Bollywood

టాలీవుడ్‌లో తెరంగేట్రం చేయనున్న.. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్..!

Sridevi  |  Aug 19, 2019
టాలీవుడ్‌లో తెరంగేట్రం చేయనున్న.. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్..!

జాన్వీ కపూర్ (Janhvikapoor).. దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi) తనయగా సినీ పరిశ్రమకు పరిచయమైన ముద్దుగుమ్మ. బాలీవుడ్‌లో ఇషాన్ ఖత్తర్ సరసన ధడక్ సినిమాతో తెరంగేట్రం చేసిన జాన్వి తొలి సినిమాతోనే తన నటనకుగానూ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. అంతేనా.. ఆ తర్వాత వరుస చిత్రాలకు తన అంగీకారం తెలిపి ప్రస్తుతం తెగ బిజీగా గడుపుతోంది. ప్రముఖ బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు సరసన రూహీ- అఫ్జా అనే హారర్ కామెడీ చిత్రంతో పాటు కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందిస్తోన్న తక్త్ చిత్రంలోను, కార్గిల్ గర్ల్, దోస్తానా 2 చిత్రాల్లోనూ నటిస్తోంది.

ఓ వైపు బాలీవుడ్‌లో ఇంత తీరిక లేకుండా ఉన్నప్పటికీ.. దక్షిణాది సినీ పరిశ్రమలో సైతం అడుగుపెట్టేందుకు ఈ అమ్మడు ప్రయత్నిస్తోందట. ఇప్పుడు దీనికి సంబంధించిన ఓ వార్త చిత్రసీమలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ వార్త ఏంటంటే.. ప్రముఖ టాలీవుడ్ హ్యాండ్‌సమ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay devarakonda) తన తదుపరి చిత్రం మాస్ యాక్షన్‌కు పెట్టింది పేరైన.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేయనున్న విషయం విదితమే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను నటి, సహనిర్మాతగా వ్యవహరిస్తోన్న ఛార్మీ ఇటీవలే తన ట్విట్టర్ వేదికగా అందరితోనూ పంచుకున్నారు.

‘పూరీ కనెక్ట్స్ తన తదుపరి ప్రాజెక్ట్‌ గురించి సగర్వంగా అందరికీ అధికారికంగా ప్రకటిస్తోంది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా, పూరీ జగన్నాథ్ దర్శకుడిగా ఓ చిత్రం రూపొందనుంది. పూరీ కనెక్ట్స్, పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్స్ పై నిర్మించనున్న ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్, ఛార్మీ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు, ఆసక్తికరమైన ప్రకటనలు త్వరలో అందరికీ తెలియజేస్తాం.. అందరూ వేచి చూడండి..’ అంటూ ఛార్మీ తన అధికారిక ట్విట్టర్ పేజీలో ట్వీట్ చేసింది.

పూరీ కనెక్ట్స్, పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్స్ పై నిర్మిస్తోన్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండకు జోడీగా జాన్వీ కపూర్‌ని అనుకుంటున్నారట. ఈ మేరకు పూరీ జగన్నాథ్ ఆమెతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారట. మరి, ఈ సంప్రదింపులకు ఆమె అంగీకారం తెలిపితే.. అతిలోక సుందరి శ్రీదేవి తనయ అయిన జాన్వీ కపూర్‌ని తెలుగులో వెండితెరపై నేరుగా చూసే అవకాశం మనకు లభించినట్లే. అయితే ఈ ఆఫర్‌కు జాన్వి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని.. త్వరలోనే ఆమె విజయ్‌కు జోడీగా తెలుగు చిత్రంలో కనిపించనుందని అంటున్నాయి సినీవర్గాలు. ‘డియర్ కామ్రేడ్’ తరహాలోనే ఈ చిత్రాన్ని కూడా మల్టీ లాంగ్వేజెస్‌లో రూపొందించనున్నారట. అయితే ఈ వార్తకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

శ్రీదేవి దక్షిణాది చిత్రాల్లో నటించి కథానాయికగా మంచి గుర్తింపు సంపాదించుకున్న తర్వాత.. బాలీవుడ్ దిశగా అడుగులు వేశారు. అక్కడ కూడా తన అందం, అభినయంతో అందరినీ ముగ్థులను చేసి టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు. ఆమె కుమార్తె జాన్వీ కపూర్ సైతం దక్షిణాది చిత్రాల్లో నటించాలని  ఆశపడ్డారు. అలా తల్లి కోరికను నెరవేర్చేందుకు సిద్ధమవుతోంది జాన్వీ. ఇప్పటికే దక్షిణాదిలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న తాలా 60 (సినిమా పేరు ఇంకా ఖరారు కాలేదు)లో జాన్వీ ఓ ప్రధాన పాత్రలో కనిపించనుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

నిజానికి జాన్వీ ఈపాటికే తెలుగు సినిమాల్లో కనిపించి ఉండాల్సింది. 2015లో మహేష్‌బాబు సరసన నటించే అవకాశం ఈ అమ్మడికి లభించిందని, కానీ కొన్ని కారణాల వల్ల ఆ అవకాశాన్ని జాన్వీ వదులుకుందని అప్పట్లో చిత్రసీమలో టాక్ వినిపించింది. ఏది ఏమైతేనేం.. ఇన్నాళ్ల తర్వాత తెలుగులో జాన్వీకపూర్‌ని చూసే అవకాశం మనకు త్వరలో రానుందని.. అంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి, ఈ వార్తకు సంబంధించిన అధికారిక ప్రకటనను నటీనటులు లేదా చిత్ర యూనిట్ ఎప్పుడు, ఏ రకంగా ప్రకటిస్తారో చూద్దాం..

ఇవి కూడా చదవండి

శ్రీదేవి .. మేమంతా సదా నిన్ను స్మరిస్తూనే ఉంటాం: జాన్వి, బోని కపూర్

ఆ ఆలోచనలను తరిమికొట్టాలంటే.. సినిమా ఒక్కటే మార్గం కాదు: తాప్సీ

సరిలేరు నీకెవ్వరు చిత్రంతో.. రీఎంట్రీ ఇవ్వనున్న మరో నటీమణి..!

Read More From Bollywood