Education

ఆ ఆత్మహత్యలకు కారణం ఎవరు? చదువుల ఒత్తిడా? అధికారుల నిర్లక్ష్యమా?

Lakshmi Sudha  |  Apr 23, 2019
ఆ ఆత్మహత్యలకు కారణం ఎవరు? చదువుల ఒత్తిడా? అధికారుల నిర్లక్ష్యమా?

‘ఓడిపోయినప్పుడు మనస్ఫూర్తిగా అంగీకరించడం, గెలిచినప్పుడు ఆనందించడం మీ పిల్లలకు నేర్పండి. ఓటమిలోనూ కీర్తి, గెలుపులోనూ నిరాశ ఉండవచ్చని వారికి వివరించండి. బాధలో ఉన్నప్పుడు నవ్వడం నేర్పించండి. ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఓర్పు గురించి తెలపండి’ అబ్రహాం లింకన్ తన కుమారుడిని పాఠశాలలో చేర్పిస్తున్నప్పుడు అక్కడి టీచర్‌కు రాసిన లేఖలో చెప్పిన అంశం ఇది. 

అబ్రహం లింకన్ చెప్పిన మాట నేటి తరానికి బాగా వర్తిస్తుంది. ప్రతిభకు మార్కులే కొలమానంగా మారిన ఈ రోజుల్లో.. ర్యాంకుల వేటే పరమావధిగా మారిన ఈ రోజుల్లో.. తల్లిదండ్రులు, పిల్లలు, ఉపాధ్యాయులు మనసులో పెట్టుకోవాల్సిన, ఎప్పుడూ మననం చేసుకోవాల్సిన వాక్యాలివి.

తెలంగాణ విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యమో.. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (Telangana Intermediate Board) అధికారుల మధ్య ఉన్న అంతర్గత విబేధాలో.. మరో కారణమో.. ఇంకేదో.. ఏదైతైనేం.. కొన్ని నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇప్పుడు ఆ తప్పు సరిదిద్దుకొన్నా..  పోయిన ఆ ప్రాణాలను మనం తెచ్చివ్వగలమా?

99 మార్కులు వచ్చిన అమ్మాయికి సున్నా మార్కులు వేయడంలోనే కనిపిస్తోంది విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యవైఖరి. మార్కులు తారుమారవడమే కాదు..  గ్రూపులు కూడా తారుమారయ్యాయి. విద్యార్థుల భవితవ్యంపై అడుగడుగునా కనిపించిన ఈ నిర్లక్ష్యానికి మందు ఏదైనా ఉందా?

ఫలితాల విడుదల విషయంలో పక్క రాష్ట్రంతో పోటీ.. విద్యార్థుల ప్రాణాలకు ఎసరు తెచ్చింది. పోనీ త్వరగా ఫలితాలను ప్రకటించారా? అంటే అదీ లేదు. హడావుడిగా జరిపిన మూల్యాంకనం, తప్పుల తడకల ఫలితాలు గందరగోళాన్ని సృష్టించాయి.

విద్యార్థులు, తల్లిదండ్రులు వీటి విషయంలో ఆందోళనకు దిగడంతో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ తప్పిదాలు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణ హైకోర్ట్ సైతం ఈ విషయంలో జోక్యం చేసుకొందంటే.. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఫెయిల్ అయినట్లుగా ఫలితాలు వచ్చిన సుమారు 3 లక్షల మంది విద్యార్థుల జవాబు పత్రాలను పున:మూల్యాంకనం చేయమని హైకోర్ట్ ఆదేశించింది.

తెలంగాణాలో ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనంలో.. ఆది నుంచీ నిర్లక్ష్యవైఖరే కనిపిస్తోంది. రోజుకి 30 జవాబు పత్రాలు దిద్దాల్సి ఉండగా.. 60 పేపర్లు మూల్యాంకనం చేశారు. విద్యార్థికి వచ్చిన మార్కుల నమోదులో నిర్లక్ష్యం ప్రదర్శించారు. వాటిని అప్డేట్ చేసే విషయంలోనూ అదే రీతిలో వ్యవహరించారు. అందుకే ఎక్కువ మార్కులు సాధించినప్పటికీ తక్కువ మార్కులు వచ్చినట్టుగా ఫలితాలు వచ్చాయి.

