ADVERTISEMENT
home / సౌందర్యం
ప్రతి పెళ్లికూతురి మేకప్ కిట్‌లో.. తప్పక ఉండి తీరాల్సిన వస్తువులు ఇవే..!

ప్రతి పెళ్లికూతురి మేకప్ కిట్‌లో.. తప్పక ఉండి తీరాల్సిన వస్తువులు ఇవే..!

పెళ్లి.. ప్రతిఒక్కరి జీవితంలోనూ ఎంతో ప్రత్యేకమైన ఘట్టం. సాధారణంగా పెళ్లికి హాజరయ్యేవాళ్లే నలుగురిలోనూ అందంగా, ప్రత్యేకంగా కనిపించాలని తెగ ఆశపడుతూ ఉంటారు. మరి, పెళ్లి వేడుకలోనే ప్రధానంగా నిలిచే పెళ్లికూతురు (Bride) సంగతేంటి?? నవవధువులా అందరిలోనూ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలవాలని ఆశపడడం సహజమే కదా.. అందుకే కొందరమ్మాయిలు పెళ్లికి కొద్ది రోజుల ముందు నుంచే సౌందర్యపరంగా రకరకాల సహజసిద్ధమైన జాగ్రత్తలు తీసుకుంటూ, చిట్కాలు పాటిస్తూ ఉంటారు.

అయితే పెళ్లిలో అందంగా మెరిసిపోవాలంటే వీటితో పాటు.. ఆ రోజు వేసుకునే మేకప్ విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే. అలాగే పెళ్లి వేడుక మొదలైన దగ్గర్నుంచి ముగిసే వరకు.. ముఖంలోని మెరుపు, తాజాదనం.. వంటివి చెక్కు చెదరకుండా ఉండాలంటే.. ప్రతి పెళ్లికూతురు కొన్ని వస్తువులు తన వద్ద ఉండే మేకప్ కిట్‌‌‌లో (Makeup kit) భాగం చేసుకోవాల్సిందే. ఇంతకీ నవవధువుల వద్ద మేకప్ కిట్‌ ఉంటే.. అందులో ఉండి తీరాల్సిన ఆ వస్తువులేవి? అవి ఎంపిక చేసుకొనేటప్పుడు ఫాలో అవ్వాల్సిన ఆ చిట్కాలేంటి? ఓసారి మనమూ తెలుసుకుందాం..

నవవధువు మేకప్ ఉత్పత్తులు ఎంచుకొనేటప్పుడు పాటించాల్సిన చిట్కాలు..

పెళ్లికి సంబంధించిన షాపింగ్ మొదలుపెట్టే ముందు.. మన బుర్రలో ఉండే ఆలోచనలు, సందేహాలు.. చాలానే ఉంటాయి. ముఖ్యంగా మేకప్ ఉత్పత్తుల విషయానికి వచ్చే సరికి ఏ తరహావి ఎంపిక చేసుకోవాలి? ఏవి నాణ్యమైనవి? ఏ ఉత్పత్తులు మన లుక్‌ని మరింత ఇనుమడించేలా చేస్తాయి?.. ఇలా ఎన్ని సందేహాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీటన్నింటికీ సమాధానాలు దొరకాలంటే మేకప్ ఉత్పత్తుల కోసం షాపింగ్ చేసే సమయంలో మనం తప్పకుండా ఫాలో అవ్వాల్సిన చిట్కాలు కొన్ని ఉన్నాయి. 

ADVERTISEMENT

ఏ షేడ్ నప్పుతుంది?

మేకప్ కిట్‌లో అన్నింటికంటే ముఖ్యమైంది, మనకు అందమైన లుక్‌ని ఇవ్వడంలో కీలక పాత్ర పోషించేది ఫౌండేషన్. దీన్ని కొనుగోలు చేయడానికి వెళ్లే ముందు.. అసలు మీకు ఏ షేడ్ ఫౌండేషన్ అయితే బాగా నప్పుతుందో ముందుగా మీరు తెలుసుకోవాలి. ఇందుకోసం అవసరమైతే మీకు బాగా తెలిసిన సౌందర్య నిపుణుల సహాయం తీసుకోవచ్చు. లేదా స్టోర్‌‌లో ఎక్స్‌పర్ట్స్ సాయం కూడా పొందవచ్చు.

