చాలామంది ఎప్పుడూ ఒకే తరహా బోరింగ్ హెయిర్‌స్టైల్స్‌ని (Hairstyles) ఫాలో అవుతుంటారు. కానీ అందరిలో మీరు ప్రత్యేకంగా కనిపించాలంటే.. మీకంటూ కాస్త గుర్తింపు ఉండాలంటే కొంత ప్రత్యేకంగా కనిపించడం అవసరమే. మరి, దీని కోసం రోజుకో కొత్త హెయిర్‌స్టైల్‌ని ప్రయత్నిస్తే సరి.
అలాంటి హెయిర్‌స్టైల్స్ గురించి మీకు తెలియకపోయినా ఫర్వాలేదు. లేదా మీకు తెలిసిన హెయిర్‌స్టైల్స్ అన్నీ ప్రయత్నించి బోర్ కొట్టినా ఇబ్బంది లేదు. ఈ కొత్త హెయిర్‌స్టైల్స్‌ని ప్రయత్నించి చూడండి. ఓ నెల పాటు మీకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా రోజూ కొత్తగా కనిపించే వీలుంటుంది. వీటిని చేయించుకోవడం కూడా చాలా సులువు.. అందుకే ఇవి ప్రయత్నిస్తే నెలరోజుల పాటు మీకు బ్యాడ్ హెయిర్ డే అన్నదే ఉండదు.
Also Read: పొట్టి జుట్టున్న వారికి నప్పే హెయిర్ కట్స్ (Haircuts For Short Hair)
1. ట్రిమ్మింగ్‌తో ప్రారంభించండి..
ఈ కొత్త హెయిర్‌స్టైల్స్‌ని ప్రయత్నించాలంటే ముందు మీ జుట్టు (Hair) ఆరోగ్యంగా ఉండాలి. అందుకే మీ చిట్లిపోయిన, పొడిబారిపోయిన జుట్టును కాస్త ట్రిమ్ చేసి ఆరోగ్యంగా మార్చుకోవాలి. ఆపై కాస్త బ్లో డ్రై చేసుకుంటే మీ జుట్టు ఒత్తుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది.
2. పూలతో ఫ్రెష్‌గా..
తలలో అందమైన పూలు పెట్టుకొని మీ డల్ ఫీలింగ్‌ని దూరం చేసుకోండి. పూలు పెట్టుకోవడానికి వీలుగా ఉండే ఏ హెయిర్‌స్టైల్ అయినా వేసుకోవచ్చు. ఈ తరహా హెయిర్‌స్టైల్స్‌ని సోమవారం పూట ట్రై చేస్తే.. మీకు మరింత ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది.
ఉదాహరణకు మీ జుట్టును ఒక వైపు దువ్వి పిన్ పెట్టి వదిలేసి ఆ పిన్ పెట్టిన చోటే చక్కగా మంచి రోజా పువ్వును పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది మిమ్మల్ని అద్భుతంగా కనిపించేలా చేయడంతో పాటు రోజంతా ఫ్రెష్‌గా ఫీలయ్యేలా చేస్తుంది.
Image: Morvi Images on Instagram
3. కొప్పు ఇలా ప్రయత్నించండి.
మీరు సమయం లేకపోతే ఎప్పుడూ మెస్సీ హెయిర్‌బన్ వేసుకుంటుంటారు. కానీ దానికి కాస్త ట్విస్ట్‌ని జోడించి కాస్త విభిన్నంగా ఉండే కొప్పును ప్రయత్నించండి. దీని కోసం ముందు నుంచి జుట్టును తీసుకొచ్చి మంచి పఫ్‌లా ఉంచి.. మిగిలిన జుట్టుతో కొప్పు వేసుకోండి. ఇది చాలా సులభంగా వేసుకోదగినది మాత్రమే కాదు.. చాలా అందంగా కనిపించేలా చేస్తుంది కూడా.
Image: Sonam Kapoor
4. వెనక్కి పెట్టండి..