ఈ తప్పులకు సాంకేతికపరమైన కారణాలే కారణం కావచ్చని వాదించేవారూ ఉన్నారు. ఆ ప్రక్రియను నిర్వహించిన గ్లోబరీనా టెక్నాలజీ సంస్థ ప్రమాణాలపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జరిగిన సంఘటన ఏదైనప్పటికీ తెలంగాణ విద్యాశాఖలో కొందరి నిర్లక్ష్యం కారణంగా.. వేలమంది విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకమైందనే చెప్పుకోవాలి.

తప్పుల తడకగా మారిన ఇంటర్ ఫలితాల కారణంగా 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరి ఆత్మహత్యలకు కారణం ఎవరు? తల్లిదండ్రులా? అధ్యాపకులా? ప్రమాణాలు మరచిపోయిన విద్యావ్యవస్థా? అధికారులా? ఆలోచించే జ్ఞానం ఇవ్వాల్సిన చదువు ఎందుకు విద్యార్థులను మానసికంగా బలహీనులను చేస్తోంది? ఇవన్నీ ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి.

అలాగని చదువుకోవడం, మార్కులు తెచ్చుకోవడం, ర్యాంకులు సంపాదించడం ఇవన్నీ సీరియస్‌గా తీసుకోవల్సిన విషయాలు కాదని పిల్లలకు చెప్పడం తప్పు. ఎందుకంటే చదువు జ్ఞానాన్ని పెంచుతుంది. సంస్కారం నేర్పిస్తుంది. బంగారు భవిష్యత్తుని ఇస్తుంది. తప్పొప్పుల మధ్య తేడాని గుర్తించే శక్తినిస్తుంది. అందుకే మన పెద్దలు ‘విద్య లేనివాడు వింత పశువు’ అన్నారు. కాబట్టి చదువుని సీరియస్‌గా తీసుకోవాల్సిందే.

మరి ఏది తప్పు? చదువు విషయంలో పిల్లలను ఒత్తిడికి గురి చేయడం తప్పు. మార్కులు తక్కువ వస్తే వారిని చేయకూడని పనేదో చేసినట్లుగా నిందించడం తప్పు. సహవిద్యార్థులతో వారిని పోల్చి కించపరచడం తప్పు. మార్కుల ఆధారంగా ఎ, బి,సి, డి సెక్షన్లు విడదీయడం తప్పు. విజ్ఞానం పెంచే విధంగా కాకుండా.. మార్కులు తెచ్చే వాటిని మాత్రమే బట్టీ కొట్టించడం తప్పు. అర్థమైనా, కాకపోయినా బండ గుర్తు పెట్టుకొనే టెక్నిక్స్ నేర్పించడం తప్పు.

ఇన్ని తప్పులు, పొరపాట్లు మనం చేస్తూ ఆ ఒత్తిడిని విద్యార్థుల మీదకు నెట్టేస్తూ.. వారిని మానసికంగా బలహీనులం చేస్తున్నాం. ఒక్క మార్కు తగ్గితేనే మనం ఒప్పుకోం కదా.. మరి సబ్జెక్టులో తప్పితే దాన్ని ఒప్పుకొంటామా? నానామాటలు అని వారి మనసు బాధపెడతాం కదా. ఆ బాధ భరించే కంటే చావే నయమనుకొంటున్నారేమో.. పరీక్షలో తప్పామని ఆత్మహత్య చేసుకొంటున్నారు. అంతేకాని మళ్లీ పరీక్ష రాసుకోవచ్చు. పాసవ్వచ్చు. అవసరమైతే పున:మూల్యాంకనం చేయించుకోవచ్చు అనే ఆలోచన వారికి రావడం లేదు. దీనికి కారణం భయం. మళ్లీ అవమానం ఎదుర్కోవాల్సి వస్తుందేమోననే భయం.