అలాగే ఫౌండేషన్ కొనుగోలు చేసే ముందు ఒకసారి మీ చేతి చర్మం మీద.. దానిని అప్లై చేసుకోవడం ద్వారా కూడా అది మీకు సరిపడుతుందో లేదో చెక్ చేసుకోవచ్చు. అవకాశం ఉంటే వధువుగా.. మీకు మేకప్ వేసే బ్యూటీ ఎక్స్‌పర్ట్‌ని మీ వెంట తీసుకెళ్లచ్చు.

ఫౌండేషన్ కొనుగోలు చేసే సమయంలో అది మీ చర్మఛాయకు నప్పుతుందో లేదో తెలుసుకునేందుకు కేవలం చేతులకే కాదు.. మెడ, భుజం, మణికట్టు.. ఇలా మీ ముఖఛాయకు దగ్గరగా ఉండే భాగాలలో కూడా అప్లై చేసి చూడవచ్చు. అయితే మణికట్టుపై అప్లై చేసుకోవడం ద్వారా వీటిని సులభంగా ఎంపిక చేసుకునే వీలు ఉంటుంది. సాధారణంగా భారతదేశంలో పీచ్, గోల్డెన్ లేదా యెల్లోయిష్ స్కిన్ టోన్స్‌కి నప్పేలా వార్మ్ అండర్ టోన్స్‌ను ఎక్కువగా ఎంపిక చేసుకుంటారు.

అయితే ఫౌండేషన్ ఎంపిక చేసుకునే సమయంలో.. మనం ఒక షేడ్‌ను చర్మానికి అప్లై చేసుకున్న తర్వాత కాస్త సమయం వేచి చూడాలి, తర్వాత అది మీ స్కిన్ షేడ్‌లో కలుస్తుందో లేదో చెక్ చేసుకున్నాక.. అంతకన్నా బెటర్ షేడ్ ఫౌండేషన్‌ను మీరు కొనుగోలు చేయచ్చు.

ADVERTISEMENT

అధిక సమయం నిలిచి ఉండాలి..

కొన్ని బ్రాండ్స్ లిప్‌‌స్టిక్స్, మేకప్ ఉత్పత్తులు చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి. కానీ వాటిని అప్లై చేసుకున్న తర్వాత.. అధిక సమయం అవి నిలిచి ఉండవు. కాబట్టి పెళ్లి సమయంలో ఇలాంటి ఉత్పత్తులను ఎంపిక చేసుకోకపోవడమే మంచిది. ముఖ్యంగా పెళ్లి తర్వాత నిర్వహించే వేడుకలు, హనీమూన్.. వంటి వాటికి ఇవి అస్సలు నప్పవు. అందుకే మేకప్ ఉత్పత్తులు ఎంపిక చేసుకునే సమయంలో నాణ్యమైనవి, అధిక సమయం నిలిచి ఉండేవే ఎంపిక చేసుకోవాలి. అలాగే వాటర్‌ప్రూఫ్ ఉత్పత్తులైతే మరీ మంచిది. ఎక్కువ చెమట పట్టినా మేకప్ గురించి చింతించాల్సిన అవసరం ఉండదు.

స్టైల్ ముఖ్యం కాదు..

మేకప్ ఉత్పత్తులు కొనుగోలు చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన మరో విషయం.. పరిమాణం కంటే నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వడం. అలాగని మరీ భారీగా ఖర్చు పెట్టి.. మేకప్ ఉత్పత్తులు కొనుగోలు చేయమని అర్థం కాదు. పెళ్లికి సంబంధించి షాపింగ్ చేసేటప్పుడు మంచి నాణ్యత కలిగినవి ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయంలో మాత్రం అస్సలు రాజీపడద్దు. మనకు స్టైల్ కంటే లుక్ చాలా ముఖ్యం అని గుర్తుంచుకోండి.

అధికంగా ఖర్చు పెట్టకండి..