ఉక్కపోతను తట్టుకుంటూ రెగ్యులర్ హెయిర్‌స్టైల్‌కి భిన్నంగా ఉండే తలకట్టు కావాలనుకుంటున్నారా? అయితే దీన్ని ప్రయత్నించండి. ఇందుకోసం చేతి నిండా బాబీ పిన్స్ సిద్ధంగా ఉంచుకోవడం మర్చిపోవద్దు. జుట్టును సన్నని పాయలుగా తీసుకుంటూ వచ్చి.. వాటిని వెనక్కి పిన్స్ పెట్టి వదిలేయాలి.
ఇలా దాదాపు సగానికి పైగా జుట్టును పిన్ చేసిన తర్వాత మిగిలిన జుట్టును వదిలేస్తే సరి. చెబుతుంటే పిన్స్ వూడిపోతాయేమో అనిపిస్తుంది కానీ.. అలా ఏం జరగదు. పైగా ఇది చాలామంది మహిళలు ఉపయోగించే అద్భుతమైన హెయిర్ స్టైల్స్‌లో ఒకటి కూడానూ. అందుకే దీన్ని ఓసారి ప్రయత్నించి చూడండి.
Read More: Best hairstyles for girls
5. ఫాక్స్ ఫిష్‌టెయిల్
వారం మధ్యలో ఒక్కోసారి ఆఫీస్‌కి లేదా కాలేజీకి వెళ్లాలంటేనే చిరాకొస్తుంది. అలాంటప్పుడు ఈ హెయిర్‌స్టైల్‌ని ప్రయత్నిస్తే చాలు.. అందంగా కనిపించి.. మీలో ఉత్సాహం పెరుగుతుంది. దీని కోసం జుట్టును వదులుగా పోనీ వేసుకొని రబ్బర్‌బ్యాండ్ పైన ఉన్న జుట్టును.. రెండు పాయలుగా చేయాలి.
పోనీ మధ్యలో వచ్చిన రంధ్రం నుంచి ఈ మిగిలిన జుట్టును వెనక్కి పోనివ్వాలి. ఆ తర్వాత మళ్లీ ఇలాగే రబ్బర్‌బ్యాండ్ పెట్టి మధ్యలోంచి పోనివ్వాలి. ఇలా జడ మొత్తం పూర్తయ్యే వరకూ చేస్తూ పోవాలి. ఈ జడ రెండు నిమిషాల్లో పూర్తవుతుంది.
6. వేవ్స్‌తో వావ్ అనిపించేలా..
రాత్రి చక్కగా, అందంగా జడలు వేసుకొని పడుకుంటే ఉదయాన్నే అందంగా, ఆకట్టుకునే వేవీ జుట్టుతో నిద్ర లేచే వీలుంటుంది. దీని కోసం జుట్టును ఐదారు పాయలుగా చేసుకొని గట్టిగా జడలు వేసి రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని పడుకోవాలి. ఉదయానికల్లా స్టైలిష్ హెయిర్‌స్టైల్ మీ సొంతమవుతుంది. తలస్నానం చేసిన తర్వాత ఇలా చేస్తే మీ వేవ్స్ ఎక్కువకాలం పాటు అలాగే నిలుస్తాయి.
7. బ్రెయిడెడ్ హాలో
ఈ అందమైన హెయిర్‌స్టైల్ అమ్మాయిలకు చాలా క్యూట్‌గా కనిపిస్తుంది. దీని కోసం జుట్టును మధ్యలోకి పాపిట తీసి వదిలేసి ఒక్కోవైపు నుంచి ఒక్కో జడను అల్లుకుంటూ వెనక్కి తీసుకురావాలి. ఇలా వెనక్కి వచ్చిన తర్వాత అక్కడ పిన్స్ పెట్టి వదిలేయాలి. ఇది ఎలాంటివారికైనా అందంగా కనిపిస్తుంది.
8. రోల్ అప్..
1960ల నుంచి ట్రెండింగ్‌లో ఉన్న హెయిర్‌స్టైల్ ఇది. దీని కోసం మీ జుట్టును పక్క పాపిట తీసి వెనక్కి దువ్వి వెనుక జుట్టు మొత్తాన్ని పట్టుకొని కొస నుంచి పైకి చుట్టుకుంటూ వచ్చి మాడు వరకూ తీసుకొచ్చాక పిన్స్ పెట్టి ఉంచాలి. తర్వాత దానికి పిన్ పెట్టుకొని, ఎర్రని లిప్‌స్టిక్‌తో మీ లుక్‌ని పూర్తి చేయండి.
