుమ్ము దులిపిన నాగార్జున .. తీవ్ర హెచ్చరికలు జారీ

ఇక నిన్నటి సండే ఎపిసోడ్ "ఫన్‌ డే"గా ఉంటుందని నాగార్జున ముందే చెప్పినట్టు.. ఇంటిలోని సభ్యులందరితో సరదాగా ఫన్నీ డ్యాన్సులను చేయించడం జరిగింది. అలాగే ఫన్నీ టాస్క్ 'అంకితం నీకే అంకితం'లో భాగంగా ఇంటి సభ్యులు ఒక్కొక్కరికి ఒక్కో కవర్ అందించారు. ఆ కవర్‌లోని కాగితంపై రాసున్న పాటని సభ్యులు.. అదే ఇంట్లోని మరో వ్యక్తికి ఎవరైనా  అంకితం ఇవ్వాలి. అలా ఎందుకు అంకితమిచ్చారో అన్నది కూడా సవివరంగా తెలియజేయాలి.

ఈ టాస్క్‌లో భాగంగా ముందుగా.. శ్రీముఖి కవర్ తెరిచి అందులో ఉన్న "'సై" సినిమాలోని "పంతం నీదా.. నాదా" పాటని రాహుల్ సిప్లిగంజ్‌కి అంకితమివ్వగా .. ఆ తరువాత శివ జ్యోతి తనకు వచ్చిన "మౌనంగనే ఎదగమనీ" పాటని  అలీ రెజాకి అంకితమిచ్చింది. ఇక బాబా భాస్కర్‌ తనకు వచ్చిన "ఒక్క మగాడు" పాటని తమన్నా సింహాద్రికి అంకితం చేయగా.. ఇద్దరు కలిసి ఆ పాటకి డ్యాన్స్ కూడా చేశారు. 

ఆ తరువాత పునర్నవి తనకు వచ్చిన "గురు" చిత్రంలోని.. "ఓ సక్కనోడా" పాటని రవిక్రిష్ణకి అంకితమిచ్చింది. అయితే ఇంటి సభ్యులు మాత్రం "చాలా సేఫ్‌గా ఆడింది గేమ్" అంటూ పునర్నవిని ఆటపట్టించారు. ఇక హిమజ  తనకు వచ్చిన "నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డి" పాటని.. ఏమాత్రం కూడా తడుముకోకుండా బాబా భాస్కర్‌కి డేడికేట్ చేయగా.. ఆ తర్వాత ఇద్దరు కలిసి డ్యాన్స్ చేశారు. ఈ సందర్భంగా "నువ్వు బాబా భాస్కర్ నుండి డ్యాన్స్ నేర్చుకోవాలి" అని హిమజకి సలహా కూడా ఇచ్చారు నాగ్.

"కొబ్బరిమట్ట" మూవీ రివ్యూ - ఇది సంపూ మార్క్ కామెడీ

ఇదంతా జరుగుతుండగా, టాస్క్‌లో రొమాంటిక్ మూడ్‌ని సెట్ చేసింది మాత్రం వరుణ్ సందేశ్, వితికల జంట అని చెప్పచ్చు. ఎందుకంటే వరుణ్ సందేశ్ తన కవర్‌ని తెరిచి వెంటనే 'కన్నుల్లో నీ రూపమే' పాటని.. తన భార్య వితికకి డేడికేట్ చేశారు. ఒకవేళ ఈ పాట డేడికేట్ చేయడానికి "నీ భార్య ఈ ఇంటిలో లేకపోతే, ఎవరికి అంకితం ఇస్తావు" అని నాగ్ అడగగా - రాహుల్ సిప్లిగంజ్‌కి అంకితం చేస్తానని తెలిపాడు. ఆ తర్వాత వితిక తనకు వచ్చిన లవ్ సాంగ్ "నాలో నేను.. నీవయ్యాను" అనే పాటను చాలా తెలివిగా శివజ్యోతికి అంకితమిచ్చింది. 