మేకప్ ఉత్పత్తుల్లో భాగంగా మీకు ఏవేవి అవసరమో ముందుగా ఒక లిస్ట్ రాసుకోండి. దాని ప్రకారమే షాపింగ్ చేసేందుకు ప్రయత్నించండి. వీలైనంత వరకు మల్టీపర్పస్‌గా ఉపయోగించే ఉత్పత్తులు కొనుగోలు చేయాలని ఆలోచించండి. లేదంటే ఒక్కో అవసరానికి ఒక్కొక్క మేకప్ ఉత్పత్తి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఫలితంగా మేకప్ కిట్‌లో పెట్టుకునే ఉత్పత్తుల సంఖ్య ఎక్కువగా ఉండడమే కాదు.. వాటిని మీ వెంట పెట్టుకునేందుకు మీకూ ఇబ్బందిగానే ఉంటుందని గ్రహించండి. అలాగే ఏ ఉత్పత్తికైనా ఎక్స్‌పైరీ డేట్ ఉన్నట్లే.. వీటికి కూడా ఉంటాయి. కాబట్టి వాటిని కూడా చెక్ చేసి తీరాల్సిందే. లేదంటే డబ్బు ఖర్చు పెట్టి కూడా.. టైమ్ వేస్ట్ చేసుకున్నట్లు అవుతుంది. 

ముందే పరీక్షించి చూడండి..

ADVERTISEMENT

Shutterstock

సాధారణంగా మేకప్ ఉత్పత్తులనేవి నాణ్యమైనవి, మీ చర్మతత్వానికి నప్పేవి అయి ఉండాలి. అటువంటి ఉత్పత్తులనే మీరు కొనుగోలు చేయడం శ్రేయస్కరం. అలాకాకుండా కొత్త బ్రాండ్స్ ఏవైనా ప్రయత్నించాలని భావిస్తే.. ముందుగానే వాటిని అప్లై చేసుకోవడం ద్వారా పరీక్షించి చూడాలి. ఫలితంగా వాటి గురించి మరింత నిశితంగా తెలుసుకునే వీలు ఉంటుంది. తద్వారా పెళ్లి సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే జాగ్రత్తపడచ్చు.

మేకప్ కిట్‌లో ఉండి తీరాల్సిన ఉత్పత్తులు..

మేకప్ కిట్‌లో కొన్ని ఉత్పత్తులు తప్పనిసరిగా ఉండి తీరాల్సిందే. ముఖ్యంగా పెళ్లి సమయం కోసం సిద్ధం చేసుకునే కిట్‌లో అయితే.. కేవలం మేకప్‌కు మాత్రమే సంబంధించినవి మాత్రమే కాకుండా.. నవవధువు అవసరాలకు తగినట్లుగా కూడా కొన్ని ఉత్పత్తులను భాగం చేయాల్సి ఉంటుంది. అవేంటంటే..

ADVERTISEMENT

ప్రైమర్

మన ముఖం అధిక సమయం తాజాగా కనిపించాలన్నా, ఫొటోల్లో ఫ్రెష్ లుక్‌తో అదరగొట్టాలన్నా అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అలాగే వేసుకున్న మేకప్ కూడా అధిక సమయం మనకు తాజా లుక్‌ని ఇవ్వాలి. ఇది సాధ్యం కావాలంటే.. మనం ఉపయోగించే మేకప్ ఉత్పత్తుల్లో ప్రైమర్ తప్పనిసరిగా భాగం కావాల్సిందే. ముందుగా ప్రైమర్ అప్లై చేసుకున్న తర్వాతే మేకప్ వేసుకోవడం ప్రారంభించాలి.

ఫౌండేషన్

చర్మం అంతా సమాన ఛాయలో మెరిసిపోవాలంటే అందుకు ఫౌండేషన్ అప్లై చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే చర్మఛాయకు నప్పే ఫౌండేషన్ ఎంపిక చేసుకున్నప్పుడే.. ఇది సాధ్యమవుతుందని గుర్తుంచుకోండి. లేదంటే సహజసిద్ధమైన లుక్ కాకుండా మీ లుక్ మరీ హెవీగా లేదా ఎబ్బెట్టుగా కనిపించే అవకాశాలున్నాయి.

కాంటూర్

మీ ముఖంలో ఏయే భాగాలు అందంగా కనిపిస్తాయో వాటిని స్పెషల్‌గా హైలైట్ చేయాలనుకుంటున్నారా?? ముక్కు, దవడ భాగాలలో స్లిమ్‌గా కనిపించడం ద్వారా.. లుక్ నాజూగ్గా కనిపించాలనుకుంటున్నారా? అయితే మేకప్ కిట్‌లో కాంటూర్ తప్పకుండా ఉండాల్సిందే.

