కొంతమందిని ఎప్పుడు చూసినా చూడచక్కని అవుట్‌ఫిట్స్ లో అందంగా, ఆకర్షణీయంగా మెరిసిపోతూ ఉంటారు. ఏ డ్రస్ వేసుకున్నా అది వారి కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేశారా?? అన్నంత చక్కగా వారికి అమరుతుంటాయి. అయితే అన్ని సందర్భాల్లోనూ అది నిజం కాకపోవచ్చు. ఎందుకంటే ఫ్యాషన్ (Fashion) ప్రపంచంలో వచ్చే కొత్త కొత్త ట్రెండ్స్ (Trends) గురించి తెలుసుకుంటూ వాటిలో తమకు అనుగుణంగా ఉండే వాటిని ఎంపిక చేసుకోవడంతో పాటు కొన్ని బేసిక్ రూల్స్ (Basic rules) ఫాలో అయితే చాలు.. ఎవరైనా సరే.. ఫ్యాషన్ క్వీన్ (Fashion Queen) అనిపించుకోవాల్సిందే. ఆ రూల్స్ ఏంటో మీకు మేం చెబుతాం రండి..
వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి..
మన వస్త్రధారణ ఏ విధంగా ఉన్నా సరే.. అవి మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయంటున్నారు డిజైనర్లు. అందుకే మన వస్త్రధారణ కూడా ఎదుటివ్యక్తితో కమ్యూనికేషన్ జరిపేందుకు ఒక మార్గంగా భావిస్తారట! సో.. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా.. మనం ధరించే దుస్తులు మన గురించి ఎంతో కొంత అవతలి వారికి అర్థమయ్యేలా చేస్తాయన్న మాట! అందుకే ఈసారి మీ మనసు, మీరు ఉన్న మూడ్ కి అనుగుణంగానే మీ వస్త్రధారణను కూడా ఎంపిక చేసుకోవడానికి ప్రయత్నించండి.
అకేషన్‌కు తగ్గట్లుగా..
డైలీ రొటీన్ లేదా ఆఫీస్ వరకు మనం ధరించే దుస్తులు ఒక ఎత్తైతే; పెళ్లిళ్లు, శుభకార్యాలు.. వంటి వేడుకల్లో పాల్గొనేటప్పుడు ధరించే దుస్తులు మరొక ఎత్తు. అందుకే చాలామంది ఇలాంటి సందర్భాల్లో చాలా ప్రత్యేకంగా కనిపించాలని, తమ అవుట్‌ఫిట్స్ అందరి కంటే భిన్నంగా ఉండాలని ఉవ్విళ్లూరుతూ ఉంటారు. ఫ్యాషన్ నియమాల ప్రకారం ఇది కాస్త మంచిదే! అయితే ఈ నియమాన్ని కేవలం ప్రత్యేక వేడుకలకు మాత్రమే పరిమితం చేయకుండా ప్రతి అకేషన్‌కు దానికి తగినట్లుగా డ్రస్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే తప్పకుండా మన లుక్ ఎదుటివారిని ఆకర్షిస్తుందంటున్నారు డిజైనర్లు.
సరిగ్గా సరిపోతుందా??
మనం ఫ్యాషనబుల్‌గా కనిపించేందుకు మనసుకు నచ్చిన మంచి డ్రస్ మార్కెట్ నుంచి కొనుక్కొని తెచ్చుకుంటే సరిపోదు.. అది మన శరీరాకృతికి తగినట్లుగా ఫిట్‌గా ఉందా? లేదా?? అన్నది సరిచూసుకోవడం కూడా ముఖ్యమే. లేదంటే డ్రస్ కనిపించినంత అందంగా, ఆకర్షణీయంగా మనం కనిపించే అవకాశం ఉండదు. సో.. ఈసారి మీరు ఎప్పుడు షాపింగ్ చేసినా సరే.. అవుట్‌ఫిట్ లుక్‌తో పాటు అది మీకు ఫిట్‌గా ఉంటుందో, లేదో కూడా సరిచూసుకోవడం మరవకండి. ఫిట్‌గా ఉండే దుస్తులు సింపుల్‌గా ఉన్నా మన లుక్‌ని స్టైలిష్‌గా కనిపించేలా చేస్తాయి.
ప్రయోగాల విషయంలో జాగ్రత్త..