ఆ తరువాత రాహుల్ సిప్లిగంజ్ తనకి వచ్చిన "ఇడియట్" చిత్రంలోని.. "చూపులతో గుచ్చి గుచ్చి చంపకే" పాటని రోహిణికి అంకితమివ్వగా.. దానిని కూడా సేఫ్ గేమ్ అంటూ అందరూ ఆటపట్టించారు. అలా సాగిపోయిన ఈ ఫన్నీ టాస్క్‌లో ఆ తరువాత వచ్చిన పాటను అశు రెడ్డి తనకు వచ్చిన "గోవిందా గోవిందా" పాటను .. వితికకి అంకితమివ్వగా.. అలీ రెజా తనకు వచ్చిన "నీ దూకుడు" సాంగ్‌ని రవిక్రిష్ణకు అంకితం ఇచ్చాడు. రవిక్రిష్ణ తనకు వచ్చిన "తమ్ముడు" సినిమాలోని "లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ది మిర్రర్" సాంగ్‌ను అలీకి డెడికేట్ చేశాడు. ఆ తర్వాత మహేష్ విట్టా తనకు వచ్చిన "అమ్మ బ్రహ్మదేవుడో.. కొంపముంచినావురో" సాంగ్‌ని పునర్నవికి అంకితం ఇవ్వడంతో మళ్లీ షో మొత్తం నవ్వులు పూశాయి.

అయితే ఈ పాట కంప్లీట్ అవ్వగానే.. అలీ రెజా ఫైర్ బాక్స్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టడంతో.. మళ్లీ అందరూ నవ్వుకున్నారు. ఈ పాట వల్ల ఎవరికో కాలుతుందనే భావన వస్తుందని చెబుతూ.. నాగార్జున కూడా నవ్వేయడం కొసమెరుపు. అలాగే రోహిణి తనకు వచ్చిన "దొంగా దొంగా వచ్చాడే.. అన్నీ దోచుకుపోతాడే" సాంగ్‌ని బాబా భాస్కర్ కి అంకితమిచ్చింది. 

అయితే ఈ మొత్తం టాస్క్‌లో హైలైట్ ఏంటంటే - తమన్నా సింహాద్రి తనకు వచ్చిన.. 'మగాళ్ళు ఒట్టి మాయగాళ్లే...' అనే పాటని రవిక్రిష్ణకి అంకితమివ్వడం. దీనిని నాగార్జున, హౌస్ మేట్స్‌తో పాటు.. షో చూస్తున్న ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేశారు.

ఇదిలావుండగా... వెన్నెల కిషోర్.. ఈ ఎపిసోడ్‌కి స్పెషల్ గెస్ట్‌గా రావడం.. ఆయన ఇంటి సభ్యులందరి గురించి ఒక్కొక మాట చెప్పడం.. అలాగే వారి గురించి బయటి ప్రజలు ఏమనుకుంటున్నారు? అని కూడా చాలా ఫన్నీగా చెప్పడం అందరిని ఆకట్టుకుంది. వెన్నెల కిషోర్ ఉన్నంతసేపు కూడా.. షోలో నవ్వులే నవ్వులు.

చివరగా తమన్నా సింహాద్రి ఇంటి నుండి ఎలిమినేట్ అవుతున్నట్టు ప్రకటించాక.. ఇంటి నుండి వెళ్లిపోయే సమయంలో కూడా ఆమె రవికృష్ణతో మాట్లాడేందుకు లేదా అతన్ని క్షమించేందుకు గానీ ఇష్టపడకపోవడం గమనార్హం. ఆ విధంగా మూడవ వారం ముగియగా... నాల్గవ వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రోమో విడుదలైంది. ఆ ప్రోమోలో చూపిస్తున్నట్లుగా నామినేషన్ ప్రక్రియ చాలా ఆసక్తికరంగా ఉంది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 రివ్యూ.. టైటిల్ గెలిచే కంటెస్టెంట్ ఎవరు?