కన్సీలర్

మనలో చాలామందికి చర్మంపై అక్కడక్కడ మచ్చలు, రంధ్రాలు.. వంటివి ఉండడం సహజమే. వాటిని మేకప్ సహాయంతో కవర్ చేయడానికి కన్సీలర్‌ ని ఉపయోగించాల్సిందే. అందుకే దీనిని కూడా మేకప్ కిట్‌లో తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.

ADVERTISEMENT

హైలైటర్

Shutterstock

పెళ్లి సమయంలో మనం ధరించే అవుట్ ఫిట్స్ కాస్త హెవీగానే ఉంటాయి. మరి, వీటిలో అందంగా మెరిసిపోవాలంటే.. మేకప్ కూడా వాటికి తగ్గట్టుగానే వేసుకోవాల్సి ఉంటుంది. ముఖంలోని అందమైన భాగాలను మరింత అందంగా తీర్చిదిద్దుతూ.. మనల్ని స్పెషల్‌గా మెరిపించే హైలైటర్ కూడా మేకప్ కిట్‌లో ఉండేలా చూసుకోవాలి.

బ్రాంజర్

రాత్రి వేళల్లో జరిగే పార్టీల్లో మనం అందంగా కనిపించాలన్నా; పెళ్లి తర్వాత జరిగే వేడుకల్లో సింపుల్‌గా మెరిసిపోవాలన్నా.. అందుకు బ్రాంజర్ ఉపయోగించి తీరాల్సిందే. దీనిని చీక్ బోన్స్ వద్ద అప్లై చేసుకోవడం ద్వారా లుక్‌ని మరింత ఇనుమడింపచేసుకోవచ్చు.

ADVERTISEMENT

బ్లష్

ముఖమంతటినీ చక్కగా తీర్చిదిద్దుకొని.. చెంపలను మాత్రం అలానే వదిలేస్తే లుక్ ఏం బాగుంటుంది చెప్పండి?? అందులోనూ నవవధువుగా సిగ్గుల మొగ్గలైపోతున్న.. అమ్మాయి చెంపలు ఎరుపెక్కుతూ ఉంటాయి. వాటిని మరింత అందంగా కనిపించేలా చేయాలంటే.. అందుకు బ్లష్ ఉపయోగించాల్సిందే. చెంపల్లో కెంపులు పూయించాల్సిందే.

కాంపాక్ట్

మేకప్ వేసుకోవడం అంతా పూర్తైన తర్వాత.. కాంపాక్ట్ పౌడర్‌తో దానిని సెట్ చేసుకుంటేనే లుక్ ఇనుమడిస్తుంది. బ్రష్ లేదా స్పాంజ్ సహాయంతో కాంపాక్ట్ పౌడర్‌ని.. అలా అలా అప్లై చేసుకోవడం ద్వారా మరింత ప్రకాశవంతంగా మనం కనిపించవచ్చు. ఒకవేళ దీనిని ఉపయోగించడం అంతగా ఇష్టం లేనివారు.. దీని బదులుగా సాధారణ పౌడర్ కూడా ఉపయోగించవచ్చు.

లిప్ బామ్

పెదవులకు తేమను అందిస్తూనే.. వాటిని అందంగా కనిపించేలా చేసే సాధనాల్లో లిప్ బామ్ కూడా ఒకటి. కాబట్టి లిప్ మేకప్ వేసుకోవడానికి ముందు.. పెదవులకు లిప్ బామ్ అప్లై చేసుకోవడం ద్వారా.. అవి పొడిబారకుండా చక్కగా కనిపించేలా చేయచ్చు.

లిప్ లైనర్, లిప్ స్టిక్

ADVERTISEMENT

Shutterstock

లిప్ మేకప్ అనగానే అందరికీ ఎక్కువగా గుర్తుకొచ్చేది లిప్‌స్టిక్. కానీ ఈ లిప్‌స్టిక్ అందంగా కనిపించాలంటే అందుకు లిప్ లైనర్ కూడా తప్పకుండా అప్లై చేసుకోవాల్సిందే. అయితే ఇది లిప్ స్టిక్ షేడ్‌కు ఒకటి లేదా రెండు షేడ్స్ డార్క్‌గా ఉండేదే ఎంపిక చేసుకోవాలి. అలాగే పెళ్లి సమయంలో ఉపయోగించే లిప్ స్టిక్ షేడ్స్ కూడా ముందే పక్కకు తీసి పెట్టుకోవాలి.