9. చక్కటి హెడ్‌బ్యాండ్ పెట్టండి..
మీ జుట్టుకి చక్కటి మెరుపు అందించేందుకు దానికి కాస్త స్పెషల్‌గా కనిపించే హెడ్ బ్యాండ్‌ని పెట్టుకోండి. ఇది మీ జుట్టుకు పెట్టుకొని ఆపై కొప్పు వేసుకున్నా లేదా జుట్టను అలాగే వదిలేసినా అందంగానే కనిపిస్తుంది.
10. ఫేక్ బ్రెయిడ్ వేసేయండి..
ఎక్కువ పాయలతో జడ వేసుకోవాలని చాలామందికి ఆశగా ఉంటుంది. కానీ అది అందరికీ రాదు. ఇలాంటప్పుడు ముందు నుంచి జుట్టు మొత్తం వెనక్కి దువ్వి రెండు జడలుగా అల్లుకోవాలి. తర్వాత ఈ రెండు జడలను పిన్నుల సాయంతో కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల కష్టతరమైన జడను సులువుగా వేసుకోవచ్చు.
11. టర్బన్ ట్రై చేయండి..
మీకు అస్సలు హెయిర్‌స్టైల్ వేసుకోవడానికి ఓపిక లేని రోజు కర్దాషియన్ స్టైల్‌లో మెరిసిపోవచ్చు. దీని కోసం మీరు చేయాల్సిందల్లా ఓ మంచి లేడీస్ టర్బన్ ప్రయత్నించడమే.. దీనికి తోడుగా ఓ చక్కటి కేప్ ధరిస్తే బోహో స్టైల్‌లో మెరిసిపోవచ్చు.
12. పాపిటతో లుక్ మార్చండి..
పాపిట కేవలం మధ్యకే తీయాలని ఎవరు చెప్పారు? మీరు ఎప్పుడూ తీసే పాపిటకు భిన్నంగా ప్రయత్నించి కొత్త లుక్‌ని సొంతం చేసుకోండి. మీ జుట్టును మొత్తం ఒక పక్కకి వేసి పక్క పాపిట తీయండి. జుట్టు అలాగే నిలిచి ఉండేలా పిన్స్ పెట్టడం వల్ల కొత్తగా కనిపిస్తారు. ఇలా కాకుండా పాపిటను క్రిస్‌క్రాస్‌గా కూడా తీసే వీలుంటుంది. అయితే దీనికి కాస్త సమయం పడుతుంది.
13. జుట్టుతో హెయిర్ బ్యాండ్
మీ చెవి కింద ఉన్న జుట్టుతో సన్నని జడను అల్లుకుంటూ రండి. ఇలా పూర్తిగా అల్లిన తర్వాత దాన్ని జుట్టు కింది నుంచి తీసుకొచ్చి నుదురు భాగంలో జుట్టుకి హెయిర్‌బ్యాండ్‌లా ఉంచి తిరిగి చెవి వెనక్కి తీసుకొచ్చి పిన్ పెట్టాలి. మీ జుట్టు తలచుట్టూ వచ్చేంత పెద్దదిగా ఉంటేనే ఈ హెయిర్‌స్టైల్ నప్పుతుందనుకోండి.
14. ట్విస్ట్ చేసేయండి..
ఇది చాలా సింపుల్ హెయిర్‌స్టైల్. దీని కోసం జుట్టును పాపిట తీసుకొని ముందున్న జుట్టును కొంత భాగం తీసుకొని దాన్ని ట్విస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని వెనక్కి ఉంచి పక్కన పిన్స్‌తో గట్టిగా మిగిలిన జుట్టుతో కలిపేయాలి. అంతే ట్విస్ట్ హెయిర్‌స్టైల్ సిద్దం.
15. కర్ల్స్ ప్రయత్నించండి..