మరేం చేయాలి? ముందు ప్రతిభకు మార్కులు కొలమానం కాదనే విషయం తల్లిదండ్రులుగా గుర్తుపెట్టుకోవాలి. పిల్లల్లో సహజంగా దాగున్న ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించాలి. వారి ఇష్టాలను ప్రోత్సహిస్తూనే చదువులోనూ రాణించేలా చూడాలి. ఈ క్రమంలో వారిపై ఒత్తిడి పడకుండా చూడాలి. వారు ఒత్తిడి బారిన పడుతున్నారని గ్రహిస్తే.. వారి మెదడుకు కాస్త విశ్రాంతినివ్వాలి. పరీక్షల్లో మార్కులు సరిగ్గా రాకపోతే.. వారిని తిట్టడం మాని.. తర్వాతి పరీక్షల్లో మార్కులు ఎక్కువ తెచ్చుకోవడానికి ప్రయత్నించమని అనునయంగా చెప్పాలి.

పనిలో పనిగా వారిని మానసికంగా దృఢంగా మార్చాలి. జీవితంలో గెలుపోటములు సహజమైన విషయాలని వారికి తెలియజెప్పాలి. ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోకుండా.. ఆత్మవిశ్వాసంతో మరోసారి పోరాడాలని వారికి చెప్పాలి. జవాబులను బట్టీ కొట్టించడం మాని పాఠ్యాంశాన్ని అర్థం చేసుకోమని చెప్పాలి. వేలకు వేలు పెట్టి క్వశ్చన్ బ్యాంకులు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కొనివ్వడం మాని పాఠ్యపుస్తకాలు కొనివ్వండి. వాటిని చదవమని చెప్పండి. పాఠం అర్థమవుతుంది. అది జరిగితే చదువు విషయంలో పిల్లలపై ఒత్తిడి ఉండదు.

ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులోనే చేయాలి. ఇది చదువుకి కూడా వర్తిస్తుంది. ఏడో తరగతి నుంచే ఐఐటీ కోచింగులు పిల్లలకు అక్కర్లేదు. ఆ వయసుకి ఏడో తరగతి పాఠాలు అర్థమైతే చాలు. అక్కడే ఐఐటీకి పునాది పడుతుంది. అంతే తప్ప వయసుకి మించిన భారాన్ని వారిపై వేయవద్దు.

భావితరం బాధ్యతగా వ్యవహరించాలంటే.. ముందు పెద్దలుగా మనం బాధ్యతగా వ్యవహరించాలి. వారిపై చదువుల విషయంలో అనవసరమైన ఒత్తిడి పెట్టకుండా ఉంటే.. పిల్లలు సైతం ఆనందంగా చదువుకోగలుగుతారు. ఆ పరిస్థితులు ఎదురైనప్పుడు ఫెయిలయ్యామనే భయంతో ఆత్మహత్యలు చేసుకొనే అవకాశం ఉండదు.

(తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడు, కర్ణాటక వంటి పక్క రాష్ట్రాల్లో… మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడాలని భావించే యువతను కాపాడడానికి, వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి ప్రయత్నిస్తున్న పలు సంస్థలు ఉన్నాయి. వాటి వివరాలివే)

సూసైడ్ ప్రివెన్షన్ హెల్ప్ లైన్స్ వివరాలు

రోషిణి – 40 66202000/2001

వన్ లైఫ్ – 78930 78930

యాంటీ సుసైడ్స్ కమిటీ (సర్వజన ఇండియా) – 9492419512

సహాయ్ (బెంగళూరు)  – 080-25497777

స్నేహ (తమిళనాడు) –  044- 24640050

Images: Shutterstock

Featured Image: Pixabay

ఇవి కూడా చదవండి:

సహోద్యోగులా.. శాడిస్టులా..? (లైంగిక వేధింపులకు.. లక్నోలో నిండు ప్రాణం బలి)

డిప్రెషన్ మిమ్మల్ని కుంగదీస్తోందా? దాని పని ఇలా పట్టండి

సెల్ఫ్ లవ్ : మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవడానికి ఈ పనులు చేయాల్సిందే

Read More From Education