ఐ లైనర్

ఐ లైనర్ లేని ఐ మేకప్‌ని మీరు ఊహించగలరా?? కళ్లు అందంగా కనిపించాలంటే వాటిని ఐ లైనర్‌తో తీర్చిదిద్దాల్సిందే. ఈ రోజుల్లో వీటిలోనూ చాలా షేడ్స్ లభ్యమవుతున్నాయి. వీటిలో మీకు ఏది నప్పుతుందో, అవుట్ ఫిట్‌కు మ్యాచ్ అవుతుందో ముందే సరిచూసుకుని.. దానిని ఓసారి అప్లై చేసుకుని చూడండి. తద్వారా అది మీకు నప్పుతుందో, లేదో కూడా తెలుసుకోవచ్చు.

ఐ షాడో

నలుగురిలోనూ మనల్ని ప్రత్యేకంగా నిలబెట్టాలన్నా, ధరించిన అవుట్ ఫిట్స్‌కు చక్కని లుక్ అందించాలన్నా అది చక్కని ఐ మేకప్‌తోనే సాధ్యం. ముఖ్యంగా కళ్లకు వేసుకునే ఐ షాడో ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి డార్క్ షేడ్స్ ఉపయోగించడం ద్వారా.. నవవధువులు తమ లుక్‌ని ఇనుమడింపచేసుకోవచ్చు.

ADVERTISEMENT

ఐ బ్రో పెన్సిల్

Shutterstock

సాధారణంగా చాలామంది అమ్మాయిల కనుబొమ్మలు చక్కని ఆకారంలో ఉంటాయి. వాటిని మరింత అందంగా తీర్చిదిద్దుకోవడం లేదా పలుచగా ఉన్న ప్రాంతాల్లో పెన్సిల్‌తో కవర్ చేసుకోవడం ద్వారా చక్కని చుక్కలా మెరిసిపోవచ్చు. కాబట్టి మీ మేకప్ కిట్‌లో దీనికి కూడా స్థానం ఇవ్వండి.

కాజల్

కళ్లకు కాటుక అందం అన్నారు పెద్దలు. నిజమే మరి.. కళ్లకు ప్రత్యేకమైన అందాన్ని, కళను తీసుకురావాలంటే అది కాటుకతోనే సాధ్యం. అదేనండీ.. కాజల్.. ఇది కళ్లను పలు ఇన్ఫెక్షన్ల బారి నుంచి కూడా కాపాడుతుంది.

ADVERTISEMENT

మస్కారా

కనురెప్పలకు ఉండే వెంట్రుకలు చాలా చిన్నవిగా ఉండడంతో పాటు.. కొందరికి పలుచగానూ ఉంటాయి. ఫలితంగా కళ్లు అంత అందంగా కనిపించకపోవచ్చు. కాబట్టి వాటిని మస్కారాతో హైలైట్ చేసుకోవడం ద్వారా కళ్ల అందాన్ని పెంచుకోవచ్చు.

మాయిశ్చరైజర్

పెళ్లి వేడుకలో నవవధువుగా అందంగా కనిపించాలంటే.. అందుకు చర్మం కూడా తాజాగా ఉండాల్సిందే. కాబట్టి చర్మం పొడిబారినట్లు అనిపించిన ప్రతిసారీ.. అప్లై చేసుకునేందుకు వీలుగా నాణ్యమైన మాయిశ్చరైజర్ కూడా మేకప్ కిట్‌‌లో పెట్టుకోవాల్సిందే.

నెయిల్ పెయింట్, రిమూవర్

పెళ్లి అంటేనే హడావుడిగా ఉంటుంది. మరి, ఇలాంటి పరిస్థితుల్లో చేతి గోళ్లకు ఉండే నెయిల్ పాలిష్ ఊడిపోవడం లేదా చెదిరిపోవడం.. వంటివి జరిగితే?? దానిని తిరిగి ఫిక్స్ చేసుకోవాలి కదా.. అందుకు వీలుగా మ్యాచింగ్ నెయిల్ పెయింట్, నెయిల్ పాలిష్ రిమూవర్‌ని కూడా మేకప్ కిట్‌లో అందుబాటులో ఉంచుకోండి.