ఫ్యాషన్ విషయంలో కొత్త కొత్త ట్రెండ్స్ (Trends) గురించి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో.. చిన్న చిన్న ప్రయోగాలు చేయడం ద్వారా వాటితో మీకు తగినట్లుగా అదిరిపోయే అవుట్‌ఫిట్స్ ని సెట్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ క్రమంలో ఏయే ట్రెండ్స్ తో ప్రయోగాలు చేయచ్చో, ఏవైతే మీకు బాగా నప్పుతాయో కూడా మీకు తెలిసి ఉండాలి. అలాగే ఏయే సందర్భాల్లో ఇలా ప్రయోగాత్మకంగా డిజైన్ చేసుకున్న దుస్తులను ధరించాలో తెలుసుకోవడం కూడా అవసరమే! అంటే బంధువుల పెళ్లి, నలుగురిలోనూ హుందాగా నడుచుకోవాల్సిన సందర్భాల్లో ఈ ప్రయోగాలకు దూరంగా ఉండడమే శ్రేయస్కరం. ఇక స్నేహితులతో కలిసి సరదాగా బయటకు వెళ్లినప్పుడు, ముఖ్యమైన వ్యక్తులను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు ఇలాంటి ప్రయోగాత్మక వస్త్రధారణలో ప్రత్యేకంగా మెరిసిపోవచ్చు.
మీ సిగ్నేచర్ ఉండాల్సిందే..
లేటెస్ట్ (Fashions) ను ఫాలో అవ్వడం మాత్రమే కాదు.. వాటితో మనకంటూ ప్రత్యేకంఫ్యాషన్స్గా ఉండే స్టైల్ కూడా ప్రతిబింబించేలా మన వస్త్రధారణ ఉండాలి. ప్రస్తుతం ప్రతిఒక్కరికీ ఒక ప్రత్యేకమైన సిగ్నేచర్ స్టైల్ ఉండడం కామన్‌గా మారిపోయింది. ఈ క్రమంలో దానికి ప్రాధాన్యం ఇస్తూ ఆ స్టైల్ కి మరింత స్పెషల్ లుక్‌ని ఇచ్చే అవుట్‌ఫిట్స్ నే ఎంపిక చేసుకోవాలి తప్ప మార్కెట్లోకి కొత్తగా వచ్చిందనో లేక నలుగురూ ఆ ట్రెండ్ ని అనుసరిస్తున్నారనో దానిని అనుసరించకూడదు. ఈ నియమం కేవలం దుస్తులకే కాదు.. మనం ఎంపిక చేసుకునే యాక్సెసరీస్‌కి కూడా వర్తిస్తుంది.
పర్సనల్ టచ్ ఇవ్వాల్సిందే..
ట్రెండ్స్ అందరూ ఫాలో అవుతారు. మరి, ఆయా ట్రెండ్స్ ఫాలో కావడంలో మీ ప్రత్యేకత ఏంటి?? అంటే.. ఫాలో అవ్వాలని ఎంపిక చేసుకున్న ప్రతి ట్రెండ్ కూ మనదైన శైలిలో స్పెషల్ పర్సనల్ టచ్ ఇవ్వాల్సిందే! అది అవుట్‌ఫిట్‌కి జత చేసే యాక్సెసరీస్ కావచ్చు.. లేదా దానికి తగ్గట్లుగా వేసుకునే మేకప్ విషయంలో కావచ్చు. మనం చేసే మార్పు చిన్నదే అయినా దాని ప్రభావం మన అవుట్ లుక్ పై కనిపించినప్పుడు మనం నలుగురిలోనూ ప్రత్యేకంగా కనిపించడం ఖాయం.
ఫిట్ జీన్స్ తప్పనిసరి!
ఈ రోజుల్లో అమ్మాయిల వార్డరోబ్ లో ఎన్ని ఫ్యాషనబుల్ అవుట్‌ఫిట్స్ ఉన్నా ఫిట్‌గా ఉండే జీన్స్ ఒక్కటైనా లేకపోతే ఆ వార్డరోబ్ అసంపూర్ణంగానే మిగిలిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సో.. ఎన్ని ట్రెండ్స్ ఫాలో అవ్వాలనుకున్నా, మీదైన శైలిలో వాటికి పర్సనల్ టచ్ ఇవ్వాలన్నా జీన్స్ వంటివి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి వీటికి మీ వార్డ్ రోబ్ లో స్థానం ఇవ్వడం మరిచిపోవద్దు సుమా!
ఇవి కూడా చదవండి
ఆఫీసులో స్టైల్ గా మెరిసిపోవాలంటే .. ఈ ఫ్యాషన్ ఫాలో అవ్వాల్సిందే..!
ఈ బీటౌన్ కలర్ కాంబినేషన్స్‌లో.. మీరు అందంగా మెరిసిపోతారు
షూ బైట్‌తో బాధపడుతున్నారా ? అయితే ఈ 15 చిట్కాలు మీకోసమే..