Bollywood

తెలుగు చిత్ర పరిశ్రమలో “కేర్ అఫ్ హాస్పిటల్”గా మారుతున్న యువ నటులు !

Sandeep Thatla  |  Jun 18, 2019
తెలుగు చిత్ర పరిశ్రమలో “కేర్ అఫ్ హాస్పిటల్”గా మారుతున్న యువ నటులు !

తెలుగు చిత్ర పరిశ్రమలో (Telugu Film Industry) గత కొద్దిరోజులుగా యువ నటులు షూటింగ్‌లలో భాగంగా  లేదా వేరే ఇతర కారణాలతో రెగ్యులర్‌గా గాయాల బారిన పడుతున్నారు. ఒకరకంగా ఈ ఘటనలు ఆయా నటుల కుటుంబసభ్యులు, సినిమా యూనిట్ వారినే కాకుండా అభిమానులని సైతం ఒకింత కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

ఇటీవలే యువ హీరో శర్వానంద్ (Sharwanand) … తాను చేస్తున్న 96 అనే తమిళ చిత్రం రీమేక్ కోసం థాయిలాండ్‌లో డైవింగ్ నేర్చుకోవడానికి వెళ్లారు. ట్రైనింగ్ సమయంలో ఆయన భుజానికి గాయమైంది. ఒకరకంగా చెప్పాలంటే ఆ ప్రమాద తీవ్రత కూడా చాలా ఎక్కువగానే ఉందట. దాదాపు నాలుగు గంటల పాటు ఆయన భుజానికి.. అయిదుగురు డాక్టర్ల బృందం సర్జరీ చేయడం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా సర్జరీ చేసిన ఆర్థోపెడిక్ సర్జన్ గురువరెడ్డి ప్రెస్ మీట్‌లో తెలిపారు. అలాగే శర్వానంద్‌కి ప్రమాదమేమీ లేదని.. కాకపోతే రెండు నెలల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని పేర్కొన్నారు. కాకపోతే.. ఈ ఘటనతో శర్వానంద్ చేస్తున్న చిత్ర షూటింగ్ వాయిదాపడింది.

Sharwanand

శర్వానంద్ మాదిరిగానే.. ఇటీవలి కాలంలో మరో యువ హీరో నాగ శౌర్య (Naga Shourya) కూడా షూటింగ్‌లో భాగంగా గాయపడ్డారు.  ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా.. ఆయన కాలికి తీవ్ర గాయమైంది. వెంటనే నిర్మాతలు జరుగుతున్న షూటింగ్‌ని వాయిదావేసి నాగ శౌర్యని హైదరాబాద్‌కి తరలించారు. దీనితో ఈ సినిమా షూటింగ్‌కి దాదాపు 15 రోజులు బ్రేక్ పడింది.

ఈ ఇద్దరి హీరోలకి జతగా మరో నవ కథానాయకుడు సందీప్ కిషన్ (Sandeep Kishan) కూడా.. తాను చేస్తున్న తెనాలి రామకృష్ణ చిత్రం షూటింగ్‌లో భాగంగా గాయాలపాలయ్యారు. ఒక బ్లాస్ట్ సీక్వెన్స్ తీస్తుండగా.. ఆ సన్నివేశంలో బాంబు అనుకున్న విధంగా పేలకపోవడంతో..  అక్కడే ఉన్న సందీప్ కిషన్‌కి గాయాలపాలయ్యారు.

సందీప్ ఎడమ కన్ను క్రింది భాగంలో గాజు ముక్కలు గుచ్చుకొని రక్తం గడ్డకట్టింది. ఈ  సంఘటన జరిగిన వెంటనే, సందీప్ కిషన్ ఆసుపత్రిలో చేరారు. తనను ఒక వారం పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా డాక్టర్లు సలహా ఇచ్చారు. ఈ సంఘటనను గురించి సందీప్ కిషన్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులకు తెలిపారు. తన ఆరోగ్య పరిస్థితిని గురించి వివరణ ఇచ్చారు. 

Naga Shaurya

ఇక పైన పేర్కొన్న నటుల మాదిరిగానే స్టార్ హీరోలు ఎన్టీఆర్,  రామ్ చరణ్‌లు కూడా తమ మల్టీ స్టారర్ చిత్రం #RRR షూటింగ్ సందర్భంగా గాయపడిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ఈ వీరిద్దరూ ఫిట్‌గా ఉన్నారనే తెలుస్తోంది.  ఈ ఇద్దరు కలిసి తమ కుటుంబసభ్యులతో కలిసి దిగిన ఫోటోలలో.. ఎన్టీఆర్ చేతికి కట్టు లేదా రామ్ చరణ్ కాలికి కట్టిన కట్లు కనిపించలేదు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. దీనితో వీరిద్దరూ మరోసారి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న #RRR చిత్రం షూటింగ్‌కి సిద్దమయినట్టుగానే స్పష్టమవుతోంది.

Jr NTR

ఇలా కొంతమంది హీరోలు తమ చిత్రాల షూటింగ్‌లో గాయపడితే..  మరికొందరు హీరోలు రోడ్డు ప్రమాదాల బారిన పడ్డారు. ఇటీవలే హీరో వరుణ్ తేజ్ (Varun Tej) షూటింగ్ ముగించుకొని.. తన సొంత కారులో బెంగళూరు నుండి హైదరాబాద్‌కి ప్రయాణిస్తుండగా ఓ ప్రమాదం జరిగింది.  కారు డ్రైవర్ అదుపుతప్పి ముందు ప్రయాణిస్తున్న కారుని ఢీ – కొట్టడంలో ఆయన పైన కేసు నమోదు చేయడం జరిగింది. అయితే కారు ప్రమాదం జరిగింది వాస్తవమేనని.. కానీ తనకి మాత్రం ఎటువంటి గాయాలవ్వలేదని వరుణ్ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు.

Varun Tej

ఈ ప్రమాదాల లిస్టులో ఇటీవలే ప్రముఖ హాస్యనటుడు చలాకి చంటి కూడా చేరారు. విజయవాడ నుండి హైదరాబాద్‌కి తన కారులో వస్తుండగా… కోదాడ ప్రాంతంలో అదే కారు అదుపు తప్పి లారీని ఢీ కొట్టింది. అయితే  చాలా స్వల్ప గాయాలతోనే ఆయన బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే అదే కారులో తనతో ప్రయాణించిన వారిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. 

Chalaki Chanti

ఏదేమైనా.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ట్రెండింగ్‌గా కొనసాగుతున్న.. ఈ ప్రమాదాల పరంపరకి త్వరలోనే తెరపడాలని మనసారా కోరుకుందాం.

ఇవి కూడా చదవండి

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. అరుదైన ఫోటోలు (ఫ్యాన్స్‌కు ప్రత్యేకం)

ప్రభాస్ కోసం.. హైదరాబాద్‌కి తరలి వస్తున్న రోమ్ నగరం..!

యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ చిత్రంపై… స్పెషల్ ఫోటో ఫీచర్..!

 

Read More From Bollywood