మేకప్ బ్రష్‌లు, స్పాంజ్‌లు

వేసుకున్న మేకప్ సరిచేసుకోవాలన్నా లేక మళ్లీ మేకప్ వేసుకోవాలన్నా అందుకు శుభ్రమైన మేకప్ బ్రష్‌లు, స్పాంజ్‌లు తప్పనిసరిగా అందుబాటులో ఉండాల్సిందే. అందుకే మేకప్ కిట్‌లో ఇవి కూడా ఉండి తీరాల్సిందే.

ADVERTISEMENT

దూది..

సౌందర్యాలంకరణలో భాగంగా దూది అవసరం మనకు ఎప్పుడైనా రావచ్చు. అది నెయిల్ పాలిష్ అప్లై చేసుకొనేటప్పుడు లేదా తొలగించేటప్పుడు, పౌడర్ అప్లై చేసుకొనేటప్పుడు.. ఇలా ఏ సందర్భం అయినా కావచ్చు. కాబట్టి నవవధువుల మేకప్ కిట్‌లో ఇది కూడా తప్పకుండా ఉండాల్సిన వస్తువుల్లో ఒకటి.

చిన్న అద్దం..

Shutterstock

మేకప్ అంటే పెద్ద అద్దం ముందు కూర్చొని.. చెక్కుచెదరకుండా బొమ్మలా తయారు కావడం అని అనుకోకండి. అవసరమైతే ఉన్న స్థలంలోనే కొన్నిసార్లు మేకప్ ఫిక్స్ చేసుకోవాల్సి రావచ్చు. అటువంటి సందర్భాలకు వీలుగా ఒక చిన్న అద్దం కూడా మీ వెంట ఉండాల్సిందే.

ADVERTISEMENT

హెయిర్ పిన్స్, సేఫ్టీ పిన్స్, దువ్వెన..

హెయిర్ స్టైల్ చెదిరినప్పుడు లేదా సర్దుకోవాల్సి వచ్చినప్పుడు.. అందుకు వీలుగా కొన్ని హెయిర్ పిన్స్ దగ్గర పెట్టుకోవాలి. అలాగే సేఫ్టీ పిన్స్, దువ్వెన.. వంటివి కూడా వెంట ఉంచుకోవడం మంచిది.

శానిటరీ న్యాప్ కిన్స్

కొందరు అమ్మాయిలకు సరిగ్గా పెళ్లి సమయంలోనే నెలసరి టెన్షన్ కూడా ఉంటుంది. ఫలితంగా పెళ్లిపై కంటే ఎక్కడ నెలసరి వచ్చేస్తుందా?? అనే టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. దీని నుంచి బయటపడాలంటే అందుకు సిద్ధంగా ఉండడం ఒక్కటే మార్గం. అందుకే మేకప్ కిట్‌లో కొన్ని శానిటరీ న్యాప్ కిన్స్ కూడా వెంట ఉంచుకుంటే.. ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండచ్చు.

రోజ్ వాటర్

మేకప్ వేసుకున్న తర్వాత అది అధిక సమయం నిలిచి ఉండాలన్నా, మన చర్మం ఎక్కువసేపు తాజాగా కనిపించాలన్నా.. అది రోజ్ వాటర్ తోనే సాధ్యం. ఇందుకోసం ముఖం శుభ్రం చేసుకున్న వెంటనే పొడి వస్త్రంతో తుడుచుకొని మేకప్ వేసుకోవడానికి ముందు.. కాటన్ బాల్‌ని రోజ్ వాటర్‌లో ముంచాలి. తర్వాత ముఖం, మెడ భాగాలను తుడుచుకోవాలి. తర్వాత కాసేపు ఆరనిచ్చి.. అప్పుడు మేకప్ వేసుకోవడం మొదలుపెట్టాలి.

మేకప్ రిమూవర్

మేకప్‌లో ఏవైనా పొరపాట్లు జరిగినప్పుడు.. ఒక్కోసారి వాటిని సరిదిద్దుకునే వీలు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు పూర్తిగా మేకప్ తొలగించుకోవాల్సి రావచ్చు. అందుకు వీలుగా.. మేకప్ రిమూవర్‌ని సైతం మేకప్ కిట్‌లో పెట్టుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది.

