పోషకాల గని కోడి గుడ్డు.. దీనివల్ల ఆరోగ్యానికి.. అందానికి ప్రయోజనాలెన్నో..!

పోషకాల గని కోడి గుడ్డు.. దీనివల్ల ఆరోగ్యానికి.. అందానికి ప్రయోజనాలెన్నో..!

కోడి గుడ్డు (Egg).. కోరినంత ఆరోగ్యాన్ని..  పోషకాలను అందించే అతి సాధారణ ఆహార పదార్థం ఇది. అందుకే ప్రభుత్వం కూడా 'సండే హో యా మండే.. రోజ్ ఖావో అండే'.. అంటూ కోడిగుడ్లు తినాలని ప్రకటనలు కూడా జారీ చేసింది. ఇందులో ఎన్ని పోషకాలు ఉంటాయంటే.. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకూ ప్రతి ఒక్కరికీ సరిపోయే విటమిన్లు, ప్రోటీన్లు ఇందులో ఉంటాయి. 

శరీరానికి అవసరమయ్యే పోషకాలను అందించడంతో పాటు.. మన దేహానికి కావాల్సిన శక్తిని కూడా కోడిగుడ్లు అందిస్తాయి. కేవలం శరీరానికి మాత్రమే కాదు.. చర్మానికి, జుట్టుకు కూడా కోడిగుడ్డు అందాన్ని అందించేందుకు తోడ్పడుతుంది. మరి, గుడ్లలోని పోషకాలు.. వాటి ప్రయోజనాలతో పాటు వీటిని చర్మ, కేశ సంరక్షణకు ఎలా ఉపయోగించాలో కూడా చూద్దాం రండి..

Table of Contents

  గుడ్డులోని పోషక విలువలు

  Shutterstock

  గుడ్డులో కేవలం 70 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఈ క్యాలరీల్లో ఎన్నో పోషక విలువలు కూడా ఉంటాయి. చాలామంది గుడ్లు తింటే బరువు పెరుగుతారని అనుకుంటారు. కానీ బరువు తగ్గడానికి, కండరాల పెరుగుదలకు కూడా గుడ్లు ఉపయోగపడతాయి. వీటిలో శరీరానికి అవసరమైన అత్యావశ్యక కొవ్వులు, ఇనుము, విటమిన్లు, మినరల్స్, కెరటినాయిడ్స్ వంటివన్నీ ఉంటాయి.

  గుడ్డులోని తెల్ల సొన మొత్తం ప్రొటీన్లతోనే నిండి ఉంటుంది. దీన్ని తింటే కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఇందులో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది బరువు తగ్గేవారికి చాలా సరైన ఆహారం. ఇక పచ్చసొనలో శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలుంటాయి. వీటిని రోజూ ఒకటి లేదా రెండు తీసుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, రక్తపోటు సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అంతేకాదు.. ఇందులోని సోడియం, పొటాషియం వంటి మినరల్స్‌తో పాటు విటమిన్ డి, ఇ, కె కూడా లభ్యమవుతాయి. వీటితో పాటు కోలిన్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.

  గుడ్డు అందించే ఆరోగ్య ప్రయోజనాలు

  ఎన్నో పోషకాలు నిండి ఉన్న గుడ్డును.. ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మన శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి. అందులో కొన్నింటిని గురించి తెలుసుకుందాం.

  Shutterstock

  మంచి కొలెస్ట్రాల్‌ని పెంచుతుంది.

  గుడ్డులోని పచ్చ సొనలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. రెండు గుడ్లు తీసుకుంటే చాలు.. రోజులో మనకు అందాల్సిన కొలెస్ట్రాల్ మొత్తం అందుతుంది. ఇది మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించేలా లివర్‌ని ప్రోత్సహిస్తుంది.

  కోలిన్‌ని అందిస్తుంది.

  కోలిన్ మన శరీరంలో కణజాలాన్ని తయారుచేసేందుకు, సిగ్నలింగ్ వ్యవస్థ సరిగ్గా పనిచేసేందుకు చాలా అవసరం. ఇలాంటి అత్యవసరమైన కోలిన్ గుడ్డులోనే లభిస్తుంది. దీన్ని తీసుకోవడం శరీరానికి ఎంతో అవసరం కూడా.

  Shutterstock

  గుండెపోటు రాకుండా చేస్తుంది.

  గుడ్లను తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గుతాయని ఎన్నో పరిశోధనల్లో తేలింది. దీనివల్ల గుండెపోటు వచ్చే ముప్పు కూడా చాలా వరకూ తగ్గుతుంది. దీంతో పాటు గుడ్లు రోజూ తినడం వల్ల స్ట్రోక్ వచ్చే ముప్పు కూడా తగ్గుతుందని చాలా పరిశోధనల్లో తేలింది.

  యాంటీ ఆక్సిడెంట్లు అందిస్తుంది.

  గుడ్డులో ల్యూటిన్, జియాక్సాంథిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మన కంటి చూపును మెరుగుపర్చడంలో తోడ్పడతాయి. రోజూ గుడ్డును తీసుకోవడం వల్ల.. కంటి సమస్యలు కూడా రాకుండా చూసుకోవచ్చన్నమాట.

  Shutterstock

  కండలు పెరగడానికి తోడ్పడుతుంది.

  మన శరీర నిర్మాణానికి ప్రొటీన్లు చాలా అవసరం. అవి రకరకాల కణాలు, కణాజాలాల తయారీలో తోడ్పడతాయి. ముఖ్యంగా శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉండకుండా.. కండరాలు అలాగే కొనసాగాలంటే ప్రొటీన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక పెద్ద గుడ్డులో కనీసం ఆరు గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. రోజూ గుడ్డును తీసుకోవడం వల్ల కండరాల పెరుగుదలతో పాటు శరీర మెటబాలిజం పెరగడానికి, బరువు తగ్గించడానికి, రక్తపోటు తగ్గించడానికి, ఎముకల సాంద్రత తగ్గకుండా చూసుకునేందుకు వీలవుతుంది.

  అందానికి గుడ్డు వల్ల ప్రయోజనాలు

  గుడ్డు వల్ల ఆరోగ్యానికి మాత్రమే కాదు.. అందానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. గుడ్డు మన చర్మం, జుట్టు ఆరోగ్యంగా, అందంగా కనిపించేలా కూడా చేస్తుంది.

  Shutterstock

  జుట్టు రాలడాన్ని నివారిస్తుంది

  గుడ్డులో ఎక్కువగా ఉండే ప్రొటీన్లు, పోషకాలు జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. జుట్టు పెరగడానికి పోషకాలను అందించి.. కేశాలను వేగంగా, బలంగా పెరిగేలా చేస్తాయి. అలాగే జుట్టు తెగిపోయి రాలడాన్ని కూడా అరికడతాయి.

  జుట్టులో జిడ్డును తగ్గిస్తుంది..

  జుట్టు కుదుళ్ల దగ్గర.. జిడ్డును తొలగించడానికి గుడ్డు చాలా బాగా తోడ్పడుతుంది. కేశాలకు ఆరోగ్యాన్ని కలిగించేందుకు వీలుగా ప్రొటీన్లను అందిస్తుంది. 

  Shutterstock

  అవాంఛిత రోమాలను తొలగిస్తుంది.

  జుట్టును వ్యాక్సింగ్ లేదా త్రెడింగ్ చేయడానికి భయపడేవారు దీన్ని వినాల్సిందే. ఎందుకంటే గుడ్డులోని పచ్చ సొనలో ఎన్నో పోషకాలు ఉండడంతో పాటు.. దాన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల జుట్టు నొప్పి లేకుండా తొలగిపోతుంది. దీనికోసం టిష్యూ పేపర్‌కి.. గుడ్డు పచ్చసొనను పూసి.. దాన్ని చర్మంపై అద్ది.. ఆ తర్వాత కాసేపు ఆరనిచ్చి వ్యాక్స్‌లా తొలిగించేస్తే సరిపోతుంది.

  మచ్చలు, ముడతలు తగ్గిస్తుంది.

  గుడ్డులోని తెల్ల సొనలో ఎన్నో మంచి గుణాలుంటాయి. దీన్ని అప్లై చేసుకోవడం వల్ల చర్మం బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, మొటిమలు, మచ్చలు, ముడతలు లేకుండా యవ్వనకాంతితో మెరిసిపోతుంది. దీనికి ఇందులోని ఆల్బుమెన్ అనే పదార్థం కారణం. అంతేకాదు.. ఇది చర్మ రంధ్రాలను కూడా చిన్నగా చేస్తుంది.

  Shutterstock

  కళ్ల కింద వాపు తగ్గుతుంది.

  కళ్ల కింద వాపు ఉండేవారు గుడ్డును తీసుకోవడం, దాన్ని ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల.. ఇందులోని ఆమ్ల గుణం రక్త నాళాలు కుంచించుకుపోయేలా చేసి వాపును తగ్గిస్తుంది. దీన్ని నేరుగా అప్లై చేసుకోవాలనుకునే వారు.. తెల్ల సొనను కళ్ల కింద రుద్ది సున్నితంగా మర్దనా చేయాలి.

  గుడ్డుతో హెయిర్ ప్యాక్స్

  గుడ్డుతో మన జుట్టు ఎంతో అందంగా, ఒత్తుగా పెరుగుతుందని చాలామందికి తెలుసు. కానీ దాన్ని జుట్టుకు అప్లై చేసుకునే విధానం తెలీదు. మీకున్న జుట్టు సమస్యను బట్టి ఎలాంటి హెయిర్ ప్యాక్ వేసుకోవాలంటే..

  Shutterstock

  గుడ్డు, ఆలివ్ నూనెతో హెయిర్ ప్యాక్

  కావాల్సినవి

  గుడ్డు - ఒకటి
  ఆలివ్ నూనె - టేబుల్ స్పూన్

  తయారీ

  ముందుగా గుడ్డు బాగా గిలక్కొట్టి అందులో ఆలివ్ ఆయిల్ కూడా కలుపుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసుకోవాలి. జుట్టు కుదుళ్లకు బాగా అప్లై చేసి.. ఆ తర్వాత జుట్టు చివర్ల వరకూ రుద్దుకోవాలి. ఇలా ఓ ఇరవై నిమిషాల పాటు ఉంచుకొని.. చల్లని నీటితో కడిగేసుకోవాలి. తర్వాత మైల్డ్ షాంపూ ఉపయోగించి తలస్నానం చేయాలి. కండిషనర్ ఉపయోగించి ఆపై జుట్టును ఆరబెట్టుకోవాలి.

  ప్రయోజనాలు

  ఈ హెయిర్ మాస్క్.. మీ జుట్టును కుదుళ్ల నుంచి కండిషనింగ్ చేస్తుంది. మీ జుట్టు కుదుళ్లలో తేమను పెంచి.. జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు తోడ్పడుతుంది. ఇందులోని ఆలివ్ ఆయిల్ జుట్టును మరింత మాయిశ్చరైజ్ చేస్తుంది.

  గుడ్డు, ఆముదం హెయిర్ మాస్క్

  కావాల్సినవి

  గుడ్లు - రెండు
  ఆముదం - టేబుల్ స్పూన్

  తయారీ

  ముందుగా గుడ్లను బౌల్‌లో వేసుకొని.. మిశ్రమం బాగా కలిసిపోయేవరకూ గిలక్కొట్టాలి. ఆ తర్వాత ఇందులో ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. దీన్ని జుట్టుకు అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు అలా ఉంచుకోవాలి. తర్వాత చల్లని నీటితో తలస్నానం చేయాలి.

  ప్రయోజనాలు

  ఆముదం జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే పదార్థాల్లో ముఖ్యమైనది. ఇందులో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది డ్యామేజ్ అయిన జుట్టును తిరిగి మామూలుగా మార్చడంతో తోడ్పడుతుంది. అంతేకాదు.. ఇందులో రికిలోనిక్ యాసిడ్ అనే కాంపౌండ్ ఉండడం వల్ల ఇది జుట్టు బలంగా, ఒత్తుగా పెరిగేలా కూడా చేస్తుంది.

  Shutterstock

  గుడ్డు, అరటి పండు ప్యాక్

  కావాల్సినవి

  అరటి పండు - ఒకటి
  గుడ్డు - ఒకటి
  ఆలివ్ నూనె - టీస్పూన్

  తయారీ

  ముందుగా అరటిపండును మెత్తగా గుజ్జులా చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకుంటే మంచిది. తర్వాత అందులో గుడ్డు, ఆలివ్ నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీన్ని తలకు బాగా పట్టించి.. పావుగంట పాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత తలను చల్లని నీటితో బాగా కడిగేసుకొని మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.

  ప్రయోజనాలు

  ఈ హెయిర్ ప్యాక్ పొడిబారిపోయిన జుట్టులో తేమను పెంచుతుంది. అరటి పండ్లు మన చర్మాన్ని, జుట్టును బాగా మాయిశ్చరైజ్ చేస్తాయి. అంతేకాదు వీటిలో విటమిన్ బి, పొటాషియం కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టును బలంగా చేయడంతో పాటు జుట్టు బలంగా, ఒత్తుగా పెరిగేలా చేస్తాయి.

  గుడ్డు, పెరుగు హెయిర్ ప్యాక్

  కావాల్సినవి

  గుడ్డు - ఒకటి
  పెరుగు - కప్పు

  తయారీ

  ముందుగా గుడ్డును బాగా గిలక్కొట్టుకోవాలి. ఆ తర్వాత అందులో పెరుగు వేసుకొని మరికాసేపు గిలక్కొట్టాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి.. అరగంట పాటు ఉంచుకోవాలి. ఆపై మీ జుట్టును చల్లని నీటితో కడిగేసుకోవాలి.

  ప్రయోజనాలు

  పెరుగులో ఎన్నో రకాల విటమిన్లు, మినరల్స్‌తో పాటు ప్రొటీన్లు కూడా ఉంటాయి. వీటికి గుడ్డులోని పోషకాలు తోడైతే జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా మారతాయి. ఈ ప్యాక్ జుట్టును కండిషనింగ్ చేయడంతో పాటు.. హెయిర్ డ్యామేజ్ తగ్గించి, కుదుళ్లను బలంగా ఉండేలా చేస్తుంది.

  Shutterstock

  గుడ్డు, కలబంద హెయిర్ ప్యాక్

  కావాల్సినవి

  గుడ్డులోని తెల్ల సొన - రెండు
  కలబంద గుజ్జు - రెండు టేబుల్ స్పూన్లు

  తయారీ

  ముందుగా గుడ్లను బౌల్‌లో వేసి బాగా గిలక్కొట్టాలి. ఆ తర్వాత కలబంద గుజ్జు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత జుట్టు కుదుళ్ల నుంచి ప్రారంభించి.. చివర్ల వరకూ అప్లై చేసుకొని.. దీన్ని ఓ గంట పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేసి.. కండిషనర్ అప్లై చేసుకోవాలి.

  ప్రయోజనాలు

  కలబంద గుజ్జులో చాలా అత్యవసరమైన అమైనో యాసిడ్లు ఉంటాయి. గ్లూకోమన్నన్స్, స్టెరాల్స్, లిపడ్స్, విటమిన్స్ కూడా ఇందులో ఉంటాయి. ఇవన్నీ తలలోని చర్మాన్ని ఆరోగ్యంగా మారుస్తాయి. ఇందులో యాంటీ సెప్టిక్ గుణాలు కూడా ఉండడం వల్ల.. తలలో చుండ్రు వంటి సమస్యలు లేకుండా చేస్తాయి. 

  గుడ్డుతో ఫేస్ ప్యాక్స్

  గుడ్డు తినడం వల్ల మాత్రమే కాదు.. నేరుగా ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల కూడా చర్మం మెరిసిపోతూ కనిపిస్తుంది. అందుకే చర్మానికి గుడ్డును ఎలా అప్లై చేసుకుంటే దాని ప్రయోజనాలను పొందొచ్చో తెలుసుకుందాం..

  Shutterstock

  గుడ్డు, ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్

  కావాల్సినవి

  గుడ్డులోని తెల్ల సొన - ఒకటి
  ముల్తానీ మట్టి - టీస్పూన్

  తయారీ

  గుడ్డులోని తెల్ల సొనను బాగా గిలక్కొట్టి.. అందులో ముల్తానీ మట్టిని చేర్చాలి. ఈ మిశ్రమం బాగా కలిసిన తర్వాత పావు గంట పాటు ముఖానికి అప్లై చేసుకోవాలి. తర్వాత చల్లని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా తరచూ చేస్తే చర్మంలో కనిపించే మార్పులు మీరే గమనించవచ్చు.

  ప్రయోజనాలు

  గుడ్డు, ముల్తానీ మట్టి రెండూ చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించి చర్మం మెరిసేలా చేస్తాయి. అంతేకాదు.. ఈ ప్యాక్ చర్మం పై ఉన్న మొటిమలను.. వాటి మచ్చలను తగ్గిస్తుంది.

  గుడ్డు, పాలు, క్యారట్లతో ఫేస్ ప్యాక్

  కావాల్సినవి

  గుడ్డులోని తెల్ల సొన - ఒకటి
  పాలు - కొద్దిగా
  క్యారట్ తురుము - ఒక క్యారట్

  తయారీ

  ముందుగా గుడ్డులోని తెల్ల సొనని ఓ గిన్నెలో వేసుకొని.. అందులో పాలు పోసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో క్యారట్ మిక్సీ పట్టి తురుమును కలుపుకోవాలి. ఆ తర్వాత ముఖాన్ని కడుక్కొని ఈ ప్యాక్‌ని ముఖం, మెడలకు అప్లై చేసుకొని.. 15 నిమిషాల పాటు ఉంచుకొని చల్లని నీటితో కడిగేసుకోవాలి.

  ప్రయోజనాలు

  ఇది యాంటీఏజింగ్ ప్యాక్.. ఈ ప్యాక్‌ని తరచూ కనీసం వారానికోసారైనా అప్లై చేసుకోవడం వల్ల చర్మంపై ముడతలు పడకుండా కాపాడుకోవచ్చు. 

  Shutterstock

  గుడ్డు, శనగపిండి ఫేస్ ప్యాక్

  కావాల్సినవి

  శనగ పిండి - టేబుల్ స్పూన్
  గుడ్డులోని తెల్ల సొన - ఒకటి
  నిమ్మరసం - కొన్ని చుక్కలు

  తయారీ

  ఈ పదార్థాలన్నింటినీ కలిపి బాగా మిక్స్ చేసి ముఖానికి, మెడకు పూసుకోవాలి. కావాలంటే చేతులకు కూడా రాసుకోవచ్చు. దీన్ని ప్యాక్ ఆరేవరకూ ఉంచి.. గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి.

  ప్రయోజనాలు

  గుడ్డులోని తెల్ల సొన చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. శనగ పిండి జిడ్డు చర్మాన్ని తొలగిస్తుంది. దీంతో చర్మం మరీ పొడిగా, మరీ జిడ్డుగా కాకుండా చూసుకోవచ్చు.

  గుడ్డు, నిమ్మరసం ఫేస్ ప్యాక్

  కావాల్సినవి

  గుడ్డులోని తెల్ల సొన - మూడు
  నిమ్మరసం - ఒక టీస్పూన్

  తయారీ

  ముందుగా గుడ్డులోని తెల్లసొనలను గిన్నెలో వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో  టీస్పూన్ నిమ్మరసం వేసి దీన్ని ముఖం, మెడకు రుద్దుకోవాలి. దీన్ని పావు గంట పాటు ఉంచుకొని చల్లని నీటితో కడిగేయాలి.

  ప్రయోజనాలు

  చర్మం మెరిసిపోయేలా చేసే ప్యాక్ ఇది. గుడ్డు తెల్ల సొన చర్మంపై ఉన్న మురికిని తొలగించగా.. నిమ్మరసం మచ్చలను తగ్గించి చర్మం మెరిసిపోయేలా చేస్తుంది.

  Shutterstock

  గుడ్డు, తేనె ఫేస్ ప్యాక్

  కావాల్సినవి

  గుడ్డులోని తెల్ల సొన - ఒకటి
  తేనె - టీస్పూన్

  తయారీ

  ముందుగా తెల్ల సొనను బాగా బీట్ చేసి.. అందులో తేనె వేసి కలపాలి. తర్వాత ముఖాన్ని బాగా కడుక్కొని ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు అప్లై చేసుకోవాలి. ఇది ఆరిన తర్వాత లేదా పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి.

  ప్రయోజనాలు

  ఈ ప్యాక్ పొడి చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. తేనెలోని మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా మార్చడంతో పాటు.. ఎండలో తిరిగి నల్లగా మారిన చర్మాన్ని తిరిగి మామూలుగా మారుస్తాయి. అంతేకాదు.. చర్మాన్ని కూడా ప్రకాశవంతంగా చేస్తాయి.

  తరచూ అడిగే ప్రశ్నలకు సమాధానాలు

  Shutterstock

  1. గుడ్డును రోజూ తినడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య వస్తుందా?

  మన శరీరంలో రోజూ కొంత మొత్తంలో కొలెస్ట్రాల్ విడుదలవుతుంది. మనం బయట నుంచి తీసుకుంటే ఆ మోతాదు మేరకు శరీరం ఉత్పత్తిని తగ్గిస్తుంది. చాలా పరిశోధనల ప్రకారం రోజూ గుడ్డును తీసుకున్న వారిలో మంచి కొలెస్ట్రాల్ స్థాయులు పెరుగుతున్నాయని గుర్తించారు. అంతేకాదు.. ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ల వల్ల రక్తంలోని ట్రైగ్లిజరైడ్లు కూడా తగ్గుతున్నాయని పరిశోధనల్లో తేలింది. అందుకే రోజూ కనీసం ఒకటి లేదా రెండు గుడ్లను తీసుకోవడం మంచిది.

  2. గుడ్డు బరువు తగ్గడంలో తోడ్పడుతుందా?

  కేవలం గుడ్డును తీసుకోగానే బరువు తగ్గుతారని కాదు. కానీ బరువు తగ్గేందుకు తక్కువ క్యాలరీల్లో ఎక్కువ పోషకాలు అందించే ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రొటీన్ ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం గుడ్డును చాలామంచి ఆహారంగా తీసుకోవచ్చు. ఒక పెద్ద గుడ్డు 78 క్యాలరీలు కలిగి ఉంటుంది. దీని నుంచి 4 గ్రాముల ప్రొటీన్‌తో పాటు..  శరీరానికి అత్యావశ్యకమైన పోషకాలు కూడా అందుతాయి.

  అంతేకాదు.. వీటిని తీసుకోవడం వల్ల థర్మిక్ ఎఫెక్ట్ కారణంగా.. శరీర మెటబాలిజం కూడా పెరిగి క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. తద్వారా బరువు త్వరగా తగ్గే వీలుంటుంది. అయితే మిగిలిన ఆహారం కూడా ఆరోగ్యకరమైనదిగా.. క్యాలరీల మోతాదులో ఉంటేనే గుడ్డు వల్ల బరువు తగ్గే వీలుంటుంది. 

  Shutterstock

  3. గుడ్డును ఆమ్లెట్ వేయడం కంటే ఉడకబెడితే ఎక్కువ పోషకాలు అందుతాయా?

  గుడ్డును ఎలా తీసుకున్నా సరే.. దాని నుంచి అందే పోషకాలు దాదాపు సమానంగా ఉంటాయి. అయితే గుడ్డును ఆమ్లెట్ రూపంలో కాకుండా ఉడికించి తీసుకోవడం మంచిది. ఆమ్లెట్‌లో నూనెను ఉపయోగించడం వల్ల శరీరానికి కొవ్వు ఎక్కువగా అందుతుంది. కాబట్టి ఉడికించిన గుడ్డును తీసుకోవడం శ్రేయస్కరం.

  4. రోజు గరిష్టంగా ఎన్ని గుడ్లు తీసుకోవచ్చు?

  గుడ్డులోని పచ్చ సొనలో.. మన శరీరానికి అవసరమైన పోషకాలతో పాటు కొవ్వు కూడా ఉంటుంది. కాబట్టి గుడ్డును మొత్తంగా తీసుకోవాలంటే మాత్రం.. రోజు రెండు కంటే ఎక్కువ తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు శాతం పెరుగుతుంది. ఇక కేవలం తెల్ల సొన (ఎగ్ వైట్ ) మాత్రమే తీసుకోవాలనుకుంటే మీ శరీరానికి అవసరమైన మేరకు తీసుకోవచ్చు. సాధారణంగా ప్రతి మనిషికి తమ బరువుకి తగ్గట్లుగా.. ఒక కేజీ బరువుకి ఒక గ్రాము ప్రొటీన్ అవసరమవుతుంది.

  మీరు చికెన్, పప్పు, చేపలు వంటివేవీ తీసుకోకపోతే.. మీ బరువును బట్టి ఎగ్ వైట్స్‌ని ఎక్కువగా తీసుకోవచ్చు. ఒక తెల్ల సొన నుంచి నాలుగు గ్రాముల ప్రొటీన్ అందుతుంది. కాబట్టి దీన్ని బట్టి రోజులో ఎన్ని తినొచ్చనే విషయాన్ని లెక్కవేసుకోవచ్చు. అయితే ఒకసారి ఆరు ఎగ్ వైట్స్ కంటే.. ఎక్కువ తీసుకోవడం వల్ల అవి కొవ్వుగా మారే ప్రమాదం ఉంటుంది. అందుకే ఒకసారి కేవలం ఐదు లేదా ఆరు ఎగ్ వైట్స్ మాత్రమే తీసుకోవాలి. మళ్లీ వాటిని నాలుగు గంటల విరామం తర్వాత తిరిగి తీసుకోవచ్చు.

  POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగుఇంగ్లీషుహిందీమరాఠీతమిళంబెంగాలీ.

  క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.