కర్ల్స్ మీరు ఉదయాన్నే చేసుకోవాల్సిన అవసరం లేదు. ముందురోజే చేయచ్చు కూడా. దీని కోసం జుట్టును మధ్యమధ్యలో కొద్ది భాగం తీసుకుంటూ దాన్ని కర్లర్ సాయంతో ఉంగరాల జుట్టులా మార్చాలి. మిగిలిన జుట్టును అలాగే ఉండనివ్వాలి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు పూర్తిగా కర్లీగా.. పూర్తిగా స్ట్రెయిట్‌గా కాకుండా కాస్త వేవీగా ఉండే అవకాశం ఉంటుంది.
16. జడకొప్పు వేసేయండి..
ముందుగా మధ్య పాపిట తీసి రెండు వైపులా ముందు నుంచి జడ అల్లుకుంటూ వెనక్కి తీసుకురావాలి. ఇలా వెనక్కి తీసుకొచ్చాక అలా వేసిన జడలను కింద వరకూ పూర్తి చేసి వాటిని కొప్పులాగా చుట్టాలి. ఇలా చేయడం వల్ల సగం జుట్టు కిందకు ఉండి మరో సగం కొప్పులా భాగంగా ఉంటుంది.. ఈ హెయిర్‌స్టైల్ ఎవరికైనా అద్భుతంగా కనిపిస్తుంది.
17. బన్ పోనీటెయిల్..
సోనమ్ నుంచి స్ఫూర్తి పొంది మీరు రోజూ వేసుకునే పోనీటెయిల్‌కి కాస్త డిఫరెంట్ టచ్‌ని అందించండి. దీని కోసం చాలా ఎత్తుగా హైపోనీ టెయిల్ వేసుకొని.. మిగిలిన జుట్టును అలాగే వదిలేయకుండా కింద చిన్న క్లిప్‌తో మరోసారి జుట్టుకు టై చేయండి. పైన ఉన్న భాగం ఓ బన్‌లా కనిపిస్తుంది.
18. మెస్సీగానే ఉంచేయాలా?
రాత్రి ఆలస్యమైపోయి ఉదయాన్నే ఆలస్యంగా నిద్రలేచారా? హెయిర్‌స్టైల్ వేసుకునే సమయం లేదా.. అయితే మీ జుట్టును అలాగే ఉంచేయండి. కొద్దిగా ఆర్గాన్ ఆయిల్‌ని తీసుకొని జుట్టుపై స్ప్రే చేసుకుంటే చాలు.. అలాగే చిక్కులుగా ఉన్నా అందమైన మెస్సీ హెయిర్ లుక్ మీకు సొంతమవుతుంది.
19. బౌన్సీగా ఉంచేందుకు..
ఒక పెద్ద గుండ్రని బ్రష్ తీసుకొని దానితో జుట్టును దువ్వుకోండి. కుదుళ్ల నుంచి దువ్వడం మర్చిపోవద్దు. తర్వాత వ్యతిరేక దిశలో దువ్వుతూ ఉండే జుట్టు లావుగా కనిపిస్తుంది. ఇలాగే వదిలేసినా పోనీ వేసినా బాగానే ఉంటుంది.
20. రిబ్బన్ వేసేయండి..
ఓ చక్కటి శాటిన్ రిబ్బన్ తో మీ జుట్టును పోనీ వేయండి. లేదా దీన్ని మీ జడలో ఉంచి ఆఖరి వరకూ జడ వేసుకోండి. దీనివల్ల ప్రత్యేకమైన కలర్‌ఫుల్ లుక్ మీ సొంతమవుతుంది.
21. బాంద్‌నా బేబీలా..
తలస్నానం చేసి చాలా రోజులవుతోందా? జుట్టు అందంగా కనిపించట్లేదా? చక్కటి బాంద్‌నా బ్యాండ్ కట్టుకొని సన్‌గ్లాసెస్ పెట్టుకొని కూల్ లుక్‌ని మీ సొంతం చేసుకోండి.
22. ఒకటే కర్ల్‌తో..
ఎప్పుడైనా సరే సులువుగా ప్రత్యేకమైన లుక్ సంపాదించేందుకు ఇది చక్కటి హెయిర్‌స్టైల్ అని చెప్పచ్చు. దీని కోసం ముందు భాగం నుంచి కొంత జుట్టు తీసుకొని పెద్ద బ్యారెల్ కర్లర్ సాయంతో దాన్ని కర్లీగా మార్చుకోవాలి. దీన్ని పక్కకి ఉంచి పిన్ పెట్టి మిగిలిన దాన్ని వదిలేయండి. ఇది మీకు చక్కటి లుక్‌ని అందిస్తుంది.
23. చక్కటి వేవ్స్ కోసం..
ఇప్పటికే మీరు చాలా రకాల హెయిర్‌స్టైల్స్‌ని ప్రయత్నించి ఉంటారు. మీ జుట్టు అటు కర్లీ, ఇటు స్ట్రెయిట్ కాకుండా వివిధ రకాలుగా ప్రయత్నించడానికి అలవాటు పడి ఉంటారు. అందుకే ఈసారి తలస్నానం చేసినప్పుడు వెంటనే దువ్వకుండా కాసేపు వదిలేయండి. ఆపై జుట్టుకి సముద్రపు ఉప్పు, నీళ్లు కలిపి చేసిన స్ప్రే కొట్టి.. చేతులతో దువ్వుతున్నట్లుగా.. ముద్దలా చేస్తున్నట్లుగా చేస్తూ బ్లో డ్రై చేసుకోవాలి. మంచి వేవ్స్ మీ సొంతమవుతాయి.
24. బబుల్ పోనీటెయిల్ ప్రయత్నించండి..
ఇలా చాలా అందంగా ఉండడంతో పాటు వేసవిలో మనల్ని అందంగా, సౌకర్యవంతంగా ఉండేలా కూడా చేస్తుంది. దీని కోసం ముందుగా హై పోనీటెయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక సన్నని పాయగా జుట్టును తీసుకొని రబ్బర్‌బ్యాండ్ కనిపించకుండా చుట్టాలి. ఆపై ఓ రెండు అంగుళాల కింద మరో రబ్బర్ బ్యాండ్ పెట్టి మళ్లీ ఇలాగే జుట్టుతో కవర్ చేయాలి. ఇలా రెండు అంగుళాల గ్యాప్ ఇస్తూ కింద వరకూ చేసుకుంటూ వెళ్లాలి.
25. పిన్స్‌తో ప్రయత్నించండి
ఇటు సింపుల్‌గా కనిపిస్తూనే అటు అందంగా మెరిసిపోవాలంటే శ్రద్ధా కపూర్ ప్రయత్నించిన ఈ హెయిర్‌స్టైల్‌ని ఓసారి వేసుకొని చూడండి. దీని కోసం మీరు చేయాల్సింది కూడా పెద్దగా ఏమీ లేదు. జుట్టును ఒక పక్కకి పాపిట తీసి మరో పక్కన రంగురంగుల బాబీ పిన్స్‌తో స్టైలిష్‌గా డిజైన్ క్రియేట్ చేస్తే సరి.
26. జెల్‌తో డిఫరెంట్‌గా..
ఈ హెయిర్‌స్టైల్ మీకే కొత్తగా అనిపించడం ఖాయం. దీని కోసం మీరు చేయాల్సిందల్లా మీ జుట్టును పూర్తిగా వెనక్కి దువ్వాలి. ఆపై చుట్టూ అంచుల వద్ద ఉన్న జుట్టును వదిలేసి కేవలం మధ్యలో ఉన్న జుట్టును మాత్రమే పోనీ వేయాలి. ఇప్పుడు ఈ వదిలేసిన జుట్టుకు జెల్ పెట్టి స్టైలిష్‌గా వెనక్కి దువ్వి.. మధ్యలోని జుట్టును కూడా రబ్బర్‌బ్యాండ్ తీసేసి వదిలేస్తే సరి. మీరు ప్రత్యేకంగా కనిపించడం ఖాయం.
27. క్రాస్ బన్స్
ఇది చాలా సింపుల్. దీని కోసం ముందుగా మీ జుట్టును పైన, మధ్యలో, కింద మూడు భాగాలు చేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడు భాగాలను మూడు కొప్పులుగా వేసుకోవాలి. ఇది చూడడానికి అందంగా ఉంటుంది. మీ జుట్టు వదిలేస్తే అందంగా కనిపించదు అనుకున్నప్పుడు ఈ హెయిర్‌స్టైల్ ప్రయత్నించండి. మూడు కొప్పులు మీకు నచ్చకపోతే మూడింటిని పోనీటెయిల్స్‌లా వేసుకొని ముందు మధ్య భాగాన్ని కొప్పుగా వేసి ఆపై కింద భాగాన్ని దానికి చుట్టాలి. ఆ తర్వాత పై భాగాన్ని చుడితే బాగుంటుంది.
28. ఫిష్‌టెయిల్ బ్రెయిడ్
ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు జడ వేసుకోవాలంటే ఫిష్‌టెయిల్ బ్రెయిడ్‌ని వేసుకోవాల్సిందే. కాస్త ఓపిక, సమయం ఉండి.. ఇందులో కాస్త పర్ఫెక్ట్ అయితే చాలు.. దీని కంటే మంచి హెయిర్‌స్టైల్ మరొకటి ఉండదు. దీన్ని వేసుకోవడానికి జుట్టును రెండు పాయలుగా విడదీయాలి.
ఇప్పుడు ఒక భాగం బయటవైపున్న జుట్టు నుంచి సన్నని పాయను తీసుకొని అవతలి దానిలో కలపాలి. అవతలి పాయను కూడా అలాగే చేసి ఇవతలి పాయలో ఆ జుట్టును కలపాలి. ఇలా చేసుకుంటూ కింద వరకూ రావాలి. ఆపై రబ్బర్ బ్యాండ్ పెడితే ఇది అందంగా కనిపిస్తుంది.
29. మిల్క్‌మెయిడ్ బ్రెయిడ్
రెండు నిమిషాల్లో వేసుకోగల ఈ హెయిర్‌స్టైల్‌ని అలియా భట్ చాలా అందంగా వేసుకుంది. దీని కోసం చేయాల్సిందల్లా మీ జుట్టులో ఒకవైపు నుంచి కాస్త జుట్టు తీసి దాన్ని రెండు పాయలుగా విడదీసి ఒకదానికి మరొకటి చుడుతూ చివరి వరకూ తీసుకురావాలి. ఆ తర్వాత ఇలా చుట్టిన దాన్ని జుట్టు కింద నుంచి తీసి ముందు నుంచి పక్కకు తీసుకొని వచ్చి ఒక వృత్తం పూర్తయ్యేలా పిన్ చేయాలి.
30. క్యాండీ బన్
ఇది చాలా సింపుల్ బన్. దీని కోసం ముందుగా హై పోనీటెయిల్ వేసుకొని హెయిర్‌స్ప్రే కొట్టుకోవాలి. ఆ తర్వాత దువ్వెనతో చివరి నుంచి మొదలుకి దువ్వడం వల్ల జుట్టు కాస్త చిక్కుగా కనిపిస్తుంది. దీని చుట్టూ హెయిర్‌బ్యాండ్ చుట్టడం వల్ల కొప్పు అందంగా కనిపిస్తుంది.
31. క్రిస్ క్రాస్ బన్
దీని కోసం ఇటు కొంచెం అటు కొంచెం జుట్టు వదిలేసి మధ్యలో ఉన్న జుట్టును పోనీటెయిల్ వేసుకోవాలి. ఆపై ఒకవైపు ఉన్న జుట్టును మరోవైపు తీసుకొచ్చి అటు నుంచి కొప్పుకి చుట్టండి. ఇప్పడు మరో వైపు ఉన్న జుట్టుతోనూ అలాగే చేయండి. ఆపై మిగిలిన పోనీ టెయిల్‌ని కూడా కొప్పు కట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కొప్పు పైన ఎక్స్ షేప్‌లో క్రిస్‌క్రాస్‌గా కనిపిస్తుంది. ఇది మీ లుక్‌ని పెంచుతుంది.
ఇవి కూడా చదవండి.
మీ అందమైన మెరిసే జుట్టు కోసం.. చక్కటి షాంపూ బ్రాండ్లివే..!
స్ట్రెయిటెనింగ్, స్మూతెనింగ్‌తో.. జుట్టును స్టైలిష్‌గా మార్చుకుందాం..
చుండ్రుకు చెక్ పెట్టాలా? అయితే ఈ చిట్కాలు ప్రయత్నించండి.
Images : Instagram