ADVERTISEMENT

బ్రైడల్ మేకప్ అధిక సమయం నిలిచి ఉండేందుకు చిట్కాలు..

పచ్చని పందిరిలో నవవధువుగా అందంగా మెరిసిపోయేందుకు బ్రైడల్ మేకప్ వేసుకుంటూ ఉంటారు అమ్మాయిలు. అయితే ఈ మేకప్ అధిక సమయం నిలిచి ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే. అవి..

ఎక్స్‌ఫోలియేషన్ తప్పనిసరి..

నవవధువుగా ముస్తాబయ్యేందుకు కాసేపటి ముందుగానే ముఖం, మెడ.. వంటి భాగాలను ఎక్స్‌ఫోలియేషన్ చేసుకోవడం చాలా మంచిది. ఫలితంగా చర్మం శుభ్రపడి సహజసిద్ధంగా ప్రకాశవంతంగా కనిపించే వీలు ఉంటుంది. ఆ తర్వాత రోజ్ వాటర్ అప్లై చేసి.. కాసేపు ఆరనిచ్చిన అనంతరం మేకప్ వేసుకుంటే అది అధిక సమయం తాజాగా నిలిచి ఉంటుంది.

మాయిశ్చరైజర్‌తో సిద్ధం చేయండి..

మేకప్ వేసుకోవడానికి ముందు.. చర్మానికి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం ద్వారా సన్నద్ధం చేయాలి. ఇది పూర్తిగా చర్మం లోపలకు ఇంకే వరకు.. బాగా  మర్దన చేసి ఆ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి.. మేకప్ వేసుకోవడం మొదలుపెట్టాలి. ఇలా చేయడం వల్ల చక్కని ఫలితం కనిపిస్తుంది.

ప్రైమర్ ఉపయోగించాల్సిందే..

మేకప్ వేసుకునే క్రమంలో నేరుగా ఫౌండేషన్‌తో ప్రారంభించడం కాకుండా.. మొదట ప్రైమర్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చర్మానికి, మేకప్‌కు మధ్య వారధిలా ఉండి.. అధిక సమయం ఫ్రెష్ లుక్‌తో మనల్ని మెరిసేలా చేస్తుంది.

ADVERTISEMENT

ఫౌండేషన్ జాగ్రత్తగా..

మేకప్ వేసుకోవడంలో భాగంగా ఫౌండేషన్ అప్లై చేసుకొనేటప్పుడు.. చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఫౌండేషన్ మరీ ఎక్కువగా అప్లై చేసుకున్నా.. లుక్ ఎబ్బెట్టుగా కనిపించే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి దీనిని చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి.

వాటర్ ప్రూఫ్ ఉత్పత్తులు..

బ్రైడల్ మేకప్ నిమిత్తం ఉపయోగించే ఉత్పత్తులు తప్పనిసరిగా.. వాటర్ ప్రూఫ్‌వి అయి ఉండేలా చూసుకోవాలి. లేదంటే అధిక చెమట కారణంగా మేకప్ చెదిరిపోయే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.

సెట్టింగ్ స్ప్రే..

మేకప్ అధిక సమయం నిలిచి ఉండేందుకు.. ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల్లానే మేకప్ వేసుకోవడం పూర్తైన తర్వాత కూడా ఓ జాగ్రత్త తీసుకోవాలి. అదేంటంటే.. సెట్టింగ్ స్ప్రేతో ముఖంపై స్ప్రే చేసుకోవడం.. ఇది మన లుక్‌ని అధిక సమయం తాజాగా కనిపించేలా చేయడంతో పాటు.. మేకప్ చెదిరిపోకుండా నిలిచి ఉండేలా కూడా చేస్తుంది.

ADVERTISEMENT

ఇవి కూడా చదవండి

ఈ సహజసిద్ధమైన చిట్కాలతో…. ట్యాన్‌కు టాటా చెప్పేయచ్చు..!

పింక్ సాల్ట్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా??

మీ కురులు ఒత్తుగా కనిపించాలా?? అయితే ఇలా చేయాల్సిందే..

29 Aug 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT